సంఖ్యాకాండము 10:11-36

సంఖ్యాకాండము 10:11-36 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

రెండో సంవత్సరం రెండో నెల ఇరవయ్యో రోజున శాసనాల గుడారం పైనుండి మేఘం వెళ్లి పోయింది. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు సీనాయి అరణ్యంలో తమ ప్రయాణం సాగించారు. మేఘం తిరిగి పారాను అరణ్యంలో నిలిచింది. యెహోవా మోషేకి ఇచ్చిన ఆదేశాలను బట్టి వారు తమ మొదటి ప్రయాణం చేశారు. యూదా గోత్రం వారి ధ్వజం కింద ఉన్న సైన్యం మొదట శిబిరం బయటికి కదిలింది. అమ్మీనాదాబు కొడుకు నయస్సోను ఆ సైన్యానికి నాయకుడు. ఇశ్శాఖారు గోత్రం సైన్యాన్ని సూయారు కొడుకు నెతనేలు నడిపించాడు. జెబూలూను గోత్రం సైన్యానికి హేలోను కొడుకు ఏలీయాబు నాయకుడు. గెర్షోను, మెరారి తెగలవారు తమ బాధ్యత ప్రకారం మందిరాన్ని విప్పి దాన్ని మోస్తూ ముందుకు సాగారు. తరువాత రూబేను గోత్రం ధ్వజం కింద ఉన్న సైన్యం ముందుకు కదిలింది. ఆ సైన్యానికి నాయకుడు షెదేయూరు కొడుకు ఏలీసూరు. షిమ్యోను గోత్రం సైన్యానికి సూరీషదాయి కొడుకు షెలుమీయేలు నాయకుడు. గాదు గోత్రం సైన్యానికి దెయూవేలు కొడుకు ఎలీయాసాపు నాయకుడు. కహాతు తెగవారు ప్రయాణమయ్యారు. వారు పరిశుద్ధ స్థలంలోని పరిశుద్ధ పరికరాలను మోస్తూ వెళ్ళారు. తరువాతి శిబిరంలో కహాతు తెగవారు వచ్చేలోగా ఇతరులు మందిరాన్ని నిలబెడుతూ ఉన్నారు. ఎఫ్రాయీము గోత్రం వారి ధ్వజం కింద వారి సేనలు కదిలాయి. ఈ సైన్యానికి అమీహూదు కొడుకు ఎలీషామా నాయకుడు. మనష్శే గోత్రం సైన్యానికి పెదాసూరు కొడుకు గమలీయేలు నాయకుడు. బెన్యామీను గోత్రం సైన్యానికి గిద్యోనీ కొడుకు అబీదాను నాయకుడు. చివర్లో దాను గోత్రపు సైన్యాలు తమ ధ్వజం కింద కదిలాయి. ఈ సైన్యానికి నాయకుడు అమీషదాయి కొడుకు అహీయెజెరు. ఆషేరు గోత్రం సైన్యానికి ఒక్రాను కొడుకు పగీయేలు నాయకుడు. నఫ్తాలి గోత్రం సేనలకి ఏనాను కొడుకు అహీరా నాయకుడు. ఈ విధంగా ఇశ్రాయేలు సైన్యాలు ముందుకు ప్రయాణం చేసాయి. మోషే హోబాబుతో మాట్లాడాడు. ఈ హోబాబు మోషే భార్యకు తండ్రి అయిన రెవూయేలు కొడుకు. ఇతడు మిద్యాను ప్రాంతం వాడు. మోషే హోబాబుతో “యెహోవా మాకు చూపించిన దేశానికి మేము వెళ్తున్నాం. దాన్ని మీకు ఇస్తానని యెహోవా మాకు చెప్పాడు. నువ్వు మాతో రా. మా వల్ల మీకు మేలు కలుగుతుంది. ఇశ్రాయేలు ప్రజలకి మేలు చేస్తానని