నెహెమ్యా 2:6-9
నెహెమ్యా 2:6-9 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అందుకు రాజు ఇలా అడిగాడు (ఆ సమయంలో రాణి తన పక్కనే కూర్చుని ఉంది). “అక్కడ ఎంతకాలం ఉంటావు? ఎప్పుడు తిరిగి వస్తావు?” నేను ఆ తేదీలు అతనికి చెప్పాను. అప్పుడు రాజు నన్ను పంపడానికి ఇష్టపడ్డాడు. నేను రాజుతో ఇంకా ఇలా అన్నాను. “రాజు గారికి అభ్యంతరం లేకపోతే నేను యూదా దేశం చేరే దాకా నది అవతల ప్రాంతాల్లో ప్రయాణించడానికి అక్కడి అధికారులు నన్ను అనుమతించేలా ఉత్తర్వులు ఇవ్వండి. రాజుగారి అడవులపై అధికారి అయిన ఆసాపుకు కూడా లేఖ రాసి ఇవ్వండి. యెరూషలేం ఆలయం దగ్గర ఉన్న కోట తలుపుల కోసం, కోట గోడ కోసం, నేను నివసించబోయే ఇంటి దూలాల కోసం అతడు కలప ఇవ్వాలి.” దేవుని కరుణా హస్తం నాపై ఉన్నందువల్ల రాజు నా మనవి విన్నాడు. తరువాత నేను నది అవతల ఉన్న అధికారుల దగ్గరకి చేరుకుని వారికి రాజుగారి ఆజ్ఞాపత్రాలు అందజేశాను. రాజు సేనాధిపతులను గుర్రపు రౌతులను నాతో పంపించాడు.
నెహెమ్యా 2:6-9 పవిత్ర బైబిల్ (TERV)
అప్పుడు రాణి రాజు పక్కనే కూర్చుని వుంది. రాజు మరియు రాణి, “నీ ప్రయాణానికి ఎన్ని రోజులు పడుతుంది? నువ్విక్కడకి తిరిగి ఎప్పుడు వస్తావు?” అని అడిగారు. అందుకని, ఇంత సమయము పట్టును అని చెప్పాను, నన్ను పంపేందుకు రాజుగారు సంతోషంగా ఒప్పుకున్నారు. నేను రాజుతో ఇంకా యిలా మనవి చేసుకున్నాను: “రాజురు దయదలిస్తే మరో కోరిక కూడా కోరుకుంటాను. యూఫ్రటీసు నది పశ్చిమ ప్రాంతపు పాలనాధికార్లకు కొన్ని ఉత్తరువు లేఖలు ఇప్పించండి. నేను యూదాకి పోయే మార్గంలో వారివారి ప్రాంతాల్లో క్షేమంగా పోయేందుకు ఆ పాల నాధికార్లు నాకు అనుమతి ఇచ్చేందుకు ఈ లేఖలు నాకు అవసరము. నగర ప్రాకార ద్వారాలకూ, గోడలకూ, ఆలయ ప్రాకారానికీ, నా యింటికీ కలప కావాలి. తమ అడవులకు బాధ్యుడైన అధికారి ఆసాపుకి ఒక లేఖ ఇవ్వండి.” రాజు నాకు లేఖలే కాకుండా, నేను కోరినవన్నీ ఇచ్చాడు. నా పట్ల దేవుని దయ కారణంగా రాజు ఇవన్నీ చేశాడు. సరే, నేను యూఫ్రటిసు నది పశ్చిమ ప్రాంతాల పాలనాధికారి వద్దకు వెళ్లాను. నేను రాజురి లేఖలు వారికి యిచ్చాను. రాజు నాకు తోడుగా కొందరు సైనికోద్యోగులను, అశ్విక సైనికులను కూడా పంపాడు.
నెహెమ్యా 2:6-9 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
అందుకు రాజు రాణి తన యొద్ద కూర్చునియుండగా–నీ ప్రయాణము ఎన్నిదినములు పట్టును? నీవు ఎప్పుడు తిరిగి వచ్చెదవని అడిగెను. నేను ఇంత కాలమని చెప్పినప్పుడు రాజు నన్ను పంపుటకు చిత్తముగలవాడాయెను. ఇదియుగాక రాజుతో నేనిట్లంటిని – రాజున కనుకూలమైతే యూదాదేశమున నేను చేరువరకు నన్ను దాటించునట్లుగా నది యవతలనున్న అధికారులకు తాకీదులను, పట్టణప్రాకారమునకును, మందిరముతో సంబంధించిన కోటగుమ్మములకును, నేను ప్రవేశింపబోవు ఇంటికిని, దూలములు మ్రానులు ఇచ్చునట్లుగా రాజుగారి అడవులను కాయు ఆసాపునకు ఒక తాకీదును ఇయ్యుడని అడిగితిని; ఆలాగు నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణా హస్తముకొలది రాజు నా మనవి ఆలకించెను. తరువాత నేను నది యవతలనున్న అధికారులయొద్దకు వచ్చి వారికి రాజుయొక్క తాకీదులను అప్పగించితిని. రాజు నాతోకూడ సేనాధిపతులను గుఱ్ఱపురౌతులను పంపించెను.
నెహెమ్యా 2:6-9 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
అప్పుడు రాణి తన ప్రక్కన కూర్చుని ఉండగా రాజు, “నీ ప్రయాణానికి ఎన్ని రోజులు పడుతుంది? మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తావు?” అని అడిగాడు. నేను ఎన్ని రోజులో చెప్పినప్పుడు రాజు నన్ను పంపడానికి ఇష్టపడ్డాడు. అప్పుడు నేను రాజును, “రాజుకు ఇష్టమైతే నేను యూదా దేశం చేరుకునేవరకు నేను క్షేమంగా ప్రయాణించడానికి యూఫ్రటీసు నది అవతలి అధిపతులకు ఉత్తరాలు ఇవ్వండి. పట్టణ గోడకు, ఆలయానికి సంబంధించిన కోట గుమ్మాలకు, నేను ఉండబోయే ఇంటికి దూలాలు, మ్రానులు ఇచ్చేలా రాజు అడవులపై అధికారియైన ఆసాపుకు ఉత్తరం ఇవ్వండి” అని అడిగాను. నా దేవుని కృప హస్తం నాకు తోడుగా ఉంది కాబట్టి రాజు నా అభ్యర్థన విన్నాడు. కాబట్టే నేను బయలుదేరి వెళ్లి యూఫ్రటీసు నది అవతలి అధిపతులకు రాజు ఉత్తరాలు ఇచ్చాను. రాజు నాతో పాటు సేనాధిపతులను గుర్రపు సేనను పంపించాడు.