నెహెమ్యా 4:1-5
నెహెమ్యా 4:1-5 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
మేము గోడ కట్టుచున్న సమాచారము విని సన్బల్లటు మిగుల కోపగించి రౌద్రుడై యూదులను ఎగతాళిచేసి షోమ్రోను దండువారి యెదుటను తన స్నేహితుల యెదుటను ఇట్లనెను–దుర్బలులైన యీ యూదులు ఏమి చేయుదురు? తమంతట తామే యీ పని ముగింతురా? బలులు అర్పించి బలపరచుకొందురా? ఒక దినమందే ముగింతురా? కాల్చబడిన చెత్తను కుప్పలుగాపడిన రాళ్లను మరల బలమైనవిగా చేయుదురా? మరియు అమ్మోనీయుడైన టోబీయా అతనియొద్దను ఉండి–వారు కట్టినదానిపైకి ఒక నక్క యెగిరినట్టయిన వారి రాతిగోడ పడిపోవుననెను. –మా దేవా ఆలకించుము, మేము తిరస్కారము నొందిన వారము; వారి నింద వారి తలలమీదికి వచ్చునట్లుచేసి, వారు చెరపట్టబడినవారై వారు నివసించు దేశములోనే వారిని దోపునకు అప్పగించుము. వారు కట్టువారినిబట్టి నీకు కోపము పుట్టించి యుండిరి గనుక వారి దోషమును పరిహరింపకుము, నీయెదుట వారి పాపమును తుడిచి వేయకుము.
నెహెమ్యా 4:1-5 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
మేము గోడలు నిలబెట్టడం మొదలు పెట్టిన విషయం సన్బల్లటుకు తెలిసింది. అతడు తీవ్ర కోపంతో మండిపడుతూ యూదులను ఎగతాళి చేశాడు. షోమ్రోను సైన్యం వారితో, తన స్నేహితులతో ఇలా అన్నాడు. “అల్పులైన ఈ యూదులు ఏం చేయగలరు? తమంత తామే ఈ పట్టణాన్ని తిరిగి కట్టగలరా? బలులు అర్పించి బలం తెచ్చుకుని ఒక్క రోజులోనే పని పూర్తి చేస్తారా? కాలిపోయిన శిథిలాల కుప్పల నుండి ఏరిన రాళ్ళను పునాదులుగా వాడతారా?” అమ్మోనీయుడు టోబీయా అతని దగ్గరుండి “వీళ్ళు కట్టిన గోడపై ఒక నక్క ఎగిరితే ఆ గాలికి గోడ పడిపోతుంది” అన్నాడు. “మా దేవా, మా ప్రార్థన విను. మేము తృణీకారానికి గురి అయిన వాళ్ళం. వారు మాపై వేసే నిందలు వారి మీదికే వచ్చేలా చెయ్యి. వారు ఓడిపోవాలి. వారు బందీలుగా పోయే దేశంలో శత్రువులు వారిని దోచుకోవాలి. వారు ఆలయం కట్టే వారిని ఆటంకపరచి నీకు కోపం తెప్పించారు. కాబట్టి వారి దోషాన్ని బట్టి వారిని విడిచిపెట్టవద్దు. నీ దృష్టిలో నుంచి వారి పాపాన్ని తీసివేయ వద్దు.”
నెహెమ్యా 4:1-5 పవిత్ర బైబిల్ (TERV)
మేము యెరూషలేము ప్రాకారాన్ని నిర్మిస్తున్నామన్న వార్తను సన్బల్లటు విన్నాడు. అతను కోపంతో ఉగ్రరూపం దాల్చాడు. అతను యూదులను ఎగతాళి చెయ్యనారంభించాడు. సన్బల్లటు తన మిత్రులతోనూ, షోమ్రోను సైన్యంతోనూ మాట్లాడాడు. అతను ఇలా అన్నాడు: “ఈ బలహీన యూదులు చేస్తున్నపని యేమిటి? మనం ఊరుకొంటామని అనుకుంటున్నారా వీళ్లు? తాము బలులు ఇద్దామనే అనుకుంటున్నారా వీళ్లు? బహూశః ఒక్క రోజులో ప్రాకార నిర్మాణం పని పూర్తి చేస్తామని అనుకుంటున్నట్లుంది వీళ్లు. ఈ చెత్త, దుమ్ము గుట్టల్నుంచి రాళ్లకు జీవం పొయడం వీళ్ల తరం కాదు. ఇవి వట్టి బూడిద రాసులు, ధూళి కుప్పలు!” సన్బల్లటుతోనే ఉన్న అమ్మోనీయుడు టోబీయా ఇలా అందుకున్నాడు: “ఈ యూదులు తామేదో గొప్పగా కట్టేస్తున్నామని అనుకుంటున్నట్లుంది. దాని మీద ఒక చిన్న నక్కపిల్ల ఎక్కితే చాలు, వాళ్ల రాతి గోడ కాస్తా కుప్పకూలిపోతుంది!” నెహెమ్యా ఇలా దైవ ప్రార్థన చేశాడు: “ఓ మా దేవా, మా మొర ఆలకించు. వీళ్లకి మేమంటే ద్వేషం. ఈ సన్బల్లటు, టోబీయా మమ్మల్ని అవమానిస్తున్నారు. వాళ్ల నిందలు వాళ్లకే వచ్చేటట్లు చెయ్యి దేవా. బానిసలుగా, చెరబట్టబడిన వాళ్ల మాదరిగా వాళ్లను సిగ్గుపడనియ్యి. వాళ్ల నేరాన్ని తీసివేయవద్దు. వారి పాపాలను క్షమించవద్దు. ప్రాకారం నిర్మిస్తున్న వాళ్లను వీళ్లు అవమానించారు, వాళ్లని వీళ్లు నిరుత్సాహపరిచారు.”
నెహెమ్యా 4:1-5 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
మేము గోడ తిరిగి కడుతున్నామని విన్న సన్బల్లటు తీవ్రమైన కోపంతో ఊగిపోతూ యూదులను అవహేళన చేస్తూ, తన స్నేహితుల ఎదుట సమరయ సైనికుల ఎదుట మాట్లాడుతూ, “ఈ బలహీనమైన యూదులు ఏం చేయగలరు? తమంతట తామే ఈ పని చేయగలరా? వారే బలి అర్పిస్తారా? ఒక రోజులోనే పనంతా చేసేస్తారా? కాలిపోయి చెత్తకుప్పగా పడి ఉన్న రాళ్లతో మళ్ళీ కడతారా?” అన్నాడు. అతని ప్రక్కన నిలబడి ఉన్న అమ్మోనీయుడైన టోబీయా, “వారు కట్టిన గోడ మీదికి నక్క ఎక్కితే అది కూలిపోతుంది” అన్నాడు. మా దేవా! ప్రార్థన వినండి, మేము తిరస్కరించబడిన వారము. వారి నిందలు వారి తలల మీదికే త్రిప్పండి. వారే పరాయి దేశానికి బందీలుగా పోవాలి! వారు కడుతున్నవారిని అడ్డుకుని నీకు కోపం పుట్టించారు కాబట్టి వారి దోషాలను కప్పివేయకండి వారి పాపాలను తుడిచివేయకండి.