సామెతలు 16:1-13

సామెతలు 16:1-13 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

మనుషుల హృదయాల్లోని ఆలోచనలు వాళ్ళ ఆధీనంలోనే ఉంటాయి. యెహోవా మాత్రమే శాంతి సమాధానాలు అనుగ్రహిస్తాడు. ఒక వ్యక్తి ప్రవర్తన అతని దృష్టిలో సవ్యంగానే ఉంటుంది. యెహోవా ఆత్మలను పరిశోధిస్తాడు. నీ పనుల భారమంతా యెహోవా మీద ఉంచు. అప్పుడు నీ ఆలోచనలు సఫలం అవుతాయి. యెహోవా ప్రతి దానినీ దాని దాని పనుల కోసం నియమించాడు. మూర్ఖులు నాశనమయ్యే రోజు కోసం సృష్టింపబడ్డారు. హృదయంలో గర్వం ఉన్నవాళ్ళు యెహోవాకు అసహ్యం. తప్పనిసరిగా వాళ్లు శిక్ష పొందుతారు. నిబంధన విశ్వసనీయత, నమ్మకత్వం దోషానికి తగిన పరిహారం కలిగిస్తాయి. యెహోవా పట్ల భయభక్తులు కలిగి ఉన్నవాడు దుష్టత్వం నుండి దూరంగా తొలగిపోతాడు. ఒకడి ప్రవర్తన యెహోవాకు ఇష్టమైతే ఆయన అతని శత్రువులను కూడా మిత్రులుగా చేస్తాడు. అన్యాయంగా సంపాదించే అధికమైన సంపద కంటే నీతిగా వచ్చే కొంచెమైనా ఉత్తమం. ఒకడు తాను చేయాలనుకున్నదంతా హృదయంలో ఆలోచించుకుంటాడు. అతని మార్గాన్ని యెహోవా స్థిరపరుస్తాడు. రాజు నోటి నుండి దైవిక తీర్మానం వెలువడుతుంది. తీర్పు తీర్చునప్పుడు అతని మాట న్యాయం తప్పిపోదు. న్యాయమైన త్రాసు, తూకం రాళ్లు యెహోవా నియమించాడు. సంచిలో ఉండే తూనిక గుళ్ళు ఆయన ఏర్పాటు. రాజులు చెడ్డ పనులు జరిగించడం హేయమైన చర్య. సింహాసనం నిలిచేది న్యాయం మూలానే. సరైన సంగతి సూటిగా మాట్లాడేవారు రాజులకు సంతోషం కలిగిస్తారు. నిజాయితీపరులు వారికి ఇష్టమైనవారు.

షేర్ చేయి
Read సామెతలు 16

సామెతలు 16:1-13 పవిత్ర బైబిల్ (TERV)

మనుష్యులు తమ ఆలోచనలు చేస్తారు. అయితే ఆ విషయాలు జరిగేటట్టుగా చేసేవాడు యెహోవాయే. ఒకడు తాను చేసేది అంతా సరిగ్గా ఉంది అనుకొంటాడు. అయితే మనుష్యులు చేసే వాటికిగల అసలైన కారణాలు ఏమిటో యెహోవా తీర్పు చెబుతాడు. నీవు చేసే ప్రతిదానిలో సహాయం కోసం ఎల్లప్పుడూ యెహోవా వైపు తిరుగు, నీవు జయం పొందుతావు. ప్రతిదానికి యెహోవా ఏర్పాటు ఒకటి ఉంది. యెహోవా ఏర్పాటులో దుర్మార్గులు నాశనం చేయబడతారు. ఇతరులకంటే తానే మంచివాడిని అనుకొనే ప్రతి మనిషి యెహోవాకు అసహ్యుడు. ఆ గర్విష్ఠుల నందరినీ యెహోవా తప్పక నాశనం చేస్తాడు. నిజమైన ప్రేమ, నమ్మకం నిన్ను పవిత్రం చేస్తాయి. యెహోవాను గౌరవించు, నీవు దుర్మార్గానికి దూరంగా ఉంటావు. ఒక వ్యక్తి యెహోవాను సంతోషపెట్టే విధంగా మంచి జీవితం జీవిస్తూంటే అప్పుడు అతని శత్రువులు కూడా అతనితో సమాధానంగా ఉంటారు. మోసం చేసి విస్తారంగా సంపాదించుటకంటే, సరైన విధంగా కొంచెం మాత్రమే సంపాదించుట మేలు. ఒక మనిషి తాను చేయాలనుకొనే వాటి విషయంలో పథకాలు వేయవచ్చు. అయితే ఏమి జరుగు తుంది అనేది నిర్ణయించే వాడు యెహోవా. ఒక రాజు మాట్లాడితే, అతని మాటలు చట్టం అవుతాయి. అతని నిర్ణయాలు ఎల్లప్పుడూ న్యాయంగా ఉండాలి. త్రాసులు, తూనిక రాళ్లు అన్నీ నిజాయితీగా ఉండాలని యెహోవా కోరుతాడు, వ్యాపార ఒప్పందాలన్నీ న్యాయంగా ఉండాలని ఆయన కోరుతాడు. కీడు చేసే మనుష్యులను రాజులు అసహ్యించుకొంటారు. మంచితనం అతని రాజ్యాన్ని మరింత బలమైనదిగా చేస్తుంది. రాజులు సత్యం వినాలని కోరుతారు. అబద్ధాలు చేప్పని ప్రజలు రాజులకు ఇష్టం.

