సంఖ్యాకాండము 15:22-41

సంఖ్యాకాండము 15:22-41 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

యెహోవా మోషేతో చెప్పిన యీ ఆజ్ఞలన్నిటిలో, అనగా యెహోవా ఆజ్ఞాపించిన దినము మొదలుకొని అటుపైని మీ తరతరములకు యెహోవా మోషే ద్వారా మీకు ఆజ్ఞాపించినవాటిలో పొరబాటున దేనినైనను మీరు చేయకపోయినప్పుడు, అది సమాజమునకు తెలియ బడనియెడల సర్వసమాజము యెహోవాకు ఇంపైన సువాసనగా నుండుటకై దహనబలిగా ఒక కోడెదూడను, విధిచొప్పున దాని నైవేద్యమును దాని పానీయార్పణమును పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను సిద్ధపరచవలెను. యాజకుడు ఇశ్రాయేలీయుల సర్వసమాజము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను; తెలియకయే దాని చేసెను గనుక క్షమింపబడును. వారు పొరబాటున చేసిన పాపములనుబట్టి తమ అర్పణమును, అనగా యెహోవాకు చెందవలసిన హోమమును పాపపరిహారార్థబలిని యెహోవా సన్నిధికి తీసికొని రావలెను. అప్పుడు ఇశ్రాయేలీయుల సర్వసమాజమేమి, వారిమధ్యను నివసించు పరదేశియేమి క్షమాపణ నొందును; ఏలయనగా ప్రజలందరు తెలియకయే దాని చేయుట తటస్థించెను. ఒకడు పొరబాటున పాపము చేసినయెడలవాడు పాప పరిహారార్థబలిగా ఏడాది ఆడుమేక పిల్లను తీసికొని రావలెను. పొరబాటున యెహోవా సన్నిధిని దాని చేసెను గనుక తెలియకయే పాపముచేసిన వాని నిమిత్తము యాజకుడు ప్రాయశ్చిత్తము చేయును; వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటవలనవాడు క్షమాపణ నొందును. ఇశ్రాయేలీయులలో పుట్టినవాడేగాని వారిమధ్యను నివసించు పరదేశియేగాని పొరబాటున ఎవడైనను పాపము చేసినయెడల వానికిని మీకును విధి ఒక్కటే ఉండవలెను. అయితే దేశమందు పుట్టినవాడేగాని పరదేశియేగాని యెవడైనను సాహసించి పాపముచేసినయెడల వాడు యెహోవాను తృణీకరించినవాడగును గనుక అట్టివాడు నిశ్చయముగా జనులలో నుండకుండ కొట్టి వేయబడును;వాడు యెహోవా మాటను అలక్ష్యము చేసి ఆయన ఆజ్ఞను మీరినందున నిశ్చయముగా కొట్టివేయబడును; వాని దోషశిక్షకు వాడే కారకుడు. ఇశ్రాయేలీయులు అరణ్యములో ఉన్నప్పుడు ఒకడు విశ్రాంతిదినమున కట్టెలు ఏరుట చూచిరి. వాడు కట్టెలు ఏరుట చూచినవారు మోషేయొద్దకును అహరోనునొద్దకును సర్వసమాజమునొద్దకును వానిని తీసికొని వచ్చిరి. వానికి ఏమి చేయవలెనో అది విశదపరచబడలేదు గనుక వానిని కావలిలో ఉంచిరి. తరువాత యెహోవా–ఆ మనుష్యుడు మరణశిక్ష నొందవలెను. సర్వసమాజము పాళెము వెలుపల రాళ్లతో వాని కొట్టి చంపవలెనని మోషేతో చెప్పెను. కాబట్టి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సర్వ సమాజము పాళెము వెలుపలికి వాని తీసికొనిపోయి రాళ్లతో వాని చావగొట్టెను. మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను –నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము. వారు తమ తర తరములకు తమ బట్టల అంచులకు కుచ్చులు చేసికొని అంచుల కుచ్చులమీద నీలిసూత్రము తగిలింపవలెను. మీరు నా ఆజ్ఞలన్నిటిని జ్ఞాపకముచేసికొని మీ దేవునికి ప్రతిష్ఠితులైయుండునట్లుమునుపటివలె కోరినవాటినిబట్టియు చూచినవాటినిబట్టియు వ్యభిచరింపక, దాని చూచి యెహోవా ఆజ్ఞలన్నిటిని జ్ఞాపకముచేసికొని వాటి ననుసరించుటకే అది మీకు కుచ్చుగానుండును. నేను మీకు దేవుడనై యుండునట్లుగా ఐగుప్తుదేశములోనుండి మిమ్మును రప్పించిన మీ దేవుడనైన యెహోవాను; మీ దేవుడనైన యెహోవాను నేనే.

