సామెతలు 2:16-22

సామెతలు 2:16-22 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

మరియు అది జారస్త్రీనుండి మృదువుగా మాటలాడు పరస్త్రీనుండి నిన్ను రక్షించును. అట్టి స్త్రీ తన యౌవనకాలపు ప్రియుని విడుచునది తన దేవుని నిబంధనను మరచునది. దాని యిల్లు మృత్యువునొద్దకు దారితీయును అది నడచు త్రోవలు ప్రేతలయొద్దకు చేరును దానియొద్దకు పోవువారిలో ఎవరును తిరిగి రారు జీవమార్గములు వారికి దక్కవు. నా మాటలు వినినయెడల నీవు సజ్జనుల మార్గమందు నడుచుకొందువు నీతిమంతుల ప్రవర్తనల ననుసరించుదువు. యథార్థవంతులు దేశమందు నివసించుదురు లోపములేనివారు దానిలో నిలిచియుందురు. భక్తిహీనులు దేశములో నుండకుండ నిర్మూలమగుదురు. విశ్వాసఘాతకులు దానిలోనుండి పెరికివేయబడుదురు.

షేర్ చేయి
Read సామెతలు 2

సామెతలు 2:16-22 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

వ్యభిచారి వలలో పడకుండా, తియ్యగా మాట్లాడి మోసపుచ్చే వేశ్య బారి నుండి జ్ఞానం నిన్ను కాపాడుతుంది. అలాంటి స్త్రీ తన యవ్వనకాలంలో తన భర్తను విడిచిపెట్టి తన దేవుని నిబంధన పెడచెవిన పెడుతుంది. ఆ స్త్రీ ఇల్లు మరణానికి నడిపిస్తుంది. ఆ స్త్రీ నడిచే మార్గం శవాల దగ్గరికి చేరుతుంది. ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళేవాళ్ళు ఎవ్వరూ వెనక్కి తిరిగిరారు. వాళ్ళు జీవమార్గం చేరుకోలేరు. నేను చెప్పే మాటలు విని ఆ విధంగా నడుచుకుంటే నువ్వు యథార్థవంతులు నడిచే మార్గంలో నడుచుకుంటావు. నీతిమంతుల ప్రవర్తన అనుసరిస్తావు. నిజాయితీపరులు దేశంలో కాపురం ఉంటారు. సత్యవర్తనులు దేశంలో స్థిరంగా ఉంటారు. చెడ్డ పనులు చేసేవారు నిర్మూలం అవుతారు. నమ్మకద్రోహులు దేశంలో లేకుండా పోతారు.

షేర్ చేయి
Read సామెతలు 2

సామెతలు 2:16-22 పవిత్ర బైబిల్ (TERV)

మరో దేశపు స్త్రీ ఎవరైనా నీవు ఆమెతో పాపము చేసేందుకు నిన్ను ఒప్పించేందుకని, దుర్మార్గులు తియ్యటి మాటలు ప్రయోగించవచ్చు. ఆమె చిన్నదిగా ఉన్నప్పుడే వివాహం చేసుకుంది కాని ఆమె తన భర్తను విడిచి పెట్టింది. ఆమె తన వివాహ ప్రమాణాన్ని నిలుపుకోవటం లేదు. ఆమె తన దేవుని నిబంధనను మర్చిపోతుంది. కాని లేదు అని ఆమెతో చెప్పేందుకు జ్ఞానం నీకు సహాయం చేస్తుంది. నీవు బలహీనుడవై ఆమె ఇంట ప్రవేశిస్తే నాశనం (మరణం) వైపు మొదటి మెట్టు మీద నడచినట్టే. నీవు ఆమెను అలానే వెంబడిస్తే ఆమె నిన్ను సమాధికి నడిపిస్తుంది. ఆమె ఒక సమాధిలా ఉంది. ఒకవేళ ఏ పురుషుడైనా ఆ స్త్రీ దగ్గరకు వెళ్తే, అతడు ఎన్నటికీ తిరిగి రాడు. ఆ మనిషి జీవితం మరలా ఎన్నటికి మొదటిలా ఉండదు. కనుక నీవు మంచి మనుష్యుల అడుగుజాడలను అనుసరించేలా, మంచి మనుష్యులు జీవించే విధంగా జీవించునట్లు జ్ఞానం సహాయం చేస్తుంది. సరిగ్గా జీవించే ప్రజలు దేశాన్ని తామే స్వంతంగా కలిగి ఉంటారు. మంచిని జరిగించే మనుష్యులు వారి భూమిలో జీవిస్తారు. కాని దుర్మార్గులు వారి భూమిని పోగొట్టుకొంటారు. ఆ దుర్మార్గులు దేశం నుండి తొలగించి వేయబడతారు.

షేర్ చేయి
Read సామెతలు 2

సామెతలు 2:16-22 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)

జ్ఞానం నిన్ను వ్యభిచార స్త్రీ నుండి, మోహపు మాట్లాడే దారితప్పిన స్త్రీ నుండి కాపాడుతుంది. అలాంటి స్త్రీ తన యవ్వన కాలపు భర్తను విడిచిపెట్టి దేవుని ఎదుట తాను చేసిన ప్రమాణాన్ని నిర్లక్ష్యం చేస్తుంది. ఖచ్చితంగా దాని ఇల్లు మరణం దగ్గరకు నడిపిస్తుంది, దాని త్రోవలు చనిపోయినవారి దగ్గరకు దారితీస్తాయి. ఆ స్త్రీ దగ్గరకు వెళ్లిన ఎవరూ తిరిగి రారు జీవమార్గాలను వారు చేరుకోలేరు. కాబట్టి నీవు మంచి మార్గాల్లో నడుచుకోవాలి, నీతిమంతుల ప్రవర్తనను అనుసరించాలి. యథార్థవంతులు దేశంలో నివసిస్తారు, ఏ తప్పుచేయని వారే దానిలో నిలిచి ఉంటారు. కాని దుర్మార్గులు దేశం నుండి తొలగించబడతారు ద్రోహులు దాని నుండి నిర్మూలం చేయబడతారు.

షేర్ చేయి
Read సామెతలు 2