మార్కు 4:10-41

మార్కు 4:10-41 తెలుగు సమకాలీన అనువాదము (TCV)

ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు, ఆ పన్నెండు మందితో పాటు ఆయన చుట్టూ ఉన్న కొందరు ఉపమానాల గురించి ఆయనను అడిగారు. అందుకు ఆయన ఈ విధంగా చెప్పారు, “దేవుని రాజ్యం గురించిన మర్మానికి సంబంధించిన జ్ఞానం మీకు ఇవ్వబడింది. కాని బయటివారికి ప్రతి విషయం ఉపమాన రీతిగానే చెప్పబడింది. తద్వారా, “ ‘వారు ఎప్పుడూ చూస్తూనే ఉండవచ్చు కాని ఎన్నటికి గ్రహించరు, ఎప్పుడూ వింటూనే ఉండవచ్చు కాని ఎన్నటికి అర్థం చేసుకోరు; లేకపోతే వారు దేవుని వైపు తిరిగి పాపక్షమాపణ పొందివుండేవారు!’” తర్వాత యేసు వారితో, “మీరు ఈ ఉపమానం అర్థం చేసుకోలేదా? అలాగైతే ఇతర ఉపమానాలు ఎలా అర్థం చేసుకుంటారు? విత్తేవాడు వాక్యం విత్తుతున్నాడు. కొందరు దారి ప్రక్కన పడిన విత్తనంలాంటి వారు, అక్కడ వాక్యం విత్తబడింది. వారు వినిన వెంటనే, సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యాన్ని ఎత్తుకొని పోతాడు. మరికొందరు, రాతి నేలలో పడిన విత్తనాల వంటివారు, వారు వాక్యాన్ని విని దానిని సంతోషంతో అంగీకరిస్తారు. అయితే వారిలో వేరు లేకపోవడంతో, వారు కొంతకాలమే నిలబడతారు. వారికి వాక్యాన్ని బట్టి కష్టాలు హింసలు ఎదురైనప్పుడు, వారు త్వరగా పడిపోతారు. ఇంకా ఇతరులు ముండ్ల పొదల్లో పడిన విత్తనాల వంటివారు, వారు వాక్యాన్ని వింటారు. కాని తమ జీవితాల్లో ఎదురయ్యే తొందరలు, ధనమోసం మరియు ఇతర కోరికలు ఆ వాక్యాన్ని అణిచివేసి, ఫలించకుండా చేస్తాయి. ఇక మిగిలిన వారు, సారవంతమైన నేల మీద పడిన విత్తనాల వంటివారు, వారు వాక్యాన్ని వింటారు, దానిని అంగీకరిస్తారు, వారిలో కొందరు విత్తబడిన దానికి ముప్పైరెట్లు, కొందరు అరవైరెట్లు, మరికొందరు వందరెట్లు ఫలిస్తారు” అని చెప్పారు. ఆయన వారితో, “మీరు దీపాన్ని తెచ్చి పాత్ర క్రింద లేక మంచం క్రింద పెడతారా? దాన్ని దీపస్తంభం మీద పెట్టరా? ఎందుకంటే రహస్యంగా ఉంచబడింది బయటకు తేబడాలి, దాచిపెట్టబడింది బహిర్గతం కావాలి. వినడానికి చెవులుగలవారు విందురు గాక!” అన్నారు. ఆయన ఇంకా మాట్లాడుతూ, “మీరు వింటున్న దాన్ని జాగ్రత్తగా పరిశీలించండి, మీరు ఏ కొలతతో