సంఖ్యాకాండము 15:22-41 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

“యెహోవా మోషేతో చెప్పిన ఈ ఆజ్ఞలన్నిట్లో, అంటే యెహోవా ఆజ్ఞాపించిన రోజు మొదలుకుని ఆ తరువాత మీ తరతరాలకు యెహోవా మోషే ద్వారా మీకు ఆజ్ఞాపించిన వాటిలో పొరపాటున దేనినైనా మీరు చెయ్యనప్పుడు, అది సమాజానికి తెలియజేస్తే, సమాజమంతా యెహోవాకు ఇష్టమైన సువాసనగా ఉండడానికి దహనబలిగా ఒక లేత దున్నపోతును ఆజ్ఞప్రకారం దాని నైవేద్యాన్ని, దాని పానీయార్పణను, పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను సిద్ధం చెయ్యాలి. యాజకుడు ఇశ్రాయేలీయుల సర్వసమాజం కోసం ప్రాయశ్చిత్తం చెయ్యాలి. తెలియక దాన్ని చేశారు గనక క్షమాపణ దొరుకుతుంది. వారు పొరపాటున చేసిన పాపాలను బట్టి తమ అర్పణ, అంటే యెహోవాకు చెందవలసిన దహనబలి, పాపపరిహారార్థబలి యెహోవా సన్నిధికి తీసుకు రావాలి. అప్పుడు ఇశ్రాయేలీయుల సర్వసమాజానికి గాని, వారి మధ్య నివాసం ఉంటున్న పరదేశికి గాని, క్షమాపణ దొరుకుతుంది. ఎందుకంటే, ప్రజలందరూ తెలియక దాన్ని చెయ్యడం జరిగింది. ఒకడు పొరపాటున పాపం చేస్తే, అతడు పాపపరిహారార్థ బలిగా ఒక సంవత్సరం వయస్సు ఉన్న ఆడమేక పిల్లను తీసుకురావాలి. పొరపాటుగా యెహోవా సన్నిధిలో దాన్ని చేశాడు గనక తెలియక పాపం చేసిన అతని కోసం యాజకుడు ప్రాయశ్చిత్తం చేస్తాడు. అతని కోసం ప్రాయశ్చిత్తం చేయడం వల్ల అతడు క్షమాపణ పొందుతాడు. ఇశ్రాయేలీయుల్లో పుట్టినవాడు గాని వారి మధ్య నివాసం ఉంటున్న పరదేశి గాని పొరపాటున ఎవరైనా పాపం చేస్తే, అతనికీ, మీకూ ఒక్కటే చట్టం ఉండాలి. కాని, దేశంలో పుట్టినవాడు గాని పరదేశి గాని ఎవరైనా కావాలని పాపం చేస్తే, అతడు యెహోవాను తృణీకరించిన వాడు గనక అలాంటి వాడు కచ్చితంగా ప్రజల్లో ఉండకుండాా కొట్టివేయాలి. అతని పాపం అతని మీద ఉంటుంది. అతడు యెహోవా మాటను అలక్ష్యం చేసి ఆయన ఆజ్ఞను అతిక్రమించిన కారణంగా అతడు తన ప్రజల్లో లేకుండా పోతాడు” అన్నాడు. ఇశ్రాయేలీయులు అరణ్యంలో ఉన్నప్పుడు ఒకడు విశ్రాంతి దినాన కట్టెలు ఏరడం గమనించారు. అతడు కట్టెలు ఏరడం చూసిన వారు మోషే అహారోనుల దగ్గరికి, సమాజం ఎదుటికి అతన్ని తీసుకొచ్చారు. అతని పట్ల ఏం చెయ్యాలో అది వాళ్లకు తెలియ లేదు గనక అతన్ని అదుపులోకి తీసుకుని ఉంచారు. తరువాత యెహోవా మోషేతో “ఆ వ్యక్తికి మరణ శిక్ష విధించాలి. సర్వసమాజం శిబిరం బయట అతన్ని రాళ్లతో కొట్టి చంపాలి” అన్నాడు. కాబట్టి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు సర్వ సమాజం శిబిరం బయటకు అతన్ని తీసుకెళ్ళి, రాళ్లతో కొట్టి చంపారు. ఇంకా యెహోవా మోషేతో మాట్లాడుతూ, “నువ్వు ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పు, వారు తమ తరతరాలకు తమ బట్టల అంచులకు కుచ్చులు చేసుకుని, అంచుల కుచ్చుల మీద నీలిరంగు దారం తగిలించాలి. మీరు నా ఆజ్ఞలన్నిటినీ జ్ఞాపకం చేసుకుని, మీ దేవునికి ప్రతిష్ఠితులై ఉండేలా ఇదివరకు కోరిన వాటిని బట్టి, చూసిన వాటిని బట్టి ఆధ్యాత్మిక వ్యభిచారం చెయ్యకుండా ఉండాలి. మీరు నా కోసం ప్రత్యేకపరచిన వారు గనక, మీరు పవిత్రులుగా ఉండేందుకు యెహోవా ఆజ్ఞలన్నిటినీ జ్ఞాపకం చేసుకుని వాటిని అనుసరించడానికి జాగ్రత్త తీసుకోండి. నేను మీకు దేవుడుగా ఉండాలని ఐగుప్తు దేశంలో నుంచి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడనైన యెహోవాను. మీ దేవుడనైన యెహోవాను నేనే.”