యెహోవా ప్రమాణం చేశాడు” అని చెప్పాడు. దానికి అతడు “నేను రాను. నేను నా స్వదేశానికీ, నా సొంత ప్రజల దగ్గరకీ వెళ్తాను” అన్నాడు. అప్పుడు మోషే ఇలా జవాబిచ్చాడు. “నువ్వు మమ్మల్ని దయచేసి విడిచి పెట్టవద్దు. అరణ్యంలో ఎలా నివసించాలో నీకు బాగా తెలుసు. నువ్వు మా కోసం కనిపెట్టుకుని ఉండాలి. నువ్వు మాతో వస్తే యెహోవా మాకు చేసిన మేలుని మేము నీకు చేస్తాం.” వారు యెహోవా కొండ దగ్గర నుండి మూడు రోజులు ప్రయాణం చేశారు. వారి విశ్రాంతి స్థలం కోసం చేసిన మూడు రోజుల ప్రయాణంలో యెహోవా నిబంధన శాసనాల పెట్టె వాళ్లకి ముందుగా కదిలింది. వారు తాము మజిలీ చేసిన స్థలం నుండి ప్రయాణం చేసినప్పుడు యెహోవా మేఘం పగటివేళ వారి మీద ఉంది. నిబంధన పెట్టె ప్రయాణం కోసం లేచినప్పుడల్లా మోషే “యెహోవా, లే, నీ శత్రువులను చెదరగొట్టు. నిన్ను ద్వేషించే వారిని నీ ఎదుటనుండి తరిమి కొట్టు” అనేవాడు. నిబంధన పెట్టె ఆగినప్పుడు మోషే “యెహోవా లక్షలాది మంది ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి తిరిగి రా” అనేవాడు.

సంఖ్యాకాండము 10:11-36 పవిత్ర బైబిల్ (TERV)

ఇశ్రాయేలు ప్రజలు ఈజిప్టు విడిచిన తర్వాత రెండో సంవత్సరం, రెండో నెలలో (20వ రోజు) సన్నిధి గుడారం మీదనుండి మేఘం పైకి లేచింది. అందుచేత ఇశ్రాయేలు ప్రజలంతా సీనాయి అరణ్యంనుండి బయల్దేరి ప్రయాణం మొదలుబెట్టారు. పారాను అరణ్యంలో ఆ మేఘం నిలిచిపోయేంత వరకు, వారు ప్రయాణం చేసారు. మోషేకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారంగా ఆ ప్రజలు వారి స్థలాన్ని మార్చటం ఇది మొదటి సారి. యూదా గుడారంలో మూడు విభాగాలు ముందుగా వెళ్లాయి. వారు వారి ధ్వజం క్రిందనే ప్రయాణం చేసారు. మొదటి విభాగం యూదా వంశం. అమ్మీనాదాబు కుమారుడైన నయస్సోను ఆ విభాగానికి సైన్యాధిపతి. తర్వాత ఇశ్శాఖారు విభాగం. సూయారు కుమారుడైన నెతనేలు ఆ కుటుంబ విభాగానికి సైన్యాధిపతి. ఆ తర్వాత జెబూలూను విభాగం. హెలోను కుమారుడైన ఏలీయాబు ఆ విభాగానికి సైన్యాధిపతి. అప్పుడు సన్నిధి గుడారం దించబడింది. గెర్షోను, మెరారి కుటుంబ పురుషులు పవిత్ర గుడారం మోసారు. కనుక తర్వాత ఈ కుటుంబాల ప్రజలు వరుసలో ఉన్నారు. తర్వాత రూబేను నివాసము నుండి మూడు భాగాలు వచ్చాయి. వారు వారి ధ్వజం క్రింద ప్రయాణం చేసారు. మొదటిది రూబేను వంశం. షెదెయూరు కుమారుడైన