సామెతలు 25:1-28

సామెతలు 25:1-28 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

ఇవి కూడా సొలొమోను యొక్క సామెతలు, యూదా రాజైన హిజ్కియా సేవకులు వీటిని పోగుచేశారు. ఒక విషయాన్ని దాచిపెట్టడం దేవుని గొప్పతనం; ఒక విషయాన్ని బయటకు లాగడం రాజుల గొప్పతనము. ఆకాశాల ఎత్తు భూమి లోతు ఎలా కనుగొనలేమో, అలాగే రాజుల హృదయాలు కూడా శోధించలేనివి. వెండిలోని లోహపు మడ్డిని తీసివేసి, కంసాలివాడు ఒక పాత్రను తయారుచేయగలడు; రాజు ఎదుట నుండి చెడ్డ అధికారులను తొలగించండి, నీతి ద్వారా ఆయన సింహాసనం స్థాపించబడుతుంది. రాజు ఎదుట నిన్ను నీవు హెచ్చించుకోవద్దు, ఆయన దగ్గర ఉండే గొప్పవారి మధ్య చోటు కావాలని కోరవద్దు. సంస్థానాధిపతుల ముందు రాజు నిన్ను అవమానించడం కంటే, “ఇక్కడకు రండి” అని ఆయన నీతో చెప్పడం బాగుంటుంది కదా. మీరు ఏదో చూసిన దానిని బట్టి, తొందరపడి న్యాయస్థానానికి వెళ్లకండి, ఎందుకంటే ఒకవేళ నీ పొరుగువాడు నిన్ను అవమానపరిస్తే తర్వాత నీవేమి చేస్తావు? ఒకవేళ నీవు నీ పొరుగువాన్ని న్యాయస్థానానికి తీసుకెళ్లినా, ఇంకొకరి గుట్టు బయట పెట్టకు. అది వినినవాడు నిన్ను అవమానపరచవచ్చు, అప్పుడు నీకు కలిగిన అపకీర్తి ఎన్నటికి తొలిగిపోదు. సకాలంలో మాట్లాడిన మాట, చిత్రమైన వెండి పళ్ళాల్లో ఉంచబడిన బంగారు ఆపిల్ పళ్ళలాంటిది. బంగారు చెవి పోగు ఎలా ఉంటుందో లేదా మేలిమి బంగారు ఆభరణం ఎలా ఉంటుందో వినే చెవికి జ్ఞానియైన న్యాయమూర్తి యొక్క గద్దింపు అలా ఉంటుంది. నమ్మకమైన పనివాడు తనను పంపువారికి కోతకాలంలో మంచు చల్లదనము వంటివాడు; వాడు తన యజమానుల హృదయాలను తెప్పరిల్లజేస్తాడు. బహుమతి ఇస్తానని వాగ్దానం చేసి ఇవ్వని వ్యక్తి వర్షము కురిపించని మబ్బు గాలి లాంటివాడు. సహనం ద్వారా ఒక పాలకుడిని ఒప్పించవచ్చు, మృదువైన నాలుక ఎముకను విరుగ గొట్ట గలదు. నీకు తేనె దొరికితే సరిపడగా తిను ఎక్కువ తింటే కక్కివేస్తావు. నీ పొరుగువారింటికి మాటిమాటికి వెళ్లకు, వారు నీ వలన విసిగిపోయి నిన్ను ద్వేషించవచ్చు. తన పొరుగువాని మీద అబద్ధసాక్ష్యం చెప్పేవాడు సమ్మెట ఖడ్గము లేదా వాడిగల బాణాన్ని పోలినవాడు. కష్ట సమయంలో నమ్మకద్రోహిని ఆశ్రయించడమంటే విరిగిన పళ్లు లేదా కుంటి పాదం లాంటిది. బాధలోనున్న వానికి పాటలు వినిపించేవాడు, బాగా చలిగా ఉన్నపుడు పై బట్టతీసివేయు వానితోను, పచ్చిపుండు మీద పుల్లని ద్రాక్షరసం పోసేవానితోను సమానము. నీ శత్రువు ఆకలితో ఉంటే, తినడానికి భోజనము పెట్టు; అతడు దాహంతో ఉంటే, త్రాగడానికి నీళ్లు ఇవ్వు. ఇలా చేయడం ద్వారా అతని తలపై మండుతున్న నిప్పులు కుప్పగా పోస్తావు, యెహోవా అందుకు నీకు ప్రతిఫలమిస్తారు. ఊహించని వర్షాన్ని తెచ్చే ఉత్తర గాలిలా కపటమైన నాలుక భయానకంగా కనిపించేలా చేస్తుంది. గయ్యాళియైన భార్యతో పెద్ద ఇంట్లో ఉండడం కంటే మిద్దెమీద ఒక మూలను నివసించడం మేలు. అలసిన ప్రాణానికి చల్లటి నీరు ఎలా ఉంటుందో దూరదేశము నుండి వచ్చిన మంచి వార్త అలా ఉంటుంది. నీతిమంతుడు దుష్టునికి మార్గం ఇవ్వడం ఊటను బురదమయం లేదా బావిని కలుషితం చేయడం లాంటిది. తేనె ఎక్కువగా తినడం మంచిది కాదు, ప్రజలు తమ సొంత కీర్తిని కోరుకోవడం గౌరవప్రదం కాదు. మనస్సు అదుపు చేసుకోలేని వ్యక్తి ప్రాకారాలు కూలిన పట్టణం లాంటివాడు.