సంఖ్యాకాండము 15:22-41 పవిత్ర బైబిల్ (TERV)

“మోషేకు యెహోవా ఇచ్చిన ఈ ఆజ్ఞలలో దేనికైనా విధేయులవటం మీరు మరచిపోతే మీరేమిచేయాలి? ఇవి మోషే ద్వారా మీకివ్వబడిన ఆజ్ఞలు. వీటిని యెహోవా మీకు ఇచ్చిన రోజే ఈ ఆజ్ఞలు ప్రారంభం అయ్యాయి. ఈ ఆజ్ఞలు రాబోయే కాలమంతా కొనసాగుతాయి. అయితే వీటిలో ఏదైనా ఒక ఆజ్ఞకు మీరు విధేయులు కాకపోవటం జరుగవచ్చు. మీరు ఒక ఆజ్ఞకు విధేయులవటం మరచిపోయినా, ప్రజలంతా ఆ ఆజ్ఞ మరచిపోయి దోషులైనా, ప్రజలంతా ఒక కోడెదూడను యెహోవాకు అర్పణగా ఇవ్వాలి. ఇది దహనబలి, ఇది యెహోవాను సంతోషపెడుతుంది. కోడె దూడతో బాటు ధాన్యార్పణ, పానార్పణం కూడ ఇవ్వాలని జ్ఞాపకం ఉంచుకోండి. మరియు పాప పరిహర బలిగా ఒక మగ మేకనుకూడ మీరు ఇవ్వాలి. “కనుక ఆ పాపం నిమిత్తం ఆ చెల్లింపును యాజకుడు అర్పిస్తాడు. ఇశ్రాయేలు ప్రజలందరి కోసం అతడు ఇలా చేస్తాడు. వారు పాపం చేస్తున్నట్టు ప్రజలకు తెలియదు. అయితే దాన్నిగూర్చి వారు తెలుసుకొన్నప్పుడు, వారి తప్పిదం నిమిత్తం యెహోవాకు అర్పించేందుకు వారు ఒక అర్పణం తెచ్చారు. అది హోమంలో దహించబడిన పాప పరిహారార్థ అర్పణ. ఇశ్రాయేలు ప్రజలందరు, వారి మధ్య నివసిస్తున్న ఇతర ప్రజలంతా క్షమించబడతారు. వారు చేస్తోంది తప్పు అని వారికి తెలియదు గనుక వారు క్షమించబడతారు. “అయితే ఒక వ్యక్తి మాత్రమే ఒక ఆజ్ఞను పాటించటం మరచిపోతే, అతడు ఒక సంవత్సరపు ఆడ మేకను పాపపరిహారార్థ బలిగా తీసుకుని రావాలి. ఆ పాపం నిమిత్తం యెహోవా ఎదుట యాజకుడు ఆ చెల్లింపును అర్పిస్తాడు. అతని నిమిత్తం యాజకుడు చెల్లింపును అర్పించాడు గనుక అతడు క్షమించ బడతాడు. పాపం చేసినప్పటికి తాను తప్పు చేస్తున్నానని ఎరుగని ప్రతి వ్యక్తికి ఈ ఆజ్ఞ వర్తిస్తుంది. ఇశ్రాయేలు వంశంలో పుట్టిన వారికి, మీ మధ్యలో నివసిస్తున్న ఇతర ప్రజలకు కూడా ఇదే ఆజ్ఞ. “కానీ ఎవరైనా సరే తాను చేస్తోంది తప్పు అని తెలిసికూడ పాపం చేస్తే, అలాంటివాడు యెహోవాకు విరోధంగా జీవిస్తున్నాడు. అతడిని తన ప్రజలనుండి