ఫిలిప్పీయులకు 1:3-10
ఫిలిప్పీయులకు 1:3-11 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
మొదటి దినమునుండి ఇదివరకు సువార్త విషయములో మీరు నాతో పాలివారై యుండుట చూచి, మీలో ఈ సత్‌క్రియ నారంభించినవాడు యేసుక్రీస్తు దినమువరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. గనుక మీ అందరి నిమిత్తము నేనుచేయు ప్రతి ప్రార్థ నలో ఎల్లప్పుడును సంతోషముతో ప్రార్థనచేయుచు, నేను మిమ్మును జ్ఞాపకము చేసికొనినప్పుడెల్లను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నా బంధకములయందును, నేను సువార్తపక్షమున వాదించుటయందును, దానిని స్థిరపరచుటయందును, మీరందరు ఈ కృపలో నాతోకూడ పాలివారై యున్నారు గనుక నేను మిమ్మును నా హృదయములో ఉంచుకొని యున్నాను. ఇందుచేత మిమ్మునందరినిగూర్చి యీలాగు భావించుట నాకు ధర్మమే. క్రీస్తుయేసుయొక్క దయారసమునుబట్టి, మీ అందరిమీద నేనెంత అపేక్ష కలిగియున్నానో దేవుడే నాకు సాక్షి. మీరు శ్రేప్ఠమైన కార్యములను వివేచింపగలవారగుటకు, మీ ప్రేమ తెలివితోను, సకలవిధములైన అనుభవజ్ఞానముతోను కూడినదై, అంతకంతకు అభివృద్ధిపొందవలెననియు, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు, మీరు యేసుక్రీస్తువలననైన నీతిఫలములతో నిండికొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులును నిర్దోషులును కావలెననియు ప్రార్థించుచున్నాను.
ఫిలిప్పీయులకు 1:3-11 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
మీరు గుర్తుకొచ్చినప్పుడెల్లా నేను దేవునికి వందనాలు చెప్తున్నా. మీ అందరి నిమిత్తం చేసే నా ప్రతి ప్రార్థనలో నేను ఎప్పుడు సంతోషిస్తూ ప్రార్థిస్తున్నాను. మొదటి నుండి ఇప్పటి వరకు సువార్త విషయంలో మీరు నాతో జతపని వారిగా ఉండడం చూసి, మీలో ఈ సత్క్రియ ఆరంభించినవాడు క్రీస్తు యేసు దినము వరకు దానిని కొనసాగిస్తాడని రూఢిగా నమ్ముతున్నాను. నేను సంకెళ్ళలో ఉన్నా లేదా సువార్త గురించి వాదించడంలో దానిని స్ధిరపరచడంలో మీరందరు నాతో కూడా ఈ కృపలో భాగస్థులుగా ఉన్నారు, కనుక మీరు నా హృదయంలో ఉన్నారు. అందువల్ల మీ అందరి గురించి ఇలా భావించడం నాకు న్యాయమే. యేసు క్రీస్తు దయను బట్టి మీ అందరి గురించి నేనెంత ఆశ కలిగివున్నానో దేవుడే సాక్ష్యం ఇస్తారు. దేవునికి మహిమ స్తోత్రం కలుగుటకు, మీరు ఏది ఉత్తమమైనదో గ్రహించగలిగి క్రీస్తు దినాన మీరు స్వచ్ఛముగా, నిర్దోషులుగా ఉండునట్లుగా, మీ ప్రేమ, జ్ఞానంలో, లోతైన పరిజ్ఞానాన్ని కలిగి అంతకంతకు వృద్ధిచెందాలని, క్రీస్తు యేసు నుండి వచ్చే నీతిఫలంతో మీరు నింపబడాలని మీ కొరకు ప్రార్థిస్తున్నాను.
