సంఖ్యాకాండము 3:40-51

సంఖ్యాకాండము 3:40-51 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

యెహోవా మోషేతో, “ఒక నెల లేదా ఆపై వయస్సున్న ఇశ్రాయేలీయుల తొలిసంతానమైన మగవారిని లెక్కించండి, వారి పేర్ల జాబితాను తయారుచేయండి. ఇశ్రాయేలీయుల్లోని తొలిసంతానానికి బదులు లేవీయులను, ఇశ్రాయేలీయుల పశువుల్లో తొలిసంతానానికి బదులు లేవీయుల పశువులను నా కోసం తీసుకోవాలి. నేను యెహోవానై యున్నాను.” కాబట్టి మోషే యెహోవా ఆజ్ఞ ప్రకారం ఇశ్రాయేలీయులలో తొలిసంతానాన్ని లెక్కించాడు. ఒక నెల లేదా ఆ పైబడి వయస్సుగల మొదటి సంతానమైన మగవారందరు 22,273 మంది. యెహోవా మోషేకు ఇలా కూడా చెప్పారు. “ఇశ్రాయేలీయుల తొలి సంతానమంతటికి బదులు లేవీయులను, వారి పశువుల్లో తొలిసంతానానికి బదులు లేవీయుల పశువులను నా కోసం తీసుకో. లేవీయులు నా వారిగా ఉండాలి. నేనే యెహోవాను. లేవీయుల కంటే ఇశ్రాయేలీయులు 273 మంది ఎక్కువ ఉన్నారు. వీరిని విడిపించడానికి, పరిశుద్ధాలయం యొక్క షెకెల్ చొప్పున, ఒక్క షెకెల్ అంటే ఇరవై గెరాలు, ఒక్కొక్కరికి అయిదు షెకెళ్ళ వెండి తీసుకోవాలి. ఆ మిగిలిన ఇశ్రాయేలీయుల విమోచన కోసం అహరోనుకు అతని కుమారులకు ఆ డబ్బు ఇవ్వాలి.” కాబట్టి మోషే లేవీయుల ద్వారా విడిపించబడిన వారికంటే ఎక్కువగా ఉన్న వారి నుండి విమోచన డబ్బు తీసుకున్నాడు. ఇశ్రాయేలీయులలో తొలిసంతానం నుండి పరిశుద్ధాలయ షెకెల్ ప్రకారం మోషే 1,365 షెకెళ్ళ వెండి తీసుకున్నాడు. యెహోవా తనకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం మోషే విమోచన డబ్బును అహరోను అతని కుమారులకు ఇచ్చాడు.

