నహూము 3:1-19
నహూము 3:1-19 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
నరహత్య చేసిన పట్టణమా, నీకు బాధ తప్పదు. అది నిరంతరం అబద్ధాలతో దొంగిలించి తెచ్చిన వస్తువులతో నిండి ఉంది. దాని చేతుల్లో హతమైన వారు దానిలో ఉన్నారు. రథసారధి చేసే కొరడా శబ్దం, రథ చక్రాల ధ్వని, గుర్రాల అడుగుల శబ్దం, వేగంగా పరిగెత్తే రథాల శబ్దం వినబడుతున్నాయి. రౌతులు వేగంగా పరుగెత్తుతున్నారు, కత్తులు, ఈటెలు తళతళ మెరుస్తున్నాయి. శవాలు కుప్పలుగా పడి ఉన్నాయి. కూలిన శవాలకు లెక్కే లేదు, శవాలు కాళ్ళకు తగిలి దాడి చేసే వారు తొట్రుపడుతున్నారు. ఇందుకు కారణం, అది మంత్ర విద్యలో ఆరితేరిన అందమైన వేశ్య జరిగించిన కామ క్రీడలే. ఆమె తన జారత్వంతో జాతులను అమ్మేసింది. తన ఇంద్రజాలంతో మనుషులను వశపరచుకుంది. సేనల ప్రభువు యెహోవా చెప్పేదేమిటంటే “నేను నీకు విరోధిని. నీ బట్టలు నీ ముఖం పైకి ఎత్తి ప్రజలకు నీ మర్మాంగాలను చూపిస్తాను. రాజ్యాలకు నీ అవమానాన్ని బట్టబయలు చేస్తాను. నీ ముఖంపై పెంట విసిరి చూసేవారు నిన్ను ఏవగించుకునేలా చేస్తాను. అప్పుడు నిన్ను చూసేవారంతా నీ దగ్గర నుండి పారిపోతారు. ‘నీనెవె పాడైపోయింది. దాని కోసం ఎవరు విలపిస్తారు? నిన్ను ఓదార్చేవాళ్ళు ఎక్కడ దొరుకుతారు’ అంటారు.” చుట్టూ నీటితో సముద్రాన్నే తనకు కావలిగా, సరిహద్దుగా చేసుకుని, నైలు నది దగ్గర ఉన్న తేబేసు పట్టణం కంటే నువ్వు గొప్పదానివా? ఇతియోపియా, ఈజిప్టు దేశాలు దానికి అండ. పూతు, లిబియా దాని మిత్ర పక్షాలు. అయినప్పటికీ దాని నివాసులు బందీలయ్యారు. పురవీధుల్లో శత్రువులు దానిలోని చిన్నపిల్లలను బండలకు కొట్టి చంపారు. ప్రముఖుల మీద చీట్లు వేశారు, దాని ప్రధానులనందరినీ సంకెళ్లతో బంధించారు. నీకు కూడా మత్తు ఎక్కుతుంది. నువ్వు దాక్కుంటావు. నీ మీదికి శత్రువు రావడం చూసి ఆశ్రయం కోసం వెదకుతావు. అయితే నీ కోటలన్నీ అకాలంలో పండిన కాయలున్న అంజూరపు చెట్లలాగా ఉన్నాయి. ఎవరైనా ఒకడు వాటిని ఊపితే చాలు, పండ్లు తిందామని వచ్చినవాడి నోట్లో పడతాయి. నీ నివాసులు స్త్రీల వంటి వారు. నీ దేశపు ద్వారాలు శత్రువులకు తెరిచి ఉన్నాయి. ద్వారాల అడ్డకర్రలు కాలిపోయాయి. వారు ముట్టడించే సమయానికి నీళ్లు చేదుకో. నీ కోటలను దిట్టపరచుకో. బంకమట్టిలోకి దిగి ఇటుకల కోసం బురద తొక్కు. కొలిమి సిద్ధం చేసుకో. అక్కడే నిన్ను అగ్ని కాల్చివేస్తుంది. కత్తివాత పడి నువ్వు నాశనం అవుతావు. గొంగళిపురుగు