సామెతలు 1:20-33

సామెతలు 1:20-33 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

జ్ఞానం వీధుల్లో కేకలు వేస్తూ ఉంది. వీధుల వెంబడి బిగ్గరగా మాట్లాడుతూ ఉంది. జ్ఞానం సందడిగా ఉన్న ప్రాంతాల్లో ప్రకటన చేస్తూ ఉంది. పట్టణ ప్రధాన ప్రవేశాల్లో ప్రచారం చేస్తూ ఇలా తెలియజేస్తూ ఉంది. “జ్ఞాన హీనులారా, జ్ఞానం తెచ్చుకోకుండా ఎంతకాలం ఉండాలని కోరుకుంటారు? అపహాసకులారా, మీరు ఎగతాళి చేస్తూ ఎన్నేళ్ళు ఆనందంగా కాలం గడుపుతారు? బుద్ధిహీనులారా, మీరు ఎంతకాలం జ్ఞానాన్ని అసహ్యించుకుంటారు? నా గద్దింపు మాటలు వినండి. నా వైపు తిరగండి. నా ఆత్మను మీ మీద కుమ్మరిస్తాను. మంచి సంగతులు మీకు తెలియజేస్తాను. నేను పిలిచినప్పుడు నా మాట మీరు వినలేదు. నా చెయ్యి చాపినప్పుడు ఎవ్వరూ అందుకోలేదు. నేను మిమ్మల్ని గద్దించి మంచి మాటలు బోధించినప్పుడు నా మాటలు లక్ష్యపెట్టలేదు, లోబడలేదు. కాబట్టి మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వుతాను. మీరు భయంతో వణుకుతున్నప్పుడు నేను మిమ్మల్ని ఎగతాళి చేస్తాను. తుఫాను వచ్చినట్టు మీకు భయం కలుగుతుంది, సుడిగాలి రేగినట్టు ప్రమాదం వచ్చి పడుతుంది. మీకు కష్ట సమయాలు, దుఃఖ సమయాలు సంభవిస్తాయి. అప్పుడు నేను మిమ్మల్ని నవ్వుల పాలు చేస్తాను. అప్పుడు వాళ్ళు నా కోసం మొరపెడతారు, కానీ నేను ఎలాంటి జవాబూ ఇవ్వను. నా కోసం ఆసక్తిగా వెతుకుతారు కానీ నేను వాళ్లకు కనబడను. జ్ఞానం అంటే వాళ్లకు అసహ్యం వేస్తుంది. యెహోవా పట్ల భయభక్తులు కలిగి జీవించడం వాళ్లకు ఇష్టం లేకుండా పోయింది. వాళ్ళు నేను చెప్పిన నా మంచి ఆలోచనలు అంగీకరించలేదు. నా మందలింపును నిర్లక్ష్యం చేశారు. కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ప్రతిఫలం అనుభవిస్తారు. విరక్తి కలిగే దాకా తమ స్వంత ఆలోచనలు అనుసరిస్తారు. ఉపదేశం పొందని వారు దేవుణ్ణి తిరస్కరించి నాశనమవుతారు. మూర్ఖుల నిర్లక్ష్యం వారిని నిర్మూలం చేస్తుంది. నా ఉపదేశం విని దాని ప్రకారం నడుచుకునేవాడు సురక్షితంగా నివసిస్తాడు. కీడు కలుగుతుందన్న భయం లేకుండా ప్రశాంతంగా ఉంటాడు.”

షేర్ చేయి
Read సామెతలు 1

సామెతలు 1:20-33 పవిత్ర బైబిల్ (TERV)