ఏలీసూరు ఆ విభాగానికి సైన్యాధిపతి. తర్వాత షిమ్యోను వంశం. సూరిషదాయి కుమారుడైన షెలుమీయేలు ఆ విభాగానికి సైన్యాధిపతి. తర్వాత గాదు వంశం. దెయువేలు కుమారుడు ఎలీయాసాపు ఆ విభాగానికి సైన్యాధిపతి. తర్వాత కహాతు కుటుంబ ప్రజలు. పవిత్ర గుడారం లోపల ఉండే పవిత్ర పరికరాలను వారు మోసారు. ఈ ప్రజలంతా వచ్చేయకముందే పవిత్ర గుడారం నిలబెట్టేందుకు వీలుగా వీరు ఈ సమయంలో వచ్చారు. ప్రజలు కూడా వచ్చారు. తర్వాత ఎఫ్రాయిము నివాసంనుండి మూడు విభాగాలు వచ్చాయి. వారు వారి ధ్వజం క్రిందనే ప్రయాణం చేసారు. మొట్టమొదటి విభాగాం ఎఫ్రాయిము వంశం. అమీహూదు కుమారుడైన ఎలీషామా ఆ భాగానికి సైన్యాధిపతి. తర్వాత మనష్షే వంశం. పెదాసూరు కుమారుడైన గమలీయేలు ఆ విభాగానికి సైన్యాధిపతి. తర్వాత బెన్యామీను వంశం. గిద్యోనీ కుమారుడైన అబీదాను ఆ విభాగానికి సైన్యాధిపతి. వరుసలో చివరి మూడు వంశాలు మిగిలిన విభాగాలన్నిటికీ వెనుక కాపుగా ఉన్నాయి. ఇవి దాను నివాసానికి చెందినవి. వారు వారి ధ్వజం క్రింద ప్రయాణం చేసారు. మొదటి విభాగం దాను వంశం. అమీషదాయి కుమారుడైన అహీయెజరు ఆ విభాగానికి సైన్యాధిపతి. తర్వాత ఆషేరు వంశం. ఒక్రాను కుమారుడైన పగీయేలు ఆ విభాగానికి సైన్యాధిపతి. తర్వాత నఫ్తాలి వంశం. ఏనాను కుమారుడైన అహీరా ఆ విభాగానికి సైన్యాధిపతి. ఇశ్రాయేలు ప్రజలు ఒక చోటు నుండి మరో చోటకు బయల్దేరినప్పుడు, వారు వెళ్లిన విధానం అది. మిద్యానీ వాడగు రెవూయేలు కుమారుడు హోబాబు. (రెవూయేలు మోషేకు మామ.) “దేవుడు మాకు ఇస్తానని వాగ్దానం చేసిన దేశానికి మేము ప్రయాణం చేస్తున్నాము. కనుక మాతో రమ్ము. మేము నీకు మేలు చేస్తాము. ఇశ్రాయేలు ప్రజలకు యెహోవా మంచివాటిని వాగ్దానం చేసాడు” అని హోబాబుతో మోషే చెప్పాడు. “నేను మీతో రాను, నేను నా సొంతదేశానికి, నా స్వంత ప్రజల దగ్గరకు వెళ్లిపోతాను” అని హోబాబు జవాబిచ్చాడు. అప్పుడు మోషే, “దయచేసి మమ్మల్ని విడువకు. అరణ్యంగూర్చి మాకంటె నీకే ఎక్కువ తెలుసు. నీవు మాకు మార్గదర్శిగా ఉండొచ్చు. నీవు మాతో వస్తే, యెహోవా మాకు ఇచ్చే మంచివాటన్నింటిలో మేము నీకు భాగం ఇస్తాము” అని చెప్పాడు. కనుక హోబాబు ఒప్పుకొన్నాడు. యెహోవా పర్వతం దగ్గరనుండి వారు ప్రయాణం మొదలు బెట్టారు. పురుషులు యెహోవా ఒడంబడిక పవిత్ర పెట్టెను పట్టుకొని ప్రజల ముందు నడిచారు. వారు స్థలం కోసం