సామెతలు 25:1-28 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

ఇవికూడా సొలొమోను సామెతలే. యూదారాజు హిజ్కియా సేవకులు వీటిని ఎత్తి రాసారు. విషయాన్ని గోప్యంగా ఉంచడం దేవునికి ఘనత. సంగతిని పరిశోధించడం రాజులకు ఘనత. ఆకాశాల ఎత్తు, భూమి లోతు, రాజుల అభిప్రాయం అగమ్యగోచరం. వెండిలోని కల్మషం తీసేస్తే లోహకారుడు తన పనితనంతో వస్తువు తయారు చేస్తాడు. రాజు సముఖం నుండి దుష్టులను తొలగించ గలిగితే అతని సింహాసనం నీతిమూలంగా స్థిరం అవుతుంది. రాజు ఎదుట నీ గొప్ప చెప్పుకోకు. గొప్పవారికి కేటాయించిన చోట ఉండవద్దు. నీవు గమనించి చూసిన ప్రధాని ఎదుట ఎవరైనా నిన్ను తగ్గించడం కంటే “ఈ పైచోటికి రా” అని అతడు నీతో చెప్పడం మంచిది కదా. అనాలోచితంగా న్యాయ స్థానానికి పోవద్దు. చివరికి నీ పొరుగువాడు నిన్ను అవమాన పరచి “ఇక నువ్వేమి చేస్తావు?” అని నీతో అంటాడు కదా. నీ పొరుగువాడితో నీవు వాదులాడ వచ్చు గానీ ఎదుటి వ్యక్తి గుట్టు నలుగురిలో రట్టు చెయ్యవద్దు. అలా చేస్తే వినేవాడు నిన్ను అవమానపరుస్తాడేమో. ఆ విధంగా నీకు కలిగిన అపకీర్తి ఎన్నటికి మాసిపోదు. సమయోచితంగా పలికిన మాట వెండి పళ్ళెంలో పొదిగిన బంగారు పండ్ల వంటిది. బంగారు చెవిపోగులు ఎలాటివో స్వర్ణాభరణాలు ఎలాటివో వినే వాడి చెవికి జ్ఞానం గల ఉపదేశకుడు అలాటి వాడు. నమ్మకమైన దూత తనను పంపిన వారిపాలిట కోతకాలపు మంచు చల్లదనం వంటి చల్లదనం గలవాడు. వాడు తన యజమానుల హృదయానికి ఆహ్లాదం కలిగిస్తాడు. ఏమీ ఇవ్వకుండానే ఇచ్చానని సొంత డబ్బా వాయించుకునే వాడు వర్షం లేని మబ్బుతో గాలితో సమానం. సహనంతో న్యాయాధిపతిని ఒప్పించవచ్చు. సాత్వికమైన నాలుక ఎముకలను నలగగొట్టగలదు. నీకు తేనె దొరికితే మితంగా తిను. మితిమీరి తింటే ఒకవేళ కక్కి వేస్తావేమో. మాటిమాటికి నీ పొరుగువాడి ఇంటికి వెళ్లకు. అతడు విసికిపోయి నిన్ను ద్వేషిస్తాడేమో. తన పొరుగువాడిపై అబద్ధ సాక్ష్యం పలికేవాడు యుద్ధంలో వాడే గదలాంటి వాడు, కత్తిలాంటి వాడు. వాడియైన బాణం వంటివాడు. కష్టకాలంలో విశ్వాస ఘాతకుణ్ణి ఆశ్రయించడం విరిగిన పన్నుతో, కీలు వసిలిన కాలుతో సమానం. దుఃఖితుడి ఎదుట పాటలు వినిపించేవాడు చలి రోజున పైబట్ట తీసివేసే వాడితోను సూరేకారం మీద చిరక పోసే వాడితోను సమానం. నీ పగవాడు ఆకలిగా ఉంటే వాడికి అన్నం పెట్టు. దాహంతో ఉంటే వాడికి మంచినీళ్ళు ఇవ్వు. అలా చేస్తే వాడి తలపై నిప్పులు కుప్పగా పోసిన వాడివౌతావు. యెహోవా అందుకు నీకు ప్రతిఫలమిస్తాడు. ఉత్తర వాయువు వాన తెస్తుంది. అలానే గుట్టు బయట పెట్టేవాడి ముఖం గంభీరంగా ఉంటుంది. గయ్యాళితో పెద్ద భవంతిలో ఉండడం కంటే మిద్దెమీద ఒక మూలన ఉండడమే హాయి. దప్పిగొన్నవాడికి చల్లని నీరు ఎలాగో దూరదేశం నుండి వచ్చిన శుభసమాచారం అలా. కలకలు అయిపోయిన ఊట, చెడిపోయిన నీటిబుగ్గ, ఉత్తముడు దుష్టుడికి లోబడి ఉండడం ఒకటే. తేనె మితిమీరి తినడం మంచిది కాదు. గొప్ప కోసం అదే పనిగా పాకులాడడం అలాటిదే. ప్రాకారం లేక పాడైన పురం ఎంతో తన మనస్సు అదుపు చేసుకోలేని వాడు అంతే.