ఇలా విను! జ్ఞానము ప్రజలకు ఉపదేశించటానికి ప్రయత్నిస్తుంది. ఆమె (జ్ఞానము) వీధుల్లో, సంతల్లో అరుస్తుంది. రద్దీగల వీధి మూలల్లో ఆమె (జ్ఞానము) పిలుస్తోంది. ఆమె (జ్ఞానము) తన మాటలు వినేందుకు ప్రజలను సమకూర్చేందుకు ప్రయత్నిస్తూ పట్టణ ద్వారాల దగ్గర ఉంటూ (జ్ఞానము) చెపుతుంది: “మీరు వెర్రివాళ్లు. ఇంకెన్నాళ్లు మీరు ఇలా వెర్రి పనులు చేస్తూనే ఉంటారు? ఎన్నాళ్లు మీరు తెలివిని ద్వేషీస్తూ ఉంటారు? మీరు పశ్చాత్తాపపడి నా సలహా, నా ఉపదేశం విని ఉంటే, నాకు తెలిసింది అంతా నేను మీతో చెప్పి ఉండేదాన్ని. నాకు ఉన్న తెలివి అంతా మీకు ఇచ్చి ఉండేదాన్ని. “కాని మీరు నా మాట వినేందుకు తిరస్కరించారు. సహాయం చేయటానికి నేను ప్రయత్నించాను. నేను నా చేయి అందించాను. కాని నా సహాయం స్వీకరించటానికి మీరు నిరాకరించారు. నా సలహా అంతటినీ మీరు నిర్లక్ష్యం చేసి, తిప్పికొట్టారు. నా మాటలు స్వీకరించటానికి మీరు నిరాకరించారు. అందుచేత నేను మీ కష్టం చూచి నవ్వుతాను. మీకు కష్టం కలగటం చూచి నేను సరదా పడతాను. గొప్ప కష్టం తుఫానులా మీ మీదికి వస్తుంది. సమస్యలు ఒక బలమైన గాలిలా మీ మీద కొడతాయి. మీ కష్టాలు, మీ విచారం మీ మీద మహా గొప్ప భారంగా ఉంటాయి. “ఈ సంగతులన్నీ జరిగినప్పుడు మీరు నా సహాయం కోసం అడుగుతారు. కాని నేను మీకు సహాయం చేయను. మీరు నాకోసం వెదుకుతారు, కాని మీరు నన్ను కనుగొనలేరు. మీరు ఎన్నడూ నా తెలివిని కోరుకోలేదు, గనుక నేను మీకు సహాయం చేయను. మీరు యెహోవాకు భయపడి ఆయనను గౌరవించుటకు నిరాకరించారు. నా సలహా మాటలు వినేందుకు ప్రజలారా మీరు నిరాకరించారు. నేను సరైనదారి మీకు చూపించినప్పుడు మీరు నా మాట వినేందుకు నిరాకరించారు. కనుక మీరు మీ స్వంత విదానంలోనే పనులు చేసుకోవాలి. మీ స్వంత కీడు మార్గాల్లో జీవిస్తూ మిమ్మల్ని మీరే నాశనం చేసుకొంటారు. “అవివేకులు జ్ఞానాన్ని అనుసరించేందుకు నిరాకరించిన మూలంగా మరణిస్తారు. వారి బుద్ధిహీన పధ్ధతులలో కొనసాగటం వారికి సంతోషం, అదే వారిని చంపుతుంది. కాని, నాకు విధేయత చూపే వ్యక్తి క్షేమంగా జీవిస్తాడు. ఆ వ్యక్తి సుఖంగా ఉంటాడు. అతడు కీడుకు భయపడాల్సిన అవసరం ఉండదు.”

షేర్ చేయి
Read సామెతలు 1

సామెతలు 1:20-33 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది సంతవీధులలో బిగ్గరగా పలుకుచున్నది గొప్ప సందడిగల స్థలములలో ప్రకటన చేయుచున్నది పురద్వారములలోను పట్టణములోను జ్ఞానము ప్రచురించుచు తెలియజేయుచున్నది –ఎట్లనగా, జ్ఞానములేనివారలారా, మీరెన్నాళ్లు జ్ఞానములేనివారుగా ఉండగోరుదురు? అపహాసకులారా, మీరెన్నాళ్లు అపహాస్యము చేయుచు ఆనందింతురు? బుద్ధిహీనులారా, మీరెన్నాళ్లు జ్ఞానమును అసహ్యించు కొందురు? నా గద్దింపు విని తిరుగుడి ఆలకించుడి నా ఆత్మను మీమీద కుమ్మరించుదును నా ఉపదేశమును మీకు తెలిపెదను. నేను పిలువగా మీరు వినకపోతిరి. నా చేయిచాపగా ఎవరును లక్ష్యపెట్టకపోయిరి నేను చెప్పిన బోధ యేమియు మీరు వినక త్రోసివేసితిరి నేను గద్దింపగా లోబడకపోతిరి. కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వెదను మీకు భయము వచ్చునప్పుడు నేను అపహాస్యము చేసెదను భయము మీమీదికి తుపానువలె వచ్చునప్పుడు సుడిగాలి వచ్చునట్లు మీకు అపాయము కలుగునప్పుడు మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించునప్పుడు నేను అపహాస్యము చేసెదను. అప్పుడు వారు నన్నుగూర్చి మొఱ్ఱపెట్టెదరుగాని నేను ప్రత్యుత్తరమియ్యకుందును నన్ను శ్రద్ధగా వెదకెదరు గాని వారికి నేను కనబడకుందును. జ్ఞానము వారికి అసహ్యమాయెను యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట వారి కిష్టము లేకపోయెను. నా ఆలోచన విననొల్లకపోయిరి నా గద్దింపును వారు కేవలము తృణీకరించిరి. కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలము ననుభవించెదరు తమకు వెక్కసమగువరకు తమ ఆలోచనలను అనుసరించెదరు జ్ఞానములేనివారు దేవుని విసర్జించి నాశనమగుదురు. బుద్ధిహీనులు క్షేమము కలిగినదని మైమరచి నిర్మూలమగుదురు. నా ఉపదేశము నంగీకరించువాడు సురక్షితముగా నివసించును వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగానుండును.

