నెహెమ్యా 1:4-11
నెహెమ్యా 1:4-11 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
ఈ మాటలు విన్నప్పుడు నేను క్రింద కూర్చుని ఏడ్చాను. కొన్ని రోజుల వరకు దుఃఖంతో ఉపవాసముండి పరలోకంలో ఉన్న దేవునికి ప్రార్థించాను. నేను ఆయనకు ఇలా ప్రార్థించాను: “యెహోవా పరలోకపు దేవా, అద్భుతమైన గొప్ప దేవా, మిమ్మల్ని ప్రేమించి మీ ఆజ్ఞలను పాటించేవారిపట్ల మీ ప్రేమ ఒడంబడికను మీరు నెరవేరుస్తారు, మీ సేవకులైన ఇశ్రాయేలు ప్రజల కోసం మీ సేవకుడు పగలు రాత్రి మీ ఎదుట చేస్తున్న ప్రార్థనను వినడానికి మీ చెవిని మీ కళ్లను తెరవండి. నేను, నా తండ్రి కుటుంబంతో సహా ఇశ్రాయేలీయులమైన మేము మీకు వ్యతిరేకంగా చేసిన పాపాలను నేను ఒప్పుకుంటున్నాను. మేము మీ పట్ల ఎంతో దుర్మార్గంగా ప్రవర్తించాము. మీరు మీ సేవకుడైన మోషేకు ఇచ్చిన ఆజ్ఞలకు, శాసనాలకు చట్టాలకు మేము లోబడలేదు. “మీరు మీ సేవకుడైన మోషేకు ఇచ్చిన మాట జ్ఞాపకం చేసుకోండి, మీరేమన్నారంటే, ‘మీరు నా పట్ల నమ్మకద్రోహులుగా ప్రవర్తిస్తే, దేశాల మధ్యలోకి మిమ్మల్ని చెదరగొడతాను, కానీ ఒకవేళ మీరు నా వైపు తిరిగి, నా ఆజ్ఞలను అనుసరిస్తే చెరగొనిపోబడిన మీ ప్రజలు ఎంత దూరంలో ఉన్నా నేను వారిని అక్కడినుండి సమకూర్చి నా పేరు కోసం నేను నివాసంగా ఎంచుకున్న ప్రదేశానికి వారిని తీసుకువస్తాను.’ “వారు మీ సేవకులైన మీ ప్రజలు, మీ గొప్ప బలంతో, శక్తిగల మీ హస్తంతో మీరు విమోచించిన ప్రజలు. ప్రభువా, మీ సేవకుడనైన నా ప్రార్థనను మీ నామం పట్ల భయభక్తులు కలిగి ఉండడంలో ఆనందించే నీ సేవకుల ప్రార్థనను మీ చెవులతో శ్రద్ధగా వినండి. ఈ రోజు ఈ వ్యక్తికి నాపై దయ పుట్టించి మీ సేవకుడనైన నాకు విజయం ఇవ్వండి.” ఆ సమయంలో నేను రాజుకు గిన్నె అందించే వానిగా ఉన్నాను.
