సామెతలు 16:1-33

సామెతలు 16:1-33 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

మనుషుల హృదయాల్లోని ఆలోచనలు వాళ్ళ ఆధీనంలోనే ఉంటాయి. యెహోవా మాత్రమే శాంతి సమాధానాలు అనుగ్రహిస్తాడు. ఒక వ్యక్తి ప్రవర్తన అతని దృష్టిలో సవ్యంగానే ఉంటుంది. యెహోవా ఆత్మలను పరిశోధిస్తాడు. నీ పనుల భారమంతా యెహోవా మీద ఉంచు. అప్పుడు నీ ఆలోచనలు సఫలం అవుతాయి. యెహోవా ప్రతి దానినీ దాని దాని పనుల కోసం నియమించాడు. మూర్ఖులు నాశనమయ్యే రోజు కోసం సృష్టింపబడ్డారు. హృదయంలో గర్వం ఉన్నవాళ్ళు యెహోవాకు అసహ్యం. తప్పనిసరిగా వాళ్లు శిక్ష పొందుతారు. నిబంధన విశ్వసనీయత, నమ్మకత్వం దోషానికి తగిన పరిహారం కలిగిస్తాయి. యెహోవా పట్ల భయభక్తులు కలిగి ఉన్నవాడు దుష్టత్వం నుండి దూరంగా తొలగిపోతాడు. ఒకడి ప్రవర్తన యెహోవాకు ఇష్టమైతే ఆయన అతని శత్రువులను కూడా మిత్రులుగా చేస్తాడు. అన్యాయంగా సంపాదించే అధికమైన సంపద కంటే నీతిగా వచ్చే కొంచెమైనా ఉత్తమం. ఒకడు తాను చేయాలనుకున్నదంతా హృదయంలో ఆలోచించుకుంటాడు. అతని మార్గాన్ని యెహోవా స్థిరపరుస్తాడు. రాజు నోటి నుండి దైవిక తీర్మానం వెలువడుతుంది. తీర్పు తీర్చునప్పుడు అతని మాట న్యాయం తప్పిపోదు. న్యాయమైన త్రాసు, తూకం రాళ్లు యెహోవా నియమించాడు. సంచిలో ఉండే తూనిక గుళ్ళు ఆయన ఏర్పాటు. రాజులు చెడ్డ పనులు జరిగించడం హేయమైన చర్య. సింహాసనం నిలిచేది న్యాయం మూలానే. సరైన సంగతి సూటిగా మాట్లాడేవారు రాజులకు సంతోషం కలిగిస్తారు. నిజాయితీపరులు వారికి ఇష్టమైనవారు. రాజుకు కోపం వస్తే మరణం దాపురిస్తుంది. జ్ఞానం ఉన్నవాడు ఆ కోపం చల్లారేలా చేస్తాడు. రాజుల ముఖకాంతి వలన జీవం కలుగుతుంది. అతని అనుగ్రహం వసంతకాలంలో వాన కురిసే మేఘం లాంటిది. విలువైన బంగారం సంపాదించడం కంటే జ్ఞానం సంపాదించడం ఎంతో శ్రేష్ఠం. వెండి సంపాదించడం కంటే తెలివితేటలు కోరుకోవడం