సంఖ్యాకాండము 3:40-51 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

తరువాత యెహోవా మోషేతో ఇలా చెప్పాడు “ఇశ్రాయేలు ప్రజల్లో మొదటి సంతానం అయిన పురుషులను ఒక నెల, ఆ పై వయసున్న వారిందర్నీ లెక్క పెట్టు. వారి పేర్లు రాయి. నేనే యెహోవాను. ఇశ్రాయేలు ప్రజల్లో మొదటి సంతానానికి బదులుగా నాకోసం లేవీ జాతి వారిని వేరు చెయ్యి. అలాగే ఇశ్రాయేలు ప్రజలకు చెందిన పశువుల్లో మొదటి సంతానానికి బదులుగా లేవీ జాతి వారి పశువులను నాకోసం తీసుకోవాలి.” యెహోవా తనకు ఆదేశించిన విధంగా మోషే ఇశ్రాయేలు ప్రజల్లో మొదటి సంతానాన్ని లెక్కపెట్టాడు. ఒక నెల, ఆ పై వయసున్న మొదటి మగ సంతానాన్ని లెక్కించాడు. వారి సంఖ్య 22, 273 అయింది. తరువాత యెహోవా మోషేకి ఇలా ఆదేశించాడు. “ఇశ్రాయేలు ప్రజల్లో మొదటి సంతానం అయిన 22, 273 మందిలో ప్రతివాడికి బదులుగా నువ్వు లేవీ జాతి వారిని వారి పశువులకి బదులుగా లేవీ జాతి వారి పశువులను తీసుకో. లేవీ జాతి వారు నా వారుగా ఉంటారు. నేనే యెహోవాను. ఇశ్రాయేలు ప్రజల్లో మొదటి పుట్టినవారు లేవీ జాతి వారి కంటే 273 మంది ఎక్కువ అయ్యారు. వారిని విడిపించడం కోసం ఒక్కొక్కరి దగ్గర ఐదేసి తులాల వెండి తీసుకో. పరిశుద్ధ స్థలంలో ప్రమాణమైన తులం బరువులో అది ఉండాలి. ఒక తులం 20 చిన్నాలు. ఎక్కువైన వారిని విడిపించడానికి సేకరించిన ఆ ధనాన్ని అహరోనుకూ అతని కొడుకులకూ ఇవ్వాలి.” కాబట్టి మోషే లేవీ జాతివారి కంటే ఎక్కువగా ఉన్న వారి దగ్గర ఆ విడుదల సొమ్మును సేకరించాడు. ఇశ్రాయేలు ప్రజల పెద్ద కొడుకుల దగ్గర ఆ సొమ్మును సేకరించాడు. పరిశుద్ధ స్థలంలో చెలామణీ అయ్యే తులం ప్రకారం 1, 365 తులాలు సేకరించాడు. మోషే తనకు యెహోవా ఆదేశించినట్లు ఆ విడుదల సొమ్మును అహరోనుకీ అతని కొడుకులకీ ఇచ్చాడు.

సంఖ్యాకాండము 3:40-51 పవిత్ర బైబిల్ (TERV)

మోషేతో యెహోవా ఇలా అన్నాడు: “ఇశ్రాయేలీయులలో ఒక నెలగాని అంతకంటె ఎక్కువగాని వయసుగల మొదట పుట్టిన బాలురను, పురుషులను అందరినీ లెక్కించు, వారి పేర్ల జాబితా ఒకటి తయారుచేయి. ఇప్పుడు ఇశ్రాయేలీయుల పెద్ద కుమారులను నేను తీసుకోను. ఇప్పుడు యెహోవానగు నేను లేవీయులను స్వీకరిస్తాను. ఇశ్రాయేలీయులలో ఇతరుల పశువులలో మొదటి ఫలమంతటినీ తీసుకొనే బదులు లేవీయుల పశువుల మొదటి ఫలాన్ని నేను తీసుకుంటాను.” కనుక యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారం మోషే చేసాడు. ఇశ్రాయేలు ప్రజల పిల్లల్లో పెద్దవారినందరినీ మోషే లెక్కించాడు. ఒక నెల, అంతకంటె ఎక్కువ వయసుగల మొదట పుట్టిన బాలురను, పురుషులను మోషే జాబితా చేసాడు. ఆ జాబితాలో 22,273 మంది ఉన్నారు. మోషేతో యెహోవా ఇంకా ఇలా అన్నాడు: “నేనే, యెహోవాను ఈ ఆజ్ఞ ఇస్తున్నాను: ‘ఇశ్రాయేలీయుల ఇతర కుటుంబాల్లోని మొదట పుట్టిన వారందరి బదులు లేవీయులను తీసుకో. మిగిలిన ప్రజల పశువులకు బదులు లేవీయుల పశువులను నేను తీసుకుంటాను. లేవీయులు నా వారు. లేవీయులు 22,000 మంది ఉన్నారు కానీ, ఇతర కుటుంబాల్లోని పెద్ద కుమారులు 22,273 మంది ఉన్నారు. అనగా లేవీయులకంటె 273 మంది పెద్ద కుమారులు ఎక్కువగా ఉన్నారు. కనుక ఆ 273 మందిలో ప్రతి ఒక్కరి వద్ద అధికారిక కొలతనుపయోగించి అయిదు తులాల వెండి తీసుకో. (ఇది 20 చిన్నములు బరువుగల అధికారిక కొలత.) ఇశ్రాయేలు ప్రజలవద్ద ఆ వెండి వసూలు చేయి. ఆ వెండిని అహరోనుకు అతని కుమారులకు ఇవ్వు. అది 273 మంది ఇశ్రాయేలీయులకు విమోచనా ధనం.’” కనుక 273 మంది కొరకు ఈ ధనాన్ని మోషే వసూలు చేసాడు. ఈ 273 మంది స్థానాన్ని లేవీ వంశం వహించలేకపోయింది. ఇశ్రాయేలు ప్రజలలో మొదట పుట్టినవారినుండి వెండిని మోషే వసూలు చేసాడు. అధికారిక కొలత ప్రకారం 1,365 వెండి తులాలను అతడు వసూలు చేసాడు. యెహోవాకు మోషే విధేయుడయ్యాడు. యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారం అహరోనుకు, అతని కుమారులకు ఆ వెండిని మోషే ఇచ్చాడు.