తినివేసే విధంగా అది నిన్ను నాశనం చేస్తుంది. గొంగళిపురుగులంత విస్తారంగా, మిడతలంత విస్తారంగా నీ సంఖ్యను పెంచుకో. నీ వర్తకుల సంఖ్య లెక్కకు ఆకాశ నక్షత్రాలకంటే ఎక్కువగా ఉన్నప్పటికీ వాళ్ళు మిడతల్లాగా వచ్చి దోచుకుని ఎగిరిపోతారు. నీ వీరులు లెక్కకు మిడతలంత విస్తారంగా ఉన్నారు. నీ సేనానులు చలికాలంలో కంచెల్లో దిగిన మిడతల్లాగా ఉన్నారు. ఎండ కాసినప్పుడు అవన్నీ ఎగిరిపోతాయి. అవి ఎక్కడికి వెళ్లి వాలతాయో ఎవరికీ తెలియదు. అష్షూరు రాజా, నీ సంరక్షకులు నిద్రపోయారు. నీ ప్రధానులు విశ్రాంతిలో ఉన్నారు. నీ ప్రజలు పర్వతాల్లోకి చెదరిపోయారు. వారిని తిరిగి సమకూర్చేవాడు ఒక్కడు కూడా లేదు. నీకు తగిలిన దెబ్బ తీవ్రమైనది. నీ గాయాన్ని ఎవ్వరూ బాగు చెయ్యలేరు. నిన్ను గూర్చిన వార్త విన్న వాళ్ళంతా నీకు జరిగిన దానికి సంతోషంతో చప్పట్లు కొడతారు. ఎందుకంటే ప్రజలంతా నీచేత ఎడతెగకుండా హింసల పాలయ్యారు.
నహూము 3:1-19 పవిత్ర బైబిల్ (TERV)
ఆ హంతకుల నగరానికి చాలా కీడు మూడుతుంది. నీనెవె నగరం అబద్ధాల పుట్ట. ఇతర దేశాలనుండి దోచుకున్న వస్తువులతో అది నిండివుంది. అది వెంటాడి చంపిన అనేకమందితో అది నిండివుంది! కొరడా ఝళిపింపుల ధ్వని, చక్రాల సవ్వడి, స్వారీ గుర్రాల గిట్టల ధ్వనులు, ఎగిరిపడే రథాల చప్పుడు నీవు వినవచ్చు! అశ్వదళం వారు దాడి చేస్తున్నారు. వారి కత్తులు మెరుస్తున్నాయి. వారి ఈటెలు తళుక్కుమంటున్నాయి! అక్కడ ఎంతోమంది చనిపోయారు. శవాలు గుట్టలుగా పడి ఉన్నాయి. శవాలు లెక్కకు మించి వున్నాయి. శవాలకు అడ్డంపడి ప్రజలు తొట్రిల్లుతున్నారు. నీనెవె మూలంగా ఇవన్నీ జరిగాయి. తృప్తి చెందని వేశ్యలా నీనెవె ఉంది. ఆమె మరింతమందిని కోరుకుంది. తనను తాను అనేక జనులకు అమ్ముకుంది. వారిని తన బానిసలుగా చేసుకోటానికి ఆమె తన మంత్ర విద్యలను ఉపయోగించింది. సర్వశక్తిమంతుడైన యెహోవా ఇలా చెపుతున్నాడు: “నీనెవె, నీకు నేను విరోధిని. నీ బట్టలను నీ ముఖంమీదకి లాగుతాను. నీ నగ్నత్వాన్ని రాజ్యాలన్నిటికీ చూపిస్తాను. ఆ రాజ్యాలన్నీ నీవు సిగ్గుపడటం చూస్తాయి. నీ మీదకు మురికి వస్తువులు విసురుతాను. నిన్ను ఏహ్యభావంతో చూస్తాను. ప్రజలు నీవంక చూసి నవ్వుతారు. నిన్ను చూసిన ప్రతి ఒక్కడూ పారిపోతాడు. ‘నీనెవె నాశనమయ్యింది. ఆమెను గురించి ఏడ్చేవారెవరు?’ అని వారు అంటారు. నీనెవె, నిన్ను ఓదార్చే వారెవ్వరినీ నేను చూడలేనని నాకు తెలుసు.” నీనెవే, నైలు నది మీద వున్న తేబేస్ (నో-అమోను) నగరం కంటే నీవు మెరుగైన దానవా? కాదు! తేబేస్ చుట్టూ కూడ నీరువుంది. తేబేస్ ఆ నీటిని శత్రువుల నుండి తనను తాను కాపాడుకోటానికి వినియోగించుకొనేది. ఆమె ఆ నీటిని ఒక గోడలా కూడా వినియోగించుకొనేది! కూషీయులును, ఈజిప్టు వారును తేబేస్‌కు మంచి బలాన్నిచ్చారు. పూతు వారు, లూబీయులు ఆమెకు మద్దతు ఇచ్చారు. అయినా తేబేస్ ఓడింపబడింది. ఆమె ప్రజలు పరదేశానికి బందీలుగా పట్టుకుపోబడ్డారు. ప్రతీ వీధి మూలా సైనికులు ఆమె పిల్లలను చావగొట్టారు. ముఖ్యులైన ప్రజలను ఎవరు బానిసలుగా ఉంచుకోవాలి అనే విషయంలో వారు చీట్లు వేశారు. తేబేస్‌లో ప్రముఖులైన వారందరికీ వారు సంకెళ్లు వేశారు. కావున నీనెవే, నీవు కూడా తాగినవానిలా పడిపోతావు! నీవు దాగటానికి ప్రయత్నిస్తావు. శత్రువుకు దూరంగా ఒక సురక్షిత ప్రదేశం కొరకు నీవు చూస్తావు. కాని నీనెవే, నీ దుర్గాలన్నీ అంజూరపు చెట్లలా ఉంటాయి. కొత్త అంజూరపు కాయలు పండుతాయి. ఒకడు వచ్చి, చెట్టును కుదుపుతాడు. అంజూరపు పండ్లు వాని నోట పడతాయి. అతడు వాటిని తింటాడు. అవి అయిపోతాయి! నీనెవే, నీ ప్రజలంతా స్త్రీలవలె ఉన్నారు. శత్రు సైనికులు వారిని పట్టుకు పోవటానికి సిద్ధంగా ఉన్నారు. నీ శత్రువులు లోనికి రావటానికి అనువుగా నీ దేశపు ద్వారాలు పూర్తిగా తెరవబడి ఉన్నాయి. ద్వారాలకు అడ్డంగా వున్న కర్రపట్టీలను అగ్ని కాల్చివేసింది. నీరు తెచ్చి దానిని నీ నగరం లోపల నిలువ చెయ్యి. ఎందుకంటే, శత్రు సైనికులు నీ నగరాన్ని చుట్టుముట్టుతారు. వారు ఎవ్వరినీ నగరంలోకి ఆహారాన్ని, నీటిని తీసుకు రానివ్వరు. నీ కోటలను పటిష్ఠ పర్చుకో! ఇటుకలు విస్తారంగా చేయటానికి బంక మట్టిని తీసుకొనిరా! సున్నము, గచ్చు కలుపు! ఇటుకలు చేయటానికి అచ్చులు తీసుకొనిరా! నీవు ఆ పనులన్నీ చేయవచ్చు. కాని, అగ్ని నిన్ను పూర్తిగా నాశనం చేసి వేస్తుంది! మరియు కత్తి నిన్ను హతమార్చుతుంది. మిడుతల దండు వచ్చి సమస్తాన్ని తినివేసినట్లు నీ దేశం కన్పిస్తుంది. నీనెవే, నీవు మిక్కిలిగా పెరిగావు. నీవు మిడుతల దండులా వున్నావు. వివిధ ప్రాంతాలకు వెళ్లి సరుకులు కొని వ్యాపారం చేసే వర్తకులు నీకు అనేక మంది ఉన్నారు. ఆకాశంలో ఎన్ని నక్షత్రాలున్నాయో వారు అంతమంది ఉన్నారు! దండులా వచ్చి సర్వాన్ని తినివేసే మిడుతల్లా వారున్నారు. మరియు నీ ప్రభు త్వాధికారులుకూడ మిడుతల్లా వున్నారు. చలిగా ఉన్నలరోజున రాతిగోడపై కుదురుకున్న మిడుతల్లా