ఉపయోగకరం. నిజాయితీపరులకు దుష్ట ప్రవర్తన విడిచి నడుచుకోవడమే రాజమార్గం వంటిది. తన ప్రవర్తన కనిపెట్టుకుని ఉండేవాడు తన ప్రాణం కాపాడుకుంటాడు. ఒకడి గర్వం వాడి పతనానికి దారి చూపుతుంది. అహంకారమైన మనస్సు నాశనానికి నడుపుతుంది. దుర్మార్గులతో కలసి దోచుకున్న సొమ్ము పంచుకోవడం కంటే, వినయంతో దీన మనస్కులతో ఉండడం మంచిది. ఉపదేశం శ్రద్ధగా ఆలకించే వారికి మేలు కలుగుతుంది. యెహోవాను ఆశ్రయం కోరేవాడు ధన్యుడు. హృదయంలో జ్ఞానం నిండి ఉన్నవాడు వివేకవంతుడు. మధురమైన మాటలు విద్యాభివృద్ది కలిగిస్తాయి. తెలివిగల వారికి వారి జ్ఞానం జీవం కలిగించే ఊట వంటిది. మూఢులకు వారి మూర్ఖత్వమే శిక్షగా మారుతుంది. జ్ఞాని హృదయం వాడికి తెలివి బోధిస్తుంది. వాడి పెదాలకు నమ్రత జోడిస్తుంది. మధురమైన మాటలు కమ్మని తేనె వంటివి. అవి ప్రాణానికి మాధుర్యం, ఎముకలకు ఆరోగ్యం. ఒకడు నడిచే బాట వాడి దృష్టికి యథార్థం అనిపిస్తుంది. చివరకూ అది మరణానికి నడిపిస్తుంది. కూలివాడి ఆకలే వాడి చేత అని చేయిస్తుంది. వాడి క్షుద్బాధ వాడు పనిచేసేలా తొందరపెడుతుంది. దుష్టులు కీడు కలిగించడం కోసం కారణాలు వెతుకుతారు. వారి పెదాల మీద కోపాగ్ని రగులుతూ ఉంటుంది. మూర్ఖుడు కలహాలు కల్పిస్తాడు. చాడీలు చెప్పేవాడు మిత్రులను విడదీస్తాడు. దౌర్జన్యం చేసేవాడు తన పొరుగువాణ్ణి మచ్చిక చేసుకుంటాడు. చెడు మార్గంలో అతణ్ణి నడిపిస్తాడు. కళ్ళు మూస్తూ పెదవులు బిగబట్టేవారు, కుయుక్తులు పన్నేవారు కీడు కలిగించే వారు. నెరసిన వెంట్రుకలు సొగసైన కిరీటం వంటివి. అవి న్యాయమార్గంలో నడుచుకునే వారికి దక్కుతాయి. పరాక్రమం గల యుద్ధవీరుని కంటే దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు. పట్టణాలను స్వాధీనం చేసుకునేవాడి కంటే తన మనస్సును అదుపులో ఉంచుకునేవాడు శ్రేష్ఠుడు. చీట్లు ఒడిలో వేస్తారు. నిర్ణయం యెహోవాదే.

