మార్కు 3:1-35
మార్కు 3:1-35 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
మరొకసారి యేసు సమాజమందిరంలో వెళ్లినప్పుడు, అక్కడ చేతికి పక్షవాతం గలవాడు ఒకడున్నాడు. వారిలో కొందరు యేసును నిందించడానికి ఒక కారణం కొరకు వెదుకుతున్నారు, కాబట్టి వారు సబ్బాతు దినాన ఆయన స్వస్థపరుస్తారేమో అని దగ్గర నుండి ఆయనను గమనిస్తున్నారు. చేతికి పక్షవాతం గలవానితో యేసు, “అందరి ముందు నిలబడు” అన్నారు. అప్పుడు ఆయన, “సబ్బాతు దినాన ఏది న్యాయం: మంచి చేయడమా లేదా చెడు చేయడమా, ప్రాణం రక్షించడమా లేదా ప్రాణం తీయడమా?” అని వారిని అడిగారు కాని వారు మౌనంగా ఉన్నారు. ఆయన కోపంతో చుట్టూ ఉన్న వారిని చూసి, వారి హృదయ కాఠిన్యాన్ని బట్టి బాధతో నొచ్చుకుని, చేతికి పక్షవాతం గలవానితో, “నీ చెయ్యి చాపు” అన్నారు. వాడు దాన్ని చాపగానే, వాని చెయ్యి పూర్తిగా బాగయింది. అప్పుడు పరిసయ్యులు బయటకు వెళ్లి హేరోదు వర్గానికి చెందిన వారితో కలిసి యేసును ఎలా చంపుదామా అని కుట్రపన్నడం మొదలుపెట్టారు. యేసు తన శిష్యులతో కలిసి సముద్రం దగ్గరకు వెళ్లారు, అలాగే గలిలయ నుండి గొప్ప జనసమూహం ఆయనను వెంబడించింది. ఆయన చేస్తున్న గొప్పకార్యాల గురించి ప్రజలు విని, చాలామంది యూదయ, యెరూషలేము, ఇదూమయ, యోర్దాను అంతటా మరియు తూరు, సీదోను చుట్టూ ఉన్న ప్రాంతాల నుండి ఆయన దగ్గరకు వచ్చారు. జనసమూహం కారణంగా ఆయన తన శిష్యులతో, తన కొరకు ఒక చిన్న పడవను సిద్ధం చేయమని చెప్పారు. ఆయన చాలామందిని స్వస్థపరిచారు, కనుక వ్యాధులు ఉన్నవారు ఆయనను ముట్టుకోవాలని ముందుకు వస్తున్నారు. అపవిత్రాత్మలు ఆయనను చూడగానే, ఆయన ముందు సాగిలపడి, “నీవు దేవుని కుమారుడవు” అని కేకలు వేసాయి. అయితే ఆయన తన గురించి ఇతరులకు చెప్పవద్దని వారికి ఖచ్చితమైన ఆదేశాలు ఇచ్చారు. ఆ తర్వాత యేసు కొండెక్కి తనకు ఇష్టమైన వారిని పిలిచారు, వారు ఆయన దగ్గరకు వచ్చారు. తనతో ఉండడానికి, ప్రకటించడానికి తాను బయటకు పంపడానికి ఆయన పన్నెండు మందిని నియమించుకొని దయ్యాలను వెళ్లగొట్టే అధికారాన్ని వారికిచ్చారు. ఆ పన్నెండు మంది ఎవరనగా: ఆయన పేతురు అని పేరుపెట్టిన సీమోను, జెబెదయి కుమారుడు యాకోబు, అతని సహోదరుడు యోహాను; (వీరిద్దరికి ఆయన