మార్కు 15:1-5
మార్కు 15:1-5 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఉదయముకాగానే ప్రధానయాజకులును పెద్ద లును శాస్త్రులును మహాసభవారందరును కలిసి ఆలోచనచేసి, యేసును బంధించి తీసికొనిపోయి పిలాతునకు అప్పగించిరి. పిలాతు–యూదులరాజవు నీవేనా? అని ఆయన నడుగగా ఆయన–నీవన్నట్టే అని అతనితో చెప్పెను. ప్రధానయాజకులు ఆయనమీద అనేకమైన నేరములు మోపగా పిలాతు ఆయనను చూచి మరల–నీవు ఉత్తర మేమియు చెప్పవా? నీ మీద వీరు ఎన్నెన్ని నేరములు మోపుచున్నారో చూడుమనెను. అయినను యేసు మరి ఏ ఉత్తరము చెప్పలేదు గనుక పిలాతు ఆశ్చర్య పడెను.
మార్కు 15:1-5 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
తెల్లవారుజామున ముఖ్య యాజకులు, నాయకులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు మరియు న్యాయసభ సభ్యులు అందరు కలిసి ఆలోచన చేశారు. కనుక వారు యేసును బంధించి, తీసుకువెళ్లి అధిపతియైన పిలాతు చేతికి అప్పగించారు. పిలాతు యేసును, “నీవు యూదుల రాజువా?” అని అడిగాడు. అందుకు యేసు, “అని నీవే అన్నావు” అని జవాబిచ్చారు. ముఖ్య యాజకులు యేసు మీద అనేక నేరాలు మోపారు. అందుకు పిలాతు మళ్ళీ యేసుతో, “నీవు వారికి జవాబు చెప్పవా? వారు నీకు వ్యతిరేకంగా ఎన్ని నేరాలు మోపుతున్నారో చూడు!” అన్నాడు. కాని యేసు జవాబివ్వలేదు, కనుక పిలాతు ఆశ్చర్యపోయాడు.
మార్కు 15:1-5 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
తెల్లవారు జామున ముఖ్య యాజకులు, పెద్దలు, ధర్మశాస్త్ర పండితులు, యూదుల మహాసభకు చెందిన సభ్యులు కలసి సమాలోచన చేశారు. తరువాత వారు యేసును బంధించి తీసుకువెళ్ళి రోమా గవర్నర్ పిలాతుకు అప్పగించారు. పిలాతు యేసును, “నీవు యూదుల రాజువా?” అని ప్రశ్నించాడు. అందుకు యేసు, “నువ్వే అంటున్నావుగా” అని అతనికి జవాబిచ్చాడు. ముఖ్య యాజకులు ఆయన మీద చాలా నేరాలు మోపారు. కనుక పిలాతు మరొకసారి ఆయనను ప్రశ్నిస్తూ, “వీళ్ళు నీకు వ్యతిరేకంగా ఎన్ని నేరారోపణలు చేస్తున్నారో చూడు! నీవేమీ జవాబు చెప్పవా?” అన్నాడు. అయినా యేసు మారు పలకలేదు. ఇది చూసి పిలాతుకు చాలా ఆశ్చర్యం వేసింది.
మార్కు 15:1-5 పవిత్ర బైబిల్ (TERV)
తెల్లవారుఝామున ప్రధాన యాజకులు, పెద్దలు, శాస్త్రులు, మహాసభకు చెందిన అందరు సభ్యులు కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు. వాళ్ళు యేసును బంధించి తీసుకెళ్ళి పిలాతుకు అప్పగించారు. పిలాతు, “నీవు యూదులకు రాజువా?” అని అడిగాడు. “మీరే అంటున్నారుగా!” అని యేసు సమాధానం చెప్పాడు. ప్రధానయాజకులు యేసు మీద ఎన్నో నేరాలు మోపారు. అందువల్ల పిలాతు యేసుతో మళ్ళీ, “నీవు సమాధానం చెప్పదలచుకోలేదా? వాళ్ళు నీ మీద ఎన్ని నేరాలు మోపుతున్నారో చూడు!” అని అన్నాడు. అయినా యేసు సమాధానం చెప్పలేదు. ఇది చూసి పిలాతుకు చాలా ఆశ్చర్యం వేసింది.