మార్కు 7:6-13
మార్కు 7:6-13 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
అందుకు ఆయన వారితో, వేషధారులారా, మీ గురించి యెషయా ప్రవచించింది నిజమే; అక్కడ వ్రాయబడి ఉన్నట్లు: “ ‘ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరుస్తారు కాని వారి హృదయాలు నాకు దూరంగా ఉన్నాయి. వారు వ్యర్థముగా నన్ను ఆరాధిస్తున్నారు; వారి బోధలు కేవలం మానవ నియమాలు మాత్రమే.’ మీరు దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను పాటించడం విడిచిపెట్టి మానవ ఆచారాలకు కట్టుబడి ఉన్నారు” అన్నారు. ఆయన ఇంకా మాట్లాడుతూ, “మీరు మీ స్వంత సంప్రదాయాలను పాటించడం కొరకు దేవుని ఆజ్ఞలను పూర్తిగా ప్రక్కకు పెట్టేస్తున్నారు! మోషే, ‘మీ తల్లిదండ్రులను గౌరవించాలి’ మరియు ‘ఎవరైనా తల్లిని గాని తండ్రిని గాని శపిస్తే, వారికి మరణశిక్ష విధించాలి’ అని ఆజ్ఞాపించాడు. కానీ మీరు, ఒక వ్యక్తి తన తల్లితో గాని తండ్రితో గాని నా వల్ల మీరు పొందదగిన సహాయమంతా కొర్బాన్ (అంటే దైవార్పితం) అని చెప్తే, వాడు తన తండ్రికి తల్లికి ఏమి చేయనక్కరలేదు అని చెప్తున్నారు. ఈ విధంగా మీరు నియమించుకొన్న మీ సాంప్రదాయం వలన దేవుని వాక్యాన్ని అర్థం లేనిదానిగా చేస్తున్నారు. ఇలాంటివి ఇంకా ఎన్నో మీరు చేస్తున్నారు” అని చెప్పారు.
మార్కు 7:6-13 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
యేసు వారితో, “‘ఈ ప్రజలు మాటలతో నన్ను గౌరవిస్తారు కాని, వారి హృదయం నాకు చాలా దూరంగా ఉంది. వారు మానవ కల్పితమైన నియమాలను దేవుని ఉపదేశంగా బోధిస్తారు కాబట్టి వారి ఆరాధన వ్యర్థం,’ అని కపట వేషధారులైన మిమ్మల్ని గురించి యెషయా ప్రవక్త ముందుగా పలికింది సరైనదే! మీరు దేవుని ఆజ్ఞలను తోసిపుచ్చి మనుషుల సంప్రదాయాలకు కట్టుబడుతున్నారు. మీ సంప్రదాయాలను పాటించడం కోసం దేవుని ఆజ్ఞలను మీరడంలో మీరు సిద్ధహస్తులు. మోషే, ‘మీ తల్లిదండ్రులను గౌరవించమనీ, తల్లిని, తండ్రిని దూషించిన వారికి శిక్ష మరణదండన’ అనీ నియమించాడు. కానీ మీరైతే, ఒక వ్యక్తి తన తల్లితో, తండ్రితో ‘నా వల్ల మీరు పొందదగిన సహాయమంతా ‘కొర్బాన్’ (అంటే దైవార్పితం)’ అని చెబితే ఇంక ఆ వ్యక్తి తన తల్లిదండ్రుల కోసం ఏమీ చేయనక్కర లేదని చెబుతారు. మీరు మీ పెద్దల సంప్రదాయాలను పాటించే నెపంతో దేవుని ఆజ్ఞ మీరుతున్నారు. ఇలాంటివి మరెన్నో మీరు చేస్తున్నారు.