షేర్ చేయి
Read సామెతలు 16

సామెతలు 16:1-33 పవిత్ర బైబిల్ (TERV)

మనుష్యులు తమ ఆలోచనలు చేస్తారు. అయితే ఆ విషయాలు జరిగేటట్టుగా చేసేవాడు యెహోవాయే. ఒకడు తాను చేసేది అంతా సరిగ్గా ఉంది అనుకొంటాడు. అయితే మనుష్యులు చేసే వాటికిగల అసలైన కారణాలు ఏమిటో యెహోవా తీర్పు చెబుతాడు. నీవు చేసే ప్రతిదానిలో సహాయం కోసం ఎల్లప్పుడూ యెహోవా వైపు తిరుగు, నీవు జయం పొందుతావు. ప్రతిదానికి యెహోవా ఏర్పాటు ఒకటి ఉంది. యెహోవా ఏర్పాటులో దుర్మార్గులు నాశనం చేయబడతారు. ఇతరులకంటే తానే మంచివాడిని అనుకొనే ప్రతి మనిషి యెహోవాకు అసహ్యుడు. ఆ గర్విష్ఠుల నందరినీ యెహోవా తప్పక నాశనం చేస్తాడు. నిజమైన ప్రేమ, నమ్మకం నిన్ను పవిత్రం చేస్తాయి. యెహోవాను గౌరవించు, నీవు దుర్మార్గానికి దూరంగా ఉంటావు. ఒక వ్యక్తి యెహోవాను సంతోషపెట్టే విధంగా మంచి జీవితం జీవిస్తూంటే అప్పుడు అతని శత్రువులు కూడా అతనితో సమాధానంగా ఉంటారు. మోసం చేసి విస్తారంగా సంపాదించుటకంటే, సరైన విధంగా కొంచెం మాత్రమే సంపాదించుట మేలు. ఒక మనిషి తాను చేయాలనుకొనే వాటి విషయంలో పథకాలు వేయవచ్చు. అయితే ఏమి జరుగు తుంది అనేది నిర్ణయించే వాడు యెహోవా. ఒక రాజు మాట్లాడితే, అతని మాటలు చట్టం అవుతాయి. అతని నిర్ణయాలు ఎల్లప్పుడూ న్యాయంగా ఉండాలి. త్రాసులు, తూనిక రాళ్లు అన్నీ నిజాయితీగా ఉండాలని యెహోవా కోరుతాడు, వ్యాపార ఒప్పందాలన్నీ న్యాయంగా ఉండాలని ఆయన కోరుతాడు. కీడు చేసే మనుష్యులను రాజులు అసహ్యించుకొంటారు. మంచితనం అతని రాజ్యాన్ని మరింత బలమైనదిగా చేస్తుంది. రాజులు సత్యం వినాలని కోరుతారు. అబద్ధాలు చేప్పని ప్రజలు రాజులకు ఇష్టం. రాజుకు కోపం వస్తే, అతడు ఎవరినైనా చంపవచ్చును. జ్ఞానముగలవాడు రాజును సంతోష పెట్టడానికి ప్రయత్నిస్తాడు. రాజు సంతోషంగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికీ జీవితం సంతోషంగా ఉంటుంది. నీ విషయమై రాజు సంతోషిస్తే, అది మేఘం నుండి కురిసిన వర్షపు ఊటలా ఉంటుంది. జ్ఞానము బంగారంకంటె చాలా ఎక్కువ విలువగలది. అవగాహన వెండికంటె చాలా ఎక్కువ విలువగలది. మంచి మనుష్యులు దుర్మార్గానికి దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తూ తమ జీవితాలు జీవిస్తారు. తన జీవితం కాపాడుకొనేవాడు తన ఆత్మను భద్రము చేసుకొంటున్నాడు. ఒక వ్యక్తి గనుక గర్వంగా ఉంటే, అప్పుడు అతడు నాశనకరమైన అపాయంలో ఉన్నాడు. ఒక మనిషి ఇతరులకంటె తానే మంచివాడినని అనుకొంటే అతడు ఓడిపోయే ప్రమాదంలో ఉన్నాడు. ఇతరులకంటె గొప్పవాళ్లం అనుకొనే వాళ్లతో ఐశ్వర్యాలు పంచుకోవటంకంటె, దీనులైన, పేదవాళ్లతో కలిసి జీవించటం మేలు. మనుష్యులు తనకు నేర్పించుటకు ప్రయత్నించినప్పుడు, వినే వ్యక్తి లాభం పొందుతాడు. యెహోవాను నమ్ముకొనేవాడు ఆశీర్వదించబడుతాడు. ఒకవేళ ఒక మనిషి జ్ఞానముగల వాడైతే అది ప్రజలు తెలుసుకొంటారు. జాగ్రత్తగా ఎంచుకొని మాటలు మాట్లాడే మనిషి, చాలా ఒప్పించదగినవాడుగా ఉంటాడు. జ్ఞానముగల వారికి అది నిజమైన జీవాన్ని తెచ్చిపెడుతుంది. కాని బుద్ధిహీనులు మరింత బుద్ధిహీనంగా ఉండటమే నేర్చుకొంటారు. జ్ఞానముగల మనిషి మాట్లాడక ముందు ఎల్లప్పుడూ ఆలోచిస్తాడు. అతడు చెప్పే మాటలు మంచివి, వినదగినవి. దయగల మాటలు తేనెలా ఉంటాయి. వాటిని అంగీకరించటం సులభం, అవి నీ ఆరోగ్యానికి మంచివి. మనుష్యుల దృష్టికి సరైనదిగా కనుపించే మార్గం ఒకటి ఉంది. కాని ఆ మార్గం మరణానికి మాత్రమే నడిపిస్తుంది. పనివాని ఆకలి అతణ్ణి పని చేయిస్తూనే ఉంటుంది. అతడు భోజనం చేయగలిగేటట్టు, అతని ఆకలి అతణ్ణి పని చేయిస్తుంది. పనికిమాలిన మనిషి చెడు పనులు చేయాలని పథకం వేస్తాడు. అతని సలహా నిప్పులా నాశనం చేస్తుంది. చిక్కులు పేట్టేవారు ఎల్లప్పుడూ సమస్యలు పుట్టిస్తూంటారు. చెప్పుడు మాటలు వ్యాపింపజేసేవాడు సన్నిహితులైన మిత్రుల మధ్య చిక్కు కలిగిస్తాడు. త్వరగా కోపం వచ్చే మనిషి తన స్నేహితులకు చిక్కు తెచ్చిపెడ్తాడు. మంచిది కాని మార్గంలో అతడు వారిని నడిపిస్తాడు. కన్నుగీటి, చిరునవ్వునవ్వేవాడు ఏదో అక్రమం, కీడు తలపెడ్తున్నాడు. నెరసిన తల వెంట్రుకలు, మంచి జీవితాలు జీవించిన వారికి మహిమ కిరీటం. బలమైన ఒక సైనికునిగా ఉండటంకంటే సహనం గలిగి ఉండటం మంచిది, ఒక పట్టణం అంతటిని స్వాధీనం చేసికోవటంకంటే, నీ కోపాన్ని స్వాధీనం చేసికోవటం మేలు. నిర్ణయాలు చేయటానికి మనుష్యులు చీట్లు వేస్తారు. కాని నిర్ణయాలు ఎల్లప్పుడూ దేవుని దగ్గర్నుండి వస్తాయి.