కొలుస్తారో, మీకు అదే కొలత లేక అంతకన్నా ఎక్కువ కొలవబడుతుంది. కలిగినవానికి మరి ఎక్కువగా ఇవ్వబడుతుంది; లేనివారి నుండి, వారు కలిగివున్నది కూడా తీసివేయబడుతుంది” అని వారితో చెప్పారు. ఆయన ఇంకా వారితో, “దేవుని రాజ్యం ఈ విధంగా ఉంటుంది. ఒక మనుష్యుడు నేల మీద విత్తనం చల్లుతాడు. పగలు రాత్రి, అతడు నిద్రపోతున్నా మేల్కొనివున్నా, అతనికి తెలియకుండానే, ఆ విత్తనం మొలిచి పెరుగుతుంది. భూమి దానంతట అదే మొదట మొలకను, తర్వాత కంకిని, అటు తర్వాత కంకి నిండా గింజలను పుట్టిస్తుంది. పంట పండినప్పుడు కోతకాలం వచ్చిందని అతడు కొడవలితో కోస్తాడు” అని చెప్పారు. ఆయన మళ్ళీ, “దేవుని రాజ్యం దేనిలా ఉంటుందని చెప్పగలం, దాన్ని వివరించడానికి ఏ ఉపమానాన్ని ఉపయోగించగలం? అది భూమిలోని విత్తనాలన్నిటి కంటే చిన్నదైన, ఒక ఆవగింజ లాంటిది. అయినాసరే అది విత్తబడినప్పుడు, అది పెరిగి, పక్షులు గూళ్ళను కట్టుకోగలిగినంత పెద్ద కొమ్మలతో తోటలోని మొక్కలన్నిటి కంటే పెద్దదిగా ఎదుగుతుంది” అన్నారు. వారు అర్థం చేసుకోగలిగినంతవరకు, ఇలాంటి అనేక ఉపమానాలతో యేసు వారితో మాట్లాడారు. ఆయన ఉపమానం లేకుండా వారికేమి చెప్పలేదు. తాను తన శిష్యులతో ఒంటరిగా ఉన్నప్పుడు, ఆయన వారికి అన్నిటిని వివరించేవారు. ఆ రోజు సాయంకాలమైనప్పుడు, ఆయన తన శిష్యులతో, “మనం సరస్సు దాటి అవతలి ఒడ్డుకు వెళ్దాం” అన్నారు. జనసమూహాన్ని విడిచిపెట్టి, ఉన్నపాటుననే, ఆయనను పడవలో తీసుకువెళ్లారు. మరికొన్ని పడవలు కూడా వారి వెంట వెళ్లాయి. అప్పుడు భయంకరమైన తుఫాను రేగి, అలలు పడవ మీద ఎగసిపడ్డాయి, పడవ నీటితో నిండిపోసాగింది. యేసు ఆ పడవ వెనుక భాగంలో, దిండు వేసుకొని నిద్రపోతున్నారు. శిష్యులు ఆయనను నిద్ర లేపి ఆయనతో, “బోధకుడా, మేము మునిగిపోతున్నా నీకు చింత లేదా?” అని అన్నారు. ఆయన లేచి గాలిని గద్దించి, అలలతో, “నిశ్శబ్దం! కదలకుండా ఉండు!” అని చెప్పారు. అప్పుడు గాలి ఆగిపోయి అక్కడ అంతా నిశ్శబ్దమయింది. ఆయన తన శిష్యులతో, “మీరు ఎందుకంతగా భయపడుతున్నారు? ఇప్పటికీ మీకు విశ్వాసం లేదా?” అన్నారు. వారు చాలా భయపడి, ఒకరితో ఒకరు, “ఈయన ఎవరు? గాలి, అలలు కూడా ఈయనకు లోబడుతున్నాయి!” అని చెప్పుకొన్నారు.

