నెహెమ్యా 8:1-18

నెహెమ్యా 8:1-18 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

ఏడవ నెల రాగా ఇశ్రాయేలీయులు తమ పట్టణములలో నివాసులై యుండిరి. అప్పుడు జనులందరును ఏక మనస్కులై, నీటి గుమ్మము ఎదుటనున్న మైదానమునకు వచ్చి –యెహోవా ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన మోషే ధర్మశాస్త్రగ్రంథమును తెమ్మని ఎజ్రా అను శాస్త్రితో చెప్పగా యాజకుడైన ఎజ్రా యేడవ మాసము మొదటి దినమున చదువబడుదాని గ్రహింపశక్తిగల స్త్రీ పురుషులు కలిసిన సమాజమంతటి యెదుటను ఆ ధర్మశాస్త్రగ్రంథము తీసికొనివచ్చి నీటి గుమ్మము ఎదుటనున్న మైదానములో ఉదయము మొదలుకొని మధ్యాహ్నమువరకు నిలుచున్న ఆ స్త్రీ పురుషులకును, తెలివితో వినగలవారికందరికిని చదివి వినిపించుచు వచ్చెను, ఆ జనులందరును ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధతో వినిరి అంతట శాస్త్రియగు ఎజ్రా ఆ పనికొరకు కఱ్ఱతో చేయబడిన యొక పీఠము మీద నిలువబడెను; మరియు అతని దగ్గర కుడిపార్శ్వమందు మత్తిత్యా షెమ అనాయా ఊరియా హిల్కీయా మయశేయా అనువారును, అతని యెడమ పార్శ్వమందు పెదాయా మిషాయేలు మల్కీయా హాషుము హష్బద్దానా జెకర్యా మెషుల్లాము అనువారును నిలిచియుండిరి. అప్పుడు ఎజ్రా అందరికంటె ఎత్తుగా నిలువబడి జనులందరును చూచుచుండగా గ్రంథమును విప్పెను, విప్ప గానే జనులందరు నిలువబడిరి. ఎజ్రా మహా దేవుడైన యెహోవాను స్తుతింపగా జనులందరు తమ చేతులెత్తి– ఆమేన్ ఆమేన్ అని పలుకుచు, నేలకు ముఖములు వంచుకొని యెహోవాకు నమస్కరించిరి. జనులు ఈలాగు నిలువబడియుండగా యేషూవ బానీ షేరేబ్యా యామీను అక్కూబు షబ్బెతై హోదీయా మయశేయా కెలీటా అజర్యా యోజాబాదు హానాను పెలాయాయును లేవీయులును ధర్మశాస్త్రముయొక్క తాత్పర్యమును తెలియ జెప్పిరి. ఇటువలెనే వారు దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించునట్లు దానికి అర్థము చెప్పిరి. జనులందరు ధర్మశాస్త్రగ్రంథపు మాటలు విని యేడ్వ మొదలుపెట్టగా, అధికారియైన నెహెమ్యాయు యాజకుడును శాస్త్రియునగు ఎజ్రాయును జనులకు బోధించు లేవీయులును–మీరు దుఃఖపడవద్దు, ఏడ్వవద్దు, ఈ దినము మీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత దినమని జనులతో చెప్పిరి. మరియు అతడు వారితో నిట్లనెను–పదండి, క్రొవ్విన మాంసము భక్షించుడి, మధురమైనదాని పానము చేయుడి, ఇదివరకు తమకొరకు ఏమియు సిద్ధము చేసికొనని వారికి వంతులు పంపించుడి. ఏలయనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమాయెను, మీరు దుఃఖపడకుడి,యెహోవాయందు ఆనందించుటవలన మీరు బల మొందుదురు. ఆలాగున లేవీయులు జనులందరిని ఓదార్చి –మీరు దుఃఖము మానుడి, ఇది పరిశుద్ధదినము, మీరు దుఃఖపడకూడదని వారితో అనిరి. ఆ తరువాత జనులు తమకు తెలియజేయబడిన మాటలన్నిటిని గ్రహించి, తినుటకును త్రాగుటకును