నెహెమ్యా 1:4-11 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఈ మాటలు విన్న వెంటనే నేను కుప్పగూలిపోయి ఏడ్చి, కొన్ని రోజులు దుఃఖంతో ఉపవాసం ఉన్నాను. ఆకాశంలో ఉన్న దేవునికి ఇలా విజ్ఞాపన చేశాను. “ఆకాశంలో ఉన్న దేవా, యెహోవా, భీకరుడా, ఘన దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞల ప్రకారం నడుచుకునే వారిని నీవు కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరుస్తావు. నా ప్రార్థన విని, నీ కళ్ళు తెరచి నీ సన్నిధిలో రేయింబవళ్ళు నీ సేవకులైన ఇశ్రాయేలీయుల తరుపున నేను చేస్తున్న ప్రార్థన అంగీకరించు. నీకు విరోధంగా పాపం చేసిన ఇశ్రాయేలు సంతతి దోషాన్ని నేను ఒప్పుకుంటున్నాను. నేనూ నా వంశం అంతా పాపం చేశాం. నీ ఎదుట ఎంతో అసహ్యంగా ప్రవర్తించాం. నీ సేవకుడు మోషే ద్వారా నీవు నియమించిన ఆజ్ఞలను గానీ చట్టాలను గానీ విధులను గానీ మేము పాటించలేదు. నీ సేవకుడైన మోషేకు నీవు చెప్పిన మాట గుర్తు చేసుకో. ‘మీరు అపరాధం చేస్తే లోక జాతుల్లోకి మిమ్మల్ని చెదరగొట్టి వేస్తాను. అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటే భూమి నలుమూలలకూ మీరు చెదిరిపోయినా అక్కడ నుండి సైతం మిమ్మల్ని సమకూర్చి, నా నామం ఉంచాలని నేను ఏర్పరచుకున్న చోటికి మిమ్మల్ని తిరిగి తీసుకు వస్తాను’ అని చెప్పావు గదా. మరి, నీవు నీ మహా బల ప్రభావాలతో, నీ బాహుబలంతో విడిపించిన నీ సేవకులైన నీ జనం వీరే గదా. యెహోవా, దయచేసి విను. నీ దాసుడినైన నా మొరను, నీ నామాన్ని భయభక్తులతో ఘనపరచడంలో సంతోషించే నీ దాసుల మొరను ఆలకించు. ఈ రోజు నీ దాసుని ఆలోచన సఫలం చేసి, ఈ మనిషి నాపై దయ చూపేలా చెయ్యమని నిన్ను వేడుకుంటున్నాను.” నేను రాజుకు పానపాత్ర అందించే ఉద్యోగిని.
నెహెమ్యా 1:4-11 పవిత్ర బైబిల్ (TERV)
యెరూషలేము ప్రజలను గురించి, ప్రాకారం గురించీ ఈ విషయాలు విన్నాక, నేను చాలా కలత చెందాను. నేను కూర్చుండి విలపించాను. నా విచారానికి అవధి లేకపోయింది. నేను కొన్ని రోజులపాటు ఉపవాసం వుండి, పరలోక దేవునికి ప్రార్థనలు చేశాను. తర్వాత ఈ క్రింది ప్రార్థన చేశాను: పరలోక దేవా, యెహోవా ప్రభూ, నీవు అత్యంత శక్తిశాలివైన మహా దేవుడివి. నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలు పాటించే మనుష్యులను నీవు కటాక్షించి వారితో ప్రేమ ఒడంబడికను అమలుపరుస్తావు. దయచేసి నీవు కళ్లు తెరిచి, చెవులొగ్గి ఈ నీ సేవకుడు రాత్రింబగళ్లు నీ సన్నిధియందు చేస్తున్న ప్రార్థనలను విను. నేను నీ సేవకులైన ఇశ్రాయేలీయుల కోసం ప్రార్థిస్తున్నాను. మేము నీకు వ్యతిరేకంగా పాపాలు చేశామన్న విషయాన్ని నేను ఒప్పుకొంటున్నాను. నేనూ, నా తండ్రి కుటుంబంలోని ఇతరులూ నీకు వ్యతిరేకంగా పాపం చేశామని ఒప్పుకొంటున్నాను. ఇశ్రాయేలు ప్రజలమైన మేము నీపట్ల చాలా చెడుగా వ్యవహరించాము. నీవు నీ సేవకుడైన మోషే ద్వారా యిచ్చిన ఆజ్ఞలనూ, బోధనలనూ, విధులనూ మేము తృణీకరించాము. నీవు నీ సేవకుడైన మోషేకి ఇచ్చిన ఉపదేశాన్ని దయచేసి