మార్కు 13:1-37

మార్కు 13:1-37 తెలుగు సమకాలీన అనువాదము (TCV)

యేసు దేవాలయం నుండి వెళ్తుండగా, ఆయన శిష్యులలో ఒకడు, “బోధకుడా, చూడండి! ఈ రాళ్ళు ఎంత పెద్దగా ఉన్నాయో! ఈ కట్టడాలు ఎంత అద్బుతంగా ఉన్నాయో!” అని ఆయనతో అన్నాడు. అందుకు యేసు “నీవు ఈ గొప్ప కట్టడాలన్నిటిని చూస్తున్నావా? ఇందులో ఒక రాయి మీద ఇంకొక రాయి ఉండదు; ప్రతి ఒకటి పడవేయబడుతుంది” అని చెప్పారు. యేసు దేవాలయానికి ఎదురుగా ఉన్న ఒలీవల కొండ మీద కూర్చుని ఉన్నప్పుడు, పేతురు, యాకోబు, యోహాను మరియు అంద్రెయలు ఏకాంతంగా ఉన్నప్పుడు, “ఈ సంగతులు ఎప్పుడు జరుగుతాయి? ఇవన్నీ నెరవేరబడబోతున్నాయి అనడానికి సూచన ఏంటి? మాకు చెప్పండి” అని ఆయనను అడిగారు. అందుకు యేసు వారితో, “ఎవరు మిమ్మల్ని మోసగించకుండ జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే అనేకులు నా పేరిట వచ్చి, ‘నేనే ఆయనను’ అని చెప్పి చాలామందిని మోసం చేస్తారు. మీరు యుద్ధాల గురించి, యుద్ధ సమాచారాలను గురించి వినినప్పుడు, ఆందోళన చెందకండి. అలాంటివన్ని జరగవలసివుంది, కాని అంతం రావలసి ఉంది. జనాల మీదికి జనాలు, రాజ్యాల మీదికి రాజ్యాలు లేస్తాయి. అక్కడక్కడ కరువులు, భూకంపాలు వస్తాయి. ఇవన్నీ ప్రసవ వేదనలకు ప్రారంభం మాత్రమే. “మీరు జాగ్రత్తగా ఉండాలి. మీరు న్యాయసభలకు అప్పగించబడతారు, సమాజమందిరాల్లో కొరడాలతో కొట్టబడతారు. నన్ను బట్టి మీరు అధికారుల యెదుట రాజుల యెదుట వారికి సాక్షులుగా నిలబడతారు. ఈ సువార్త మొదట అన్ని దేశాల ప్రజలకు ప్రకటించబడాలి. మీరు బంధించబడి తీర్పుకు అప్పగించబడినప్పుడు ఏమి చెప్పాలో అని మీరు ముందుగానే చింతించవద్దు. ఆ సమయంలో మీకు ఇవ్వబడిన మాటలనే చెప్పండి, ఎందుకంటే మాట్లాడేది మీరు కాదు, పరిశుద్ధాత్మ మీ ద్వారా మాట్లాడతాడు. “సహోదరుడు సహోదరున్ని, తండ్రి తన బిడ్డను మరణానికి అప్పగిస్తారు. పిల్లలు తల్లిదండ్రుల మీద తిరగబడి వారిని చంపిస్తారు. నన్ను బట్టి ప్రతి ఒక్కరు మిమ్మల్ని ద్వేషిస్తారు, కాని చివరి వరకు స్థిరంగా నిలబడినవారే రక్షింపబడతారు. “ ‘నిర్జనంగా మారడానికి కారణమైన హేయమైనది’ నిలబడకూడని స్థలంలో నిలబడడం మీరు చూసినప్పుడు, చదివేవాడు అర్థం చేసుకొనును గాక, అప్పుడు యూదయలోని వారు కొండల్లోకి పారిపోవాలి. ఇంటిపైన ఉన్న వారెవరు కిందికి దిగకూడదు ఇంట్లోకి వెళ్లి దేనిని బయటకు తీసుకురాకూడదు. పొలంలో ఉన్నవారు తమ పైవస్త్రాన్ని తెచ్చుకోడానికి వెనక్కి వెళ్లకూడదు. ఆ దినాల్లో గర్భిణీ స్త్రీలకు, పాలిచ్చే తల్లులకు శ్రమ! ఇది చలికాలంలో రాకుండా