లేనివారికి ఫలాహారములు పంపించుటకును సంభ్రమముగా ఉండుటకును ఎవరి యిండ్లకు వారు వెళ్లిరి. రెండవదినమందు జనులందరి పెద్దలలో ప్రధానులైనవారును యాజకులును లేవీయులును ధర్మశాస్త్రగ్రంథపు మాటలు వినవలెనని శాస్త్రియైన ఎజ్రా యొద్దకు కూడి వచ్చిరి. యెహోవా మోషేకు దయచేసిన గ్రంథములో చూడగా, ఏడవ మాసపు ఉత్సవకాలమందు ఇశ్రాయేలీయులు పర్ణశాలలలో నివాసము చేయవలెనని వ్రాయబడి యుండుట కనుగొనెను మరియు వారు తమ పట్టణములన్నిటిలోను యెరూషలేములోను ప్రకటనచేసి తెలియ జేయవలసినదేమనగా–మీరు పర్వతమునకు పోయి ఒలీవ చెట్ల కొమ్మలను అడవి ఒలీవచెట్ల కొమ్మలను గొంజిచెట్ల కొమ్మలను ఈతచెట్ల కొమ్మలను గుబురుగల వేరువేరు చెట్ల కొమ్మలను తెచ్చి, వ్రాయబడినట్లుగా పర్ణశాలలు కట్టవలెను. ఆప్రకారమే జనులుపోయి కొమ్మలను తెచ్చి జనులందరు తమతమ యిండ్లమీదను తమ లోగిళ్లలోను దేవమందిరపు ఆవరణములోను నీటి గుమ్మపు వీధిలోను ఎఫ్రాయిము గుమ్మపు వీధిలోను పర్ణశాలలు కట్టుకొనిరి. మరియు చెరలోనుండి తిరిగి వచ్చినవారి సమూహమును పర్ణశాలలు కట్టుకొని వాటిలో కూర్చుండిరి. నూను కుమారుడైన యెహోషువ దినములు మొదలుకొని అదివరకు ఇశ్రాయేలీయులు ఆలాగున చేసియుండలేదు; అప్పుడు వారికి బహు సంతోషము పుట్టెను. ఇదియుగాక మొదటి దినము మొదలుకొని కడదినమువరకు అను దినము ఎజ్రా దేవుని ధర్మశాస్త్ర గ్రంథమును చదివి విని పించుచు వచ్చెను. వారు ఈ ఉత్సవమును ఏడు దినములవరకు ఆచరించిన తరువాత విధిచొప్పున ఎనిమిదవదినమునవారు పరిశుద్ధ సంఘముగా కూడుకొనిరి.

షేర్ చేయి
Read నెహెమ్యా 8

నెహెమ్యా 8:1-18 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

అప్పుడు ప్రజలంతా ఒకే ఉద్దేశంతో నీటి ద్వారం ఎదురుగా ఉన్న మైదానంలో సమకూడారు. యెహోవా ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన మోషే ధర్మశాస్త్ర గ్రంథాన్ని తీసుకు రమ్మని ఎజ్రాశాస్త్రితో చెప్పారు. ఎజ్రా ఏడవ నెల మొదటి రోజున గ్రంథాన్ని చదువుతుండగా అర్థం చేసుకోగలిగే స్త్రీ పురుషులు కలసి ఉన్న సమూహం ఎదుటికి ఆ ధర్మశాస్త్ర గ్రంథం తెచ్చాడు. అతడు నీటి ద్వారం ఎదురుగా ఉన్న మైదానంలో ఉదయం నుండి మధ్యాహ్నం దాకా నిలబడి ఉన్న ఆ స్త్రీ పురుషులకు, అంటే జ్ఞానంతో దాన్ని అర్థం చేసుకోగల వారందరికీ వినిపించాడు. ప్రజలంతా ఆ ధర్మశాస్త్ర గ్రంథాన్ని శ్రద్ధగా విన్నారు. ఆ పని కోసం చెక్కతో చేసిన ఎత్తయిన వేదిక మీద ఎజ్రా నిలబడ్డాడు. అతని కుడివైపు మత్తిత్యా, షెమ, అనాయా, ఊరియా, హిల్కీయా, మయశేయా అనేవాళ్ళు. ఎడమవైపు పెదాయా, మిషాయేలు, మల్కీయా, హాషుము, హష్బద్దానా, జెకర్యా, మెషుల్లాము అనేవాళ్ళు నిలబడ్డారు. అప్పుడు అందరికంటే ఎత్తయిన వేదికపై ఎజ్రా నిలబడి ప్రజలంతా చూస్తుండగా గ్రంథం తెరిచాడు. ప్రజలంతా లేచి నిలబడ్డారు. ఎజ్రా గొప్ప దేవుడైన యెహోవాను