వెదుకుతూ, మూడు రోజులపాటు పవిత్ర పెట్టెను మోసారు. యెహోవా మేఘం ప్రతిరోజూ వారిమీద ఉంది. ప్రతి ఉదయం వారు తమ స్థలం విడిచిపెట్టినప్పుడు, వారిని నడిపించేందుకు మేఘం అక్కడ ఉండేది: ప్రజలు ప్రయాణం మొదలు బెట్టి, పవిత్రపెట్టె వారితో పాటు వెడలగానే, మోషే ఎప్పుడూ ఇలా చెప్పేవాడు: “యెహోవా, లెమ్ము నీ శత్రువులు అన్ని దిక్కుల్లో పారిపోదురు గాక: నీకు వ్యతిరేకంగా ఉన్న మనుష్యులు నీ ఎదుట నుండి పారిపోదురుగాక,” పవిత్ర పెట్టెను, దాని స్థలంలో దాన్ని ఉంచి నప్పుడు, మోషే ఎప్పుడూ ఇలా చెప్పేవాడు

సంఖ్యాకాండము 10:11-36 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

రెండవ సంవత్సరము రెండవనెల యిరువదియవ తేదిని మేఘము సాక్ష్యపు మందిరము మీదనుండి పైకెత్తబడెను గనుక ఇశ్రాయేలీయులు సీనాయి అరణ్యములోనుండి ప్రయాణములు చేయసాగిరి. తరువాత ఆ మేఘము పారాను అరణ్యములో నిలిచెను. యెహోవా మోషే చేత పలికించిన మాటనుబట్టి వారు మొదట ప్రయాణము చేసిరి. యూదీయుల పాళెపు ధ్వజము వారి సేనల చొప్పున ముందర సాగెను; అమ్మీనాదాబు కుమారుడైన నయస్సోను ఆ సైన్యమునకు అధిపతి. ఇశ్శాఖారీయుల గోత్రసైన్యమునకు సూయారు కుమారుడైన నెతనేలు అధిపతి. జెబూలూనీయుల గోత్రసైన్యమునకు హేలోను కుమారుడైన ఏలీయాబు అధిపతి. మందిరము విప్పబడినప్పుడు గెర్షోనీయులును మెరారీయులును మందిరమును మోయుచు సాగిరి. రూబేనీయుల పాళెము ధ్వజము వారి సేనలచొప్పున సాగెను. ఆ సైన్యమునకు షెదేయూరు కుమారుడైన ఏలీసూరు అధిపతి. షిమ్యోనీయుల గోత్రసైన్యమునకు సూరీషదాయి కుమారుడైన షెలుమీయేలు అధిపతి. గాదీయుల గోత్రసైన్యమునకు దెయూవేలు కుమారుడైన ఎలీయాసాపు అధిపతి. కహాతీయులు పరిశుద్ధమైనవాటిని మోయుచుసాగిరి; అందరు వచ్చులోగా వారు మందిరమును నిలువబెట్టిరి. ఎఫ్రాయీమీయుల పాళెపు ధ్వజము వారి సేనల చొప్పున సాగెను; ఆ సైన్యమునకు అమీహూదు కుమారుడైన ఎలీషామా అధిపతి. పెదాసూరు కుమారుడైన గమలీయేలు మనష్షీయుల గోత్ర సైన్యమునకు అధిపతి. గిద్యోనీ కుమారుడైన అబీదాను బెన్యామీనీయుల గోత్రసైన్యమునకు అధిపతి. దానీయుల పాళెపు ధ్వజము సాగెను; అది పాళెములన్నిటిలో వెనుక నుండెను; అమీషద్దాయి కుమారుడైన అహీయెజరు ఆ సైన్యమునకు అధిపతి ఒక్రాను కుమారుడైన పగీయేలు ఆషేరీయుల గోత్రసైన్యమునకు అధిపతి. ఏనాను కుమారుడైన అహీర నఫ్తాలీయుల గోత్రసైన్యమునకు అధిపతి. ఇశ్రాయేలీయులు