షేర్ చేయి
Read సామెతలు 16

సామెతలు 16:1-33 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

హృదయాలోచనలు మనుష్యుని వశము, చక్కని ప్రత్యుత్తరమిచ్చుటకు యెహోవావలన కలుగును. ఒకని నడతలన్నియు వాని దృష్టికి నిర్దోషములుగా కనబడును యెహోవా ఆత్మలను పరిశోధించును. నీ పనుల భారము యెహోవామీద నుంచుము అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. యెహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలుగజేసెను నాశనదినమునకు ఆయన భక్తిహీనులను కలుగజేసెను. గర్వహృదయులందరు యెహోవాకు హేయులు నిశ్చయముగా వారు శిక్ష నొందుదురు. కృపాసత్యములవలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును యెహోవాయందు భయభక్తులు కలిగియుండుటవలన మనుష్యులు చెడుతనమునుండి తొలగిపోవుదురు. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. అన్యాయముచేత కలిగిన గొప్ప వచ్చుబడికంటె నీతితోకూడిన కొంచెమే శ్రేష్ఠము. ఒకడు తాను చేయబోవునది హృదయములో యోచించుకొనును యెహోవా వాని నడతను స్థిరపరచును దేవోక్తి పలుకుట రాజువశము న్యాయము విధించుటయందు అతని మాట న్యాయము తప్పదు. న్యాయమైన త్రాసును తూనికరాళ్లును యెహోవా యొక్క యేర్పాటులు సంచిలోని గుండ్లన్నియు ఆయన నియమించెను. రాజులు దుష్టక్రియలు చేయుట హేయమైనది నీతివలన సింహాసనము స్థిరపరచబడును. నీతిగల పెదవులు రాజులకు సంతోషకరములు యథార్థవాదులు వారికి ప్రియులు. రాజు క్రోధము మరణదూత జ్ఞానియైనవాడు ఆ క్రోధమును శాంతిపరచును. రాజుల ముఖప్రకాశమువలన జీవము కలుగునువారి కటాక్షము కడవరి వానమబ్బు. అపరంజిని సంపాదించుటకంటె జ్ఞానమును సంపా దించుట ఎంతో శ్రేష్ఠము వెండిని సంపాదించుటకంటె తెలివిని సంపాదించుట ఎంతో మేలు. చెడుతనము విడిచి నడచుటయే యథార్థవంతులకు రాజమార్గము తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకొనును. నాశనమునకు ముందు గర్వము నడచును. పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడచును గర్విష్ఠులతో దోపుడుసొమ్ము పంచుకొనుటకంటె దీనమనస్సు కలిగి దీనులతో పొత్తుచేయుట మేలు. ఉపదేశమునకు చెవి యొగ్గువాడు మేలునొందును యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు. జ్ఞానహృదయుడు వివేకి యనబడును రుచిగల మాటలు పలుకుటవలన విద్యయెక్కువగును. తెలివిగలవానికి వాని తెలివి జీవపు ఊట మూఢులకు వారి మూఢత్వమే శిక్ష జ్ఞానుని హృదయము వానినోటికి తెలివి కలిగించును వాని పెదవులకు విద్య విస్తరింపజేయును. ఇంపైన మాటలు తేనెపట్టువంటివి అవి ప్రాణమునకు మధురమైనవి యెముకలకు ఆరోగ్య కరమైనవి. ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును అయినను తుదకు అది మరణమునకు చేరును. కష్టము చేయువాని ఆకలి వానికొరకు వానిచేత కష్టము చేయించును వాని కడుపు వానిని తొందరపెట్టును. పనికిమాలినవాడు కీడును త్రవ్వి పైకెత్తును వాని పెదవులమీద అగ్ని మండుచున్నట్టున్నది. మూర్ఖుడు కలహము పుట్టించును కొండెగాడు మిత్రభేదము చేయును. బలాత్కారి తన పొరుగువానిని లాలనచేయును కానిమార్గములో వాని నడిపించును. కృత్రిమములు కల్పింపవలెనని కన్నులు మూసికొని తన పెదవులు బిగబట్టువాడే కీడు పుట్టించువాడు. నెరసిన వెండ్రుకలు సొగసైన కిరీటము అవి నీతిప్రవర్తన గలవానికి కలిగి యుండును. పరాక్రమశాలికంటె దీర్ఘశాంతముగలవాడు శ్రేష్ఠుడు పట్టణము పట్టుకొనువానికంటె తన మనస్సును స్వాధీన పరచుకొనువాడు శ్రేష్ఠుడు చీట్లు ఒడిలో వేయబడును వాటివలని తీర్పు యెహోవా వశము.

షేర్ చేయి
Read సామెతలు 16

సామెతలు 16:1-33 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)

