సంఖ్యాకాండము 15:1-21

సంఖ్యాకాండము 15:1-21 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

తరువాత యెహోవా మోషేతో మాట్లాడుతూ, “నువ్వు ఇశ్రాయేలీయులతో చెప్పు, ‘యెహోవా మీకిస్తున్న ఆ ప్రదేశంలోకి మీరు వెళ్ళినప్పుడు, యెహోవాకు ఇష్టమైన సువాసన కలిగేలా మందలోని పశువుల్లో, దహనబలిగానైనా, బలిగానైనా తెచ్చి, మొక్కుబడి చెల్లించడానికి గాని, స్వేచ్ఛార్పణగా గాని, నియామక కాలంలో అర్పించేదిగా గాని, దేనినైనా మీరు అర్పించాలనుకున్నారనుకోండి. యెహోవాకు ఆ అర్పణ అర్పించే వాడు ముప్పావు నూనెతో కలిపిన రెండున్నర కిలోల పిండిని నైవేద్యంగా తేవాలి. ఒక్కొక్క గొర్రెపిల్లతో పాటు దహనబలి మీద గాని, బలి మీద గాని పొయ్యడానికి ముప్పావు లీటర్ల ద్రాక్షారసం పానార్పణగా సిద్ధం చెయ్యాలి. పొట్టేలుతో పాటు ఒక పడి నూనెతో కలిపిన నాలుగు లీటర్ల పిండిని నైవేద్యంగా సిద్ధం చెయ్యాలి ఒక లీటరు ద్రాక్షారసం పానార్పణగా తేవాలి. అది యెహోవాకు ఇష్టమైన సువాసన. మొక్కుబడి చెల్లించడానికైనా, యెహోవాకు సమాధానబలి అర్పించడానికైనా, నువ్వు దహనబలిగానైనా, బలిగానైనా లేత దున్నపోతును సిద్ధం చేస్తే, దానితో పాటు, లీటరున్నర నూనె కలిపిన ఏడున్నర కిలోల గోదుమపిండిని నైవేద్యంగా అర్పించాలి. ఇంకా, యెహోవాకు ఇష్టమైన సువాసన కలిగిన దహన బలిగా మీరు తేవలసినవి. లీటరున్నర ద్రాక్షారసం పానీయార్పణగా తేవాలి. ఒక్కొక్క కోడెతోపాటు, ఒక్కొక్క పొట్టేలుతోపాటు, గొర్రెల్లోనైనా, మేకల్లోనైనా ఒక్కొక్క పిల్లతో పాటు ఆ విధంగా చెయ్యాలి. మీరు సిద్ధపరిచే వాటి లెక్కను బట్టి వాటి లెక్కలో ప్రతి దానికీ ఆ విధంగా చెయ్యాలి. దేశంలో పుట్టిన వారందరూ యెహోవాకు ఇష్టమైన సువాసన కలిగిన దహనబలి అర్పణ తెచ్చేటప్పుడు ఆ విధంగానే చెయ్యాలి. మీ దగ్గర నివాసం ఉన్న పరదేశిగాని, మీ తరతరాల్లో మీ మధ్య ఉన్నవాడు ఎవడైనా గాని యెహోవాకు ఇష్టమైన సువాసన కలిగిన దహనబలి అర్పించాలని అనుకున్నప్పుడు, మీరు చేసినట్టే అతడు కూడా చెయ్యాలి. సమాజానికి, అంటే మీకూ, మీలో నివాసం ఉన్న పరదేశికీ ఒకే కట్టడ. అది మీ తరతరాలకు ఉండే శాశ్వతమైన కట్టుబాటు. యెహోవా సన్నిధిలో మీరున్నట్టే పరదేశి కూడా ఉండాలి. మీకూ, మీ దగ్గర నివాసం ఉండే పరదేశికీ ఒకే ఏర్పాటు, ఒకే న్యాయవిధి ఉండాలి’” అన్నాడు. యెహోవా మోషేతో మళ్ళీ మాట్లాడుతూ “ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పు, నేను మిమ్మల్ని తీసుకెళ్తున్న దేశంలో మీరు ప్రవేశించిన తరువాత మీరు ఆ దేశపు ఆహారం తిన్నప్పుడు యెహోవాకు ప్రతిష్ట అర్పణ అర్పించాలి. మీరు మీ మొదటి పిండిముద్ద రొట్టెను ప్రతిష్టార్పణగా అర్పించాలి. కళ్లపు అర్పణలా దాన్ని అర్పించాలి. మీ తరతరాలకు మీ మొదటి పిండిముద్దలోనుంచి ప్రతిష్ఠార్పణను యెహోవాకు అర్పించాలి” అన్నాడు.

సంఖ్యాకాండము 15:1-21 పవిత్ర బైబిల్ (TERV)

మోషేతో యెహోవా ఇలా అన్నాడు: “ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడి వారికి చెప్పు: మీకు నివాసంగా నేను ఇస్తున్న ఒక దేశంలో మీరు ప్రవేశిస్తారు. మీరు ఆ దేశంలో ప్రవేశించగానే మీరు యెహోవాకు బలులు అర్పించాలి. ఈ అర్పణల్లో కొన్నింటిని మీరు అగ్నితో దహించాలి. మీ పశువుల మందల్లోనుండి, గొర్రెలమందల్లోనుండి మీరు అర్పణలు ఇవ్వాలి. ఇది యెహోవాకు ప్రీతిని కలిగిస్తుంది. దహనబలులు, బలి అర్పణలు, ప్రత్యేక ప్రమాణాలు, ప్రత్యేక కానుకలు, సమాధాన బలులు, ప్రత్యేక సెలవు దినాలు ఇవన్నీ యెహోవాకు చాల ఇష్టం. “ఆ సమయంలో తన అర్పణను తెచ్చేవాడు యెహోవాకు ధాన్యార్పణ కూడ పెట్టాలి. ఆ ధాన్యార్పణ ముప్పావు ఒలీవ నూనెతో కలపబడ్డ రెండు పడుల పిండి. ఒక గొర్రెపిల్లను దహనబలిగా నీవు అర్పించిన ప్రతిసారీ ముప్పావు ద్రాక్షారసం పానార్పణంగా నీవు సిద్ధం చేయాలి. “మీరు ఒక పొట్టేలును అర్పిస్తుంటే కూడ ధాన్యార్పణ సిద్ధం చేయాలి. ఆ ధాన్యార్పణ ఒక పడి ఒలీవ నూనెతో కలుపబడ్డ నాలుగు పడుల పిండి. ఒక పడి ద్రాక్షారసాన్ని పానార్పణంగా నీవు సిద్ధం చేయాలి. దాన్ని యెహోవాకు అర్పించు. అది ఆయన్ని సంతోషపెడుతుంది. “అర్పణగా, బలిగా, సమాధాన బలిగా, లేక యెహోవాకు ఒక ప్రత్యేక వాగ్దానంగా నీవు ఒక కోడెదూడను సిద్ధం చేయవచ్చు. కనుక ఆ కోడెదూడతోబాటు ధాన్యార్పణ కూడ నీవు తీసుకొనిరావాలి. ఆ ధాన్యార్పణ పడిన్నర ఒలీవ నూనెతో కలుపబడిన ఆరు పడుల గోధుమ పిండి. మరియు పడిన్నర ద్రాక్షారసం పానార్పణంగా తేవాలి. ఈ అర్పణ హోమంలో దహించబడటం యెహోవాకు ఎంతో సంతోషం. నీవు యెహోవాకు అర్పించే ప్రతి కోడెదూడ, పోట్టేలు, గొర్రెపిల్ల, మేక పిల్ల ఈ విధంగా సిద్ధం చేయబడాలి. నీవు అర్పించే ప్రతి జంతువుకూ నీవు ఇలా చేయాలి. “ప్రజలు ఇలా దహన బలులు అర్పించినప్పుడు వారు యెహోవాను సంతోషపెడతారు. అయితే ఇశ్రాయేలీయుల్లో ప్రతి పౌరుడూ వీటన్నింటినీ నేను నీతో చెప్పినట్టే చేయాలి. మరియు రాబోయే కాలమంతటిలో ఇశ్రాయేలు కుటుంబంలో జన్మించనివాడు మీ మధ్య నివసిస్తుంటే, అతడు కూడా వీటన్నింటికీ విధేయుడు కావాలి. నేను నీకు చెప్పిన విధంగానే అతడు ఇవన్నీ చేయాలి. ఇశ్రాయేలు వంశంలో పుట్టిన మీకు, మీ మధ్య నివసించే ఇతరులకు ఒకే రకమైన నియమాలు ఉండాలి. ఈ ఆజ్ఞ ఇప్పటినుండి భవిష్యత్తు వరకు కొనసాగుతుంది. మీరు, మీ మధ్య ఉండే ఇతరులు అంతా ఒకటే యెహోవా ఎదుట. అంటే మీరు ఒకే ఆజ్ఞలు, నియమాలు పాటించాలని దీని భావం. ఇశ్రాయేలు వంశంలో పుట్టిన మీకు, మీ మధ్య నివసించే ఇతర ప్రజలందరికి ఇవే ఆజ్ఞలు, నియమాలు.” మోషేతో యెహోవా ఇలా చెప్పాడు: “ఇశ్రాయేలు ప్రజలతో ఈ విషయాలు చెప్పు: నేను మిమ్మల్ని మరో దేశానికి తీసుకొని వెళ్తున్నాను. ఆ దేశంలో పండే ఆహారం మీరు తినేటప్పుడు దానిలో భాగం యెహోవాకు అర్పణగా మీరు ఇవ్వాలి. మీరు ధాన్యం విసిరి, ముద్దగా చేయాలి. దాన్ని రొట్టెలుగా చేయాలి. ఆ రొట్టెల్లో మొదటిది యెహోవాకు ఇవ్వాలి. అది కళ్లం నుండి వచ్చే ధాన్యార్పణ. ఇప్పుడు, రాబోయే కాలమంతా ఈ అర్పణను మీరు యెహోవాకు ఇవ్వాలి. అనగా మీరు ఆహారంగా విసరుకొనే ధాన్యంలో మొదటిది యెహోవాకు ఇవ్వాలని అర్థం.

