మార్కు 2:1-4
మార్కు 2:1-4 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
కొన్ని రోజుల తర్వాత, యేసు మళ్ళీ కపెర్నహూము పట్టణంలో ప్రవేశించినప్పుడు, ఆయన ఇంటికి వచ్చారని ప్రజలకు తెలిసింది. వారు పెద్ద సంఖ్యలో కూడి వచ్చారు కనుక తలుపు బయట నిలబడడానికి కూడ స్థలం లేదు, అయినా ఆయన వారికి వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. అప్పుడు కొందరు మనుష్యులు పక్షవాతంగల ఒక వ్యక్తిని ఆయన దగ్గరకు తీసుకొని వచ్చారు, నలుగురు అతన్ని మోసుకొచ్చారు. కానీ ప్రజలు గుంపుగా ఉన్నందుకు వాన్ని యేసు దగ్గరకు తీసుకొని వెళ్లలేక, సరిగ్గా యేసు ఉన్న చోట ఇంటి పైకప్పును విప్పి పక్షవాతంగల వాన్ని చాపపై పడుకోబెట్టి కిందికి దింపారు.
మార్కు 2:1-4 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
కొద్ది రోజుల తరువాత యేసు కపెర్నహూము పట్టణానికి తిరిగి వచ్చాడు. ఆయన ఇంట్లో ఉన్నాడని ప్రజలకు తెలిసింది. చాలా మంది అక్కడ గుమికూడారు. తలుపు దగ్గర కూడా చోటు లేకపోయింది. యేసు వారికి ఉపదేశం చేయసాగాడు. నలుగురు మనుషులు ఒక పక్షవాత రోగిని మోసుకుంటూ అక్కడికి తెచ్చారు. ప్రజలంతా గుమికూడిన కారణంగా రోగిని ఆయనకు దగ్గరగా తీసుకురాలేకపోయారు. అందువల్ల వారు ఆయన ఉన్న గది పైకప్పు ఊడదీసి, సందుచేసి, ఆ పక్షవాత రోగిని అతని పరుపుతో సహా యేసు ముందు దించారు.
మార్కు 2:1-4 పవిత్ర బైబిల్ (TERV)
కొద్ది రోజుల తర్వాత యేసు మళ్ళీ కపెర్నహూము పట్టణానికి వెళ్ళాడు. ఆయన ఇంటికి వచ్చాడన్న వార్త ప్రజలకు తెలిసింది. చాలా మంది ప్రజలు సమావేశం అవటం వల్ల స్థలం చాలలేదు. తలుపు అవతల కూడా స్థలం లేకపోయింది. యేసు వాళ్ళకు ఉపదేశిస్తూ ఉన్నాడు. ఇంతలో నలుగురు మనుష్యులు ఒక పక్షవాత రోగిని మోసికొని అక్కడికి తీసుకు వచ్చారు. చాలామంది ప్రజలుండటం వల్ల రోగిని యేసు ముందుకు తీసుకు రాలేకపోయారు. అందువల్ల వాళ్ళు యేసు వున్న గది పైకప్పు తెరచి, ఆ పక్షవాత రోగిని, అతడు పడుకొని ఉన్న చాపతో సహా ఆ సందు ద్వారా యేసు ముందుకు దించారు.
మార్కు 2:1-4 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
కొన్నిదినములైన పిమ్మట ఆయన మరల కపెర్న హూములోనికి వచ్చెను ఆయన యింట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడివచ్చిరి గనుక వాకిటనైనను వారికి స్థలము లేకపోయెను. ఆయన వారికి వాక్యము బోధించుచుండగా కొందరు పక్షవాయువుగల ఒక మనుష్యుని నలుగురిచేత మోయించుకొని ఆయనయొద్దకు తీసికొని వచ్చిరి. చాలమంది కూడియున్నందున వారాయనయొద్దకు చేరలేక, ఆయన యున్నచోటికి పైగా ఇంటి కప్పు విప్పి, సందుచేసి పక్షవాయువుగలవానిని పరుపుతోనే దింపిరి.