హృదయ ప్రణాళికల మనుష్యులకు చెందినవి, కాని నాలుక యొక్క సరియైన జవాబు యెహోవా నుండి వస్తుంది. ఒక వ్యక్తి యొక్క అన్ని మార్గాలు వారికి సరియైనవిగా కనిపిస్తాయి, అయితే ఉద్దేశాలు తూకం వేయబడతాయి. మీ పనులను యెహోవాకు అప్పగించండి, మీ ప్రణాళికలు స్థిరపరచబడతాయి. యెహోవా ప్రతిదీ దాని దాని పని కోసం కలుగజేశారు నాశన దినానికి ఆయన భక్తిలేని వారిని కలుగజేశారు. గర్వ హృదయులందరిని యెహోవా అసహ్యించుకుంటారు. ఇది నిశ్చయం: వారు శిక్షింపబడకపోరు. ప్రేమ, నమ్మకత్వం వలన పాపానికి ప్రాయశ్చిత్తం కలుగుతుంది; యెహోవాయందలి భయం వలన కీడు తొలగిపోతుంది. ఒక వ్యక్తి మార్గాలు యెహోవాకు నచ్చినప్పుడు, అతడు వాని శత్రువులను వానితో సమాధానపరుస్తారు. అన్యాయం చేత కలిగిన గొప్ప రాబడి కంటే, నీతితో కూడిన కొంచెము మేలు. మనుష్యులు తాము చేయబోయేది తమ హృదయాల్లో ఆలోచిస్తారు, యెహోవా వారి అడుగులను స్ధిరపరుస్తారు. రాజు పెదవులు దైవ వాక్కులా మాట్లాడతాయి, అతని నోరు న్యాయ ద్రోహం చేయదు. న్యాయమైన త్రాసు, తూనిక రాళ్లు యెహోవా ఏర్పాట్లు, సంచిలోని గుండ్లన్నియు ఆయన నియమించారు. రాజులు చెడ్డపనులు చేయడాన్ని అసహ్యించుకుంటారు, నీతి వలన సింహాసనం స్ధిరపరచబడుతుంది. రాజులు నిజాయితీగల పెదవులను ఇష్టపడతారు, యథార్థంగా మాట్లాడేవారికి వారు విలువనిస్తారు. రాజు ఆగ్రహం మరణ దూత వంటిది, అయితే జ్ఞానులు దాన్ని శాంతింపజేస్తారు. రాజుల ముఖకాంతి వలన జీవం కలుగుతుంది, వారి దయ వసంత రుతువులో వర్షం మేఘం లాంటిది. బంగారం కంటే జ్ఞానాన్ని సంపాదించడం, వెండి కంటే తెలివిని సంపాదించడం ఎంత మేలు! యథార్థవంతుల రాజమార్గం చెడును తప్పిస్తుంది; తమ మార్గాలను కాపాడుకునేవారు తమ ప్రాణాలను కాపాడుకుంటారు. నాశనానికి ముందు గర్వం, పతనానికి ముందు అహంకారం వెళ్తాయి. గర్విష్ఠులతో దోపుడుసొమ్ము పంచుకోవడం కంటే, అణచివేయబడిన వారితో పాటు దీనులుగా ఉండడం మేలు. ఉపదేశాన్ని పాటించేలా జాగ్రత్తవహించేవాడు వర్ధిల్లుతాడు, యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు. జ్ఞానంగల హృదయం గలవారు వివేకులు అని పిలువబడతారు, దయగల మాటలు ఒప్పింపజేస్తాయి. వివేకికి వాని వివేకం ఒక జీవపుఊట, కానీ మూర్ఖులకు మూర్ఖత్వం శిక్షను తెస్తుంది. జ్ఞానుని హృదయం వాని నోటికి తెలివి కలిగిస్తుంది, వాని పెదవులకు విద్య ఎక్కువయేలా చేస్తుంది. దయ గల మాటలు తేనెతెట్టె వంటివి, అవి ప్రాణానికి తియ్యనివి ఎముకలకు ఆరోగ్యకరమైనవి. ఒకని ఎదుట సరియైనదిగా కనబడే ఓ మార్గం ఉంది, అయితే చివరికి అది మరణానికి నడిపిస్తుంది. కష్టం చేసేవారి ఆకలి వానిచేత కష్టం చేయిస్తుంది, వారి ఆకలి వారిని ముందుకు నడిపిస్తుంది. పనికిమాలినవారు కీడును పన్నాగం వేస్తారు, వారి మాటలు మండుతున్న అగ్నిలాంటివి. మూర్ఖులు తగవు రేపుతారు, పుకార్లు సన్నిహితులైన స్నేహితులను వేరు చేస్తాయి. హింసాత్మకమైన వారు వారి పొరుగువారిని ఆశపెడతారు, సరియైనది కాని మార్గంలో వారిని నడిపిస్తారు. తమ కన్ను గీటేవారు కుట్ర పన్నుతున్నారు; తన పెదవులు బిగబట్టేవారు కీడు వైపు మొగ్గు చూపుతారు. నెరసిన వెంట్రుకలు వైభవం కలిగిన కిరీటం, అది నీతి మార్గంలో సాధించబడుతుంది. యుద్ధవీరునికంటే సహనం గలవాడు, పట్టణాన్ని స్వాధీనం చేసుకునేవానికంటే తన మనస్సును అదుపు చేసుకోగలవాడు మేలు. చీట్లు ఒడిలో వేయబడవచ్చు, కాని వాటి నిర్ణయం యెహోవా సొంతము.

షేర్ చేయి
Read సామెతలు 16