ప్రార్థించండి. ఎందుకంటే దేవుడు లోకాన్ని సృష్టించినప్పటి నుండి నేటి వరకు అలాంటి శ్రమకాలాలు రాలేదు, మరి ఎప్పటికి రావు. “ప్రభువు ఆ దినాలను తగ్గించకపోతే ఎవ్వరూ తప్పించుకోలేరు. కాని ఎన్నుకోబడినవారి కొరకు, అనగా ఆయన ఎన్నికలో ఉన్న వారి కొరకు ఆ రోజులు తగ్గించబడతాయి. ఆ రోజుల్లో మీతో ఎవరైనా, ‘ఇదిగో, క్రీస్తు ఇక్కడ ఉన్నాడు!’ లేదా, ‘ఇదిగో, ఆయన అక్కడ ఉన్నాడు!’ అని చెప్పితే నమ్మకండి. ఎందుకంటే అబద్ధ క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు వచ్చి దేవుడు ఎన్నుకొన్న వారిని సహితం మోసం చేయడానికి సూచక క్రియలను, అద్బుతాలను చేస్తారు. కనుక మీరు జాగ్రత్తగా ఉండండి; అందుకే ఈ విషయాలను నేను మీకు ముందుగానే చెప్పాను. “కాని ఆ దినాలలో, ఆ శ్రమకాలం తర్వాత, “ ‘సూర్యుడు నల్లగా మారుతాడు, చంద్రుడు తన కాంతిని కోల్పోతాడు. నక్షత్రాలు ఆకాశం నుండి రాలిపోతాయి, ఆకాశ సంబంధమైనవి కదల్చబడతాయి.’ “అప్పుడు మనుష్యకుమారుడు గొప్ప శక్తితో మరియు మహిమతో మేఘాలలో రావడం ప్రజలు చూస్తారు. ఆయన తన దూతలను పంపి, నలుదిక్కుల నుండి, భూమి చివర్ల నుండి ఆకాశాల చివర్ల వరకు ఆయన ఎన్నుకొన్న వారిని పోగుచేస్తారు. “అంజూరపు చెట్టును చూసి ఒక పాఠం నేర్చుకోండి: అంజూరపు కొమ్మలు లేతవై చిగురిస్తున్నప్పుడు, వేసవికాలం సమీపంగా ఉందని మీకు తెలుస్తుంది. అలాగే, ఈ సంగతులన్ని జరుగుతున్నాయని మీరు చూసినప్పుడు, ఆయన రాకడ చాలా దగ్గరలో ఉందని, తలుపు దగ్గరే ఉందని మీరు తెలుసుకోండి. ఇవన్ని జరిగే వరకు ఈ తరం గతించదని ఖచ్చితంగా మీతో చెప్తున్నాను. ఆకాశం మరియు భూమి గతించిపోతాయి, గాని నా మాటలు ఏ మాత్రం గతించవు. “అయితే ఆ దినము గురించి, ఆ సమయం గురించి ఎవరికి తెలియదు, కనీసం పరలోకంలోని దూతలకు గాని, తన కుమారునికి గాని తెలియదు. కేవలం తండ్రికి మాత్రమే తెలుసు. జాగ్రత్తగా ఉండండి! మెలకువగా ఉండండి! ఆ సమయం ఎప్పుడు వస్తుందో మీకు తెలియదు. అది తన ఇల్లు విడిచి దూరదేశం వెళ్తున్న ఒక మనిషిని పోలి ఉంది: అతడు సేవకులకు అధికారం ఇచ్చి, ప్రతీ సేవకునికి వారి వారి పనులను అప్పగించి, ద్వారం దగ్గర ఉన్న వానికి కాపలా కాయమని చెప్తాడు. “ఇంటి యజమాని సాయంత్రం వస్తాడో, మధ్యరాత్రి వస్తాడో, కోడి కూసే వేళకు వస్తాడో, లేక సూర్యోదయం వేళకు వస్తాడో, ఎప్పుడు వస్తాడో మీకు తెలియదు కనుక మెలకువగా ఉండండి. అతడు ఒకవేళ అకస్మాత్తుగా వస్తే, మీరు నిద్రపోవడం చూస్తాడేమో అని జాగ్రత్తగా ఉండండి! నేను మీతో చెప్తుందే ప్రతి ఒక్కరితో చెప్తున్నాను: ‘మెలకువగా ఉండండి!’ ” అన్నారు.