స్తుతించినప్పుడు ప్రజలంతా తమ చేతులు పైకెత్తి ఆమేన్‌, ఆమేన్‌ అని కేకలు వేస్తూ, క్రిందికి నేల వైపుకు తమ తలలు వంచుకుని యెహోవాకు నమస్కరించారు. ప్రజలు ఇలా నిలబడి ఉన్న సమయంలో యేషూవ, బానీ, షేరేబ్యా, యామీను, అక్కూబు, షబ్బెతై, హోదీయా, మయశేయా, కెలీటా, అజర్యా, యోజాబాదు, హానాను, పెలాయా, లేవీయులు ధర్మశాస్త్రం అర్థాన్ని, భావాలను వారికి తెలియజేశారు. ఆ విధంగా ప్రజలు మరింత స్పష్టంగా అర్థం చేసుకుని గ్రహించగలిగేలా గ్రంథాన్ని చదివి వినిపించి వాటి సారాంశం తెలియజేసారు. ధర్మశాస్త్ర గ్రంథంలోని విషయాలు గ్రహించిన ప్రజలు బిగ్గరగా ఏడవడం మొదలుపెట్టారు. అధికారి నెహెమ్యా, యాజకుడు, శాస్త్రి అయిన ఎజ్రా, ప్రజలకు వివరించే లేవీయులు వారితో “మీరు ఏడవ్వద్దు. ఈ రోజు మీ దేవుడైన యెహోవాకు కేటాయించిన రోజు” అని చెప్పారు. అప్పుడు నెహెమ్యా “బయలు దేరండి. కొవ్విన మాంసం తినండి. ఏదైనా తియ్యటిది తాగండి. ఇప్పటి దాకా తమ కోసం ఏమీ సిద్ధం చేసుకోని వాళ్లకు వాటాలు పంపించండి. ఎందుకంటే ఈ రోజు పరిశుద్ధమైనది. మీరు దుఃఖపడొద్దు. యెహోవాలో ఆనందమే మీ బలం” అని చెప్పాడు. ఈ విధంగా లేవీయులు ప్రజలందరినీ ఓదార్చారు. “మీరు దుఃఖించడం ఆపండి. చింతించకండి. ఇది పవిత్రమైన రోజు” అన్నారు. ఆ తరువాత ప్రజలు తాము విన్న మాటలన్నీ గ్రహించి, తినడానికీ, తాగడానికీ, లేని వారికి వాటాలు పంపించడానికీ, సంతోషంగా గడపడానికీ ఎవరి ఇళ్ళకు వాళ్ళు వెళ్లారు. రెండవ రోజు ప్రజల పెద్దల్లో ప్రముఖులు, యాజకులు, లేవీయులు ధర్మశాస్త్ర గ్రంథంలోని విషయాలు తెలుసుకోవాలని ఆచార్యుడు ఎజ్రా దగ్గర సమకూడారు. యెహోవా మోషేకు అనుగ్రహించిన గ్రంథం పరిశీలించినప్పుడు ఏడవ నెలలో జరిగే పండగ సమయంలో పర్ణశాలల్లో గడపాలని రాసి ఉన్నట్టు వారు కనుగొన్నారు. వాళ్ళు యెరూషలేంలో, తమ పట్టణాల్లో ఈ విధంగా చాటింపు వేయించారు. “గ్రంథంలో రాసి ఉన్నట్టు, మీరు కొండలకు వెళ్లి ఒలీవచెట్ల కొమ్మలు, అడవి ఒలీవచెట్ల కొమ్మలు, గొంజి చెట్ల కొమ్మలు, ఈతచెట్ల కొమ్మలు, గుబురుగా ఉండే రకరకాల చెట్ల కొమ్మలు తీసుకువచ్చి పర్ణశాలలు కట్టాలి.” కాబట్టి ప్రజలు వెళ్లి కొమ్మలు తెచ్చి అందరూ తమ తమ ఇళ్ళ మీద, వాకిళ్ళలో, మందిరం పరిసరాల్లో, నీటి ద్వారం వీధిలో, ఎఫ్రాయీం ద్వారం వీధిలో పర్ణశాలలు కట్టారు. చెర నుండి తిరిగి వచ్చినవాళ్ళంతా పర్ణశాలలు కట్టుకుని వాటిలో ఉన్నారు. అందరూ ఆనందించారు. నూను కొడుకు యెహోషువ జీవిత కాలం తరువాత నుండి ఇప్పటి వరకూ ఇశ్రాయేలీయులు ఈ విధంగా చేయలేదు. అంతే కాకుండా, మొదటి రోజు నుండి ఏడవ రోజు వరకూ ప్రతిరోజూ ఎజ్రా దేవుని ధర్మశాస్త్ర గ్రంథం చదివి, వినిపిస్తూ వచ్చాడు. వాళ్ళు ఇలా వారం పాటు ఈ పండగ రోజులు ఆచరించారు. తరువాత ఎనిమిదవ రోజున నిర్ణయించిన క్రమం ప్రకారం పవిత్ర సమావేశంలో సమకూడారు.

