మార్కు 8:27-31

మార్కు 8:27-31 తెలుగు సమకాలీన అనువాదము (TCV)

యేసు, ఆయన శిష్యులు కైసరయ ఫిలిప్పు చుట్టూ ఉన్న గ్రామాలకు వెళ్లారు. మార్గం మధ్యలో ఆయన వారిని “నేను ఎవరినని ప్రజలు చెప్పుకుంటున్నారు?” అని అడిగారు. అందుకు వారు, “కొందరు బాప్తిస్మమిచ్చే యోహాను అంటున్నారు; ఇతరులు ఏలీయా అంటున్నారు; మరికొందరు ప్రవక్తలలో ఒకడు అని చెప్పుకొంటున్నారు” అన్నారు. ఆయన వారిని, “అయితే నేనెవరినని మీరనుకొంటున్నారు?” అని అడిగారు. పేతురు, “నీవు క్రీస్తువు” అని చెప్పాడు. అప్పుడు యేసు తన గురించి ఎవరితో చెప్పవద్దని వారిని హెచ్చరించారు. ఆ తర్వాత యేసు, మనుష్యకుమారుడు యూదా నాయకులచే, ముఖ్య యాజకులచే, ధర్మశాస్త్ర ఉపదేశకులచే తిరస్కరించబడి, అనేక హింసలు పొంది, చంపబడి, మూడు రోజుల తర్వాత తిరిగి లేస్తాడు అని తన శిష్యులకు బోధించడం మొదలుపెట్టారు.

షేర్ చేయి
Read మార్కు 8

మార్కు 8:27-31 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

యేసు ఆయన శిష్యులతో కలిసి ఫిలిప్పు కైసరయ పట్టణం చుట్టూ ఉన్న గ్రామాలకు వెళ్ళాడు. దారిలో ఆయన, “నేను ఎవరినని ప్రజలు చెప్పుకుంటున్నారు? అని తన శిష్యులను అడిగాడు. అందుకు వారు, “బాప్తిసం ఇచ్చే యోహానని కొందరూ, ఏలీయా అని కొందరూ, ప్రవక్తల్లో ఒకడు అని కొందరూ అంటున్నారు” అని చెప్పారు. “అయితే మీరు నేనెవరినని అనుకుంటున్నారు?” అని ఆయన వారిని అడిగాడు. దానికి జవాబుగా పేతురు, “నీవు అభిషిక్తుడివి!” అన్నాడు. అప్పుడు ఆయన తనను గురించి ఎవ్వరికీ చెప్పవద్దని వారిని హెచ్చరించాడు. ఆ తరువాత యేసు వారితో ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టాడు, “మనుష్య కుమారుడు ఎన్నో కష్టాలు భరిస్తాడు. పెద్దలు, ముఖ్య యాజకులు, ధర్మశాస్త్ర పండితులచే ఆయన తృణీకారానికి గురై మరణమౌతాడు. ఆయన మూడు రోజుల తరువాత సజీవంగా బ్రతికి వస్తాడు.”

షేర్ చేయి
Read మార్కు 8

మార్కు 8:27-31 పవిత్ర బైబిల్ (TERV)

యేసు తన శిష్యులతో కలిసి, కైసరయ ఫిలిప్పి పట్టణానికి చుట్టూవున్న పల్లెలకు వెళ్ళాడు. దారిలో యేసు వాళ్ళతో, “ప్రజలు నేనెవరని అనుకొంటున్నారు?” అని అడిగాడు. వాళ్ళు, “బాప్తిస్మము నిచ్చే యోహాను అని కొందరు, ఏలీయా అని కొందరు, ప్రవక్తలలో ఒకడై ఉండవచ్చని మరికొందరు అంటున్నారు” అని సమాధానం చెప్పారు. “మరి మీ సంగతేమిటి? మీరేమంటారు?” అని అడిగాడు. పేతురు, “మీరే క్రీస్తు” అని సమాధానం చెప్పాడు. తనను గురించి ఎవ్వరికి చెప్పవద్దని వాళ్ళను హెచ్చరించాడు. ఆ తదుపరి యేసు వాళ్ళకు ఈ విధంగా చెప్పటం మొదలుపెట్టాడు: “మనుష్య కుమారుడు కష్టాలు అనుభవిస్తాడు. పెద్దలు, ప్రధానయాజకులు, శాస్త్రులు, ఆయన్ని తృణీకరిస్తారు. ఆయన చంపబడి మూడు రోజుల తర్వాత మళ్ళీ బ్రతికివస్తాడు.”

షేర్ చేయి
Read మార్కు 8

మార్కు 8:27-31 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

యేసు తన శిష్యులతో ఫిలిప్పుదైన కైసరయతో చేరిన గ్రామములకు బయలుదేరెను. మార్గములోనుండగా– నేను ఎవడనని జనులు చెప్పుచున్నారని తన శిష్యుల నడిగెను. అందుకు వారు–కొందరు బాప్తిస్మమిచ్చు యోహాను అనియు, కొందరు ఏలీయా అనియు, మరి కొందరు ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారనిరి. అందుకాయన–మీరైతే నేను ఎవడని చెప్పుచున్నారని వారినడుగగా పేతురు–నీవు క్రీస్తువని ఆయనతో చెప్పెను. అప్పుడు తన్నుగూర్చిన యీ సంగతి ఎవనితోను చెప్పవద్దని ఆయన వారికి ఖండితముగా చెప్పెను. మరియు మనుష్యకుమారుడు అనేక హింసలుపొంది, పెద్దలచేతను ప్రధానయాజకులచేతను శాస్త్రులచేతను ఉపేక్షింపబడి చంపబడి, మూడుదినములైన తరువాత లేచుట అగత్యమని ఆయన వారికి బోధింప నారంభించెను.

షేర్ చేయి
Read మార్కు 8