పంపించి వేయాలి. ఇశ్రాయేలు వంశంలో పుట్టిన వానికి, మీ మధ్య నివసించే వానికి ఇది సమానం. అతడు యెహోవా మాటకు అడ్డం తిరిగాడు. అతడు యెహోవా ఆజ్ఞలకు విధేయుడు కాలేదు. అతడు తప్పకుండ మీ మధ్యనుండి వెళ్లగొట్టబడాలి. అతడు దోషిగానే ఉంటాడు.” ఇప్పటికి ఇశ్రాయేలు ప్రజలు ఇంకా అరణ్యంలోనే ఉన్నారు. ఒకడు వంట కట్టెలు చూడటం తటస్థించింది. కనుక అతడు ఆ కట్టెలు ప్రోగుచేస్తున్నాడు కాని అది సబ్బాతు. అతడు ఇలా చేయటం మరికొందరు చూసారు. అతడు కట్టెలు ఏరటం చూచిన వాళ్లు అతన్ని, మోషే, అహరోను దగ్గరకు తీసుకుని వచ్చారు. ప్రజలంతా వాడ్ని చుట్టేసారు. ఆ మనిషిని ఎలా శిక్షించాలో వారికి తెలియదు గనుక వారు అతణ్ణి అక్కడే ఉంచారు. అప్పుడు యెహోవా, “ఆ మనిషిచావాలి. నివాస స్థలపు వెలుపల, ప్రజలంతా వానిమీద రాళ్లు విసరాలి” అని మోషేతో చెప్పాడు. కనుక ప్రజలు అతణ్ణి నివాస స్థలమునుండి వెలుపలకు తీసు కుని వెళ్లి రాళ్లతో కొట్టి చంపారు. మోషేకు యెహోవా ఆజ్ఞాపించిన విధంగానే వారు ఇలా చేసారు. మోషేతో యెహోవా అన్నాడు: “ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడి ఇలా చెప్పు: మీరు నా ఆజ్ఞలు జ్ఞాపకం ఉంచుకొనేందుకు నేను మీకు ఒకటి ఇస్తాను. దారం ముక్కలు కొన్ని తీసుకొని వాటిని పేని, మీ బట్టల అంచులకు వాటిని కట్టాలి. ఆ కుచ్చుల్లో ఒక్కొక్క దాని మధ్య ఒక నీలం దారం ఉంచాలి. ఇప్పుడూ, ఇక ముందుకూ ఎప్పటికీ మీరు వాటిని ధరించాలి. మీరు ఈ కుచ్చులను చూచి, యెహోవా మీకిచ్చిన ఆజ్ఞలన్నింటిని జ్ఞాపకం ఉంచుకో గలుగుతారు. అప్పుడు మీరు ఆ ఆజ్ఞలకు విధేయులవుతారు. ఆజ్ఞలను మరచిపోయి, మీ శరీరాలు, కండ్లు కోరిన ప్రకారం చేయరు. మీరు నా ఆజ్ఞలు అన్నింటికి విధేయులు కావాలని జ్ఞాపకం ఉంచుకొంటారు. అప్పుడు మీరు దేవుని ప్రత్యక ప్రజలుగా ఉంటారు. నేను యెహోవాను, మీ దేవుడ్ని. మిమ్మల్ని ఈజిప్టు నుండి బయటకు తీసుకుని వచ్చింది నేనే. నేను మీ దేవునిగా ఉండటానికి ఇలా చేసాను. నేను యెహోవాను, మీ దేవుడ్ని.”