షేర్ చేయి
Read మార్కు 13

మార్కు 13:1-37 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

యేసు దేవాలయంలో నుండి వస్తూ ఉండగా ఆయన శిష్యుల్లో ఒకడు, “బోధకా! ఈ రాళ్ళు, కట్టడాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో చూశావా!” అన్నాడు. యేసు అతనితో, “ఈ గొప్ప కట్టడాలు చూస్తున్నావు కదా! రాయి మీద రాయి నిలవకుండా ఈ రాళ్ళన్నీ కూలిపోతాయి” అన్నాడు. యేసు దేవాలయానికి ఎదురుగా ఉన్న ఒలీవల కొండ మీద కూర్చుని ఉన్నప్పుడు పేతురు, యాకోబు, యోహాను, అంద్రెయ ఏకాంతంగా ఆయనను ఇలా అడిగారు. “ఇది ఎప్పుడు జరుగుతుంది? ఇవి జరగడానికి ముందు సూచన ఏమైనా కనబడుతుందా?” యేసు వారితో, “మిమ్మల్ని ఎవ్వరూ మోసం చేయకుండా, తప్పుదోవ పట్టించకుండా జాగ్రత పడండి. చాలా మంది నా పేరుతో వచ్చి ‘నేనే ఆయనను’ అంటూ చాలా మందిని మోసం చేస్తారు. మీరు యుద్ధాల గురించిన వార్తలు, వదంతులు విన్నప్పుడు ఆందోళన చెందకండి. అవి తప్పక సంభవిస్తాయి. కాని అంతం అప్పుడే రాదు. జనం మీదికి జనం, దేశం మీదికి దేశం లేస్తాయి. అనేక ప్రాంతాల్లో భూకంపాలు, కరువులు వస్తాయి. ఇవి ప్రసవించే ముందు కలిగే నొప్పుల్లాంటివి మాత్రమే. మీరు జాగ్రతగా ఉండండి! కొందరు మిమ్మల్ని చట్టసభలకు అప్పగిస్తారు. సమాజ మందిరాల్లో మీరు దెబ్బలు తినవలసి వస్తుంది. నా కారణంగా మీరు అధికారుల ముందు, రాజుల ముందు నిలబడి సాక్ష్యం చెప్పవలసి వస్తుంది. అంతానికి ముందు అన్ని జాతులకూ సువార్త ప్రకటించడం జరగాలి. వారు మిమ్మల్ని పట్టుకుని తీర్పుకు అప్పగించేటప్పుడు మీరు ఏమి మాట్లాడాలో అని కంగారుపడకండి. ఏమి మాట్లాడాలో ముందుగా ఆలోచన చేసుకోవద్దు. ఆ గడియలో మీకేది ఇయ్యబడుతుందో అదే చెప్పండి. ఎందుకంటే ఆ సమయంలో మాట్లాడేది మీరు కాదు, పరిశుద్ధాత్మ. సోదరుడు తన సోదరుడికి ద్రోహం చేసి చావుకు అప్పగిస్తారు. అదే విధంగా తండ్రి తన కుమారుణ్ణి మరణానికి అప్పగిస్తాడు. పిల్లలు తల్లిదండ్రులకు వ్యతిరేకంగా లేచి వారిని మరణానికి అప్పగిస్తారు. నా కారణంగా అందరూ మిమ్మల్ని ద్వేషిస్తారు. కాని, చివరి వరకూ సహించిన వారిని దేవుడు రక్షిస్తాడు. “వినాశకారి అయిన హేయ వస్తువు నిలబడకూడని స్థలంలో నిలబడడం మీరు చూసినప్పుడు (ఇది చదివేవాడు గ్రహిస్తాడు గాక) యూదయలో ఉన్నవారు కొండల్లోకి పారిపోవాలి. మిద్దె మీద ఉన్న వారు కిందికి దిగి ఇళ్ళలోకి వెళ్ళడం గానీ తమ వస్తువులు తెచ్చుకోవడం గానీ చేయకూడదు. పొలాల్లో ఉన్నవారు పై వస్త్రం తెచ్చుకోడానికి వెనక్కి రాకూడదు. గర్భవతులకూ బాలింతలకూ ఆ రోజుల్లో