వారున్నారు. కాని సూర్యుడు పైకి వచ్చినప్పుడు రాళ్లు వేడెక్కగా మిడుతలు ఎగిరిపోతాయి. పైగా అవి ఎక్కడికి పోతాయో ఎవ్వరికీ తెలియదు! నీ అధికారులు కూడా అలానే వుంటారు. అష్షూరు రాజా, నీ గొర్రెల కాపరులు (నాయకులు) నిద్రకుపడ్డారు. శక్తివంతులగు ఆ మనుష్యులు నిద్రిస్తున్నారు. ఇప్పుడు నీ గొర్రెలు (ప్రజలు) పర్వతాలపై చెదిరిపోయాయి. వాటిని మరల్చుకొని వచ్చేవాడు ఎవ్వడూ లేడు. నీనెవే, నీవు తీవ్రంగా దెబ్బతిన్నావు. నీ గాయాన్ని ఏదీ మాన్పలేదు. నీ వినాశాన్ని గురించి విన్న ప్రతివాడూ చప్పట్లు చరుస్తాడు. వారంతా సంతోషంగా ఉంటారు! ఎందుకంటే, నీవు ఎల్లప్పుడూ కలుగజేసిన బాధను వారంతా అనుభవించారు!
నహూము 3:1-19 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
నరహత్య చేసిన పట్టణమా, నీకు శ్రమ; అది ఎడతెగక యెర పట్టుకొనుచు మోసముతోను బలాత్కారముతోను నిండియున్నది. సారధియొక్క చబుకు ధ్వనియు చక్రములధ్వనియు గుఱ్ఱముల త్రొక్కుడు ధ్వనియు వడిగా పరుగెత్తు రథములధ్వనియు వినబడుచున్నవి. రౌతులు వడిగా పరుగెత్తుచున్నారు, ఖడ్గములు తళతళలాడుచున్నవి, ఈటెలు మెరయుచున్నవి, చాలమంది హతమవుచున్నారు; చచ్చినవారు కుప్పలు కుప్పలుగా పడియున్నారు; పీనుగులకు లెక్కయే లేదు, పీనుగులు కాలికి తగిలి జనులు తొట్రిల్లుచున్నారు. చక్కనిదానవై వేశ్యవై చిల్లంగి తనమందు జ్ఞానముగల దానవై జారత్వముచేసి జనాంగములమీద చిల్లంగితనము జరిగించి సంసారములను అమ్మివేసినదానా, నీవు చేసిన అధిక జారత్వమునుబట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు ఇదే–నేను నీకు విరోధినైయున్నాను, నీ చెంగులు నీ ముఖముమీద కెత్తి జనములకు నీ మానమును రాజ్యములకు నీ యవమానమును నేను బయలుపరతును. పదిమంది యెదుట నీమీద మాలిన్యమువేసి నిన్ను అవమానపరచెదను. అప్పుడు నిన్ను చూచువారందరు నీయొద్ద నుండి పారిపోయి–నీనెవె పాడైపోయెనే, దానికొరకు అంగలార్చువారెవరు? నిన్ను ఓదార్చు వారిని ఎక్కడ నుండి పిలుచుకొని వచ్చెదము అందురు. సముద్రమే తనకు ఆపుగాను సముద్రమే తనకు ప్రాకారముగాను చేసికొని, బహుజనములచేత చుట్టబడి నైలునది దగ్గర నుండిన నోఅమోను పట్టణముకంటె నీవు విశేషమైన దానవా? కూషీయులును ఐగుప్తీయులును దాని శూరులైరి, వారు విస్తార జనముగా నుండిరి, పూతువారును లూబీయులును నీకు సహాయులై యుండిరి. అయినను అది చెరపట్టబడి కొనిపోబడెను, రాజమార్గముల మొగలయందు శత్రువులు దానిలోని చిన్నపిల్లలను బండలకువేసి