ప్రయాణముచేయునప్పుడు తమతమ సైన్యముల చొప్పుననే ప్రయాణమై సాగిరి. మోషే మామయగు మిద్యానీయుడైన రెవూయేలు కుమారుడగు హోబాబుతో మోషే–యెహోవా మా కిచ్చెదనని చెప్పిన స్థలమునకు మేము ప్రయాణమై పోవుచున్నాము; మాతోకూడ రమ్ము; మేము మీకు మేలు చేసెదము; యెహోవా ఇశ్రాయేలీయులకు తాను చేయబోవు మేలునుగూర్చి వాగ్దానము చేసెననగా అందుకతడు–నేను రాను, నా దేశమునకును నా వంశస్థుల యొద్దకును వెళ్లుదుననెను. అందుకు మోషే–నీవు దయచేసి మమ్మును విడువకుము; ఎట్లనగా ఈ అరణ్యమందు మేము దిగవలసిన స్థలములు నీకు తెలిసియున్నవి; నీవు మాకు కన్నులవలె ఉందువు. మరియు నీవు మాతోకూడ వచ్చినయెడల యెహోవా మాకు ఏ మేలుచేయునో ఆ మేలునుబట్టి మేము నీకు మేలుచేయుదుమనెను. వారు యెహోవా కొండనుండి మూడుదినముల ప్రయాణముచేసిరి; వారికి విశ్రాంతిస్థలము చూచుటకు ఆ మూడుదినముల ప్రయాణములో యెహోవా నిబంధనమందసము వారికి ముందుగా సాగెను. వారు తాము దిగిన స్థలమునుండి సాగినప్పుడు యెహోవా మేఘము పగటివేళ వారిమీద ఉండెను. ఆ మందసము సాగినప్పుడు మోషే–యెహోవా లెమ్ము; నీ శత్రువులు చెదరిపోవుదురుగాక, నిన్ను ద్వేషించువారు నీ యెదుటనుండి పారిపోవుదురుగాక యనెను. అది నిలిచినప్పుడు అతడు–యెహోవా, ఇశ్రాయేలు వేవేలమధ్యకు మరల రమ్మనెను.

సంఖ్యాకాండము 10:11-36 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)

రెండవ సంవత్సరం రెండవ నెల ఇరవయ్యవ రోజున, మేఘం సాక్షి గుడారం మీది నుండి కదిలింది. ఇశ్రాయేలీయులు సీనాయి అరణ్యం నుండి బయలుదేరి మేఘం పారాను అరణ్యంలో ఆగేవరకు స్థలం నుండి స్థలానికి ప్రయాణించారు. యెహోవా మోషేకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం మొదటిసారిగా, వారు బయలుదేరారు. యూదా శిబిరం యొక్క విభజనలు వారి పతాకాన్ని పట్టుకుని ముందుగా వెళ్లాయి. అమ్మీనాదాబు కుమారుడైన నయస్సోను యూదా గోత్రం వారిని నడిపించాడు. అదే విధంగా సూయరు కుమారుడైన నెతనేలు ఇశ్శాఖారు గోత్రం, ఏలీయాబు కుమారుడైన హేలోను జెబూలూను గోత్రానికి నియమించబడ్డారు. తర్వాత గుడారాన్ని తీసివేశారు, గెర్షోను, మెరారి వంశస్థులు దానిని మోస్తూ బయలుదేరారు. వారి తర్వాత రూబేను శిబిరం వారు వారి సేనల ప్రకారం వెళ్లారు. షెదేయూరు కుమారుడైన ఎలీసూరు రూబేను గోత్ర నాయకుడు సైన్యాధిపతి. సూరీషద్దాయి కుమారుడైన షెలుమీయేలు షిమ్యోను