షేర్ చేయి
Read నెహెమ్యా 8

నెహెమ్యా 8:1-18 పవిత్ర బైబిల్ (TERV)

ఆ విధంగా, ఇశ్రాయేలీయులందరూ ఆ ఏడాది ఏడవ నెలలో సమావేశమయ్యారు. వాళ్లందరూ నీటి గుమ్మం ముందరి మైదానంలో ఏక మనస్కులై ఒకే మనిషి అన్నట్లు గుమికూడారు. వాళ్లు ఎజ్రా ఉపదేశకుణ్ణి మోషే ధర్మశాస్త్రాన్ని పైకి తీసి పఠించ వలసిందిగా కోరారు. ఇశ్రాయేలీయులకు యెహోవా ఇచ్చిన ధర్మశాస్త్రమది. యాజకుడైన ఎజ్రా సమావేశమైన జనం ముందుకి ధర్మశాస్త్రాన్ని తెచ్చాడు. అది నెల మొదటి రోజు. అది ఏడాదిలో ఏడవ నెల. ఆ సమావేశంలో స్త్రీలు, పురుషులు విని, అర్థం చేసుకోగల వయస్కులు వున్నారు. ఎజ్రా ఉదయాన్నుంచి మిట్ట మధ్యాహ్నంవరకు ధర్మశాస్త్రాన్ని చదివాడు. నీటి గుమ్మం ఎదుటవున్న మైదానానికి ఎదురుగా నిలబడి, ఎజ్రా స్త్రీలనీ, పురుషుల్నీ విని అర్థం చేసుకోగల వాళ్లందర్నీ ఉద్దేశించి చదివాడు. జనం అందరూ ధర్మశాస్త్ర గ్రంథం పట్ల భక్తి శ్రద్ధలతో విన్నారు. ఎజ్రా ఈ ప్రత్యేక సందర్భంకోసం నిర్మింపబడిన ఎత్తైన కొయ్య వేదిక మీద నిలబడ్డాడు. ఎజ్రా కుడి ప్రక్కన మత్తిత్యా, షెమ, అనాయా, ఊరియా, హిల్కియా, మయశేయాలు ఉన్నారు. ఎజ్రా ఎడమ ప్రక్కన పెదాయా, మిషాయేలు, మల్కీయా, హాషుము, హష్బద్దానా, జెకర్యా, మెషుల్లాములు వున్నారు. అప్పుడు ఎజ్రా గ్రంథం విప్పాడు. ఎజ్రా ఎతైన వేదిక మీద నిలబడి ఉన్నందున జనులందరూ అతన్ని చూడగలుగుతున్నారు. ఎజ్రా ధర్మశాస్త్ర గ్రంథాన్ని తెరవగానే, జనం అందరూ గౌరవంగా లేచి నిలబడ్డారు. ఎజ్రా మహా దేవుడైన యెహోవాను స్తుతించాడు. జనులందరూ తమ చేతులు పైకెత్తి బిగ్గరగా, “ఆమేన్! ఆమేన్!” అన్నారు. తర్వాత జనులందరూ నేలమీదవంగి నమస్కరించి యెహోవాను ఆరాధించారు. జనం అక్కడ నిలబడి వుండగా లేవీయులు ధర్మశాస్త్ర నియమాలను జనానికి బోధించారు. అలా బోధించిన లేవీయులు: యేషూవ, బానీ, షేరేబ్యా, యామీను, అక్కూబు, షబ్బెతై, హూదీయా, మయశాయా, కెలీటా, అజర్యా, యెజాబాదు, హానాను, పెలాయా. ఆ లేవీయులు దేవుని ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదివారు. వాళ్లు జనానికి అర్థం వివరించి దాన్ని సులభం చేశారు. చదివినదాన్ని జనం తేలిగ్గా అర్థం చేసుకోగలిగేందుకు గాను వాళ్లు తాత్పర్యాలను వివరించి చెప్పారు. తర్వాత పాలనాధికారి నెహెమ్యా, యాజకుడును, ఉపదేశకుడునైన ఎజ్రా, జనానికి బోధిస్తున్న లేవీయులు మాట్లాడారు. వాళ్లు, “ఈ రోజు మీ దేవుడైన యెహోవాకి