ఎంతో కష్టం. ఈ సంభవం చలికాలంలో జరగకుండా ఉండాలని ప్రార్థన చేయండి. ఎందుకంటే దేవుడు ఈ ప్రపంచాన్ని సృష్టించిన రోజు నుండి ఈనాటి వరకూ ఎన్నడూ రాని కష్టాలు ఆ రోజుల్లో వస్తాయి. అవి ఇక ముందు రావు కూడా. దేవుడు ఆ రోజుల సంఖ్య తక్కువ చెయ్యకపోతే శరీరం ఉన్న ఎవ్వరూ తప్పించుకోలేరు. కాని, తాను ఎన్నుకున్న ప్రజల కోసం ఆయన ఆ రోజులను తక్కువ చేస్తాడు. ఆ రోజుల్లో ఎవరైనా మీతో, ‘ఇదుగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, ఇదుగో అక్కడ ఉన్నాడు’ అంటే నమ్మకండి. కపట క్రీస్తులు, కపట ప్రవక్తలు వస్తారు. అద్భుతాలు, మహత్కార్యాలు ప్రదర్శించి దేవుడు ఎన్నుకున్న వారిని కూడా మోసగించి తప్పు దారి పట్టిస్తారు. అందువల్ల మీరు జాగ్రత్తగా ఉండండి. మీకు అన్ని విషయాలు ముందే చెబుతున్నాను. “ఆ కష్టకాలం గడచిన తరువాతి రోజుల్లో, సూర్యుడు చీకటైపోతాడు. చంద్రుడు కాంతినివ్వడు. ఆకాశ నక్షత్రాలు రాలిపోతాయి. ఆకాశంలో ఉన్న శక్తులన్నీ కదిలిపోతాయి. అప్పుడు మనుష్య కుమారుడు గొప్ప శక్తితో ప్రభావంతో మేఘాల మీద రావడం మనుషులు చూస్తారు. అప్పుడాయన భూమి నలువైపుల నుండి ఆకాశం నలువైపుల దాకా తన దూతలను పంపి ఆయన ఎన్నుకున్న ప్రజలను పోగుచేయిస్తాడు.” “అంజూరు చెట్టును చూసి ఈ ఉపమానం నేర్చుకోండి. దాని కొమ్మలు చిగురించడం చూసి వసంతకాలం వస్తున్నదని మీరు గ్రహిస్తారు. అదే విధంగా ఈ సంగతులు జరగడం మీరు చూసినప్పుడు ఆయన దగ్గరలోనే ఉన్నాడనీ, త్వరలో రాబోతున్నాడనీ తెలుసుకోండి. నేను కచ్చితంగా చెప్పేదేమంటే, ఈ తరం వారు బతికి ఉండగానే ఇవన్నీ జరుగుతాయి. ఆకాశం, భూమి గతించిపోతాయి. కాని నా మాటలు ఎన్నటికీ గతించవు. అయితే ఆ రోజు, ఆ గంట ఎప్పుడు వస్తుందో పరలోకంలోని దేవదూతలకు గాని, కుమారుడికి గానీ, మరెవ్వరికీ తెలియదు. తండ్రికి మాత్రమే తెలుసు. జాగ్రతగా ఉండండి. సిద్ధంగా ఉండండి. ఎందుకంటే ఆ సమయం ఎప్పుడు వస్తుందో మీకు తెలియదు. “ఇది తన ఇల్లు విడిచి వేరే దేశం వెళ్ళిన ఒక మనిషిలాగా ఉంటుంది. అతడు తన సేవకులకు అధికారం ఇచ్చి, ఒక్కొక్కడికి ఒక్కొక్క పని అప్పగించి ద్వారం దగ్గర ఉన్నవాడికి మెలకువగా ఉండమని చెప్పాడు. కాబట్టి ఎప్పుడూ అప్రమత్తంగా ఉండండి. ఎందుకంటే ఇంటి యజమాని ఎప్పుడు తిరిగి వస్తాడో మీకు తెలియదు. సాయంత్రం వస్తాడో, అర్థరాత్రి వస్తాడో, కోడి కూసే వేళ వస్తాడో, సూర్యోదయం వేళ వస్తాడో మీకు తెలియదు. ఆయన హఠాత్తుగా వచ్చి మీరు నిద్రపోతూ ఉండడం చూస్తాడేమో జాగ్రత్త! నేను మీకు చెబుతున్నది అందరికి చెప్తున్నాను, మెలకువగా ఉండండి.”