షేర్ చేయి
Read సామెతలు 16

సామెతలు 16:1-13 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

హృదయాలోచనలు మనుష్యుని వశము, చక్కని ప్రత్యుత్తరమిచ్చుటకు యెహోవావలన కలుగును. ఒకని నడతలన్నియు వాని దృష్టికి నిర్దోషములుగా కనబడును యెహోవా ఆత్మలను పరిశోధించును. నీ పనుల భారము యెహోవామీద నుంచుము అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. యెహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలుగజేసెను నాశనదినమునకు ఆయన భక్తిహీనులను కలుగజేసెను. గర్వహృదయులందరు యెహోవాకు హేయులు నిశ్చయముగా వారు శిక్ష నొందుదురు. కృపాసత్యములవలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును యెహోవాయందు భయభక్తులు కలిగియుండుటవలన మనుష్యులు చెడుతనమునుండి తొలగిపోవుదురు. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. అన్యాయముచేత కలిగిన గొప్ప వచ్చుబడికంటె నీతితోకూడిన కొంచెమే శ్రేష్ఠము. ఒకడు తాను చేయబోవునది హృదయములో యోచించుకొనును యెహోవా వాని నడతను స్థిరపరచును దేవోక్తి పలుకుట రాజువశము న్యాయము విధించుటయందు అతని మాట న్యాయము తప్పదు. న్యాయమైన త్రాసును తూనికరాళ్లును యెహోవా యొక్క యేర్పాటులు సంచిలోని గుండ్లన్నియు ఆయన నియమించెను. రాజులు దుష్టక్రియలు చేయుట హేయమైనది నీతివలన సింహాసనము స్థిరపరచబడును. నీతిగల పెదవులు రాజులకు సంతోషకరములు యథార్థవాదులు వారికి ప్రియులు.

షేర్ చేయి
Read సామెతలు 16

సామెతలు 16:1-13 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)

హృదయ ప్రణాళికల మనుష్యులకు చెందినవి, కాని నాలుక యొక్క సరియైన జవాబు యెహోవా నుండి వస్తుంది. ఒక వ్యక్తి యొక్క అన్ని మార్గాలు వారికి సరియైనవిగా కనిపిస్తాయి, అయితే ఉద్దేశాలు తూకం వేయబడతాయి. మీ పనులను యెహోవాకు అప్పగించండి, మీ ప్రణాళికలు స్థిరపరచబడతాయి. యెహోవా ప్రతిదీ దాని దాని పని కోసం కలుగజేశారు నాశన దినానికి ఆయన భక్తిలేని వారిని కలుగజేశారు. గర్వ హృదయులందరిని యెహోవా అసహ్యించుకుంటారు. ఇది నిశ్చయం: వారు శిక్షింపబడకపోరు. ప్రేమ, నమ్మకత్వం వలన పాపానికి ప్రాయశ్చిత్తం కలుగుతుంది; యెహోవాయందలి భయం వలన కీడు తొలగిపోతుంది. ఒక వ్యక్తి మార్గాలు యెహోవాకు నచ్చినప్పుడు, అతడు వాని శత్రువులను వానితో సమాధానపరుస్తారు. అన్యాయం చేత కలిగిన గొప్ప రాబడి కంటే, నీతితో కూడిన కొంచెము మేలు. మనుష్యులు తాము చేయబోయేది తమ హృదయాల్లో ఆలోచిస్తారు, యెహోవా వారి అడుగులను స్ధిరపరుస్తారు. రాజు పెదవులు దైవ వాక్కులా మాట్లాడతాయి, అతని నోరు న్యాయ ద్రోహం చేయదు. న్యాయమైన త్రాసు, తూనిక రాళ్లు యెహోవా ఏర్పాట్లు, సంచిలోని గుండ్లన్నియు ఆయన నియమించారు. రాజులు చెడ్డపనులు చేయడాన్ని అసహ్యించుకుంటారు, నీతి వలన సింహాసనం స్ధిరపరచబడుతుంది. రాజులు నిజాయితీగల పెదవులను ఇష్టపడతారు, యథార్థంగా మాట్లాడేవారికి వారు విలువనిస్తారు.

షేర్ చేయి
Read సామెతలు 16