బోయనెర్గెస్ అనే పేరు పెట్టారు; దాని అర్థం “ఉరుము కుమారులు”), అంద్రెయ, ఫిలిప్పు, బర్తలోమయి, మత్తయి, తోమా, అల్ఫయి కుమారుడు యాకోబు, తద్దయి, అత్యాసక్తి కలవాడైన సీమోను, మరియు ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా. తర్వాత యేసు ఒక ఇంట్లోకి వెళ్లినప్పుడు, ప్రజలు మరల గుంపుగా కూడి వచ్చారు, కనుక ఆయన మరియు ఆయన శిష్యులు భోజనం కూడా చేయలేకపోయారు. అది విని ఆయన కుటుంబీకులు, “ఆయనకు మతిపోయింది” అని చెప్పి ఆయనను తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. యెరూషలేము నుండి వచ్చిన ధర్మశాస్త్ర ఉపదేశకులు, “ఇతడు బయెల్జెబూలు చేత పట్టబడినవాడు! దయ్యాల అధిపతి సహాయంతో దయ్యాలను వెళ్లగొడుతున్నాడు” అని అన్నారు. కనుక యేసు వారిని తన దగ్గరకు పిలుచుకొని వారితో ఉపమానరీతిగా మాట్లాడారు: “సాతాను సాతానును ఎలా వెళ్లగొట్టగలడు? ఏ రాజ్యమైనా తనకు తానే వ్యతిరేకంగా ఉండి చీలిపోతే, ఆ రాజ్యం నిలువలేదు. ఒక కుటుంబం తనకు తానే వ్యతిరేకంగా చీలిపోతే అది నిలబడదు. అలాగే ఒకవేళ సాతాను తనను తానే వ్యతిరేకించుకొని చీలిపోతే, వాడు నిలువలేడు; వాని అంతం వచ్చినట్లే. నిజానికి, బలవంతుడైనవాని మొదట కట్టివేయకుండ అతని ఇంట్లోకి ఎవరు ప్రవేశించలేరు. అతన్ని బంధిస్తేనే వాడు ఇంటిని దోచుకోగలడు. ప్రతి పాపానికి, దూషణకు మనుష్యులకు క్షమాపణ ఉంది. కాని, పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడే ఎవరికైనా క్షమాపణ ఉండదు; వారు నిత్య పాపం చేసిన అపరాధులుగా ఉంటారని మీతో ఖచ్చితంగా చెప్తున్నాను” అన్నారు. “ఆయన అపవిత్రాత్మ పట్టినవాడు” అని వారు అంటున్నారు కాబట్టి యేసు ఈ విధంగా చెప్పారు. ఆ తర్వాత యేసు తల్లి మరియు సహోదరులు వచ్చారు. వారు బయట నిలబడి, ఆయనను పిలువడానికి ఒకరిని లోపలికి పంపారు. జనసమూహం ఆయన చుట్టు కూర్చుని ఉండగా, వారు ఆయనతో, “నీ తల్లి మరియు నీ సహోదరులు నిన్ను కలువడానికి వచ్చి బయట వేచి ఉన్నారు” అని చెప్పారు. అందుకు ఆయన, “నా తల్లి మరియు నా సహోదరులు ఎవరు?” అని అడిగారు. ఆయన తన చుట్టు కూర్చున్న వారిని చూసి, “వీరే నా తల్లి, నా సహోదరులు! దేవుని చిత్తప్రకారం చేసేవారే నా సహోదరుడు, సహోదరి మరియు తల్లి” అని చెప్పారు.