ప్రత్యేక దినం మీరు విచారంగా వుండకండి, ఏడ్వకండి!” అని చెప్పారు. ధర్మశాస్త్రంలోని సందేశాలను వింటూ జనం అందరూ రోదించనారంభించిన మూలంగా వాళ్లీ మాటలు చెప్పారు. నెహెమ్యా ఇలా చెప్పాడు: “పోయి కొవ్విన మాంసంతో భోజనం చేయండి, మధుర ద్రాక్షారసం సేవించండి. ఏ ఆహారమూ తయారు చేసుకోని వాళ్లకికొంత ఆహారమూ పానీయాలూ ఇవ్వండి. ఈ రోజు యెహోవాకి ప్రత్యేకమైన రోజు. విచారాన్ని విడనాడండి! ఎందుకంటే, యెహోవా ఆనందం మీకు పుష్టిని చేకూరుస్తుంది.” జనం శాంతచిత్తులయ్యేందుకు లేవీయులు తోడ్పడ్డారు. “శాంతించండి, మౌనంగా వుండండి. ఇదొక ప్రత్యేక దినం, దుఃఖించకండి.” అప్పుడిక అందరూ విందు భోజనం చేసేందుకు వెళ్లారు. వాళ్లు తమ ఆహార పదార్థాలనీ, పానీయాలనీ పరస్పరం పంచుకున్నారు. ఆ ప్రత్యేక దినాన్ని వాళ్లెంతో సంతోషంగా జరుపుకున్నారు. వాళ్లు చివరికి బోధకులు తమకి బోధించ ప్రయత్నిస్తున్న ధర్మశాస్త్ర గుణపాఠాలను అర్థం చేసుకున్నారు. అటు తర్వాత, నెల రెండవ రోజున అన్ని కుటుంబాల పెద్దలూ ఎజ్రానూ, యాజకులనూ, లేవీయులనూ కలుసుకునేందుకు వెళ్లారు. వాళ్లందరూ ధర్మశాస్త్రంలోని ప్రవచనాలను అధ్యయనం చేసేందుకు ఉపదేశకుడైన ఎజ్రాచుట్టూ చేరారు. వాళ్లు ధర్మశాస్త్రాన్ని అధ్యయనం చేయగా దానిలో ఈ దిగువ ఆజ్ఞలు వాళ్లకి కనిపించాయి యెహోవా మోషే ద్వారా ఈ ఆజ్ఞ ఇచ్చాడు: ఏడాది ఏడవ నెలలో ఇశ్రాయేలీయులు యెరూషలేముకు ప్రత్యేకమైన పండుగ జరుపుకునేందుకు విధిగా పోవాలి. వాళ్లు తాత్కాలిక పర్ణశాలల్లో ఉండాలి. తమ పట్టణాలన్నింటికీ, యెరూషలేముకీ పోయి, ఈ క్రింది మాటలు ప్రకటించాలి. “పర్వత ప్రాంతానికి పోయి రకరకాల ఒలీవ చెట్ల కొమ్మలు తీసుకురావాలి. కదంబ, తాటి, ఈత ఆకులను, అలాగే నీడనిచ్చే ఇతర మొక్కలను తీసుకురావాలి. ఆ కొమ్మలతో తాత్కాలికమైన పర్ణశాలలు వెయ్యాలి. ధర్మశాస్త్ర గ్రంథం చెప్పినట్లు చెయ్యండి.” సరే, జనం పోయి, ఆ చెట్ల కొమ్మలు తెచ్చారు. తర్వాత వాటితో వాళ్లు తమకి తాత్కాలిక పర్ణశాలలు నిర్మించుకున్నారు. వాళ్లు పర్ణశాలలను తమ ఇళ్ల కప్పులపైనా, తమ ఆవరణల్లోనూ వేసుకున్నారు. వాళ్లు ఆలయ ప్రాంగణంలో, నీటి గుమ్మం దగ్గరి ఖాళీ స్థలంలో, ఎఫ్రాయిము ద్వారం దగ్గర పర్ణశాలలు నిర్మించారు. చెరనుంచి బంధవిముక్తులై తిరిగివచ్చిన ఇశ్రాయేలీయుల బృందమంతా పర్ణశాలలు కట్టు కున్నారు. వాళ్లు తాము కట్టుకున్న పర్ణశాలల్లో నివసించారు. నూను కుమారుడైన యెహోషువా కాలంనుంచి ఆనాటిదాకా ఇశ్రాయేలీయులు పర్ణశాలల పండుగను ఇంత చక్కగా జరుపుకోలేదు. అందరూ ఎంతో సంతోషించారు! ఆ పండుగ ప్రతి రోజూ, మొదటి రోజునుంచి చివరి రోజు వరకు ఎజ్రా వాళ్లకి ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదివి వినిపించాడు. ఇశ్రాయేలు ప్రజలు ఆ పండగను వారం రోజులపాటు జరుపుకున్నారు. అటు తర్వాత ఎనిమిదో రోజున, ధర్మ శాస్త్రం నిర్దేశించినట్టు ఒక ప్రత్యేక సమావేశం కోసం ఒక చోట కూడారు.

షేర్ చేయి
Read నెహెమ్యా 8

నెహెమ్యా 8:1-18 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)

ప్రజలంతా ఏకమనస్సుతో నీటిగుమ్మం ఎదుట ఉన్న చావడికి వచ్చారు. యెహోవా ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన మోషే ధర్మశాస్త్ర గ్రంథాన్ని తీసుకురమ్మని వారు ధర్మశాస్త్ర బోధకుడైన ఎజ్రాతో చెప్పారు. యాజకుడైన ఎజ్రా ఏడవ నెల మొదటి రోజున విని గ్రహించగలిగిన స్త్రీలు పురుషులందరు ఉన్న సమాజం ఎదుటకు ఆ ధర్మశాస్త్ర గ్రంథాన్ని తీసుకువచ్చాడు. అతడు నీటిగుమ్మం ఎదుట ఉన్న మైదానంలో ఉదయం నుండి మధ్యాహ్నం వరకు అక్కడ ఉన్న విని గ్రహించగలిగిన స్త్రీలు పురుషులందరికి ధర్మశాస్త్ర గ్రంథాన్ని బిగ్గరగా చదివి వినిపించాడు. వారందరు ధర్మశాస్త్రాన్ని శ్రద్ధగా విన్నారు. అప్పుడు ధర్మశాస్త్ర శాస్త్రియైన ఎజ్రా చెక్కతో చేయబడిన ఒక పీఠం మీద నిలబడ్డాడు. అతని కుడి ప్రక్కన మత్తిత్యా, షెమ, అనాయా, ఊరియా, హిల్కీయా, మయశేయా అనేవారు ఉన్నారు; ఎడమ ప్రక్కన పెదాయా, మిషాయేలు, మల్కీయా, హాషుము, హష్బద్దానా, జెకర్యా, మెషుల్లాము అనేవారు ఉన్నారు. ప్రజలందరికి కనిపించేలా వారందరి కన్నా ఎత్తులో ఎజ్రా నిలబడి గ్రంథాన్ని తెరిచాడు. అతడు గ్రంథాన్ని విప్పగానే ప్రజలంతా లేచి నిలబడ్డారు. ఎజ్రా గొప్ప దేవుడైన యెహోవాను స్తుతించగా ప్రజలందరు చేతులెత్తి, “ఆమేన్! ఆమేన్!” అని అంటూ తమ తలలు నేలకు వంచి యెహోవాను ఆరాధించారు. ప్రజలందరు నిలబడి ఉండగా లేవీయులైన యెషూవ, బానీ, షేరేబ్యా, యామీను, అక్కూబు, షబ్బెతై, హోదీయా, మయశేయా, కెలిథా, అజర్యా, యోజాబాదు, హానాను, పెలాయా మొదలగు వారందరు కలిసి ధర్మశాస్త్రాన్ని ప్రజలకు బోధించారు. వారు దేవుని ధర్మశాస్త్ర గ్రంథాన్ని స్పష్టంగా చదివి వినిపించి ప్రజలు దానిని గ్రహించేలా దాని అర్థాన్ని వివరించారు. ప్రజలందరు ధర్మశాస్త్ర గ్రంథంలోని మాటలు వినగానే ఏడ్వడం