సంఖ్యాకాండము 10:1-10

సంఖ్యాకాండము 10:1-10 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

యెహోవా మోషేతో ఇలా చెప్పారు: “సుత్తెతో సాగగొట్టబడిన వెండితో రెండు బూరలు తయారుచేసి, సమాజం కూడుకోడానికి, శిబిరాలు బయలుదేరడాన్ని సూచించడానికి వాటిని వాడాలి. రెండు బూరలు ఒకేసారి మ్రోగితే ఆ శబ్దానికి సమాజమంతా నీ ఎదుట సమావేశ గుడార ద్వారం దగ్గర కూడుకోవాలి. ఒక బూర మాత్రమే మ్రోగితే, నాయకులు అంటే ఇశ్రాయేలు గోత్రాల అధిపతులు నీ ముందు సమకూడాలి. బూరధ్వని వినబడినప్పుడు, తూర్పున ఉన్న గోత్రాలు బయలుదేరాలి. రెండవ ధ్వని వినబడినప్పుడు, దక్షిణాన ఉన్న దండ్లు బయలుదేరాలి. బయలుదేరడానికి ధ్వని ఒక సూచన. సమాజం కూడుకోడానికి, బూరలు ఊదండి, అయితే బయలుదేరడానికి ఊదే విధంగా కాదు. “యాజకులైన అహరోను కుమారులు, బూరలు ఊదాలి. ఇది మీకు రాబోయే తరాలకు నిత్య కట్టుబాటుగా ఉంటుంది. మీ భూమిలో మిమ్మల్ని బాధపరిచే మీ శత్రువులపై యుద్ధం చేయబోతున్నప్పుడు బూరధ్వని చేయాలి. అప్పుడు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మీ శత్రువుల నుండి మిమ్మల్ని విడిపిస్తారు. అంతేకాక మీ సంతోష సమయాల్లో అంటే నియమించబడిన పండుగలు, అమావాస్య వేడుకలప్పుడు మీ దహనబలులు, మీ సమాధాన బలులపై బూరధ్వని చేయండి. అవి మీ దేవుని ఎదుట జ్ఞాపకార్థంగా ఉంటాయి. నేను మీ దేవుడనైన యెహోవానై ఉన్నాను.”

సంఖ్యాకాండము 10:1-10 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

యెహోవా మోషేతో మాట్లాడాడు. ఆయన ఇలా అన్నాడు. “రెండు వెండి బాకాలు చేయించు. వెండిని సాగగొట్టి వాటిని చేయించాలి. సమాజాన్ని సమావేశం కోసం పిలవడానికీ, సేనలను తరలించడానికీ ఆ బాకాలను ఉపయోగించాలి. సన్నిధి గుడారం ఎదుట నీ దగ్గరికి సమాజమంతా సమావేశం కావడానికి యాజకులు ఆ బాకాలు ఊదాలి. యాజకులు ఒకే బాకా ఊదితే ఇశ్రాయేలు సమాజంలో నాయకులూ, తెగల పెద్దలు నీ దగ్గరకి రావాలి. మీరు పెద్ద శబ్దంతో వాటిని ఊదితే అది సంకేతంగా భావించి తూర్పు వైపున ఉన్న సేనలు ప్రయాణం ప్రారంభించాలి. మీరు రెండో సారి పెద్ద శబ్దంతో వాటిని ఊదితే అది సంకేతంగా భావించి దక్షిణం వైపున సైన్యాలు ప్రయాణం మొదలు పెట్టాలి. వారి ప్రయాణం ప్రారంభించినప్పుడు పెద్ద శబ్దంతో ఊదాలి. సమాజం సమావేశంగా కూడినప్పుడు బాకాలు ఊదాలి గానీ పెద్ద శబ్దం చేయకూడదు. యాజకులైన అహరోను కొడుకులు ఆ బాకాలు ఊదాలి. మీ తరతరాల్లో మీ సంతానానికి అది నిత్యమైన నియమంగా ఉండాలి. మిమ్మల్ని బాధించే శత్రువుకి వ్యతిరేకంగా మీ దేశంలో యుద్ధానికి బయలు దేరే సమయంలో ఆ బాకాలు పదేపదే పెద్ద శబ్దంతో ఊదాలి. అప్పుడు మీ దేవుడైన యెహోవా అనే నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుని శత్రువుల నుండి మిమ్మల్ని రక్షిస్తాను. మీ పండగల సమయంలోనూ, నెల ప్రారంభంలోనూ మీరు వేడుకలు చేసుకునేటప్పుడు మీరు అర్పించే దహన బలుల గౌరవార్ధం, మీ శాంతి బలుల గౌరవార్ధం మీరు బాకాలు ఊదాలి. ఇవి మీకు మీ దేవుడినైన నన్ను జ్ఞాపకం చేస్తాయి. నేనే యెహోవాను. మీ దేవుణ్ణి.”

