మార్కు 15:6-11
మార్కు 15:6-11 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
పండుగ రోజు ప్రజల కోరిక ప్రకారం ఒక నేరస్థుని విడుదల చేయడం ఆనవాయితి. తిరుగుబాటు చేసి, మనుష్యులను చంపినందుకు బంధింపబడిన వారిలో బరబ్బా అనేవాడు ఉన్నాడు. ప్రజలు గుంపుగా వచ్చి, అతడు ఎప్పుడూ చేసినట్లే చేయమని పిలాతును కోరారు. ముఖ్య యాజకులు కేవలం అసూయతోనే యేసును అప్పగించారని పిలాతుకు తెలుసు, కనుక “యూదుల రాజును విడుదల చేయమంటారా?” అని అడిగాడు. కాని ముఖ్య యాజకులు, యేసుకు బదులుగా బరబ్బాను విడుదల చేసేలా పిలాతును కోరమని గుంపును రెచ్చగొట్టారు.
మార్కు 15:6-11 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
పండగ రోజున ప్రజల కోరిక ప్రకారం ఒక ఖైదీని విడుదల చేయడం పిలాతుకు ఆనవాయితీ. బరబ్బ అనే ఒక ఖైదీ హంతకులైన తన తోటి తిరుగుబాటుదారులతో ఖైదులో ఉన్నాడు. జన సమూహం ప్రతి సంవత్సరం విడుదల చేసినట్టే ఆ సంవత్సరం కూడా ఒకరిని విడుదల చేయమని పిలాతును కోరారు. పిలాతు, “యూదుల రాజును మీకు విడుదల చేయాలని కోరుతున్నారా?” అని అన్నాడు. ఎందుకంటే ముఖ్య యాజకులు కేవలం అసూయ చేతనే యేసును తనకు అప్పగించారని అతడు గ్రహించాడు. కాని ముఖ్య యాజకులు, యేసుకు బదులుగా బరబ్బను విడుదల చెయ్యాలని కోరమని ప్రజలను పురికొల్పారు.
మార్కు 15:6-11 పవిత్ర బైబిల్ (TERV)
పండుగ రోజు ప్రజల కోరిక ప్రకారం ఒక నేరస్తుణ్ణి విడుదల చేయటం ఒక ఆచారం. తిరుగుబాటులో పాల్గొని హత్యలు చేసిన వాళ్ళు కారాగారంలో ఉన్నారు. వాళ్ళలో బరబ్బ ఒకడు. ప్రజలు పిలాతు దగ్గరకు వచ్చి ప్రతి సంవత్సరం విడుదల చేసినట్లే ఆ సంవత్సరం కూడా ఒకణ్ణి విడుదల చెయ్యమని కోరారు. ప్రధానయాజకులు అసూయవల్ల యేసును తనకప్పగించారని పిలాతుకు తెలుసు. కనుక, “యూదుల రాజును విడుదల చెయ్యమంటారా?” అని అడిగాడు. కాని ప్రధానయాజకులు యేసుకు మారుగా బరబ్బాను విడుదల చేసేటట్లు పిలాతును కోరమని ప్రజలను పురికొల్పారు.
మార్కు 15:6-11 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఆ పండుగలో వారు కోరుకొనిన యొక ఖయిదీని పిలాతు విడిపించువాడు. అధికారుల నెదిరించి, కలహములో నరహత్య చేసినవారితోకూడ బంధించబడియుండిన బరబ్బ అను ఒకడుండెను. జనులు గుంపుగా కూడివచ్చి, అతడు అదివరకు తమకు చేయుచువచ్చిన ప్రకారము చేయవలెనని అడుగగా ప్రధానయాజకులు అసూయ చేత యేసును అప్పగించిరని పిలాతు తెలిసికొని–నేను యూదుల రాజును మీకు విడుదల చేయగోరుచున్నారా? అని అడిగెను. అతడు బరబ్బను తమకు విడుదల చేయవలెనని జనులు అడుగుకొనునట్లు ప్రధానయాజకులు వారిని ప్రేరేపించిరి.