మార్కు 3:1-35 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
యేసు మరోసారి సమాజమందిరంలో ప్రవేశించాడు. అక్కడ చెయ్యి చచ్చుబడిపోయిన వాడొకడు ఉన్నాడు. అక్కడివారు ఆయన మీద నేరం మోపే ఉద్దేశంతో, యేసు విశ్రాంతి దినాన ఆ మనిషిని బాగుచేస్తాడేమో అని జాగ్రత్తగా గమనిస్తున్నారు. యేసు ఆ చెయ్యి చచ్చుబడిపోయిన వాడితో, “ఇటు వచ్చి అందరి ముందూ నిలబడు” అన్నాడు. అప్పుడు ఆయన వారితో, “విశ్రాంతి దినాన మేలు చేయడం ధర్మమా? కీడు చేయడమా? ప్రాణాన్ని రక్షించడం ధర్మమా? చంపడమా?” అని అన్నాడు. అందుకు వారు ఏ జవాబూ చెప్పలేదు. వారి కఠిన హృదయాలను బట్టి ఆయన నొచ్చుకుని, కోపంతో రగిలిపోతూ అందరి వైపూ చూశాడు. ఆ చెయ్యి చచ్చుబడిపోయిన వాడితో, “నీ చెయ్యి చాపు” అనగానే వాడు చెయ్యి చాపాడు. వెంటనే అతని చెయ్యి పూర్తిగా బాగైపోయింది. అప్పుడు పరిసయ్యులు బయటకు వెళ్ళి, హేరోదు రాజు మనుషులతో కలిసి యేసుని చంపడానికి కుట్ర పన్నారు. యేసు తన శిష్యులతో కలసి గలిలయ సరస్సు వెంబడి వెళ్తూ ఉన్నాడు. గలిలయ, యూదయ ప్రాంతం నుండి వచ్చిన చాలామంది ప్రజలు ఆయన వెంట వెళ్ళారు. యేసు చేస్తున్నవన్నీ విని చాలామంది ప్రజలు యూదయ, యెరూషలేము, ఇదూమియ ప్రాంతాలనుండీ, యొర్దాను నది అవతలి నుండీ తూరు, సీదోను ప్రాంతాలనుండీ ఆయన దగ్గరికి వచ్చారు. ప్రజలు ఎక్కువమంది ఉన్న కారణంగా వారు తన మీద పడకుండా ఉండాలని తన కోసం ఒక పడవ సిద్ధం చేయమని ఆయన తన శిష్యులతో చెప్పాడు. ఆయన చాలామందిని బాగు చేశాడు. అందువల్ల రోగులందరూ ఆయనను తాకాలని ఆయన దగ్గరికి తోసుకొస్తున్నారు. దయ్యాలు పట్టినవారు ఆయనను చూడగానే, ఆయన ఎదుట నేలపై పడిపోయి, “నీవు దేవుని కుమారుడివి” అని కేకలు వేశారు. యేసు, తానెవరో తెలపవద్దని దయ్యాలకు ఖండితంగా ఆజ్ఞాపించాడు. తరువాత యేసు కొండ ఎక్కి వెళ్ళి తనను ఎవరు అనుసరించాలని ఆయన కోరుకున్నాడో వారిని పిలిచాడు. వారు ఆయన దగ్గరికి వచ్చారు. తనతో ఉండడానికీ, సువార్త ప్రకటనకు పంపడానికీ ఆయన పన్నెండు మందిని నియమించాడు. వారికి అపొస్తలులు అని పేరు పెట్టాడు. రోగాలను బాగుచేయడానికీ, దయ్యాలను వెళ్ళగొట్టడానికీ వారికి అధికారం ఇచ్చాడు. వారి పేర్లు, సీమోను (ఇతనికి ఆయన పేతురు అనే పేరు పెట్టాడు), జెబెదయి కుమారుడు యాకోబు, అతని సోదరుడు యోహాను (వీరికి ఆయన ‘బోయనేర్గెసు’ అనే పేరు పెట్టాడు, ఆ మాటకి ‘ఉరిమేవారు’ అని అర్థం), అంద్రెయ, ఫిలిప్పు, బర్తొలొమయి, మత్తయి, తోమా, అల్ఫయి కొడుకు యాకోబు, తద్దయి, కనానీయుడైన సీమోను, యేసును పట్టి ఇచ్చిన ఇస్కరియోతు యూదా. తరువాత యేసు, ఆయన శిష్యులు ఒక