షేర్ చేయి
Read మార్కు 13

మార్కు 13:1-37 పవిత్ర బైబిల్ (TERV)

యేసు మందిరం నుండి వెళ్తుండగా శిష్యుల్లో ఒకడు, “బోధకుడా! చూడండి, ఎంత అద్భుతమైన పెద్ద రాళ్ళో! ఎంత పెద్ద కట్టడాలో చూడండి!” అని అన్నాడు. యేసు సమాధానంగా, “నీవు పెద్ద కట్టడాన్ని చూస్తున్నావా? రాయి మీద రాయి నిలువకుండా రాళ్ళన్ని పడిపోతాయి” అని అన్నాడు. యేసు మందిరానికి ఎదురుగా ఉన్న ఒలీవల కొండపై కూర్చొన్నాడు. ఆయన వెంట ఆయన శిష్యులు పేతురు, యాకోబు, యోహాను మరియు అంద్రెయ ఉన్నారు. వాళ్ళు ఆయనతో “ఇది ఎప్పుడు జరుగుతుందో మాకు చెప్పండి. ఇవి జరుగబోయే సమయం వచ్చిందని సూచించటానికి ఏం జరుగుతుంది?” అని అడిగారు. యేసు వాళ్ళతో, “మిమ్మల్నెవరూ మోసం చేయకుండా జాగ్రత్తపడండి. అనేకులు నా పేరు పెట్టుకొని వచ్చి, నేనే ఆయన్ని అని చెప్పి అనేకుల్ని మోసం చేస్తారు. మీరు యుద్ధాల్ని గురించి కాని, యుద్ధాల వదంతుల్ని గురించి కాని వింటే వెంటనే ఆందోళన చెందకండి. అవి తప్పక సంభవిస్తాయి. కాని అంతం అప్పుడే రాదు. దేశాలకు, రాజ్యాలకు మధ్య యుద్ధాలు సంభవిస్తాయి. అనేక ప్రాంతాల్లో భూకంపాలు వస్తాయి. కరువులు వస్తాయి. అంటే ప్రసవించే ముందు కలిగే నొప్పులు ప్రారంభమయ్యాయన్నమాట. “మీరు జాగ్రత్తగా ఉండండి. కొందరు మనుష్యులు మిమ్మల్ని మహాసభలకు అప్పగిస్తారు. సమాజ మందిరాల్లో మీరు కొరడా దెబ్బలు తినవలసి వస్తుంది. నా కారణంగా మీరు రాజ్యాధికారుల ముందు, రాజుల ముందు నిలుచొని సాక్ష్యం చెప్పవలసి వస్తుంది. మొదట మీరు అన్ని దేశాలకు సువార్త తప్పక ప్రకటించాలి. మిమ్మల్ని బంధించి విచారణ జరపటానికి తీసుకు వెళ్తారు. అప్పుడు మీరు ఏం మాట్లాడాలో అని చింతించకండి. ఆ సమయంలో మీకు తోచింది మాట్లాడండి. ఎందుకంటే, అప్పుడు మాట్లాడేది మీరు కాదు. పవిత్రాత్మ మీ ద్వారా మాట్లాడుతాడు. “సోదరులు ఒకరికొకరు ద్రోహం చేసుకొని, ఒకరి మరణానికి ఒకరు కారకులౌతారు. అదే విధంగా తండ్రి తన కుమారుని యొక్క మరణానికి కారకుడౌతాడు. పిల్లలు తమ తల్లిదండ్రులకు ఎదురు తిరిగి వాళ్ళ మరణానికి కారకులౌతారు. నా కారణంగా ప్రజలందరూ మిమ్మల్ని ఏవగించుకొంటారు. కాని చివరిదాకా పట్టుదలతో ఉన్న వాణ్ణి దేవుడు రక్షిస్తాడు. “నాశనం కలిగించేది, అసహ్యమైనది, తనది కాని స్థానంలో నిలుచొని ఉండటం మీకు కనిపిస్తే యూదయలో ఉన్నవాళ్ళు కొండల మీదికి పారిపొండి. ఇంటి మిద్దె మీద ఉన్న వాళ్ళు క్రిందికి దిగి తమ వస్తువులు తెచ్చుకోవటానికి తమ యిళ్ళలోకి వెళ్ళరాదు. పొలాల్లో పని చేస్తున్న వాళ్ళు తమ దుస్తులు తెచ్చుకోవటానికి యిళ్ళకు వెళ్ళరాదు. “గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు ఆ రోజులు