షేర్ చేయి
Read మార్కు 4

మార్కు 4:10-41 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

తరువాత ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు ఆయన పన్నెండు మంది శిష్యులు, ఆయన సన్నిహితులు కొందరు ఆ ఉదాహరణల గురించి ఆయనను అడిగారు. ఆయన వారితో, “దేవుని రాజ్యం గురించిన రహస్య సత్యం మీకు చెప్పాను. కాని బయటి వారికి ప్రతి విషయమూ ఉపమానాల రూపంలోనే లభిస్తుంది. ఎందుకంటే, వారు చూస్తూనే ఉన్నా గ్రహించకుండా ఉండాలి. వింటూ ఉన్నా అర్థం చేసుకోకుండా ఉండాలి. లేకపోతే వారు దేవుని వైపు తిరిగి పాపక్షమాపణ పొందుతారేమో.” ఆయన వారితో ఇలా అన్నాడు, “ఈ ఉపమానం మీకు అర్థం కాలేదా? అయితే మిగతా ఉపమానాలు ఎలా అర్థం చేసుకుంటారు? విత్తనాలు చల్లేవాడు చల్లేది దేవుని వాక్కు. దారి పక్కన ఉన్నవారెవరంటే, వాక్కు వారిలో పడింది గాని, వారు విన్న వెంటనే సైతాను వచ్చి వారిలో పడిన వాక్కును తీసివేస్తాడు. అలాగే కొంతమంది రాతినేల లాంటి వారు. వీళ్ళు వాక్కును విని ఆనందంతో దాన్ని స్వీకరిస్తారు. కానీ వారిలో వాక్కు లోతుగా వేరు పారని కారణంగా కష్టం, హింస కలిగితే దాన్ని వదిలివేస్తారు. కొంతమంది ముళ్ళతుప్పలు మొలిచే నేల లాంటి వారు. దేవుని వాక్కు వింటారు. కాని, జీవితంలో కలిగే చింతలు, ధనం కలిగించే మోసం, ఇతర విషయాల పట్ల కోరికలు ఆ వాక్కును అణచివేసి ఫలించకుండా చేస్తాయి. మరి కొందరు సారవంతమైన నేలలాంటి వారు, వీళ్ళు దేవుని వాక్కు విని, అంగీకరించి కొందరు ముప్ఫై రెట్లు, కొందరు అరవై రెట్లు, కొందరు వంద రెట్లు ఫలిస్తారు.” ఆయన వారితో ఇంకా ఇలా అన్నాడు, “దీపాన్ని తెచ్చి బోర్లించిన పాత్ర కింద, లేక మంచం కింద ఉంచుతారా? దాన్ని దీపస్తంభం మీద ఉంచుతాం గదా! దాచి ఉంచినవన్నీ బహిర్గతమౌతాయి. అన్ని రహస్యాలూ బయట పడిపోతాయి. వినడానికి చెవులు గలవాడు వినుగాక.” యేసు వారితో ఇంకా ఇలా అన్నాడు, “నేను మీతో చెప్పేది జాగ్రత్తగా గమనించండి. మీరు ఏ కొలతలో కొలిచి ఇస్తారో అదే కొలతలో ఇంకా ఎక్కువగా కొలిచి దేవుడు మీకిస్తాడు. కలిగిన వారికి దేవుడు ఇంకా ఎక్కువగా ఇస్తాడు. లేని వారి దగ్గర నుండి ఉన్నది కూడా తీసివేస్తాడు.” ఆయన మళ్ళీ ఇలా అన్నాడు, “దేవుని రాజ్యం ఒక మనిషి భూమి మీద విత్తనాలు చల్లినట్టు ఉంటుంది. ఆ వ్యక్తి నిద్ర పోతున్నా మెలకువగా ఉన్నా రాత్రి, పగలు అతనికి తెలియకుండానే ఆ విత్తనాలు మొలకెత్తి పెరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే భూమి దానంతట అదే పండుతుంది. మొదట మొలక, ఆ తరువాత కంకి, ఆ కంకి నిండా గింజలు