ఫిలిప్పీయులకు 2:12-18
ఫిలిప్పీయులకు 2:12-18 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
కనుక, నా ప్రియ స్నేహితులారా, మీరు ఎప్పుడు లోబడి ఉన్నట్లుగానే నేను ఉన్నప్పుడు మాత్రమే కాకుండా, నేను మీతో లేనప్పుడు మరి ఎక్కువ లోబడి భయంతో వణుకుతో మీ సొంత రక్షణను కొనసాగించండి. ఎందుకంటే దేవుని మంచి ఉద్దేశాలను నెరవేర్చడానికి మీరు ఇష్టపడడానికి, వాటిని చేయడానికి, మీలో కార్యాన్ని జరిగించేది దేవుడే. సణుగుకోకుండా లేదా వాదించకుండా ప్రతిదానిని చేయండి. తద్వారా మీరు నిందలేనివారిగా, శుద్ధులుగా, “చెడిపోయిన వక్రమైన ఈ తరం మధ్యలో, మీరు దోషంలేని దేవుని బిడ్డలు” అవుతారు. మీరు జీవవాక్యాన్ని స్థిరంగా పట్టుకొని ఉన్నప్పుడు, మీరు ఆకాశంలోని నక్షత్రాల్లాగా వారి మధ్యలో ప్రకాశిస్తారు. అప్పుడు నేను వృధాగా పరుగు పెట్టలేదు లేదా శ్రమపడలేదని క్రీస్తు దినాన నేను అతిశయించగలను. మీ విశ్వాస యాగంలో సేవలో పానార్పణగా నేను పోయబడినప్పటికి, మీతో కలిసి సంతోషించి ఆనందిస్తాను. కనుక మీరు కూడా నాతో కలిసి సంతోషించి ఆనందించండి.
ఫిలిప్పీయులకు 2:12-18 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
నా ప్రియ సహ విశ్వాసులారా, మీరెప్పుడూ లోబడుతున్నట్టుగానే, నేను మీ దగ్గర ఉన్నప్పుడు మాత్రమే కాకుండా, మరి ఎక్కువగా మీతో లేనప్పుడు, భయభక్తులతో మీ సొంత రక్షణను కొనసాగించుకోండి. ఎందుకంటే దేవుడే మీరు తనకిష్టమైన ఉద్దేశాన్ని నెరవేర్చటానికి కావలసిన సంకల్పాన్ని, కార్యసిద్ధిని కలుగజేయడానికి మీలో పని చేస్తూ ఉన్నాడు. మీరు చేసేవన్నీ, ఫిర్యాదులూ వాదాలూ లేకుండా చేయండి. దానివలన మీరు కుటిలమైన వక్రమైన ఈ తరం ప్రజల మధ్య నిర్దోషులు, నిందారహితులు, నిష్కళంకులైన దేవుని కుమారులుగా, లోకంలో దీపాలుగా వెలుగుతుంటారు. జీవవాక్యాన్ని గట్టిగా పట్టుకోండి. అప్పుడు క్రీస్తు తిరిగి వచ్చే రోజున నేను వ్యర్థంగా పరుగెత్తలేదనీ నా పని వృధా కాలేదనీ నాకు తెలుస్తుంది. గొప్పగా చెప్పుకోడానికి నాకొక కారణం ఉంటుంది. మీ విశ్వాస బలిదాన పరిచర్యలో నేను పానార్పణగా పోయబడినా, నేను సంతోషిస్తూ మీ అందరితో ఆనందిస్తాను. అలాగే మీరు కూడా సంతోషిస్తూ నాతోబాటు ఆనందించండి.