సంఖ్యాకాండము 15:1-21 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను –నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము–నేను మీ కిచ్చుచున్న దేశనివాసములలో మీరు ప్రవేశించిన తరువాత యెహోవాకు ఇంపైన సువాసన కలుగునట్లుగా గోవులలోనిదానినేకాని, గొఱ్ఱె మేకలలోనిదానినేకాని, దహనబలిగానైనను, బలిగానైనను తెచ్చి, మ్రొక్కుబడి చెల్లించుటకనియో, స్వేచ్ఛార్పణగాననియో, నియామక కాలమందు అర్పించునదియనియో, దేనినైనను మీరు అర్పింపగోరినయెడల యెహోవాకు ఆ అర్పణము నర్పించువాడు ముప్పావు నూనెతో కలుపబడిన రెండు పళ్ల పిండిని నైవేద్యముగా తేవలెను. ఒక్కొక్క గొఱ్ఱెపిల్లతోకూడ దహనబలిమీదనేమి బలిమీదనేమి పోయుటకై ముప్పావు ద్రాక్షారసమును పానార్పణముగా సిద్ధపరచవలెను. పొట్టేలుతోకూడ పడి నూనెతో కలుపబడిన నాలుగు పళ్ల పిండిని నైవేద్యముగా సిద్ధపరచవలెను. పడి ద్రాక్షారసమును పానార్పణముగా తేవలెను; అది యెహోవాకు ఇంపైన సువాసన. మ్రొక్కుబడిని చెల్లించుటకైనను యెహోవాకు సమాధానబలి నర్పించుటకైనను నీవు దహనబలిగానైనను బలిగానైనను కోడెదూడను సిద్ధపరచినయెడల ఆ కోడెతోకూడ పడిన్నరనూనె కలుపబడిన ఆరుపళ్ల గోధుమపిండిని నైవేద్యముగా అర్పింపవలెను. మరియు యెహోవాకు ఇంపైన సువాసనగల హోమముగా పడిన్నర ద్రాక్షారసమును పానీయార్పణముగా తేవలెను; ఒక్కొక్క కోడెతోకూడను ఒక్కొక్క పొట్టేలుతోకూడను, గొఱ్ఱెలలోనిదైనను మేకలలోనిదైనను ఒక్కొక్క పిల్లతోకూడను, ఆలాగు చేయవలెను. మీరు సిద్ధపరచువాటి లెక్కనుబట్టి వాటి లెక్కలో ప్రతిదానికిని అట్లు చేయవలెను. దేశములో పుట్టినవారందరు యెహోవాకు ఇంపైన సువాసనగల హోమార్పణమును తెచ్చునప్పుడు ఆలాగుననే చేయవలెను. మీయొద్ద నివసించు పరదేశిగాని మీ తరతరములలో మీ మధ్యనున్నవాడెవడుగాని యెహోవాకు ఇంపైన సువాసనగల హోమము అర్పింప గోరినప్పుడు మీరు చేయునట్లే అతడును చేయవలెను. సంఘమునకు, అనగా మీకును మీలో నివసించు పరదేశికిని ఒక్కటే కట్టడ; అది మీ తరతరములకుండు నిత్యమైన కట్టడ; యెహోవా సన్నిధిని మీరున్నట్లే పరదేశియు ఉండును. మీకును మీయొద్ద నివసించు పరదేశికిని ఒక్కటే యేర్పాటు, ఒక్కటే న్యాయవిధి యుండవలెను. యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను–నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము –నేను మిమ్మును కొని పోవుచున్న దేశములో మీరు ప్రవేశించిన తరువాత మీరు ఆ దేశపు ఆహారమును తినునప్పుడు ప్రతిష్ఠార్పణమును యెహోవాకు అర్పింపవలెను. మీరు మీ మొదటి పిండిముద్ద రొట్టెను ప్రతిష్ఠార్పణముగా అర్పింపవలెను; కళ్లపు అర్పణమువలె దాని అర్పింపవలెను. మీ తరతరములకు మీ మొదటి పిండిముద్దలోనుండి ప్రతిష్ఠార్పణమును యెహోవాకు అర్పింపవలెను.