కొట్టి చంపిరి, దాని ఘనులమీద చీట్లువేసి దాని ప్రధానుల నందరిని సంకెళ్లతో బంధించిరి. నీవును మత్తురాలవై దాగుకొందువు, శత్రువు వచ్చుట చూచి ఆశ్రయదుర్గము వెదకుదువు. అయితే నీ కోటలన్నియు అకాలపు పండ్లు గల అంజూరపు చెట్లవలె ఉన్నవి; ఒకడు వాటిని కదిలింపగానే పండ్లు తినవచ్చినవానినోట పడును; నీ జనులు స్త్రీలవంటివారైరి, నీ శత్రువులు చొచ్చునట్లు నీ దేశపు గవునుల అడ్డకఱ్ఱలు తీయబడియున్నవి, అగ్ని నీ అడ్డగడియలను కాల్చుచున్నది. ముట్టడివేయు కాలమునకు నీళ్లు చేదుకొనుము, నీ కోటలను బలపరచుము, జిగట మంటిలోనికి దిగి యిటుకల బురదను త్రొక్కుము, ఆవములను సిద్ధపరచుము. అచ్చటనే అగ్ని నిన్ను కాల్చివేయును, ఖడ్గము నిన్ను నాశనముచేయును, గొంగళిపురుగు తినివేయురీతిగా అది నిన్ను తినివేయును, నీవు సంఖ్యకు గొంగళిపురుగులంత విస్తారముగాను మిడుతలంత విస్తారముగాను ఉండుము. నీ వర్తకులు లెక్కకు ఆకాశ నక్షత్రములకంటె ఎక్కువగానున్నను గొంగళి పురుగు వచ్చి అంతయు నాకివేసి యెగిరిపోయెను. నీవు ఏర్పరచిన శూరులు మిడుతలంత విస్తారముగా నున్నారు, నీ సైనికులు చలికాలమందు కంచెలలో దిగిన గొంగళి పురుగులవలె నున్నారు. ఎండకాయగా అవి యెగిరి పోవును, అవి ఎక్కడ వాలినది ఎవరికిని తెలియదు. అష్షూరు రాజా, నీ కాపరులు నిద్రపోయిరి, నీ ప్రధానులు పండుకొనిరి, నీ జనులు పర్వతములమీద చెదరి పోయిరి, వారిని సమకూర్చువాడొకడును లేడు. నీకు తగిలిన దెబ్బ బహు చెడ్డది, నీ గాయమునకు చికిత్స ఎవడును చేయజాలడు, జనులందరు ఎడతెగక నీచేత హింసనొందిరి, నిన్నుగూర్చిన వార్త వినువారందరు నీ విషయమై చప్పట్లు కొట్టుదురు.
నహూము 3:1-19 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
అబద్ధాలతో దోపిడీతో నిండి ఉన్న, హంతకుల పట్టణానికి శ్రమ! నిత్యం బాధితులు ఉండే, రక్తపు పట్టణానికి శ్రమ! కొరడాల ధ్వని, చక్రాల మోత, పరుగెడుతున్న గుర్రపు డెక్కల శబ్దం వేగంగా పరుగెడుతున్న రథాల ధ్వని వినబడుతుంది! రౌతులు ముందుకు దూసుకువెళ్తుండగా, వారి ఖడ్గాలు మెరుస్తున్నాయి, వారి ఈటెలు తళతళ మెరుస్తున్నాయి! ఎంతో ప్రాణనష్టం జరుగుతుంది, మృతులు కుప్పలుగా పడి ఉన్నారు, మృతదేహాలకు లెక్క లేదు, మృతదేహాలు తగిలి ప్రజలు తడబడుతున్నారు. తన మంత్రవిద్య ద్వారా ప్రజలను, తన వ్యభిచారం ద్వారా దేశాలను బానిసలుగా మార్చిన వేశ్య; మంత్రగత్తెల యజమానురాలు ఇదంతా చేసింది. సైన్యాల యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు, “నేను