ఇంటికి వెళ్ళారు. మళ్ళీ అక్కడ చాలా మంది ప్రజలు గుమికూడారు. కాబట్టి వారికి భోజనం చేయడానికి కూడా వీలు లేకపోయింది. ఇది తెలిసిన యేసు కుటుంబీకులు ఆయనను పట్టుకుని ఇంటికి తీసుకు వెళ్ళడానికి వచ్చారు. ఎందుకంటే కొందరు “ఈయనకు మతి స్థిమితం లేదు” అన్నారు. యెరూషలేము నుండి వచ్చిన ధర్మశాస్త్ర పండితులు, “బయల్జెబూలు ఇతణ్ణి ఆవహించాడు. ఆ దయ్యాల అధిపతి సహాయంతోనే దయ్యాలను పారదోలుతున్నాడు” అన్నారు. యేసు వారిని తన దగ్గరికి పిలిచి, ఉదాహరణల రూపంలో ఇలా అన్నాడు, “సైతాను సైతానును ఎలా వెళ్ళగొడతాడు? చీలికలు వచ్చిన రాజ్యం నిలబడదు. చీలికలు వచ్చిన కుటుంబం నిలబడదు. అలాగే సైతాను తనకు తానే విరోధంగా ఉంటే వాని అధికారం అంతమౌతుంది గదా. నిజానికి ఒక బలవంతుడి ఇంట్లో దొంగతనం చేయాలంటే మొదట అతణ్ణి కట్టివేయాల్సిందే. నేను మీతో కచ్చితంగా చెప్పేదేమంటే, మనుషులు చేసిన అన్ని పాపాలను, వారు పలికే దైవ దూషణలను దేవుడు క్షమిస్తాడు. కాని పరిశుద్ధాత్మను దూషించినవాణ్ణి దేవుడు ఎన్నడూ క్షమించడు. అలా చేసేవాడు శాశ్వత పాపం చేసిన దోషంలో ఉంటాడు.” ‘ఆయనకు దయ్యం పట్టింది’ అని వారు అన్నందుకు ఆయన వారితో ఇలా చెప్పాడు. అప్పుడు యేసు తల్లి, ఆయన సోదరులు అక్కడికి వచ్చి, బయట నిలబడి యేసు కోసం కబురు చేశారు. యేసు చుట్టూ చాలా మంది ప్రజలు ఉన్నారు. వారు ఆయనతో, “నీ తల్లి, సోదరులు బయట నీ కోసం చూస్తున్నారు” అన్నారు. ఆయన వారితో, “ఎవరు నా తల్లి? ఎవరు నా సోదరులు?” అన్నాడు. తన చుట్టూ కూర్చున్న వారిని చూస్తూ, “ఇదిగో నా తల్లి, నా సోదరులు. ఎందుకంటే, దేవుని ఇష్టప్రకారం నడచుకునే వారే నా సోదరులు, నా అక్క చెల్లెళ్ళు, నా తల్లి” అని అన్నాడు.
మార్కు 3:1-35 పవిత్ర బైబిల్ (TERV)
ఒక రోజు యేసు సమాజ మందిరానికి వెళ్ళాడు. అక్కడ చెయ్యి ఎండిపోయిన వాడొకడు ఉన్నాడు. అక్కడున్న వాళ్ళలో కొందరు, యేసు ఆ చేయి ఎండిపోయిన వానికి విశ్రాంతి రోజు నయం చేస్తాడేమో చూడాలని జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నారు. అలా చేస్తే ఆయనపై నేరం మోపాలని వాళ్ళ ఉద్దేశ్యం. యేసు ఆ చేయిపడిపోయిన వానితో, “అందరి ముందుకి వచ్చి నిలుచో” అని అన్నాడు. అప్పుడు యేసు అక్కడున్న వాళ్ళతో, “విశ్రాంతి రోజున మంచి చెయ్యటం ధర్మమా? లేక చెడు చేయటం ధర్మమా? ప్రాణాన్ని రక్షించటం ధర్మమా లేక చంపటం ధర్మమా?” అని అన్నాడు. కాని దానికి వాళ్ళు ఏ సమాధానమూ చెప్పలేదు. ఆయన కోపంతో చుట్టూ చూసాడు. వాళ్ళవి కఠిన హృదయాలైనందుకు ఎంతో దుఃఖిస్తూ, ఆ చేయి ఎండిపోయిన వానితో, “నీ చేయి చాపు” అని అన్నాడు. వాడు చేయి