గోత్రం మీద, దెయూవేలు కుమారుడైన ఎలీయాసాపు గాదు గోత్రం మీద నియమించబడ్డారు. తర్వాత కహాతు వంశస్థులు పవిత్ర వస్తువులను మోస్తూ బయలుదేరారు. వీరు తర్వాతి శిబిరాన్ని చేరకముందే సమావేశ గుడారం సిద్ధం చేయబడాలి. వారి తర్వాత ఎఫ్రాయిం శిబిరం వారు వారి సేనల ప్రకారం బయలుదేరారు. అమీహూదు కుమారుడైన ఎలీషామా ఎఫ్రాయిం గోత్ర సైన్యాధిపతి. తర్వాత మనష్షే గోత్రం వారు వెళ్లారు. వారి నాయకుడు పెదాసూరు కుమారుడైన గమలీయేలు, తర్వాత బెన్యామీను గోత్రం వారు వెళ్లారు. వారి నాయకుడు గిద్యోనీ కుమారుడైన అబీదాను సైన్యాధిపతి. చివరకు, అన్ని శిబిరాల వెనుక దాను శిబిరం వారు వారి సేనల ప్రకారం బయలుదేరారు. అమీషద్దాయి కుమారుడైన అహీయెజెరు న్యాయాధిపతి. తర్వాత ఆషేరు గోత్రం వారు వెళ్లారు. వారు నాయకుడు ఒక్రాను కుమారుడైన పగీయేలు. తర్వాత నఫ్తాలి గోత్రం వారు వెళ్లారు. వారి నాయకుడు ఏనాను కుమారుడైన అహీర సైన్యాధిపతి. ఈ క్రమంలో తమ తమ సేనలతో ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణం చేశారు. ఒక రోజు మోషే తన మామ మిద్యానీయుడైన రెయూయేలు కుమారుడైన హోబాబుతో, “యెహోవా, ‘నేను మీకు ఇస్తాను’ అని చెప్పిన స్థలానికి వెళ్తున్నాము. నీవు మాతో వచ్చెయ్యి, మేము నిన్ను మంచిగా చూసుకుంటాం, ఎందుకంటే యెహోవా ఇశ్రాయేలుకు మంచి వాటిని వాగ్దానం చేశారు” అని చెప్పాడు. అతడు, “నేను రాను, నా స్వదేశానికి, నా బంధువుల దగ్గరకు తిరిగి వెళ్తున్నాను” అని జవాబిచ్చాడు. అయితే మోషే, “దయచేసి మమ్మల్ని వదిలి వెళ్లకు. ఈ అరణ్యంలో ఎక్కడ దిగాలో నీకు దారి బాగా తెలుసు, నీవు మాకు దారి చూపించగలవు. నీవు కాబట్టి మాతో వస్తే యెహోవా మాకు ఇచ్చే మేలులు నీతో పంచుకుంటాం” అని చెప్పాడు. కాబట్టి వారు యెహోవా పర్వతం నుండి బయలుదేరి మూడు రోజులు ప్రయాణించారు. వారి విశ్రాంతి స్థలం కోసం ఈ మూడు రోజులు యెహోవా నిబంధన మందసం వారికి ముందుగా వెళ్లింది. వారు ప్రయాణం మొదలుపెట్టినప్పుడు యెహోవా మేఘము పగలు వారి మీద ఉంది. మందసం ఎప్పుడు బయలుదేరుతుందో అప్పుడు మోషే బిగ్గరగా, “యెహోవా, లేవండి! మీ శత్రువులు చెదిరిపోవుదురు గాక; మీ ఎదుట నుండి మీ శత్రువులు పారిపోవుదురు గాక” అని అనేవాడు. మందసం ఆగినప్పుడు, అతడు, “యెహోవా, లెక్కలేనంతగా ఉన్న వేలాది ఇశ్రాయేలు ప్రజల దగ్గరకు తిరిగి రండి” అని అనేవాడు.