నీకు వ్యతిరేకిని, నేను నీ వస్త్రాలను నీ ముఖం మీదుగా ఎత్తి, దేశాలకు నీ నగ్నత్వాన్ని రాజ్యాలకు నీ అవమానాన్ని చూపిస్తాను. నీ మీదికి హేయమైనది విసిరి, అందరి ముందు, నిన్ను అవమానిస్తాను. నిన్ను చూసేవారందరూ నీ నుండి పారిపోయి, ‘నీనెవె శిథిలావస్థలో ఉంది, ఆమె కోసం ఎవరు దుఃఖిస్తారు?’ నిన్ను ఓదార్చేవారిని నేను ఎక్కడి నుండి తీసుకురాగలం?” అని అంటారు. నైలు నది దగ్గర ఉండి, చుట్టూ నీళ్లు ఉన్న, తేబేసు కంటే మేలైనదానివా? ఆ నది ఆమెకు రక్షణ, ఆ నీళ్లు ఆమెకు గోడ. కూషు, ఈజిప్టు ఆమెకు అపరిమితమైన బలం; పూతు, లిబియా ఆమెకు మిత్రరాజ్యాలు. అయినప్పటికీ ఆమెను బందీగా తీసుకెళ్లారు. ప్రతి వీధి మూలలో దాని పసిపిల్లల్ని ముక్కలు చేశారు. దాని అధిపతుల కోసం చీట్లు వేశారు, దాని ఘనులందరిని సంకెళ్ళతో బంధించారు. నీకు కూడా మత్తు ఎక్కుతుంది; నీవు వెళ్లి దాక్కుని శత్రువు నుండి కాపాడుకోడానికి ఆశ్రయాన్ని వెదకుతావు. నీ కోటలన్నీ మొదట పండిన పండ్లతో ఉన్న అంజూరపు చెట్లలా ఉన్నాయి; అవి కదిలించబడినప్పుడు, తినే వారి నోటిలో అంజూరపు పండ్లు పడతాయి. నీ సైన్యాన్ని చూడు, వారంతా బలహీనులు. నీ దేశపు ద్వారాలు నీ శత్రువులకు విశాలంగా తెరిచి ఉన్నాయి; అగ్ని నీ ద్వారబంధాలను కాల్చివేసింది. ముట్టడివేసే సమయానికి నీళ్లు తోడుకో, నీ కోటలను బలపరచుకో! బురదలోకి దిగు, ఇటుకలు తయారుచేయడానికి బురదను త్రొక్కు, ఇటుక బట్టీలను సిద్ధపరచు. అక్కడ అగ్ని నిన్ను కాల్చివేస్తుంది; ఖడ్గం నిన్ను నరికివేస్తుంది, మిడతల గుంపులా అవి నిన్ను మ్రింగివేస్తాయి. గొంగళిపురుగుల్లా విస్తరించు, మిడతలంత విస్తారంగా నీ సంఖ్యను పెంచుకో! ఆకాశంలోని నక్షత్రాల కంటే మీ వ్యాపారుల సంఖ్యను ఎక్కువగా ఉన్నప్పటికీ, మిడతల్లా వారు దేశాన్ని దోచుకుని ఎగిరిపోతారు. మీ కావలివారు మిడతల్లా ఉన్నారు, మీ అధికారులు మిడతల గుంపులా ఉన్నారు. అవి చలికాలంలో గోడల మీద ఉండి ఎండ రాగానే ఎగిరిపోతాయి. అవి ఎక్కడికి వెళ్తాయో ఎవరికీ తెలియదు. అష్షూరు రాజా, మీ కాపరులు నిద్రపోతున్నారు; మీ అధిపతులు విశ్రాంతి తీసుకోవడానికి పడుకున్నారు. మీ ప్రజలు పర్వతాలమీద చెదరిపోయారు. ఏదీ నిన్ను స్వస్థపరచలేదు; మీ గాయం ప్రాణాంతకమైనది. మీ గురించిన వార్త విన్నవారందరు మీ పతనాన్ని చూసి చప్పట్లు కొడతారు, ఎందుకంటే ప్రజలందరూ మీ అంతులేని క్రూరత్వాన్ని నీ క్రూరమైన హింసను అనుభవించిన వారే.