సంఖ్యాకాండము 3:40-51 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను –నీవు ఇశ్రాయేలీయులలో ఒక నెల మొదలుకొని పై ప్రాయముగల తొలిచూలియైన ప్రతిమగవానిని లెక్కించి వారి సంఖ్యను వ్రాయించుము. నేనే యెహోవాను; నీవు ఇశ్రాయేలీయులలో తొలిచూలియైన ప్రతి మగపిల్లకు మారుగా లేవీయులను ఇశ్రాయేలీయుల పశువులలో తొలిచూలియైన ప్రతి దానికి మారుగా లేవీయుల పశువులను నా నిమిత్తము తీసికొనవలెను. కాబట్టి యెహోవా తనకు ఆజ్ఞాపించినట్లు మోషే ఇశ్రాయేలీయులలో తొలుత పుట్టినవారినందరిని లెక్కించెను. వారిలో లెక్కింపబడిన వారి సంఖ్య, అనగా ఒక నెల మొదలుకొని పైప్రాయము గల తొలిచూలి మగవారందరి సంఖ్య యిరువది రెండువేల రెండువందల డెబ్బదిమూడు. మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను –నీవు ఇశ్రాయేలీయులలో తొలిచూలియైన ప్రతివానికి మారుగా లేవీయులను వారి పశువులకు ప్రతిగా లేవీయుల పశువులను తీసికొనుము. లేవీయులు నా వారైయుందురు; నేనే యెహోవాను. ఇశ్రాయేలీయులకు తొలుత పుట్టిన వారిలో లేవీయులకంటె రెండువందల డెబ్బది ముగ్గురు ఎక్కువైనందున శేషించినవారియొద్ద తలకొక అయిదేసి తులముల వెండిని తీసికొనవలెను. పరిశుద్ధమైన తులము చొప్పున వాటిని తీసికొనవలెను. తులము ఇరువది చిన్నములు. వారిలో ఎక్కువ మంది విమోచనకొరకు ఇయ్య బడిన ధనమును అహరోనుకును అతని కుమారులకును ఇయ్యవలెను. కాబట్టి మోషే లేవీయులవలన విడిపింప బడినవారికంటె ఆ యెక్కువైన వారియొక్క విమోచన ధనమును తీసికొనెను. పరిశుద్ధమైన తులముచొప్పున వెయ్యి మూడువందల అరువదియైదు తులముల ధనమును ఇశ్రాయేలీయుల జ్యేష్ఠకుమారులయొద్ద తీసికొనెను. యెహోవా మోషే కాజ్ఞాపించినట్లు యెహోవా నోటి మాటచొప్పున అహరోనుకును అతని కుమారులకును విడిపింపబడిన వారి విమోచన ధనమును మోషే యిచ్చెను.