చాపాడు. వెంటనే అతని చేయి పూర్తిగా నయమైపోయింది. ఆ తర్వాత పరిసయ్యులు బయటికి వెళ్ళి, హేరోదీయులతో కలిసి యేసును చంపాలని కుట్రపన్నటం మొదలు పెట్టారు. యేసు తన శిష్యులతో కలిసి సముద్రం దగ్గరకు వెళ్ళాడు. గలిలయ నుండి చాలా మంది ప్రజలు ఆయన్ని అనుసరించారు. యేసు చేస్తున్నవన్నీ విని చాలామంది ప్రజలు యూదయ నుండి, యెరూషలేము నుండి, ఇదూమియ నుండి, యోర్దాను నది అవతలి వైపునున్న ప్రాంతాలనుండి, తూరు, సీదోను పట్టణాల చుట్టూవున్న ప్రాంతాలనుండి ఆయన దగ్గరకు వచ్చారు. చాలామంది ప్రజలు ఉండటం వల్ల వాళ్ళు తనను త్రోయకుండా ఉండాలని యేసు తన శిష్యులతో ఒక చిన్న పడవను తన కోసం సిద్ధం చేయమని చెప్పాడు. ఆయన చాలామందికి నయం చేసాడు. అందువల్ల రోగాలున్నవాళ్ళు ఆయన్ని తాకాలని ముందుకు త్రోసుకుంటూ వస్తూ ఉన్నారు. చెడు ఆత్మలు ఆయన్ని చూసినప్పుడల్లా ఆయన ముందుపడి బిగ్గరగా, “నీవు దేవుని కుమారుడివి” అని కేకలు వేసేవి. యేసు తానెవరో ఎవ్వరికి చెప్పవద్దని ఆ ప్రజల్ని గట్టిగా ఆజ్ఞాపించాడు. యేసు కొండపైకి వెళ్ళి తనకు కావలసిన వాళ్ళను పిలిపించాడు. వాళ్ళు ఆయన దగ్గరకు వెళ్ళారు. ఆయన పన్నెండుగురిని తన అపొస్తలులుగా నియమించాడు. వాళ్ళు తనతో ఉండాలని, ప్రకటించటానికి వాళ్ళను ప్రపంచంలోకి పంపాలని ఆయన ఉద్దేశ్యం. దయ్యాలను వదిలించే అధికారం వాళ్ళకిచ్చాడు. ఆయన నియమించిన పన్నెండుగురు అపొస్తలుల పేర్లు యివి: సీమోను, ఇతనికి పేతురు అనే పేరునిచ్చాడు. జెబెదయి కుమారులైన యాకోబు అతని సోదరుడు యోహాను, వీళ్ళకు బోయనేర్గెసు అనే పేరునిచ్చాడు. బోయనేర్గెసు అంటే “ఉరుముకు పుత్రులు” అని అర్థం. అంద్రెయ, ఫిలిప్పు, బర్తొలొమయి, మత్తయి, తోమా, అల్ఫయి కుమారుడు యాకోబు, తద్దయి, జెలటు అని పిలవబడే సీమోను, యేసుకు ద్రోహం చేసిన యూదా ఇస్కరియోతు. ఆ తర్వాత యేసు యింటికి వెళ్ళాడు. మళ్ళీ ప్రజలు సమావేశమయ్యారు. దీనితో ఆయనకు, ఆయన శిష్యులకు తినటానికి కూడా సమయం దొరకలేదు. ప్రజలు “ఆయనకు మతిపోయింది” అని అంటూ ఉండటంవల్ల ఆయన బంధువులు ఆయన భారం వహించటానికి వచ్చారు. యెరూషలేము నుండి వచ్చిన శాస్త్రులు, “అతనికి బయల్జెబూలు దయ్యం పట్టింది. దయ్యాల రాజు సహాయంతో అతడు దయ్యాలను వదిలిస్తున్నాడు” అని అన్నారు. అందువల్ల యేసు వాళ్ళను గురించి, ఉపమానాలు ఉపయోగించి వారితో ఈ విధంగా అన్నాడు: “సైతాను తనను తాను ఏవిధంగా పారద్రోలుతాడు? ఏ రాజ్యంలో చీలికలు వస్తాయో ఆ రాజ్యం నిలువదు. కుటుంబంలో చీలికలు వస్తే ఆ కుటుంబం నిలువదు. సైతాను తనకు తాను విరోధి అయి తన అధికారంతో చీలికలు తెచ్చుకొంటే ఆ సైతాను నిలవడు. వాని