ఫిలిప్పీయులకు 2:12-18 పవిత్ర బైబిల్ (TERV)
నా ప్రియ మిత్రులారా! నేను మీతో ఉన్నప్పుడు మీరు దేవుని ఆజ్ఞల్ని అతిక్రమించలేదు. ప్రస్తుతం నేను మీతో లేను కనుక యిప్పుడు మీరు దేవుని ఆజ్ఞల్ని పాటించుచూ మీ స్వంత రక్షణను భయముతోను, వణకుతోనూ, కార్యసాధకము చేయండి. దేవుడు మీలో ఉండి తన ఉద్దేశ్యాన్ని నెరవేర్చుకోవటానికి కావలసిన ఉత్సాహము, శక్తి మీకు యిస్తాడు. మీరు చేస్తున్న పని గొణగకుండా, వాదించకుండా చెయ్యండి. అప్పుడు మీరు నిష్కళంకులై మంచి వాళ్ళుగా ఉంటారు. దుర్మార్గులై, నీతి లేకుండా జీవిస్తున్న వీళ్ళ మధ్య ఏ అపరాధమూ చెయ్యని దేవుని బిడ్డల్లా ఉంటారు. మీరు వాళ్ళ మధ్య ఆకాశంలోని నక్షత్రాల్లా ప్రకాశిస్తారు. మీరు జీవంగల దైవసందేశాన్ని ప్రకటిస్తున్నారు. కనుక క్రీస్తు వచ్చిన రోజున మీ విషయంలో గర్వించటానికి నాకు ఆస్కారం ఉంటుంది. నా కృషి, సాధన వ్యర్థం కాలేదని రుజువౌతుంది. మీ విశ్వాసం వల్ల అర్పిస్తున్న బలికి తోడుగా నా రక్తాన్ని బలిగా ధార పోయవలసివస్తే నేను వెనుకాడను. చాలా ఆనందిస్తాను. నా ఆనందాన్ని మీతో పంచుకోవాలని నా కోరిక. అందువల్ల మీరు కూడా ఆనందించి, మీ ఆనందాన్ని నాతో పంచుకొండి.
ఫిలిప్పీయులకు 2:12-18 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడును విధేయులై యున్న ప్రకారము, నాయెదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి యెక్కువగా నేను మీతో లేని యీ కాల మందును, భయముతోను వణకుతోను మీ సొంతరక్షణను కొనసాగించుకొనుడి. ఎందుకనగా మీరు ఇచ్ఛయించుటకును కార్యసిద్ధి కలుగజేసికొనుటకును, తన దయాసంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే. మీరు మూర్ఖైమెన వక్రజనము మధ్య, నిరపరాధులును నిష్కళంకులును అనింద్యులునైన దేవుని కుమారులగునట్లు, సణుగులును సంశయములును మాని, సమస్త కార్యములను చేయుడి. అట్టి జనముమధ్యను మీరు జీవవాక్యమును చేతపట్టుకొని, లోకమందు జ్యోతులవలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరుగెత్తలేదనియు, నేను పడిన కష్టము నిష్‌ప్రయోజనము కాలేదనియు క్రీస్తుదినమున నాకు అతిశయకారణము కలుగును. మరియు మీ విశ్వాసయాగములోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణముగా పోయబడినను, నేనానందించి మీ యందరితోకూడ సంతోషింతును. ఇటు వలెనే మీరును ఆనందించి నాతోకూడ సంతోషించుడి.
ఫిలిప్పీయులకు 2:12-18 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
కాబట్టి, నా ప్రియ స్నేహితులారా, మీరు ఎప్పుడు లోబడి ఉన్నట్లుగానే నేను ఉన్నప్పుడు మాత్రమే కాకుండా, నేను మీతో లేనప్పుడు మరి ఎక్కువ లోబడి భయంతో వణుకుతో మీ సొంత రక్షణను కొనసాగించండి. ఎందుకంటే దేవుని మంచి ఉద్దేశాలను నెరవేర్చడానికి మీరు ఇష్టపడడానికి, వాటిని చేయడానికి, మీలో కార్యాన్ని జరిగించేది దేవుడే. సణుగుకోకుండా లేదా వాదించకుండా ప్రతిదాన్ని చేయండి. తద్వారా మీరు నిందలేనివారిగా, శుద్ధులుగా, “చెడిపోయిన వక్రమైన ఈ తరం మధ్యలో, మీరు దోషంలేని దేవుని బిడ్డలు” అవుతారు. మీరు జీవవాక్యాన్ని స్థిరంగా పట్టుకుని ఉన్నప్పుడు, మీరు ఆకాశంలోని నక్షత్రాల్లా వారి మధ్యలో ప్రకాశిస్తారు. అప్పుడు నేను వృధాగా పరుగు పెట్టలేదు లేదా శ్రమపడలేదని క్రీస్తు దినాన నేను అతిశయించగలను. మీ విశ్వాస యాగంలో దానికి సంబంధించిన సేవలో నేను పానార్పణంగా పోయబడినప్పటికి, మీతో కలిసి సంతోషించి ఆనందిస్తాను. కాబట్టి మీరు కూడా నాతో కలిసి సంతోషించి ఆనందించండి.