సామెతలు 16:20-24
సామెతలు 16:20-24 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఉపదేశం శ్రద్ధగా ఆలకించే వారికి మేలు కలుగుతుంది. యెహోవాను ఆశ్రయం కోరేవాడు ధన్యుడు. హృదయంలో జ్ఞానం నిండి ఉన్నవాడు వివేకవంతుడు. మధురమైన మాటలు విద్యాభివృద్ది కలిగిస్తాయి. తెలివిగల వారికి వారి జ్ఞానం జీవం కలిగించే ఊట వంటిది. మూఢులకు వారి మూర్ఖత్వమే శిక్షగా మారుతుంది. జ్ఞాని హృదయం వాడికి తెలివి బోధిస్తుంది. వాడి పెదాలకు నమ్రత జోడిస్తుంది. మధురమైన మాటలు కమ్మని తేనె వంటివి. అవి ప్రాణానికి మాధుర్యం, ఎముకలకు ఆరోగ్యం.
సామెతలు 16:20-24 పవిత్ర బైబిల్ (TERV)
మనుష్యులు తనకు నేర్పించుటకు ప్రయత్నించినప్పుడు, వినే వ్యక్తి లాభం పొందుతాడు. యెహోవాను నమ్ముకొనేవాడు ఆశీర్వదించబడుతాడు. ఒకవేళ ఒక మనిషి జ్ఞానముగల వాడైతే అది ప్రజలు తెలుసుకొంటారు. జాగ్రత్తగా ఎంచుకొని మాటలు మాట్లాడే మనిషి, చాలా ఒప్పించదగినవాడుగా ఉంటాడు. జ్ఞానముగల వారికి అది నిజమైన జీవాన్ని తెచ్చిపెడుతుంది. కాని బుద్ధిహీనులు మరింత బుద్ధిహీనంగా ఉండటమే నేర్చుకొంటారు. జ్ఞానముగల మనిషి మాట్లాడక ముందు ఎల్లప్పుడూ ఆలోచిస్తాడు. అతడు చెప్పే మాటలు మంచివి, వినదగినవి. దయగల మాటలు తేనెలా ఉంటాయి. వాటిని అంగీకరించటం సులభం, అవి నీ ఆరోగ్యానికి మంచివి.
సామెతలు 16:20-24 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఉపదేశమునకు చెవి యొగ్గువాడు మేలునొందును యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు. జ్ఞానహృదయుడు వివేకి యనబడును రుచిగల మాటలు పలుకుటవలన విద్యయెక్కువగును. తెలివిగలవానికి వాని తెలివి జీవపు ఊట మూఢులకు వారి మూఢత్వమే శిక్ష జ్ఞానుని హృదయము వానినోటికి తెలివి కలిగించును వాని పెదవులకు విద్య విస్తరింపజేయును. ఇంపైన మాటలు తేనెపట్టువంటివి అవి ప్రాణమునకు మధురమైనవి యెముకలకు ఆరోగ్య కరమైనవి.
సామెతలు 16:20-24 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
ఉపదేశాన్ని పాటించేలా జాగ్రత్తవహించేవాడు వర్ధిల్లుతాడు, యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు. జ్ఞానంగల హృదయం గలవారు వివేకులు అని పిలువబడతారు, దయగల మాటలు ఒప్పింపజేస్తాయి. వివేకికి వాని వివేకం ఒక జీవపుఊట, కానీ మూర్ఖులకు మూర్ఖత్వం శిక్షను తెస్తుంది. జ్ఞానుని హృదయం వాని నోటికి తెలివి కలిగిస్తుంది, వాని పెదవులకు విద్య ఎక్కువయేలా చేస్తుంది. దయ గల మాటలు తేనెతెట్టె వంటివి, అవి ప్రాణానికి తియ్యనివి ఎముకలకు ఆరోగ్యకరమైనవి.