అధికారం అంతమౌతుంది. “నిజానికి బలవంతుని యింట్లోకి వెళ్ళి అతని వస్తువుల్ని దోచుకోవాలనుకొంటే మొదట ఆ బలవంతుణ్ణి కట్టివేయవలసి వస్తుంది. అప్పుడే ఆ యింటిని దోచుకోగల్గుతాడు. “నేను నిజం చెబుతున్నాను. మానవులు చేసిన అన్ని పాపాలను, వాళ్ళ దూషణలను, దేవుడు క్షమిస్తాడు. కాని పవిత్రాత్మను దూషించిన వాణ్ణి దేవుడు ఎప్పటికి క్షమించడు. అతణ్ణి శాశ్వతమైన పాపం చేసిన వానిగా పరిగణిస్తాడు.” ధర్మశాస్త్ర పండితులు తనలో దురాత్మ ఉందని అనటం వలన ఆయన పై విధంగా అన్నాడు. యేసు తల్లి, ఆయన సోదరులు అక్కడికి వచ్చారు. బయటే నిలుచుని యేసును పిలవమని ఒకణ్ణి లోపలికి పంపారు. యేసు చుట్టూ జనసమూహం ఉంది. వాళ్ళు ఆయనతో, “మీ తల్లి, సోదరులు మీకోసం అడుగుతూ బయట నిలుచున్నారు” అని అన్నారు. “ఎవరు నా తల్లి? ఎవరు నా సోదరులు?” అని అంటూ చుట్టూ కూర్చున్న వాళ్ళవైపు చూసి, “వీరే నా తల్లి, నా సోదరులు. దైవేచ్చానుసారం నడుచుకొనే వాళ్ళు నా సోదరులు, నా అక్కచెల్లెండ్లు, నా తల్లి” అని అన్నాడు.
మార్కు 3:1-35 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
సమాజమందిరములో ఆయన మరల ప్రవేశింపగా అక్కడ ఊచచెయ్యి గలవాడు ఒకడుండెను. అచ్చటి వారు ఆయనమీద నేరము మోపవలెననియుండి, విశ్రాంతిదినమున వానిని స్వస్థపరచునేమో అని ఆయనను కని పెట్టుచుండిరి. ఆయన నీవు లేచిమధ్యను నిలువుమని ఊచచెయ్యిగలవానితో చెప్పి వారిని చూచి విశ్రాంతిదినమున మేలుచేయుట ధర్మమా కీడుచేయుట ధర్మమా? ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా! అని అడిగెను; అందుకు వారు ఊరకుండిరి. ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి, కోపముతో వారిని కలయ చూచి నీ చెయ్యిచాపుమని ఆ మనుష్యునితో చెప్పెను; వాడు తన చెయ్యి చాపగా అది బాగుపడెను. పరి సయ్యులు వెలుపలికి పోయి వెంటనే హేరోదీయులతో కలిసికొని, ఆయన నేలాగు సంహరింతుమా యని ఆయనకు విరోధముగా ఆలోచనచేసిరి. యేసు తన శిష్యులతోకూడ సముద్రమునొద్దకు వెళ్లగా, గలిలయనుండి వచ్చిన గొప్ప జనసమూహము ఆయనను వెంబడించెను, మరియు ఆయన ఇన్ని గొప్ప కార్యములు చేయుచున్నాడని విని జనులు యూదయనుండియు, యెరూషలేమునుండియు, ఇదూమయనుండియు, యొర్దాను అవతలనుండియు, తూరు సీదోను అనెడి పట్టణప్రాంతములనుండియు ఆయనయొద్దకు గుంపులు గుంపులుగా వచ్చిరి. జనులు గుంపుకూడగా చూచి, వారు తనకు ఇరుకు కలిగింపకుండునట్లు చిన్నదోనె యొకటి తనకు సిద్ధపరచియుంచవలెనని ఆయన తన శిష్యులతో చెప్పెను. ఆయన అనేకులను స్వస్థపరచెను గనుక రోగపీడితులైన వారందరు ఆయనను ముట్టుకొనవలెనని ఆయనమీద పడుచుండిరి. అపవిత్రాత్మలు