సామెతలు 25:1-28 పవిత్ర బైబిల్ (TERV)

ఇవి సొలొమోను చెప్పిన మరికొన్ని జ్ఞానసూక్తులు: యూదా రాజు హిజ్కియా సేవకులు నకలు చేసిన మాటలు ఇవి: మనం తెలిసికోగూడదని దేవుడు కోరే విషయాలను దాచి పెట్టేందుకు ఆయనకు అధికారం ఉంది. కాని ఒక రాజు విషయమును పరిశోధించుట మూలంగానే ఘనపర్చబడతాడు. ఆకాశం మనకు పైన చాలా ఎత్తుగాను, భూమి మన క్రింద చాలా లోతువరకును ఉన్నాయి. రాజుల మనస్సులు కూడ అదే విధంగా ఉంటాయి. మనం వాటిని గ్రహించలేం. వెండి నుండి పనికిమాలిన పదార్థాలను నీవు తీసివేసినట్లయితే అప్పుడు పనివాడు దానితో అందమైన వస్తువులు చేయగలడు. అదే విధంగా ఒక రాజు సమక్షం నుండి దుర్మార్గపు సలహాదారులను నీవు తొలగించి వేస్తే అప్పుడు మంచితనం అతని రాజ్యాన్ని బలమైనదిగా చేస్తుంది. ఒక రాజు ఎదుట నిన్ను గూర్చి నీవు అతిశయించవద్దు. నీవు చాలా ప్రఖ్యాత వ్యక్తివి అని చెప్పుకోవద్దు. రాజుగారే నిన్ను ఆహ్వానించటం చాలా మంచిది. కాని నిన్ను నీవే ఆహ్వానించుకొంటే అప్పుడు నీవు ఇతరుల ఎదుట ఇబ్బంది పడవచ్చును. నీవు చూచిన దానిని గూర్చి న్యాయమూర్తికి చెప్పుటకు త్వరపడవద్దు. నీవు చెప్పింది తప్పు అని మరో వ్యక్తి గనుక చెబితే అప్పుడు నీవు ఇబ్బంది పడాల్సి వస్తుంది. నీవూ మరో వ్యక్తి ఏకీభవించలేకపోతే ఏమి చేయాలి? అనే విషయం, మీ మధ్యనే నిర్ణయం కావాలి. మరో వ్యక్తి రహస్యాన్ని చెప్పవద్దు. నీవలా చేస్తే నీకు అవమానం కలుగుతుంది. ఆ చెడ్డ పేరు నీకు ఎప్పటికీ పోదు. సమయానికి తగిన రీతిగా పలికిన మంచిమాటలు వెండి పళ్లెంలో ఉంచిన బంగారు పండులా ఉంటవి. జ్ఞానముగల ఒక మనిషి నీకు ఒక హెచ్చరిక ఇస్తే బంగారు ఉంగరాలకంటే లేక మేలిమి బంగారు నగలకంటే అది ఎక్కువ విలువగలది. నమ్మదగిన వార్తాహరుడు అతనిని పంపిన వారికి ఎంతో విలువగలవాడు. అతడు కోతకాలపు ఎండ రోజుల్లో చల్లటి నీళ్లలాంటివాడు. కానుకలు ఇస్తామని వాగ్దానం చేసి, వాటిని ఎన్నడూ ఇవ్వని వారు వర్షం కురిపించని మేఘాలు, గాలిలాంటివారు. సహనంగా