సంఖ్యాకాండము 15:22-41 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)

“ ‘సమాజంగా మీరు అనుకోకుండ యెహోవా మోషేకు ఇచ్చిన ఈ ఆజ్ఞలలో దేనినైనా పాటించడంలో ఒకవేళ విఫలమైతే, యెహోవా మోషే ద్వార మీకు ఇచ్చిన ఆజ్ఞలు, యెహోవా వాటిని ఇచ్చిన రోజు నుండి రాబోయే తరాల వరకు కొనసాగిస్తూ, ఒకవేళ తెలియక పొరపాటున మీరితే, అప్పుడు సమాజమంతా యెహోవాకు ఇష్టమైన సువాసనగల దహనబలిగా కోడెను, దానితో పాటు నిర్దేశించిన భోజనార్పణ, పానార్పణలతో, పాపపరిహారబలి కోసం మేకపోతుతో కలిపి అర్పించాలి. యాజకుడు ఇశ్రాయేలు సమాజమంతటి కోసం ప్రాయశ్చిత్తం చేయాలి అప్పుడు వారు క్షమించబడతారు ఎందుకంటే ఆ పాపం ఉద్దేశపూర్వకమైనది కాదు, పైగా వారు పొరపాటున చేసిన తప్పును బట్టి యెహోవాకు వారు హోమబలి పాపపరిహారబలిని అర్పించారు. ప్రజలు అనుకోకుండ తప్పు చేశారు కాబట్టి ఇశ్రాయేలు సర్వసమాజం, వారితో నివసిస్తున్న విదేశీయులు క్షమించబడతారు. “ ‘అయితే ఒక్క వ్యక్తి అనుకోకుండ చేసిన పాపాలకు, ఆ వ్యక్తి పాపపరిహారబలిగా ఏడాది ఆడ మేకను అర్పించాలి. పొరపాటున పాపం చేసిన వారి కోసం యాజకుడు యెహోవా ఎదుట ప్రాయశ్చిత్తం జరిగిస్తాడు, అది జరిగినప్పుడు ఆ వ్యక్తి క్షమించబడతాడు. స్వదేశీయులైన ఇశ్రాయేలీయులైనా వారి మధ్యలో నివసించే విదేశీయులైనా పొరపాటున పాపం చేసినవారందరికి ఒకే చట్టం వర్తిస్తుంది. “ ‘అయితే ఎవరైనా కావాలని పాపం చేస్తే, స్వదేశీయులైనా విదేశీయులైనా వారు యెహోవాను దూషించిన వారు కాబట్టి ఖచ్చితంగా ఇశ్రాయేలీయుల నుండి వారిని తొలగించాలి. వారు యెహోవా మాటను తృణీకరించి, ఆయన ఆజ్ఞలను అతిక్రమించారు, కాబట్టి వారు తప్పక తొలగించబడాలి; వారి అపరాధం వారి మీదే ఉంటుంది.’ ” ఇశ్రాయేలీయులు అరణ్యంలో ఉన్నప్పుడు, ఒక మనుష్యుడు సబ్బాతు దినాన్న కట్టెలు ఏరుకుంటున్నాడు. అది చూసినవారు అతన్ని పట్టుకుని, మోషే అహరోనుల ఎదుట సమాజమందరి ఎదుట నిలబెట్టారు. అతనికి ఏం చేయాలో స్పష్టత లేనందున అతన్ని కావలిలో ఉంచారు. అప్పుడు యెహోవా మోషేతో, “ఆ మనుష్యుడు చావాలి. సమాజమంతా అతన్ని శిబిరం బయటకు తీసుకెళ్లి రాళ్లతో కొట్టాలి.” కాబట్టి యెహోవా మోషేకిచ్చిన ఆజ్ఞ ప్రకారం వారు అతన్ని శిబిరం బయటకు తీసుకెళ్లి రాళ్లతో కొట్టి చంపారు. యెహోవా మోషేతో ఇలా అన్నారు, “ఇశ్రాయేలీయులతో మాట్లాడుతూ ఇలా చెప్పు: ‘రాబోయే తరాలన్నిటిలో మీరు మీ వస్త్రాల మూలల్లో నీలం రంగు దారంతో కుచ్చులు తయారుచేయాలి. ఆ కుచ్చులను చూసినప్పుడు యెహోవా ఆజ్ఞలన్నీ మీరు జ్ఞాపకం చేసుకుంటారు, వాటికి లోబడాలని మీ హృదయాభిలాషలు మీ నేత్రాశల వెంటపడుతూ వ్యభిచరించకూడదని జ్ఞాపకం చేసుకుంటారు. అప్పుడు నా ఆజ్ఞలన్నిటికి లోబడాలని జ్ఞాపకం చేసుకుని మీ దేవునికి మీరు ప్రతిష్ఠించుకుంటారు. నేను మీ దేవుడైన యెహోవానై ఉన్నాను, మీకు దేవునిగా ఉండడానికి నేను మిమ్మల్ని ఈజిప్టు నుండి బయటకు తెచ్చాను. నేను మీ దేవుడైన యెహోవాను.’ ”