పెట్టినవారు ఆయనను చూడ గానే ఆయన యెదుట సాగిలపడి–నీవు దేవుని కుమారుడ వని చెప్పుచు కేకలువేసిరి. తన్ను ప్రసిద్ధిచేయవద్దని ఆయన వారికి ఖండితముగా ఆజ్ఞాపించెను. ఆయన కొండ యెక్కి తనకిష్టమైనవారిని పిలువగా వారాయన యొద్దకు వచ్చిరి. వారు తనతోకూడ ఉండునట్లును దయ్యములను వెళ్లగొట్టు అధికారముగలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలెనని ఆయన పండ్రెండు మందిని నియమించెను. వారెవరనగా–ఆయన పేతురను పేరుపెట్టిన సీమోను జెబెదయి కుమారుడగు యాకోబు, అతని సహోదరుడగు యోహాను; వీరిద్దరికి ఆయన బోయ నేర్గెసను పేరుపెట్టెను; బోయనేర్గెసు అనగా ఉరిమెడు వారని అర్థము. అంద్రెయ, ఫిలిప్పు, బర్తొలొమయి, మత్తయి, తోమా, అల్ఫయి కుమారుడగు యాకోబు, తద్దయి, కనానీయుడైన సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా అనువారు. ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు జనులు మరల గుంపు కూడి వచ్చిరి గనుక భోజనము చేయుటకైనను వారికి వీలు లేకపోయెను. ఆయన ఇంటివారు సంగతి విని, ఆయన మతి చలించియున్నదని చెప్పి ఆయనను పట్టుకొనబోయిరి. యెరూషలేమునుండి వచ్చిన శాస్త్రులు ఇతడు బయల్జెబూలు పెట్టినవాడై దయ్యముల యధిపతిచేత దయ్యములను వెళ్లగొట్టుచున్నాడని చెప్పిరి. అప్పుడాయన వారిని తన యొద్దకు పిలిచి, ఉపమానరీతిగా వారితో ఇట్లనెను– సాతాను సాతాను నేలాగు వెళ్లగొట్టును? ఒక రాజ్యము తనకు తానే విరోధముగా వేరుపడినయెడల, ఆ రాజ్యము నిలువనేరదు. ఒక యిల్లు తనుకుతానే విరోధముగా వేరు పడినయెడల, ఆ యిల్లు నిలువనేరదు. సాతాను తనకు తానే విరోధముగా లేచి వేరుపడినయెడల వాడు నిలువలేక కడతేరును. ఒకడు బలవంతుడైనవానిని మొదట బంధించితేనే తప్ప, ఆ బలవంతుని ఇంటజొచ్చి వాని సామగ్రి దోచుకొననేరడు; బంధించినయెడల వాని యిల్లు దోచుకొనవచ్చును. సమస్త పాపములును మనుష్యులుచేయు దూషణలన్నియు వారికి క్షమింపబడును గాని పరిశుద్ధాత్మ విషయము దూషణచేయువాడెప్పుడును క్షమాపణ పొందక నిత్యపాపము చేసినవాడైయుండునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ పెట్టినవాడని వారు చెప్పిరి. ఆయన సహోదరులును తల్లియు వచ్చి వెలుపల నిలిచి ఆయనను పిలువనంపిరి. జనులు గుంపుగా ఆయనచుట్టు కూర్చుండిరి. వారు ఇదిగో నీ తల్లియు నీ సహోదరు లును వెలుపల ఉండి, నీకోసరము వెదకుచున్నారని ఆయనతో చెప్పగా ఆయన–నా తల్లి నా సహోదరులు ఎవరని తన చుట్టుకూర్చున్న వారిని కలయచూచి– ఇదిగో నా తల్లియు నా సహోదరులును; దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడును సహో దరియు తల్లియునని చెప్పెను.