మార్కు 2:23-26
మార్కు 2:23-26 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
ఒక సబ్బాతు దినాన యేసు పంటచేనుల గుండా వెళ్తున్నప్పుడు, ఆయనతోపాటు నడుస్తున్న శిష్యులు, కొన్ని కంకులు తెంపుకొని తినడం మొదలుపెట్టారు. అది చూసిన పరిసయ్యులు, “చూడు, ఎందుకు వారు సబ్బాతు దినాన చేయకూడని పని చేస్తున్నారు?” అని ఆయనతో అన్నారు. అందుకు ఆయన, “దావీదుకు మరియు అతనితో ఉన్నవారికి ఆకలి వేసినప్పుడు, అవసరంలో ఉన్నప్పుడు అతడు ఏమి చేశాడో మీరు చదవలేదా? ప్రధాన యాజకుడైన అబ్యాతారు దినాలలో, అతడు దేవుని ఆలయంలో ప్రవేశించి, ధర్మశాస్త్రం ప్రకారం యాజకులు తప్ప మరెవరు తినకూడని ప్రతిష్ఠిత రొట్టెను తీసుకొని తాను తిని, తనతో ఉన్నవారికి కూడా ఇచ్చాడు” అని జవాబిచ్చారు.
మార్కు 2:23-26 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
విశ్రాంతి దినాన ఆయన పంట చేలలో నడుస్తూ ఉన్నాడు. ఆయన శిష్యులు తాము తినడానికి కొన్ని ధాన్యం కంకులను తుంచారు. పరిసయ్యులు, “చూడు, నీ శిష్యులు విశ్రాంతి దినాన చేయకూడని పని ఎందుకు చేస్తున్నారు?” అని ఆయనను అడిగారు. అందుకాయన వారితో ఇలా అన్నాడు, “దావీదు, అతనితో ఉన్నవారు అవసరంలో ఆకలిగా ఉన్నప్పుడు అతడు చేసింది మీరు చదవలేదా? అబ్యాతారు ప్రధాన యాజకుడిగా ఉన్నప్పుడు దావీదు దేవుని మందిరంలో ప్రవేశించి యాజకులు తప్ప మరెవ్వరూ తినకూడని సన్నిధి రొట్టెలు తిని తనతో ఉన్నవారికి పెట్టలేదా?” అన్నాడు.
మార్కు 2:23-26 పవిత్ర బైబిల్ (TERV)
ఒక విశ్రాంతి రోజు యేసు పొలాల ద్వారా వెళ్తూవున్నాడు. ఆయన శిష్యులు కూడా ఆయన వెంటే ఉన్నారు. వాళ్ళు తినటానికి కొన్ని దాన్యపు కంకుల్ని త్రుంచారు. పరిసయ్యులు ఆయనతో, “అదిగో చూడండి! వాళ్ళు విశ్రాంతి రోజు చేయకూడని పని ఎందుకు చేస్తున్నారు?” అని అడిగారు. యేసు, “దావీదు, అతని అనుచరులు ఆకలితో ఉన్నప్పుడు వాళ్ళకు ఆహారం కావలసివచ్చింది. అప్పుడు దావీదు ఏం చేసాడో మీరు ఎన్నడూ చదవలేదా? అబ్యాతారు ప్రధానయాజకుడుగా ఉన్న కాలంలో దావీదు దేవాలయంలోకి ప్రవేశించి దేవుని సముఖమున పెట్టిన రొట్టె తీసుకొని, తానుతిని, తన సహచరులకు కూడా కొంత యిచ్చాడు. ఈ రొట్టెను యాజకులు తప్ప యితరులు తినకూడదు” అని అన్నాడు.
మార్కు 2:23-26 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
మరియు ఆయన విశ్రాంతిదినమున పంటచేలలోబడి వెళ్లుచుండగా, శిష్యులు మార్గమున సాగిపోవుచు– వెన్నులు త్రుంచుచునుండిరి. అందుకు పరిసయ్యులు–చూడుము, విశ్రాంతిదినమున చేయకూడనిది వారేల చేయుచున్నారని ఆయన నడిగిరి. అందుకాయన వారితో ఇట్లనెను తానును తనతోకూడ నున్నవారును ఆకలిగొని నందున దావీదునకు అవసరము వచ్చినప్పుడు అతడు చేసినది మీరెన్నడును చదువలేదా? అబ్యాతారు ప్రధానయాజకుడై యుండగా దేవమందిరములోనికి వెళ్లి, యాజకులేగాని యితరులు తినకూడని సముఖపు రొట్టెలు తాను తిని, తనతోకూడ ఉన్నవారికిచ్చెను గదా అని చెప్పెను.