మాట్లాడటం ఏ వ్యక్తినేగాని, చివరికి ఒక అధికారి ఆలోచననేగాని మార్చుతుంది. నిదానంగా మాట్లాడటం చాలా శక్తివంతమైనది. తేనె మంచిది. కాని దానిని మరీ ఎక్కువగా తినవద్దు. నీవలా చేస్తే నీకు జబ్బు వస్తుంది. అదే విధంగా నీ పొరుగు వాని ఇంటికి మరీ తరచుగా వెళ్లవద్దు. నీవలా చేస్తే అప్పుడు అతడు నిన్ను అసహ్యించు కోవటం మొదలు పెడతాడు. సత్యం చెప్పని మనిషి ప్రమాదకరమైనవాడు. అతడు ఒక గునపం, లేక ఖడ్గం లేక వాడిగల బాణం లాంటివాడు. కష్టకాలంలో అబద్ధీకుని మీద ఎన్నడూ ఆధారపడవద్దు. ఆ మనిషి నొప్పెడుతున్న పన్నులా లేక కుంటిపాదంలా ఉంటాడు. నీకు అతడు ఎంతో అవసరమైనప్పుడే అతడు నిన్ను బాధపెడతాడు. ధు ఖంలో ఉన్న మనిషి దగ్గర ఆనంద గీతాలు పాడటం అతనికి చలిపెడుతున్నప్పుడు అతని గుడ్డలు తీసివేయటంలా ఉంటుంది. అది సోడా, చిరకా మిళితం చేసినట్టు ఉంటుంది. నీ శత్రువు ఆకలితో ఉన్నప్పుడు తినేందుకు అతనికి భోజనం పెట్టు. నీ శత్రువు దాహంతో ఉంటే తాగేందుకు అతనికి నీళ్లు యివ్వు. నీవు ఇలా చేస్తే నీవు అతనిని సిగ్గుపడేలా చేస్తావు. అది మండుతున్న నిప్పులు అతని తల మీద ఉంచినట్టు ఉంటుంది. మరియు నీ శత్రువుకు నీవు మంచి చేశావు గనుక యెహోవా నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఉత్తరం నుండి వీచే గాలి వర్షాన్ని తెస్తుంది. అదే విధంగా చెప్పుడు మాటలు కోపం రప్పిస్తాయి. వివాదం కోరుకొనే భార్యతో కలిసి ఇంటిలో ఉండటంకంటె, ఇంటికప్పు మీద బ్రతకటం మేలు. దూరస్థలం నుండి వచ్చిన శుభవార్త నీకు వేడిగా, దాహంగా ఉన్నప్పుడు చల్లటి నీళ్లు తాగినట్టు ఉంటుంది. ఒక మంచి మనిషి బలహీనుడై ఒక దుర్మార్గుని వెంబడిస్తే, అది మంచి నీళ్లు బురద నీళ్లు అయినట్టుగా ఉంటుంది. నీవు చాలా ఎక్కువ తేనెను తింటే అది నీకు మంచిది కాదు. అదే విధంగా నీకోసం మరీ ఎక్కువ ఘనత తెచ్చుకోవాలని ప్రయత్నించకు. ఒక మనిషి తనను తాను అదుపులో ఉంచుకోలేకపోతే, అప్పుడు అతడు కూలిపోయిన గోడలుగల పట్టణంలా ఉంటాడు.