షేర్ చేయి
Read సామెతలు 1

సామెతలు 1:20-33 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)

జ్ఞానం వీధుల్లో కేకలు వేస్తున్నది, అది బహిరంగ స్థలాల్లో తన గొంతు గట్టిగా వినిపిస్తుంది; అధిక రద్దీ ఉండే వీధి చివర్లలో అది కేక వేస్తుంది, పట్టణ ద్వారాల దగ్గర ఆమె తన ప్రసంగం చేస్తుంది: “బుద్ధిహీనులారా మీరు ఎన్నాళ్ళు బుద్ధిహీనుని మార్గాలను ప్రేమిస్తారు? ఎగతాళి చేసేవారు ఎన్నాళ్ళు ఎగతాళి చేస్తూ ఆనందిస్తారు? బుద్ధిహీనులు ఎన్నాళ్ళు తెలివిని అసహ్యించుకుంటారు? నా గద్దింపును విని పశ్చాత్తాపపడండి! అప్పుడు నా ఆత్మను మీమీద కుమ్మరిస్తాను, నా ఉపదేశాలను మీకు తెలియజేస్తాను. కానీ నేను పిలిచినప్పుడు మీరు వినడానికి నిరాకరించినందున నేను నా చేయి చాచినప్పుడు ఎవరూ పట్టించుకోనందున, మీరు నా సలహాను లెక్కచేయనందున నా గద్దింపును అంగీకరించనందున, ఆపద మిమ్మల్ని తాకినప్పుడు నేను నవ్వుతాను; విపత్తు మిమ్మల్ని అధిగమించినప్పుడు నేను ఎగతాళి చేస్తాను, విపత్తు తుఫానులా మిమ్మల్ని అధిగమించినప్పుడు, ఆపద మిమ్మల్ని తుఫానులా ముంచినప్పుడు, మీకు బాధ ఇబ్బంది కలిగినప్పుడు నేను ఎగతాళి చేస్తాను. “అప్పుడు వారు నాకు మొరపెడతారు కాని నేను జవాబు ఇవ్వను; నా కోసం ఆతురతగా వెదకుతారు కాని నేను కనబడను, వారు జ్ఞానాన్ని అసహ్యించుకున్నారు, యెహోవాకు భయపడాలని వారు కోరలేదు కాబట్టి. వారు నా సలహాను అంగీకరించలేదు నా గద్దింపును కూడా త్రోసివేశారు కాబట్టి, వారు తమ క్రియలకు తగిన ఫలాన్ని అనుభవిస్తారు వారి ఆలోచనల ఫలితాలకు వారే విసుగుచెందుతారు. మూర్ఖులు దారితప్పడం వల్ల నశిస్తారు, బుద్ధిహీనుల నిర్లక్ష్యం వారిని నాశనం చేస్తుంది; నా మాటలను వినేవారు క్షేమంగా నివసిస్తారు; కీడు కలుగుతుందనే భయం లేకుండా నెమ్మదిగా ఉంటారు.”

షేర్ చేయి
Read సామెతలు 1