ఎంత దుర్భరంగా ఉంటాయో కదా! ఈ సంఘటన చలికాలంలో సంభవించకూడదని ప్రార్థించండి. ప్రపంచంలో ఇదివరకు ఎన్నడూ, అంటే దేవుడు ఈ ప్రపంచాన్ని సృష్టించిన నాటినుండి ఈనాటి వరకూ సంభవించని దుర్భరమైన కష్టాలు ఆ రోజుల్లో సంభవిస్తాయి. అలాంటి కష్టాలు యిక ముందు కూడా ఎన్నడూ కలగవు. కాని దేవుడు ఆ రోజుల సంఖ్య తక్కువ చేసాడు. లేకపోయినట్లయితే ఎవ్వరూ బ్రతికేవాళ్ళు కాదు. తానెన్నుకున్న తన ప్రజల కోసం ఆ రోజుల సంఖ్యను తగ్గించాడు. “ఆ రోజుల్లో మీలో ఎవరైనా ‘ఇదిగో! క్రీస్తు యిక్కడ ఉన్నాడని’ కాని, ‘అదిగో అక్కడున్నాడని’ కాని అంటే నమ్మకండి. దొంగ క్రీస్తులు, దొంగ ప్రవక్తలు వచ్చి అద్భుతాలు, మహత్యాలు చేసి ఐనంతవరకు దేవుడు ఎన్నుకొన్న వాళ్ళను మోసం చెయ్యాలని చూస్తారు. అందువల్ల మీరు జాగ్రత్తగా ఉండాలని, అన్ని విషయాలు మీకు ముందే చెబుతున్నాను. “కాని ఆ కష్టాలు గడిచిన తర్వాత వచ్చే రోజుల్లో, ‘సూర్యుడు చీకటైపోతాడు. చంద్రుడు తన వెలుగును వెదజల్లడు. ఆకాశంలోని నక్షత్రాలు రాలిపోతాయి. ఆకాశంలో వున్నవన్నీ మార్పుచెందుతాయి.’ “అప్పుడు మనుష్యకుమారుడు గొప్ప శక్తితో, తేజస్సుతో, మేఘాలమీద రావటం మానవులు చూస్తారు. ఆయన నలువైపుల నుండి, అంటే ఈ మూలనుండి ఆ మూల దాకా, తన దేవదూతలను పంపి తానెన్నుకున్న ప్రజలను ప్రోగు చేయిస్తాడు. “అంజూరపు చెట్టును చూసి పాఠం నేర్చుకొండి. దాని రెమ్మలు ఆకులు చిగురించుట చూసి ఎండాకాలం రానున్నదని మీరు గ్రహిస్తారు. అదే విధంగా యివి జరగటం మీరు చూసినప్పుడు ఆయన త్వరగా రానైయున్నాడని గ్రహిస్తారు. ఇది నిజం. ఈ కాలపువాళ్ళు జీవిస్తూండగానే ఇవన్ని జరుగును. ఆకాశం, భూమి గతించి పోతాయి కాని, నా మాటలు ఎన్నటికి గతించిపోవు. “ఆ దినము, ఆ ఘడియ ఎప్పుడు వస్తుందో, పరలోకంలోని దేవదూతలకు గాని, కుమారునికి గాని మరెవ్వరికి గాని తెలియదు. అది తండ్రికి మాత్రమే తెలుసు. జాగ్రత్తగా, సిద్ధంగా ఉండండి. ఆ సమయం ఎప్పుడు రాబోతోందో మీకు తెలియదు. “ఇది తన యిల్లు విడిచి దూరదేశం వెళ్ళే ఒక మనిషిని పోలి ఉంటుంది. అతడు తన యింటిని సేవకులకు అప్పగిస్తాడు. ప్రతి సేవకునికి ఒక పని అప్పగిస్తాడు. ద్వారం దగ్గరవున్నవానికి కాపలా కాయమని చెబుతాడు. ఎల్లప్పుడు సిద్ధంగా ఉండమని చెబుతాడు. ఇంటి యజమాని ఎప్పుడు తిరిగి వస్తాడో మీకు తెలియదు. సాయంత్రం వస్తాడో, మధ్యరాత్రి వస్తాడో, కోడికూసే వేళకు వస్తాడో, సూర్యోదయం వేళకు వస్తాడో, ఎప్పుడు వస్తాడో మీకు తెలియదు. అతడు అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రిస్తూ ఉండటం చూస్తాడేమో. హెచ్చరికగా ఉండండి అని మీకు చెబుతున్నాను. అదే ప్రతి ఒక్కనికి చెబుతున్నాను.”

షేర్ చేయి
Read మార్కు 13

మార్కు 13:1-37 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

ఆయన దేవాలయములోనుండి వెళ్లుచుండగా ఆయన శిష్యులలో ఒకడు – బోధకుడా, యీ రాళ్లేలాటివో యీ కట్టడములు ఏలాటివో చూడుమని ఆయనతో అనెను. అందుకు యేసు – ఈ గొప్ప కట్టడములు చూచుచున్నావే; రాతిమీద రాయి యొకటియైన ఇక్కడ నిలిచియుండకుండ పడద్రోయబడునని అతనితో చెప్పెను. ఆయన దేవాలయము ఎదుట ఒలీవల కొండమీద కూర్చుండియుండగా, పేతురు యాకోబు యోహాను అంద్రెయ అను వారు ఆయనను చూచి –ఇవి ఎప్పుడు జరుగును? ఇవన్నియు నెరవేరబోవుకాలమునకు ఏ గురుతు కలుగును? అది మాతో చెప్పుమని ఆయనను ఏకాంతమందు అడుగగా యేసు వారితో ఇట్లు చెప్పసాగెను –ఎవడును మిమ్మును మోసపుచ్చకుండ చూచుకొనుడి. అనేకులు నా పేరట వచ్చి–నేనే ఆయననని చెప్పి అనేకులను మోసపుచ్చెదరు. మీరు యుద్ధములనుగూర్చియు యుద్ధసమాచారములనుగూర్చియు వినునప్పుడు కలవరపడకుడి; ఇవి జరుగవలసియున్నవి గాని అంతము వెంటనే రాదు. జనముమీదికి జనమును రాజ్యముమీదికి రాజ్యమును లేచును, అక్కడక్కడ భూకంపములు కలుగును, కరవులు వచ్చును. ఇవే వేద నలకు ప్రారంభము. మిమ్మునుగూర్చి మీరే జాగ్రత్తపడుడి. వారు మిమ్మును సభల కప్పగించెదరు; మిమ్మును సమాజమందిరములలో కొట్టించెదరు; మీరు వారికి సాక్ష్యార్థమై అధిపతుల యెదుటను రాజుల యెదుటను నా నిమిత్తము నిలువబడెదరు. సకల జనములకు సువార్త ముందుగా ప్రకటింప బడవలెను. వారు మిమ్మును అప్పగించుటకు కొనిపోవు నప్పుడు మీరు–ఏమి చెప్పుదుమా అని ముందుగా చింతింపకుడి, ఆ గడియలోనే మీకేది ఇయ్యబడునో అదే చెప్పుడి; చెప్పువాడు పరిశుద్ధాత్మయే గాని మీరు కారు. సహోదరుడు సహోదరుని, తండ్రి కుమారుని, మరణమున కప్పగింతురు; కుమారులు తలిదండ్రులమీద లేచి వారిని చంపింతురు; నా నామము నిమిత్తము అందరిచేత మీరు ద్వేషింపబడుదురు; అంతమువరకు సహించినవాడే రక్షణ పొందును. మరియు నాశకరమైన హేయవస్తువు నిలువరాని స్థలమందు నిలుచుట మీరు చూచునప్పుడు – చదువు వాడు గ్రహించుగాక – యూదయలో ఉండువారు కొండలకు పారిపోవలెను; మిద్దెమీద ఉండువాడు ఇంటిలోనుండి ఏదైనను తీసికొనిపోవుటకై దిగి అందులో ప్రవేశింపకూడదు; పొలములో ఉండువాడు తన వస్త్రము తీసికొనిపోవుటకు ఇంటిలోనికి తిరిగి రాకూడదు. అయ్యో, ఆ దినములలో గర్భిణులకును పాలిచ్చు వారికిని శ్రమ. అది చలికాలమందు సంభవింపకుండ వలెనని ప్రార్థించుడి. అవి శ్రమగల దినములు; దేవుడు సృజించిన సృష్ట్యాదినుండి ఇదివరకు అంత శ్రమ కలుగ లేదు, ఇక ఎన్నడును కలుగబోదు. ప్రభువు ఆ దినములను తక్కువచేయనియెడల ఏ శరీరియు తప్పించు కొనక పోవును; ఏర్పరచబడినవారి నిమిత్తము, అనగా తాను ఏర్పరచుకొనిన వారినిమిత్తము ఆయన ఆ దినములను తక్కువ చేసెను. కాగా – ఇదిగో క్రీస్తు ఇక్కడ నున్నాడు, అదిగో అక్కడ నున్నాడు అని యెవడైనను మీతో చెప్పినయెడల నమ్మకుడి. ఆ కాలమందు అబద్ధపు క్రీస్తులును అబద్ధపు ప్రవక్తలును వచ్చి, సాధ్యమైనయెడల ఏర్పరచబడినవారిని మోసపుచ్చుటకై సూచక క్రియలను మహత్కార్యములను అగపరచెదరు. మీరు జాగ్రత్తగా ఉండుడి; ఇదిగో సమస్తమును మీతో ముందుగా చెప్పి యున్నాను. ఆ దినములలో ఆ శ్రమతీరిన తరువాత చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు తన కాంతిని ఇయ్యడు, ఆకాశమునుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదలింపబడును. అప్పుడు మనుష్యకుమారుడు మహా ప్రభావముతోను మహిమతోను మేఘారూఢుడై వచ్చుట చూచెదరు. అప్పుడాయన తన దూతలను పంపి, భూమ్యంతము మొదలుకొని ఆకాశాంతమువరకు నలుదిక్కులనుండి తాను ఏర్పరచుకొనినవారిని పోగు చేయించును. అంజూరపుచెట్టును చూచి యొక ఉపమానము నేర్చు కొనుడి. దాని కొమ్మ యింక లేతదై చిగిరించునప్పుడు వసంతకాలము సమీపముగా ఉన్నదని మీకు తెలియును. ఆప్రకారమే మీరు ఈ సంగతులు జరుగుట చూచు నప్పుడు ఆయన సమీపముననే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలిసికొనుడి. ఇవన్నియు జరుగువరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పు చున్నాను. ఆకాశమును భూమియును గతించును గాని నా మాటలు గతింపవు. ఆ దినమునుగూర్చియు ఆ గడియనుగూర్చియు తండ్రి తప్ప ఏ మనుష్యుడైనను, పరలోకమందలి దూత లైనను, కుమారుడైనను ఎరుగరు. జాగ్రత్తపడుడి; మెలకువగానుండి ప్రార్థనచేయుడి; ఆ కాలమెప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఒక మనుష్యుడు తన దాసులకు అధికారమిచ్చి, ప్రతివానికి వాని వాని పని నియమించి – మెలకువగా నుండుమని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి, యిల్లు విడిచి దేశాంతరము పోయినట్టే (ఆ కాలము ఉండును.) ఇంటి యజమానుడు ప్రొద్దు గ్రుంకివచ్చునో, అర్ధరాత్రివచ్చునో, కోడికూయునప్పుడు వచ్చునో, తెల్లవారునప్పుడు వచ్చునో, యెప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రబోవుచుండుట చూచునేమో గనుక మీరు మెలకువగా నుండుడి. నేను మీతో చెప్పుచున్నది అందరితోను చెప్పుచున్నాను; మెలకువగా నుండుడనెను.

షేర్ చేయి
Read మార్కు 13