సంఖ్యాకాండము 15:1-21 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)

యెహోవా మోషేతో అన్నారు, “ఇశ్రాయేలీయులతో మాట్లాడుతూ ఇలా చెప్పు: మీకు నివాస స్థలంగా ఇస్తున్న దేశంలో ప్రవేశించిన తర్వాత మీరు యెహోవాకు ఇష్టమైన సువాసన కలుగునట్లు మీ మందల నుండి లేదా పశువుల నుండి అర్పణలు అంటే దహనబలులు గాని బలులు గాని, ప్రత్యేకమైన మ్రొక్కుబడులు గాని స్వేచ్ఛార్పణలు గాని, లేదా పండుగ అర్పణలు గాని అర్పించవచ్చు. అప్పుడు అర్పణ తెచ్చే వ్యక్తి ఒక పావు హిన్ నూనెలో ఒక ఓమెరు నాణ్యమైన పిండి కలిపి యెహోవాకు భోజనార్పణ సమర్పించాలి. దహనబలి లేదా బలి కోసం తెచ్చే ప్రతి గొర్రెపిల్లతో పాటు ఒక పావు హిన్ ద్రాక్షరసం పానార్పణంగా తేవాలి. “ ‘భోజనార్పణ కోసం పొట్టేళ్ళతో పాటు రెండు ఓమెర్ల నాణ్యమైన పిండి ఒక హిన్‌లో మూడవ వంతు నూనెతో కలిపి తేవాలి, దానితో పాటు ఒక హిన్‌లో మూడవ వంతు ద్రాక్షరసం పానార్పణం కోసం తేవాలి. యెహోవాకు ఇష్టమైన సువాసన గలదిగా అర్పించాలి. “ ‘యెహోవాకు ప్రత్యేకమైన మ్రొక్కుబడి లేదా సమాధానబలి కోసం దహనబలిగా లేదా బలిగా అర్పించడానికి కోడెను సిద్ధపరిచేటప్పుడు, కోడెతో పాటు అయితే భోజనార్పణగా మూడు ఓమెర్ల నూనె కలిపిన అర హిన్ లో నాణ్యమైన పిండి, దానితో పాటు అర హిన్ ద్రాక్షరసం పానార్పణం కోసం తేవాలి. అది యెహోవాకు ఇష్టమైన సువాసన గలదిగా ఉంటుంది. ప్రతి కోడె లేదా పొట్టేలు, ప్రతి గొర్రెపిల్ల లేదా మగ మేకపిల్ల ఈ విధంగా సిద్ధపరచబడాలి. ఇలా ప్రతి దానిలోకి, మీరు ఎన్ని సిద్ధం చేస్తారో, అన్నిటికి చేయాలి. “ ‘స్వదేశీయులుగా ఉన్న ప్రతి ఒక్కరు యెహోవాకు ఇష్టమైన సువాసనగల హోమబలి అర్పించినప్పుడు ఇలాగే చేయాలి. వారు ఇలాగే విధులను పాటించాలి. వచ్చే తరాలకు కూడా ఇదే నియమం వర్తిస్తుంది. విదేశీయులు లేదా మీ మధ్య నివసించే ఎవరైనా సరే, యెహోవాకు ఇష్టమైన సువాసనగల హోమబలి అర్పించాలనుకుంటే, మీలాగే వారు కూడా చేయాలి. సమాజంలో ఉండే మీరైనా, విదేశీయులైనా ఒకే చట్టం పాటించాలి; ఇది రాబోయే తరాలకు నిత్య కట్టుబాటుగా ఉంటుంది. యెహోవా దృష్టిలో మీరూ విదేశీయులు ఒక్కటే: మీకూ, మీ మధ్య ఉన్న విదేశీయులకు అవే నియమాలు, అవే నిబంధనలు వర్తిస్తాయి.’ ” యెహోవా మోషేతో అన్నారు, “ఇశ్రాయేలీయులతో మాట్లాడుతూ ఇలా చెప్పు: ‘నేను మిమ్మల్ని తీసుకెళ్తున్న దేశంలో ప్రవేశించినప్పుడు, ఆ దేశం ఆహారాన్ని మీరు తినేటప్పుడు, ఒక భాగం యెహోవాకు అర్పణగా సమర్పించాలి. మీరు రుబ్బిన పిండితో చేసిన మొదటి రొట్టెను నూర్పిడి కళ్ళపు అర్పణగా అర్పించాలి. రాబోయే తరాలకు ఇలా మీ మొదటి పిండి ముద్ద నుండి యెహోవాకు అర్పణను అర్పించాలి.