సామెతలు 31:10-20

సామెతలు 31:10-20 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

గుణవతియైన భార్య ఎవరు కనుగొనగలరు? ఆమె ముత్యాల కంటే విలువైనది. ఆమె భర్త ఆమెపై పూర్తి నమ్మిక కలిగి ఉంటాడు అతనికి లాభం తక్కువకాదు. ఆమె బ్రతుకు దినాలన్ని, అతనికి మేలు చేస్తుంది గాని కీడు చేయదు. ఆమె గొర్రె ఉన్నిని నారను తెచ్చుకుని, ఆసక్తి కలిగి తన చేతులతో పని చేస్తుంది. ఆమె దూరము నుండి తన ఆహారాన్ని తెచ్చే, వర్తకుల ఓడల లాంటిది. ఆమె ఇంకా చీకటి ఉండగానే లేస్తుంది; తన కుటుంబానికి భోజనము సిద్ధము చేస్తుంది; తన పనికత్తెలకు వారి వాటాను ఇస్తుంది. ఆమె పొలాన్ని చూసి దానిని కొంటుంది; తన సంపాదనల నుండి ఆమె ద్రాక్షతోట ఒకటి నాటుతుంది. ఆమె తన పనిని తీవ్రంగా ప్రారంభిస్తుంది, ఆమె పనులకు తగినట్టుగా ఆమె చేతులు బలమైనవి. ఆమె తన వ్యాపారం లాభదాయకంగా ఉండడం చూస్తుంది, రాత్రివేళ ఆమె దీపం ఆరిపోదు. ఆమె పంటను చేత పట్టుకుంటుంది, తన వ్రేళ్ళతో కదురు పట్టుకుని వడుకుతుంది. పేదవారికి తన చేయి చాపి సహాయం చేస్తుంది, దరిద్రులకు తన చేతులు చాపి సహాయపడుతుంది.

సామెతలు 31:10-20 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

సమర్థురాలైన భార్య ఎవరికి దొరుకుతుంది? అలాటిది బంగారు ఆభరణాల కంటే అమూల్యమైనది. ఆమె భర్త ఆమెపై నమ్మకం పెట్టుకుంటాడు. అతడు పేదవాడు కావడం అంటూ ఉండదు. ఆమె తన జీవిత కాలమంతా అతనికి మేలే చేస్తుంది గాని కీడేమీ చేయదు. ఆమె గొర్రె బొచ్చును అవిసెనారను సేకరిస్తుంది. తన చేతులారా వాటితో పని చేస్తుంది. వర్తకపు ఓడలు దూర ప్రాంతం నుండి ఆహారం తెచ్చేలా ఆమె దూరం నుండి ఆహారం తెచ్చుకుంటుంది. ఆమె చీకటితోనే లేచి, తన యింటి వారికి భోజనం సిద్ధపరుస్తుంది. తన సేవికలకు జీతం నిర్ణయిస్తుంది. ఆమె పొలం చూసి దాన్ని కొంటుంది. కూడబెట్టిన డబ్బుతో ద్రాక్షతోట నాటిస్తుంది. ఆమె బలం ధరించుకుంటుంది. చేతులతో బలంగా పని చేస్తుంది. తనకు లాభం చేకూర్చే వాటిని గుర్తిస్తుంది. రాత్రివేళ ఆమె దీపం ఆరిపోదు. ఆమె నేత కదురును చేతబట్టుకుంటుంది. తన వ్రేళ్లతో కదురు పట్టుకుని వడుకుతుంది. దీనులకు తన చెయ్యి చాపుతుంది. అవసరంలో ఉన్న వారిని ఆదుకుంటుంది.

సామెతలు 31:10-20 పవిత్ర బైబిల్ (TERV)

“పరిపూర్ణమైన స్త్రీ” దొరకటం ఎంతో కష్టం. కాని ఆమె నగలకంటె ఎంతో ఎక్కువ అమూల్యం. ఆమె భర్త ఆమెను నమ్మగలడు. అతడు ఎన్నడూ దరిద్రునిగా ఉండడు. మంచి భార్య తన జీవితకాలం అంతా తన భర్తకు మంచినే చేస్తుంది. ఆమె ఎన్నడూ అతనికి చిక్కు కలిగించదు. ఆమె ఉన్నిబట్ట తయారు చేస్తూ ఎల్లప్పుడూ పనిలో నిమగ్నమవుతుంది. ఆమె దూరము నుండి వచ్చిన ఓడలా ఉంటుంది. అన్ని చోట్ల నుండీ ఆమె ఆహారం తీసుకొని వస్తుంది. ఆమె అతి వేకువనే మేలుకొంటుంది. తన కుటుంబానికి భోజనం, తన పని వారికి భోజనం ఆమె వండుతుంది. ఆమె పొలాన్ని చూస్తుంది. దాన్నికొంటుంది. ఆమె ద్రాక్షతోట నాటేందుకు ఆమె దాచుకొన్న డబ్బు ఉపయోగిస్తుంది. ఆమె చాలా కష్టపడి పని చేస్తుంది. ఆమె బలంగా ఉండి తన పని అంతా చేసుకోగలుగుతుంది. ఆమె తయారు చేసిన వాటిని అమ్మినప్పుడు ఆమె ఎల్లప్పుడూ లాభం సంపాదిస్తుంది. మరియు రాత్రి చాలా పొద్దుపోయేదాకా ఆమె పని చేస్తుంది. ఆమె స్వంతంగా దారం తయారు చేసికొని తన స్వంత బట్ట నేస్తుంది. ఆమె ఎల్లప్పుడూ పేద ప్రజలకు పెడుతుంది. అవసరంలో ఉన్న వారికి సహాయం చేస్తుంది!

సామెతలు 31:10-20 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

గుణవతియైన భార్య దొరుకుట అరుదు అట్టిది ముత్యముకంటె అమూల్యమైనది. ఆమె పెనిమిటి ఆమెయందు నమ్మికయుంచును అతని లాభప్రాప్తికి వెలితి కలుగదు. ఆమె తాను బ్రదుకు దినములన్నియు అతనికి మేలుచేయును గాని కీడేమియు చేయదు. ఆమె గొఱ్ఱెబొచ్చును అవిసెనారను వెదకును తన చేతులార వాటితో పనిచేయును. వర్తకపు ఓడలు దూరమునుండి ఆహారము తెచ్చునట్లు ఆమె దూరమునుండి ఆహారము తెచ్చుకొనును. ఆమె చీకటితోనే లేచి, తన యింటివారికి భోజనము సిద్ధపరచును తన పనికత్తెలకు బత్తెము ఏర్పరచును. ఆమె పొలమును చూచి దానిని తీసికొనును తాము కూడబెట్టిన ద్రవ్యము పెట్టి ద్రాక్షతోట యొకటి నాటించును. ఆమె నడికట్టుచేత నడుము బలపరచుకొని చేతులతో బలముగా పనిచేయును తన వ్యాపారలాభము అనుభవముచే తెలిసికొనును రాత్రివేళ ఆమె దీపము ఆరిపోదు. ఆమె పంటెను చేతపట్టుకొనును తన వ్రేళ్లతో కదురు పట్టుకొని వడుకును. దీనులకు తన చెయ్యి చాపును దరిద్రులకు తన చేతులు చాపును