పుడతాయి. పంట పండినప్పుడు అతడు కోతకాలం వచ్చిందని వెంటనే కొడవలితో కోస్తాడు.” ఆయన మళ్ళీ ఈ విధంగా అన్నాడు. “దేవుని రాజ్యాన్ని దేనితో పోల్చగలం? ఏ ఉపమానం ఉపయోగించి దాన్ని వర్ణించగలం? అది ఆవగింజ లాంటిది. మనం భూమి మీద నాటే విత్తనాలన్నిటిలోకీ అది చిన్నది. కాని దాన్ని నాటిన తరువాత తోటలో ఉన్న అన్ని మొక్కల కన్నా అది పెద్దగా పెరుగుతుంది. దాని కొమ్మలు పెద్దగా ఎదుగుతాయి. పక్షులు దాని నీడలో గూడు కట్టుకుంటాయి.” యేసు ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉపయోగించి, వారు అర్థం చేసుకోగలిగిన కొద్దీ వారికి ఉపదేశించాడు. ఉపమానం లేకుండా వారికి ఏ ఉపదేశమూ చేయలేదు. తరువాత ఆయన తన శిష్యులతో ఒంటరిగా ఉన్నప్పుడు వారికి అన్నీ వివరించి చెప్పాడు. ఆ రోజు సాయంత్రం ఆయన తన శిష్యులతో, “సరస్సు అవతలి ఒడ్డుకు వెళ్దాం పదండి” అన్నాడు. శిష్యులు జనసమూహాలను విడిచి యేసుతో పడవలో బయలుదేరారు. మరి కొన్ని పడవలు కూడా వారివెంట వచ్చాయి. అప్పుడు పెద్ద తుఫాను వచ్చింది. అలలు లేచి పడవను నీళ్ళతో నింపేశాయి. పడవ వెనుక భాగంలో యేసు తలకింద దిండు పెట్టుకుని నిద్రపోతూ ఉన్నాడు. శిష్యులు ఆయనను నిద్ర లేపి ఆయనతో, “బోధకా! మేము మునిగిపోతుంటే నీకేమీ పట్టదా?” అని అన్నారు. ఆయన లేచి గాలిని, సముద్రాన్ని గద్దిస్తూ, “శాంతించు! ఆగిపో!” అని ఆజ్ఞాపించాడు. వెంటనే గాలి ఆగిపోయింది. అంతా ప్రశాంతంగా మారింది. అప్పుడాయన శిష్యులతో, “మీరెందుకు భయపడుతున్నారు? మీలో ఇంకా విశ్వాసం కలగలేదా?” అని అన్నాడు. వారికి చాలా భయమేసింది. ఒకరితో ఒకరు, “ఎవరీయన? గాలి, సముద్రం సహా ఈయన మాటకు లోబడుతున్నాయే!” అని చెప్పుకుని ఆశ్చర్యపడ్డారు.

షేర్ చేయి
Read మార్కు 4

మార్కు 4:10-41 పవిత్ర బైబిల్ (TERV)

ఆయన ఏకాంతంగా ఉన్నప్పుడు ఆయన పన్నెండుగురు శిష్యులు ఆయన చుట్టూ ఉన్న మిగతా వాళ్ళు ఆ ఉపమానాన్ని గురించి అడిగారు. ఆయన వాళ్ళతో, “దేవుని రాజ్యంయొక్క రహస్య జ్ఞానాన్ని మీకు చెప్పాను. కాని యితరులకు ఈ జ్ఞానం ఉపమానాల ద్వారా చెబుతాను. ఎందుకంటే, ‘వాళ్ళు ఎప్పుడూ చూస్తారు కాని ఏదీ గ్రహించరు. అన్నీ వింటారు కాని ఒక్కటీ అర్థం చేసుకోరు. వాళ్ళు అలా చేస్తే దేవుని వైపు మళ్ళవచ్చు దేవుడు వాళ్ళను క్షమిస్తాడు.’” యేసు వాళ్ళతో ఈ విధంగా అన్నాడు: “మీకీ ఉపమానం అర్థం కాలేదా? మరి మిగతా ఉపమానాల్ని ఎలా అర్థం చేసుకొంటారు? రైతు, దైవ సందేశాన్ని విత్తుతున్నవాడు. కొందరు వ్యక్తులు దారి మీది మట్టిలాంటి వాళ్ళు. వీళ్ళలో విత్తనం నాటిన వెంటనే, అంటేవాళ్ళు విన్న