సంఖ్యాకాండము 10:1-10 పవిత్ర బైబిల్ (TERV)

మోషేతో యెహోవా ఇలా చెప్పాడు: “రెండు వెండి బూరలు చేయించు. వెండిని ఉపయోగించి, బూరలు చేసేందుకు దానిని సాగగొట్టాలి. ఆ బూరలు ప్రజలందర్నీ సమావేశపర్చి సేనలను ఎప్పుడు బయలుదేరదీయాలో చెప్పటానికి ఉండవలెను. ప్రజలు ఎక్కడ నివాసం చేయాలి అనేది వారికి చెప్పటానికి ఇది నీకు సహాయకరంగా ఉంటుంది. ఆ రెండు బూరలు ఒక ప్రకటనగా ఉంటాయి. ప్రజలంతా అది విని, సన్నిధి గుడార ప్రవేశం దగ్గర నీ ఎదుట కూడుకొంటారు. నీవు ఒకే బూర ఊదితే నాయకులు (ఇశ్రాయేలు పన్నెండు కుటుంబాల నాయకులు) నీ ఎదుట కూడుకొంటారు. “నీవు ఒక బూరను పదే పదే ఊదితే, తూర్పు వైపున నివాసం చేస్తున్న వంశాలు బయల్దేరాలి. ఒక బూరను నీవు రెండోసారి కూడా అలాగే ఊదితే దక్షిణాన నివాసం చేస్తున్నవారు బయల్దేరాలి. బూర శబ్దం ప్రజలు బయల్దేరాలని చెప్పే ఒక ప్రకటన. ప్రజలందరినీ ఒక్కచోట నీవు సమకూర్చాలంటే, బూరలను మరో విధంగా అంటే ఏకధాటిగా ఒకే శృతిలో ఊదాలి. అహరోను కుమారులు, యాజకులు బూరలు ఊదాలి. ఇది మీకు భవిష్యత్తులో కూడ కొనసాగే ఆజ్ఞ. “మీ స్వంత స్థలంలో మీరు శత్రువుతో యుద్ధం చేయాల్సివస్తే, మీరు వారిమీదికి వెళ్లక ముందు బూరలను గట్టిగా ఊదాలి. అప్పుడు మీ యెహోవా దేవుడు వింటాడు, మీ శత్రువులనుండి ఆయన మిమ్ములను రక్షిస్తాడు. అలాగే మీ ప్రత్యేక సంతోష సమయాల్లోకూడ మీరు బూరలు ఊదాలి. మీ ప్రత్యేక పండుగ దినాల్లోను, నెలల ఆరంభ దినాల్లోను మీ బూరలు ఊదండి. మీ దహన బలులు, మీ సమాధాన బలులు అర్పించేటప్పుడు మీ బూరలు ఊదండి. అది మీరు మీ దేవుని జ్ఞాపకం చేసుకునేందుకు సహాయకరమైన ఒక ప్రత్యేక విషయం. మీరు ఇలా చేయాలని నేను మీకు ఆజ్ఞాపిస్తున్నాను. నేను యెహోవాను, మీ దేవుడ్ని.”

సంఖ్యాకాండము 10:1-10 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను–నీవు . రెండు వెండి బూరలు చేయించుకొనుము; నకిషిపనిగా వాటిని చేయింపవలెను. అవి సమాజమును పిలుచుటకును సేనలను తర్లించుటకును నీకుండవలెను. ఊదువారు వాటిని ఊదునప్పుడు సమాజము ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునెదుట నీ యొద్దకు కూడి రావలెను. వారు ఒకటే ఊదినయెడల ఇశ్రాయేలీయుల సమూహములకు ముఖ్యులైన ప్రధానులు నీయొద్దకు కూడి రావలెను. మీరు ఆర్భాటముగా ఊదునప్పుడు తూర్పుదిక్కున దిగి యున్న సైన్యములు సాగవలెను. మీరు రెండవమారు ఆర్భాటముగా ఊదునప్పుడు దక్షిణదిక్కున దిగిన సైన్యములు సాగవలెను. వారు ప్రయాణమైపోవునప్పుడు ఆర్భాటముగా ఊదవలెను. సమాజమును కూర్చునప్పుడు ఊదవలెనుగాని ఆర్భాటము చేయవలదు. అహరోను కుమారులైన యాజకులు ఆ బూరలు ఊదవలెను; నిత్యమైన కట్టడనుబట్టి అవి మీ వంశముల పరంపరగా మీకు ఉండును. మిమ్మును బాధించు శత్రువులకు విరోధముగా మీ దేశములో యుద్ధమునకు వెళ్లునప్పుడు ఆ బూరలు ఆర్భాటముగా ఊదవలెను అప్పుడు మీ దేవుడైన యెహోవా సన్నిధిని మీరు జ్ఞాపకమునకు వచ్చి మీ శత్రువులనుండి రక్షింపబడుదురు. మరియు ఉత్సవ దినమందును నియామక కాలములయందును నెలల ఆరంభములయందును మీరు దహనబలులనుగాని సమాధానబలు లనుగాని అర్పించునప్పుడు ఆ బూరలు ఊదవలెను అప్పుడు అవి మీ దేవుని సన్నిధిని మీకు జ్ఞాపకార్థముగా ఉండును మీ దేవుడైన యెహోవాను నేనే.