మొదలుపెట్టారు. అప్పుడు అధిపతియైన నెహెమ్యా, యాజకుడూ ధర్మశాస్త్ర బోధకుడైన ఎజ్రా, ప్రజలు గ్రహించేలా బోధించి లేవీయులు వారందరితో, “ఈ రోజు మన దేవుడైన యెహోవాకు పరిశుద్ధ దినం కాబట్టి మీరు దుఃఖపడకండి ఏడవకండి” అని చెప్పారు. నెహెమ్యా వారితో, “వెళ్లి, రుచికరమైన ఆహారాన్ని తిని మధురమైన వాటిని త్రాగి ఆనందించండి. తమ కోసం ఏమి సిద్ధం చేసుకోని వారికి కొంత భాగాన్ని పంపించండి. ఈ రోజు యెహోవాకు పరిశుద్ధ దినము. యెహోవాలో ఆనందించడమే మీ బలం కాబట్టి మీరు దుఃఖపడకండి” అన్నాడు. లేవీయులు ప్రజలందరినీ ఓదార్చుతూ, “మీరు నిశ్శబ్దంగా ఉండండి. ఇది పరిశుద్ధమైన రోజు కాబట్టి దుఃఖపడకండి” అన్నారు. ఆ తర్వాత ప్రజలందరు తమకు తెలియజేసిన మాటలన్నీ గ్రహించారు కాబట్టి తినడానికి త్రాగడానికి లేనివారికి పంపించడానికి, గొప్ప సంతోషాన్ని అనుభవించడానికి ఎవరి ఇళ్ళకు వారు వెళ్లిపోయారు. నెలలో రెండవ రోజున కుటుంబ పెద్దలు యాజకులు లేవీయులతో కలిసి ధర్మశాస్త్ర బోధకుడైన ఎజ్రా దగ్గరకు ధర్మశాస్త్రంలోని మాటల నుండి జ్ఞానం పొందాలని వచ్చారు. యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రంలో ఏడవ నెల పండుగ సమయంలో ఇశ్రాయేలీయులు తాత్కాలిక నివాసాల్లో నివసించాలని వ్రాయబడి ఉండడం చూసి, వెంటనే వారు తమ పట్టణాల్లో యెరూషలేములో ఈ విధంగా ప్రకటించారు: “మీరు పర్వత ప్రాంతానికి వెళ్లి ఒలీవ చెట్ల కొమ్మలు, అడవి ఒలీవ చెట్ల కొమ్మలు, గొంజి చెట్టు కొమ్మలు, ఈత చెట్టు కొమ్మలు, గుబురుగా ఉండే చెట్టు కొమ్మలు తీసుకువచ్చి వ్రాయబడిన విధంగా తాత్కాలిక నివాసాలు నిర్మించాలి.” అలాగే ప్రజలందరు వెళ్లి కొమ్మలు తెచ్చి తమ ఇళ్ళ కప్పుల మీద, తమ వాకిటిలో, దేవుని ఆలయ ఆవరణంలో, నీటి గుమ్మపు వీధిలో, ఎఫ్రాయిం గుమ్మపు వీధిలో తాత్కాలిక నివాసాలు కట్టుకున్నారు. చెర నుండి తిరిగి వచ్చినవారి సమూహం తాత్కాలిక నివాసాలు కట్టుకుని వాటిలో నివసించారు. నూను కుమారుడైన యెహోషువ కాలం నుండి ఆ రోజు వరకు ఇశ్రాయేలీయులు ఎప్పుడు అలా చేయలేదు. వారు గొప్ప సంతోషాన్ని అనుభవించారు. మొదటి రోజు నుండి చివరి రోజు వరకు ప్రతిరోజు ఎజ్రా దేవుని ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదివి వినిపిస్తూ వచ్చాడు. వారు ఏడు రోజులు పండుగ చేసుకుని నియమించిన ప్రకారం ఎనిమిదవ రోజున పరిశుద్ధ సంఘంగా కూడుకున్నారు.

షేర్ చేయి
Read నెహెమ్యా 8