మార్కు 3:1-6
మార్కు 3:1-6 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
సమాజమందిరములో ఆయన మరల ప్రవేశింపగా అక్కడ ఊచచెయ్యి గలవాడు ఒకడుండెను. అచ్చటి వారు ఆయనమీద నేరము మోపవలెననియుండి, విశ్రాంతిదినమున వానిని స్వస్థపరచునేమో అని ఆయనను కని పెట్టుచుండిరి. ఆయన నీవు లేచిమధ్యను నిలువుమని ఊచచెయ్యిగలవానితో చెప్పి వారిని చూచి విశ్రాంతిదినమున మేలుచేయుట ధర్మమా కీడుచేయుట ధర్మమా? ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా! అని అడిగెను; అందుకు వారు ఊరకుండిరి. ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి, కోపముతో వారిని కలయ చూచి నీ చెయ్యిచాపుమని ఆ మనుష్యునితో చెప్పెను; వాడు తన చెయ్యి చాపగా అది బాగుపడెను. పరి సయ్యులు వెలుపలికి పోయి వెంటనే హేరోదీయులతో కలిసికొని, ఆయన నేలాగు సంహరింతుమా యని ఆయనకు విరోధముగా ఆలోచనచేసిరి.
మార్కు 3:1-6 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
మరొకసారి యేసు సమాజమందిరంలో వెళ్లినప్పుడు, అక్కడ చేతికి పక్షవాతం గలవాడు ఒకడున్నాడు. వారిలో కొందరు యేసును నిందించడానికి ఒక కారణం కొరకు వెదుకుతున్నారు, కాబట్టి వారు సబ్బాతు దినాన ఆయన స్వస్థపరుస్తారేమో అని దగ్గర నుండి ఆయనను గమనిస్తున్నారు. చేతికి పక్షవాతం గలవానితో యేసు, “అందరి ముందు నిలబడు” అన్నారు. అప్పుడు ఆయన, “సబ్బాతు దినాన ఏది న్యాయం: మంచి చేయడమా లేదా చెడు చేయడమా, ప్రాణం రక్షించడమా లేదా ప్రాణం తీయడమా?” అని వారిని అడిగారు కాని వారు మౌనంగా ఉన్నారు. ఆయన కోపంతో చుట్టూ ఉన్న వారిని చూసి, వారి హృదయ కాఠిన్యాన్ని బట్టి బాధతో నొచ్చుకుని, చేతికి పక్షవాతం గలవానితో, “నీ చెయ్యి చాపు” అన్నారు. వాడు దాన్ని చాపగానే, వాని చెయ్యి పూర్తిగా బాగయింది. అప్పుడు పరిసయ్యులు బయటకు వెళ్లి హేరోదు వర్గానికి చెందిన వారితో కలిసి యేసును ఎలా చంపుదామా అని కుట్రపన్నడం మొదలుపెట్టారు.
మార్కు 3:1-6 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
యేసు మరోసారి సమాజమందిరంలో ప్రవేశించాడు. అక్కడ చెయ్యి చచ్చుబడిపోయిన వాడొకడు ఉన్నాడు. అక్కడివారు ఆయన మీద నేరం మోపే ఉద్దేశంతో, యేసు విశ్రాంతి దినాన ఆ మనిషిని బాగుచేస్తాడేమో అని జాగ్రత్తగా గమనిస్తున్నారు. యేసు ఆ చెయ్యి చచ్చుబడిపోయిన వాడితో, “ఇటు వచ్చి అందరి ముందూ నిలబడు” అన్నాడు. అప్పుడు ఆయన వారితో, “విశ్రాంతి దినాన మేలు చేయడం ధర్మమా? కీడు చేయడమా? ప్రాణాన్ని రక్షించడం ధర్మమా? చంపడమా?” అని అన్నాడు. అందుకు వారు ఏ జవాబూ చెప్పలేదు. వారి కఠిన హృదయాలను బట్టి ఆయన నొచ్చుకుని, కోపంతో రగిలిపోతూ అందరి వైపూ చూశాడు. ఆ చెయ్యి చచ్చుబడిపోయిన వాడితో, “నీ చెయ్యి చాపు” అనగానే వాడు చెయ్యి చాపాడు. వెంటనే అతని చెయ్యి పూర్తిగా బాగైపోయింది. అప్పుడు పరిసయ్యులు బయటకు వెళ్ళి, హేరోదు రాజు మనుషులతో కలిసి యేసుని చంపడానికి కుట్ర పన్నారు.
మార్కు 3:1-6 పవిత్ర బైబిల్ (TERV)
ఒక రోజు యేసు సమాజ మందిరానికి వెళ్ళాడు. అక్కడ చెయ్యి ఎండిపోయిన వాడొకడు ఉన్నాడు. అక్కడున్న వాళ్ళలో కొందరు, యేసు ఆ చేయి ఎండిపోయిన వానికి విశ్రాంతి రోజు నయం చేస్తాడేమో చూడాలని జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నారు. అలా చేస్తే ఆయనపై నేరం మోపాలని వాళ్ళ ఉద్దేశ్యం. యేసు ఆ చేయిపడిపోయిన వానితో, “అందరి ముందుకి వచ్చి నిలుచో” అని అన్నాడు. అప్పుడు యేసు అక్కడున్న వాళ్ళతో, “విశ్రాంతి రోజున మంచి చెయ్యటం ధర్మమా? లేక చెడు చేయటం ధర్మమా? ప్రాణాన్ని రక్షించటం ధర్మమా లేక చంపటం ధర్మమా?” అని అన్నాడు. కాని దానికి వాళ్ళు ఏ సమాధానమూ చెప్పలేదు. ఆయన కోపంతో చుట్టూ చూసాడు. వాళ్ళవి కఠిన హృదయాలైనందుకు ఎంతో దుఃఖిస్తూ, ఆ చేయి ఎండిపోయిన వానితో, “నీ చేయి చాపు” అని అన్నాడు. వాడు చేయి చాపాడు. వెంటనే అతని చేయి పూర్తిగా నయమైపోయింది. ఆ తర్వాత పరిసయ్యులు బయటికి వెళ్ళి, హేరోదీయులతో కలిసి యేసును చంపాలని కుట్రపన్నటం మొదలు పెట్టారు.