వెంటనే, సైతాను వచ్చి వాళ్ళలో నాటబడిన దైవసందేశాన్ని తీసుకువెళ్తాడు. “మరి కొందరు రాతినేలలాంటి వాళ్ళు. వీళ్ళు సందేశాన్ని విని ఆనందంతో దాన్ని స్వీకరిస్తారు. కాని వాళ్ళు సందేశాన్ని లోతైన జీవితంలోనికి నాటనివ్వరు. కొంత కాలం మాత్రమే నిలుస్తుంది. ఆ సందేశం కారణంగా కష్టంకాని, హింసకాని కలిగితే వాళ్ళు వెంటనే దాన్ని వదిలేస్తారు. “మరి కొందరు ముళ్ళమొక్కలు మొలిచే నేలలాంటి వాళ్ళు. వాళ్ళు దైవసందేశం వింటారు కాని ఈ జీవితం వల్ల కలిగే చింతలు, ధనం కలిగించే మోసం, యితర వస్తువుల పట్ల వ్యామోహం, ఆ దైవ సందేశాన్ని అణిచివేసి ఫలించకుండా చేస్తాయి. “ఇతరులు సారవంతమైన భూమిలాంటివాళ్ళు. కనుక వీళ్ళు దైవసందేశాన్ని విని అంగీకరించి ఫలంపొందే వాళ్ళు. కనుక వీళ్ళు ముప్పై, అరవై, నూరువంతుల ఫలం ఫలిస్తారు.” ఆయన మళ్ళీ వాళ్ళతో ఈ విధంగా అన్నాడు: “మీరు దీపాన్ని తెచ్చి స్తంభం మీద పెట్టకుండా మంచం క్రింద లేక పాత్ర క్రింద పెడతారా? లేదు, దీపస్తంభం మీద పెడతారు. దాచబడినవన్నీ బహిరంగమౌతాయి. అన్ని రహస్యాలు బయటపడతాయి. వింటున్న మీరు జాగ్రత్తగా వినండి.” యేసు మళ్ళీ ఈ విధంగా అన్నాడు: “మీరు విన్నదాన్ని జాగ్రత్తగా గమనించండి. మీరు ఏ కొలతతో కొలిచి యిస్తారో అదే కొలతతో యింకా ఎక్కువగా కొలిచి దేవుడు మీకిస్తాడు. వున్నవానికి దేవుడు యింకా ఎక్కువగా యిస్తాడు. లేనివాని దగ్గరనుండి అతని దగ్గర ఉన్నది కూడా తీసివేస్తాడు.” యేసు మళ్ళీ ఈ విధంగా అన్నాడు: “దేవుని రాజ్యం ఈ విధంగా ఉంటుంది. ఒక వ్యక్తి విత్తనాల్ని భూమ్మీద చల్లుతాడు. అవి రాత్రి, పగలు, అతడు పడుకొని ఉన్నా, లేచివున్నా మొలకెత్తి పెరుగుతూ ఉంటాయి. అవి ఏ విధంగా పెరుగుతున్నాయో అతనికి తెలియదు. భూమి తనంతకు తానె ధాన్యాన్ని పండిస్తుంది. మొదట మొలక వేసి ఆ తర్వాత కంకువేసి, ఆ కంకి నిండా ధాన్యం పండుతుంది. పంటకాలం వరకు ఆ ధాన్యం పూర్తిగా పండిపోతుంది. వెంటనే, రైతు కొడవలిపెట్టి కోస్తాడు.” ఆయన మళ్ళీ ఈ విధంగా అన్నాడు: “దేవుని రాజ్యం ఏ విధంగా ఉందని చెప్పాలి? ఏ ఉపమానాన్ని ఉపయోగించి దాన్ని వర్ణించాలి? అది ఆవగింజలాంటిది. మనం భూమిలో నాటే విత్తనాలన్నిటి కన్నా అది చాలా చిన్నది. కాని ఆ ఆవగింజను నాటాక తోటలో ఉన్న అన్ని మొక్కల కన్నా అది పెద్దగా పెరుగుతుంది. దాని కొమ్మలు పెద్దగా ఉంటాయి. గాలిలో ఎగిరే పక్షులు దాని నీడలో గూడుకట్టుకొంటాయి.” యేసు ఇలాంటి ఉపమానాల్ని ఎన్నో ఉపయోగించి, దైవసందేశాన్ని వాళ్ళు అర్థం చేసుకొన్నంత బోధించాడు. ఉపమానాల్ని ఉపయోగించకుండా వాళ్ళకు ఏదీ బోధించ లేదు. కాని ఆయన తన శిష్యులతో ఒంటరిగా ఉన్నప్పుడు వాళ్ళకు అన్నీ వివరించి చెప్పాడు. ఆ రోజు సాయంత్రం ఆయన తన శిష్యులతో, “సముద్రం అవతలివైపుకు వెళ్దాం!” అని అన్నాడు. శిష్యులు, అక్కడ ఉన్న ప్రజా సమూహాన్ని వదిలి పడవలో ఉన్న యేసును తమవెంట తీసుకు వెళ్ళారు. మరికొన్ని పడవలు కూడా వాళ్ళను అనుసరించాయి. ఇంతలో తీవ్రమైన ఒక పెనుగాలి వీచింది. అలలు రేగి ఆ పడవలోకి నీళ్ళు వచ్చాయి. పడవ నిండి పోసాగింది. పడవ వెనుక వైపు యేసు తలక్రింద ఒక దిండు పెట్టుకొని నిద్రపోతూ ఉన్నాడు. శిష్యులు ఆయన్ని లేపి ఆయనతో, “బోధకుడా! మేము మునిగి పోయినా మీకు చింతలేదా?” అని అన్నారు. ఆయన లేచి గాలిని, అలల్ని గద్దిస్తూ, “ఆగిపో, నెమ్మదించు!” అని ఆజ్ఞాపించాడు. వెంటనే గాలి తీవ్రత తగ్గిపోయింది. అంతటా శాంతం ఏర్పడింది. ఆయన తన శిష్యులతో, “మీరెందుకింత భయపడుతున్నారు? మీలో యింకా విశ్వాసం కలుగలేదా?” అని అన్నాడు. వాళ్ళకు చాలా భయంవేసింది. తమలో తాము, “ఎవరీయన? గాలి, అలలు కూడా ఆయన మాటకు లోబడుతున్నాయే!” అని ఆశ్చర్యపడ్డారు.

షేర్ చేయి
Read మార్కు 4

మార్కు 4:10-41 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు పండ్రెండుమంది శిష్యులతోకూడ ఆయనచుట్టు ఉండినవారు ఆ ఉపమానమునుగూర్చి ఆయన నడిగిరి. అందుకాయన దేవుని రాజ్య మర్మము (తెలిసికొనుట) మీకు అనుగ్రహింపబడియున్నది గాని వెలుపలనుండువారు ఒకవేళ దేవునివైపు తిరిగి పాప క్షమాపణ పొందుదురని, వారు చూచుటకైతే చూచియు కనుగొనకను, వినుటకైతే వినియు గ్రహింపకయు నుండుటకును అన్నియు ఉపమానరీతిగా వారికి బోధింపబడుచున్న వని వారితో చెప్పెను మరియు–ఈ ఉపమానము మీకు తెలియలేదా? ఆలాగైతే ఉపమానములన్నియు మీకేలాగు తెలియుననెను. విత్తువాడు వాక్యము విత్తుచున్నాడు. త్రోవప్రక్క నుండువారెవరనగా, వాక్యము వారిలో విత్తబడును గాని వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్య మెత్తికొనిపోవును. అటువలె రాతినేలను విత్తబడినవారెవరనగా, వాక్యము విని సంతోషముగా అంగీకరించువారు; అయితే వారిలో వేరు లేనందున, కొంతకాలము వారు నిలుతురు గాని వాక్యము నిమిత్తము శ్రమయైనను హింసయైనను కలుగ గానే వారు అభ్యంతరపడుదురు. ఇతరులు ముండ్లపొదలలో విత్తబడినవారు; వీరు వాక్యము విందురు గాని ఐహిక విచారములును, ధనమోసమును మరి ఇతరమైన అపేక్ష లును లోపల చొచ్చి, వాక్యమును అణచివేయుటవలన అది నిష్ఫలమగును. మంచి నేలను విత్తబడినవారెవరనగా, వాక్యము విని, దానిని అంగీకరించి ముప్పదంతలుగాను అరువదంతలుగాను నూరంతలుగాను ఫలించువారని చెప్పెను. మరియు