సామెతలు 25:1-28 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

ఇవియును సొలొమోను సామెతలే యూదారాజైన హిజ్కియా సేవకులు వీటిని ఎత్తి వ్రాసిరి. –సంగతి మరుగుచేయుట దేవునికి ఘనత సంగతి శోధించుట రాజులకు ఘనత. ఆకాశముల యెత్తును భూమి లోతును రాజుల అభిప్రాయమును అగోచరములు. వెండిలోని మష్టు తీసివేసినయెడల పుటము వేయువాడు పాత్రయొకటి సిద్ధపరచును. రాజు ఎదుటనుండి దుష్టులను తొలగించినయెడల అతని సింహాసనము నీతివలన స్థిరపరచబడును. రాజు ఎదుట డంబము చూపకుము గొప్పవారున్న చోట నిలువకుము. నీ కన్నులు చూచిన ప్రధానియెదుట ఒకడు నిన్ను తగ్గించుటకంటె –ఇక్కడికి ఎక్కి రమ్మని అతడు నీతో చెప్పుట నీకు మేలు గదా. ఆలోచన లేక వ్యాజ్యెమాడుటకు పోకుము నీ పొరుగువాడు నిన్ను అవమానపరచి–దాని అంత మున ఇక నీవేమి చేయుదువని నీతో అనునేమో. నీ పొరుగువానితో నీవు వ్యాజ్యెమాడవచ్చును గాని పరునిగుట్టు బయటపెట్టకుము. బయటపెట్టినయెడల వినువాడు నిన్ను అవమానపరచునేమో అందువలన నీకు కలిగిన అపకీర్తి యెన్నటికిని పోకుండును. సమయోచితముగా పలుకబడిన మాట చిత్రమైన వెండి పళ్లెములలో నుంచబడిన బంగారు పండ్లవంటిది. బంగారు కర్ణభూషణమెట్టిదో అపరంజి ఆభరణమెట్టిదో వినువాని చెవికి జ్ఞానముగల ఉపదేశకుడు అట్టివాడు. నమ్మకమైన దూత తనను పంపువారికి కోతకాలపు మంచు చల్లదనమువంటివాడు వాడు తన యజమానుల హృదయమును తెప్పరిల్ల జేయును. కపటమనస్సుతో దానమిచ్చి డంబము చేయువాడు వర్షములేని మబ్బును గాలిని పోలియున్నాడు. దీర్ఘశాంతముచేత న్యాయాధిపతిని ఒప్పించ వచ్చును సాత్వికమైన నాలుక యెముకలను నలుగగొట్టును. తేనె కనుగొంటివా? తగినంతమట్టుకే త్రాగుము అధికముగా త్రాగినయెడల కక్కి వేయుదువేమో మాటిమాటికి నీ పొరుగువాని యింటికి వెళ్లకుము అతడు నీవలన విసికి నిన్ను ద్వేషించునేమో. తన పొరుగువానిమీద కూటసాక్ష్యము పలుకువాడు సమ్మెటను ఖడ్గమును వాడిగల అంబును పోలినవాడు. శ్రమకాలములో విశ్వాసఘాతకుని ఆశ్రయించుట విరిగిన పళ్లతోను కీలు వసిలిన కాలుతోను సమానము. దుఃఖచిత్తునికి పాటలు వినుపించువాడు చలిదినమున పైబట్ట తీసివేయువానితోను సురేకారముమీద చిరకపోయువానితోను సమానుడు. నీ పగవాడు ఆకలిగొనినయెడల వానికి భోజనము పెట్టుము దప్పిగొనినయెడల వానికి దాహమిమ్ము అట్లు చేయుటచేత వాని తలమీద నిప్పులు కుప్పగా పోయుదువు యెహోవా అందుకు నీకు ప్రతిఫలమిచ్చును. ఉత్తరపు గాలి వాన పుట్టించును కొండెగాని నాలుక కోపదృష్టి కలిగించును. గయ్యాళితో పెద్ద యింట నుండుటకంటె మిద్దెమీద నొక మూలను నివసించుట మేలు దప్పిగొనినవానికి చల్లని నీరు ఎట్లుండునో దూరదేశమునుండి వచ్చిన శుభసమాచారము అట్లుండును. కలకలు చేయబడిన ఊటయు చెడిపోయిన బుగ్గయు నీతిమంతుడు దుష్టునికి లోబడుటయు సమానములు. తేనె నధికముగా త్రాగుట మంచిది కాదు. దుర్లభమైన సంగతి పరిశీలన చేయుట ఘనతకు కారణము. ప్రాకారము లేక పాడైన పురము ఎంతో తన మనస్సును అణచుకొనలేనివాడును అంతే.

సామెతలు 25:1-28 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)