మార్కు 7:6-13 పవిత్ర బైబిల్ (TERV)
యేసు సమాధానంగా, “యెషయా వేషధారులైన మిమ్మల్ని గురించి సరిగ్గా ప్రవచించాడు. అతడు తన గ్రంథంలో ఇలా ప్రవచించాడు: ‘వీళ్ళు మాటలతో నన్ను గౌరవిస్తారు. కాని వాళ్ళ హృదయాలు నాకు చాలా దూరంగా ఉన్నాయి. వాళ్ళు మానవ కల్పితమైన నియమాలను బోధిస్తారు. కనుక వాళ్ళ ఆరాధన నిరర్థకం.’ దేవుని ఆజ్ఞల్ని పాటించటం మానేసి, మానవుడు కల్పించిన ఆచారాల్ని పట్టుకొని మీరు పాటిస్తున్నారు. “మీరు దేవుని ఆజ్ఞల్ని కాదని, మీ ఆచారాలను స్థాపించటంలో ఘనులు. ఉదాహరణకు, మోషే మీ తల్లితండ్రుల్ని గౌరవించమని మరియు తల్లిని కాని, తండ్రిని కాని దూషించినవారికి మరణ దండన విధించమని ఆజ్ఞాపించాడు. కాని ఒక మనిషి దగ్గర తన తల్లితండ్రులకు సహాయం చెయ్యటానికి కొంత ధనం ఉన్నా అతడు వాళ్ళతో, అది అంటే దేవునికి అర్పితం అని అంటే, ఆ మనిషి తన తల్లి తండ్రులకు సహాయం చేయనవసరంలేదని మీరు అతణ్ణి సమర్థిస్తున్నారు. మీ పెద్దల ఆచారం దేవుని ఆజ్ఞను రద్దు చేస్తోంది. ఇలాంటివి మీరు ఎన్నో చేస్తున్నారు” అని అన్నాడు.
మార్కు 7:6-13 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
అందుకాయన వారితో ఈలాగు చెప్పెను– ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరచుదురుగాని, వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. వారు, మానవులు కల్పించిన పద్ధతులు దేవోప దేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరా ధించుదురు అని వ్రాయబడినట్టు వేషధారులైన మిమ్మునుగూర్చి యెషయా ప్రవచించినది సరియే. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి, మనుష్యుల పారంపర్యాచారమును గైకొనుచున్నారు. మరియు ఆయన–మీరు మీ పారంపర్యా చారమును గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాక రించుదురు. –నీ తలిదండ్రులను ఘనపరచవలెననియు, తండ్రినైనను తల్లినైనను దూషించువానికి మరణశిక్ష విధింపవలెననియు మోషే చెప్పెను గదా. అయినను మీరు–ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి– నావలన నీకు ప్రయోజనమగునది ఏదో అది కొర్బాను, అనగా దేవార్పితమని చెప్పినయెడల, తన తండ్రికైనను తల్లి కైనను వానిని ఏమియు చేయనియ్యక మీరు నియమించిన మీ పారంపర్యాచారమువలన దేవుని వాక్యమును నిరర్థకము చేయుదురు. ఇటువంటివి అనేకములు మీరు చేయుదురని చెప్పెను.
మార్కు 7:6-13 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
అందుకు ఆయన వారితో, “వేషధారులారా, మీ గురించి ఇలా యెషయా ప్రవచించింది నిజమే; అక్కడ వ్రాయబడి ఉన్నట్లు: “ ‘ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరుస్తారు కాని వారి హృదయాలు నాకు దూరంగా ఉన్నాయి. వారు వ్యర్థంగా నన్ను ఆరాధిస్తున్నారు; వారి బోధలు కేవలం మానవ నియమాలు మాత్రమే.’ మీరు దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను పాటించడం విడిచిపెట్టి మానవ ఆచారాలకు కట్టుబడి ఉన్నారు” అన్నారు. ఆయన ఇంకా మాట్లాడుతూ, “మీరు మీ సొంత సంప్రదాయాలను పాటించడం కోసం దేవుని ఆజ్ఞలను పూర్తిగా ప్రక్కకు పెట్టేస్తున్నారు! మోషే, ‘మీ తండ్రిని తల్లిని గౌరవించాలి’ ‘ఎవరైనా తల్లిని గాని తండ్రిని గాని శపిస్తే, వారికి మరణశిక్ష విధించాలి’ అని ఆజ్ఞాపించాడు. కానీ మీరు, ఒక వ్యక్తి తన తల్లితో గాని తండ్రితో గాని నా వల్ల మీరు పొందదగిన సహాయమంతా కొర్బాన్ (అంటే దేవునికి అంకితం) అని ప్రకటిస్తే, వాడు తన తండ్రికి తల్లికి ఏమి చేయనక్కరలేదు అని చెప్తున్నారు. ఈ విధంగా మీరు నియమించుకొన్న మీ సాంప్రదాయం వలన దేవుని వాక్యాన్ని అర్థం లేనిదానిగా చేస్తున్నారు. ఇలాంటివి ఇంకా ఎన్నో మీరు చేస్తున్నారు” అని చెప్పారు.