ఫిలిప్పీయులకు 1:3-10 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
నేను మిమ్మల్ని ఎప్పుడు గుర్తుకు తెచ్చుకున్నా నా దేవునికి వందనాలు చెబుతాను. మీ కోసం నేను ప్రార్థించే ప్రతిసారీ అది ఆనందభరితమైన ప్రార్థనే. సువార్త విషయంలో మొదటి రోజు నుంచి ఇప్పటి వరకూ మీ సహవాసానికి వందనాలు. మీలో ఈ మంచి పని మొదలు పెట్టినవాడు యేసు క్రీస్తు తిరిగి వచ్చే రోజు వరకూ ఆ పని కొనసాగించి పూర్తి చేస్తాడు. ఇది నా గట్టి నమ్మకం. మిమ్మల్ని గురించి నేనిలా భావించడం సబబే. ఎందుకంటే మీరు నా హృదయంలో ఉన్నారు. నేను ఖైదులో ఉన్నప్పుడూ, నేను సువార్త పక్షంగా వాదిస్తూ నిరూపిస్తున్నపుడు మీరంతా ఈ కృపలో నాతో పాలివారుగా ఉన్నారు. క్రీస్తు యేసు ప్రేమ లోతుల్లో నుంచి, మీ కోసం నేనెంత తపిస్తున్నానో దేవుడే నాకు సాక్షి. మీ ప్రేమ జ్ఞానంతో, సంపూర్ణ వివేచనతో అంతకంతకూ వృద్ధి చెందుతూ ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను. దేవునికి మహిమ, స్తుతి కలిగేలా మీరు శ్రేష్ఠమైన విషయాలను పరీక్షించి తెలుసుకుని, యేసు క్రీస్తు ద్వారా కలిగే నీతిఫలాలతో నిండి, క్రీస్తు వచ్చే రోజు వరకూ యథార్థంగా నిర్దోషంగా ఉండాలన్నదే నా ప్రార్థన
ఫిలిప్పీయులకు 1:3-10 పవిత్ర బైబిల్ (TERV)
నేను మిమ్మల్ని తలచుకొన్నప్పుడెల్లా దేవునికి కృతజ్ఞతలు చెప్పుకొనుచున్నాను. కనుక మీకోసం ప్రార్థించినప్పుడెల్లా ఆనందంతో ప్రార్థిస్తాను. దైవసందేశం ప్రచారం చెయ్యటానికి మీరు మొదటి రోజు నుండి ఈ రోజుదాకా నాతో కలిసి పని చేసారు. ఈ మంచి కార్యాన్ని మీలో ప్రారంభించినవాడు అది పూర్తి అయ్యేదాకా, అంటే యేసు క్రీస్తు వచ్చేదాకా కొనసాగిస్తాడని నాకు నమ్మకం ఉంది. మీరు నా హృదయంలో ఉన్నారు. కనుక మీ అందర్ని గురించి నేనీవిధంగా ఆలోచించటం సమంజసమే. ఎందుకంటే నేను సంకెళ్ళలో ఉన్నా, లేక సువార్తను ప్రకటిస్తూ దానిలో ఉన్న నిజాన్ని నిరూపిస్తూ, స్వేచ్ఛగా పర్యటన చేస్తున్నా దైవానుగ్రహాన్ని మీరు నాతో కలిసి పంచుకొన్నారు. మీ పట్ల నాకున్న ప్రేమ యేసు క్రీస్తు నుండి వచ్చిందని నేను దైవసాక్షిగా చెపుతున్నాను. ఇదే నా ప్రార్థన: మీ ప్రేమ అవధులు లేకుండా పెరగాలి, దానితోబాటు మీకు నిజమైన జ్ఞానము, ఆ జ్ఞానంలోని లోతులు తెలుసుకొనే శక్తి కలగాలి. అప్పుడు మీకు మంచి, చెడు విడమరిచే శక్తి కలుగుతుంది. క్రీస్తు వచ్చే వరకు మీరు పవిత్రంగా ఎలాంటి అపవాదులు లేకుండా ఉండగలుగుతారు.
ఫిలిప్పీయులకు 1:3-11 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
మీరు గుర్తుకొచ్చినప్పుడెల్లా నేను దేవునికి వందనాలు చెప్తున్నాను. మీ అందరి నిమిత్తం చేసే నా ప్రతి ప్రార్థనలో నేను ఎప్పుడు సంతోషిస్తూ ప్రార్థిస్తున్నాను. మొదటి నుండి ఇప్పటివరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారిగా ఉండడం చూసి, మీలో ఈ మంచి కార్యాన్ని ఆరంభించినవాడు క్రీస్తు యేసు దినం వరకు దానిని కొనసాగిస్తాడని రూఢిగా నమ్ముతున్నాను. నేను సంకెళ్ళలో ఉన్నా లేదా సువార్త గురించి వాదించడంలో దానిని స్ధిరపరచడంలో మీరందరు నాతో కూడా ఈ కృపలో భాగస్థులుగా ఉన్నారు, కాబట్టి మీరు నా హృదయంలో ఉన్నారు. అందువల్ల మీ అందరి గురించి ఇలా భావించడం నాకు న్యాయమే. యేసు క్రీస్తు దయను బట్టి మీ అందరి గురించి నేనెంత ఆశ కలిగి ఉన్నానో దేవుడే సాక్ష్యం ఇస్తారు. దేవునికి మహిమ స్తోత్రం కలుగుటకు, మీరు ఏది ఉత్తమమైనదో గ్రహించ కలిగి క్రీస్తు దినాన మీరు స్వచ్ఛముగా, నిర్దోషులుగా ఉండేలా, మీ ప్రేమ, జ్ఞానంలో, లోతైన పరిజ్ఞానాన్ని కలిగి అంతకంతకు వృద్ధిచెందాలని, క్రీస్తు యేసు నుండి వచ్చే నీతిఫలంతో మీరు నింపబడాలని మీ కోసం ప్రార్థిస్తున్నాను.