ఆయన వారితో ఇట్లనెను దీపము దీప స్తంభముమీద నుంచబడుటకే గాని కుంచము క్రిందనైనను మంచముక్రిందనైన నుంచబడుటకు తేబడదు గదా రహస్య మేదైనను తేటపరచబడకపోదు; బయలుపరచబడుటకే గాని యేదియు మరుగుచేయబడలేదు వినుటకు చెవులెవనికైన నుండినయెడల వాడు వినునుగాకనెను. మరియు ఆయన మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. మీరెట్టి కొలతతో కొలుతురో మీకును అట్టి కొలతతోనే కొలువబడును, మరి ఎక్కువగా మీ కియ్యబడును. కలిగినవానికి ఇయ్యబడును, లేనివానికి కలిగినదియు వానియొద్దనుండి తీసివేయబడునని వారితో చెప్పెను. మరియు ఆయన–ఒక మనుష్యుడు భూమిలో విత్తనము చల్లి, రాత్రింబగళ్లు నిద్రపోవుచు, మేల్కొనుచు నుండగా, వానికి తెలియని రీతిగా ఆ విత్తనము మొలిచి పెరిగినట్లే దేవుని రాజ్యమున్నది. భూమి మొదట మొల కను తరువాత వెన్నును అటుతరువాత వెన్నులో ముదురు గింజలను తనంతటతానే పుట్టించును. పంట పండినప్పుడు కోతకాలము వచ్చినదని సేద్యగాడు వెంటనే కొడవలి పెట్టి కోయునని చెప్పెను. మరియు ఆయన ఇట్లనెను–దేవుని రాజ్యమును ఎట్లు పోల్చెదము? ఏ ఉపమానముతో దానిని ఉపమించెదము? అది ఆవగింజను పోలియున్నది. ఆవగింజ భూమిలో విత్తబడినప్పుడు భూమిమీదనున్న విత్తనములన్నిటికంటె చిన్నదే గాని విత్తబడిన తరువాత అది మొలిచి యెదిగి కూర మొక్కలన్నిటికంటె పెద్దదై గొప్ప కొమ్మలు వేయును గనుక ఆకాశపక్షులు దాని నీడను నివసింపగలవనెను. వారికి వినుటకు శక్తి కలిగినకొలది యీలాటి అనేకమైన ఉపమానములను చెప్పి, ఆయన వారికి వాక్యము బోధించెను. ఉపమానము లేక వారికి బోధింపలేదు గాని ఒంటరిగా ఉన్నప్పుడు తన శిష్యులకు అన్నిటిని విశదపరచెను. ఆ దినమే సాయంకాలమైనప్పుడు ఆయన–అద్దరికి పోవుదమని వారితో చెప్పగా, వారు జనులను పంపివేసి, ఆయనను ఉన్నపాటున చిన్నదోనెలో తీసికొనిపోయిరి; ఆయనవెంబడి మరికొన్ని దోనెలు వచ్చెను. అప్పుడు పెద్ద తుపాను రేగి ఆయన యున్న దోనెమీద అలలు కొట్టినందున దోనె నిండిపోయెను. ఆయన దోనె అమరమున తలగడమీద (తల వాల్చుకొని) నిద్రించుచుండెను. వారాయనను లేపి–బోధకుడా, మేము నశించిపోవు చున్నాము; నీకు చింతలేదా? అని ఆయనతో అనిరి. అందుకాయన లేచి గాలిని గద్దించి–నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రముతో చెప్పగా, గాలి అణగి మిక్కిలి నిమ్మళమాయెను. అప్పుడాయన–మీరెందుకు భయపడుచున్నారు? మీరింకను నమ్మికలేక యున్నారా? అని వారితో చెప్పెను. వారు మిక్కిలి భయపడి–ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని యొకనితో ఒకడు చెప్పుకొనిరి.

షేర్ చేయి
Read మార్కు 4