గుర్తుచేసుకొనుము. దేవా, నీవు అతనికి “మీ ఇశ్రాయేలు ప్రజలు విశ్వసనీయంగా వ్యవహరించక పోయినట్లయితే, మిమ్మల్ని యితర దేశాల మధ్యకు చెదరగొడ్తాను. అలాకాక, మీ ఇశ్రాయేలీయులు నా వద్దకు తిరిగి వచ్చి, నా ఆదేశాలను పాటించినట్లయితే, అప్పుడు నేనిలా చేస్తాను: మీ ప్రజలు తమ ఇళ్లు వాకిళ్లు వదలటానికి బలవంతం చేయబడినా, భూలోకపు అంచులదాకా పోయినా సరే, నేను వాళ్లని అక్కడనుంచి తిరిగి ఒక్కచోట చేరుస్తాను. ఎక్కడైతే నా నామాన్ని ఉంచుటకు ఏర్పాటు చేసుకున్నానో అక్కడికి తిరిగి వాళ్లని నేను తీసుకొస్తాను” అని చెప్పావు. ఇశ్రాయేలు ప్రజలు నీ సేవకులు, నీ ప్రజలు. నీవు నీ గొప్ప శక్తిని వినియోగించి, వాళ్లని విడిపించావు. కాబట్టి ప్రభువా, నా ప్రార్థన ఆలకించు. నేను నీ దాసుడను. నీ నామం పట్ల గౌరవం ప్రదర్శించాలని ఇష్టపడే నీ సేవకుల ప్రార్థనలు దయచేసి ఆలకించు. ప్రభూ, నేను రాజుకి ద్రాక్షారసం అందించే సేవకుణ్ణి. ఈ విషయం నీకు తెలుసు. అందుకని దేవా, నాకు ఈ నాడు సహాయం చెయ్యి. నేను రాజు సహాయాన్ని అర్థిస్తున్నాను. ఈ నా ప్రయత్నంలో నాకు విజయం చేకూర్చు. రాజుకు నా పట్ల అభిమానం కలిగేలా చెయ్యి.
నెహెమ్యా 1:4-11 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి యేడ్చి, కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి, ఆకాశమందలి దేవుని యెదుట విజ్ఞాపన చేసితిని. ఎట్లనగా–ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడవైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా, నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలీయుల పక్షముగా నేనుచేయు ప్రార్థన అంగీ కరించుము. నీకు విరోధముగ పాపముచేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నేనును నా తండ్రి యింటివారును పాపము చేసియున్నాము. నీ యెదుట బహు అసహ్యముగా ప్రవర్తించితిమి, నీ సేవకుడైన మోషేచేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలనైనను కట్టడలనైనను విధులనైనను మేము గైకొనక పోతిమి. నీ సేవకుడైన మోషేతో నీవు సెలవిచ్చినమాటను జ్ఞాపకము తెచ్చుకొనుము; అదేదనగా–మీరు అపరాధము చేసినయెడల జనులలోనికి మిమ్మును చెదర గొట్టుదును. అయితే మీరు నావైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించి నడిచినయెడల, భూదిగంతములవరకు మీరు తోలివేయబడినను అక్కడ నుండి సహా మిమ్మునుకూర్చి, నా నామము ఉంచుటకు నేను ఏర్పరచుకొనిన స్థలమునకు మిమ్మును రప్పించెదనని నీవు సెలవిచ్చితివి గదా. చిత్తగించుము, నీవు నీ మహా ప్రభావమును చూపి, నీ బాహుబలముచేత విడిపించిన నీ దాసులగు నీ జనులు వీరే. యెహోవా చెవియొగ్గి నీ దాసుడనైన నా మొఱ్ఱను, నీ నామమును భయభక్తులతో ఘనపరచుటయందు ఆనందించు నీ దాసుల మొఱ్ఱను ఆలకించి, ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరచి, ఈ మనుష్యుడు నాయందు దయచూపునట్లు అనుగ్రహించుమని నిన్ను బతిమాలుకొనుచున్నాను, అని ప్రార్థించితిని. నేను రాజునకు గిన్నె అందించువాడనై యుంటిని.