మార్కు 13:1-13

మార్కు 13:1-13 తెలుగు సమకాలీన అనువాదము (TCV)

యేసు దేవాలయం నుండి వెళ్తుండగా, ఆయన శిష్యులలో ఒకడు, “బోధకుడా, చూడండి! ఈ రాళ్ళు ఎంత పెద్దగా ఉన్నాయో! ఈ కట్టడాలు ఎంత అద్బుతంగా ఉన్నాయో!” అని ఆయనతో అన్నాడు. అందుకు యేసు “నీవు ఈ గొప్ప కట్టడాలన్నిటిని చూస్తున్నావా? ఇందులో ఒక రాయి మీద ఇంకొక రాయి ఉండదు; ప్రతి ఒకటి పడవేయబడుతుంది” అని చెప్పారు. యేసు దేవాలయానికి ఎదురుగా ఉన్న ఒలీవల కొండ మీద కూర్చుని ఉన్నప్పుడు, పేతురు, యాకోబు, యోహాను మరియు అంద్రెయలు ఏకాంతంగా ఉన్నప్పుడు, “ఈ సంగతులు ఎప్పుడు జరుగుతాయి? ఇవన్నీ నెరవేరబడబోతున్నాయి అనడానికి సూచన ఏంటి? మాకు చెప్పండి” అని ఆయనను అడిగారు. అందుకు యేసు వారితో, “ఎవరు మిమ్మల్ని మోసగించకుండ జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే అనేకులు నా పేరిట వచ్చి, ‘నేనే ఆయనను’ అని చెప్పి చాలామందిని మోసం చేస్తారు. మీరు యుద్ధాల గురించి, యుద్ధ సమాచారాలను గురించి వినినప్పుడు, ఆందోళన చెందకండి. అలాంటివన్ని జరగవలసివుంది, కాని అంతం రావలసి ఉంది. జనాల మీదికి జనాలు, రాజ్యాల మీదికి రాజ్యాలు లేస్తాయి. అక్కడక్కడ కరువులు, భూకంపాలు వస్తాయి. ఇవన్నీ ప్రసవ వేదనలకు ప్రారంభం మాత్రమే. “మీరు జాగ్రత్తగా ఉండాలి. మీరు న్యాయసభలకు అప్పగించబడతారు, సమాజమందిరాల్లో కొరడాలతో కొట్టబడతారు. నన్ను బట్టి మీరు అధికారుల యెదుట రాజుల యెదుట వారికి సాక్షులుగా నిలబడతారు. ఈ సువార్త మొదట అన్ని దేశాల ప్రజలకు ప్రకటించబడాలి. మీరు బంధించబడి తీర్పుకు అప్పగించబడినప్పుడు ఏమి చెప్పాలో అని మీరు ముందుగానే చింతించవద్దు. ఆ సమయంలో మీకు ఇవ్వబడిన మాటలనే చెప్పండి, ఎందుకంటే మాట్లాడేది మీరు కాదు, పరిశుద్ధాత్మ మీ ద్వారా మాట్లాడతాడు. “సహోదరుడు సహోదరున్ని, తండ్రి తన బిడ్డను మరణానికి అప్పగిస్తారు. పిల్లలు తల్లిదండ్రుల మీద తిరగబడి వారిని చంపిస్తారు. నన్ను బట్టి ప్రతి ఒక్కరు మిమ్మల్ని ద్వేషిస్తారు, కాని చివరి వరకు స్థిరంగా నిలబడినవారే రక్షింపబడతారు.

షేర్ చేయి
Read మార్కు 13

మార్కు 13:1-13 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

యేసు దేవాలయంలో నుండి వస్తూ ఉండగా ఆయన శిష్యుల్లో ఒకడు, “బోధకా! ఈ రాళ్ళు, కట్టడాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో చూశావా!” అన్నాడు. యేసు అతనితో, “ఈ గొప్ప కట్టడాలు చూస్తున్నావు కదా! రాయి మీద రాయి నిలవకుండా ఈ రాళ్ళన్నీ కూలిపోతాయి” అన్నాడు. యేసు దేవాలయానికి ఎదురుగా ఉన్న ఒలీవల కొండ మీద కూర్చుని ఉన్నప్పుడు పేతురు, యాకోబు, యోహాను, అంద్రెయ ఏకాంతంగా ఆయనను ఇలా అడిగారు. “ఇది ఎప్పుడు జరుగుతుంది? ఇవి జరగడానికి ముందు సూచన ఏమైనా కనబడుతుందా?” యేసు వారితో, “మిమ్మల్ని ఎవ్వరూ మోసం చేయకుండా, తప్పుదోవ పట్టించకుండా జాగ్రత పడండి. చాలా మంది నా పేరుతో వచ్చి ‘నేనే ఆయనను’ అంటూ చాలా మందిని మోసం చేస్తారు. మీరు యుద్ధాల గురించిన వార్తలు, వదంతులు విన్నప్పుడు ఆందోళన చెందకండి. అవి తప్పక సంభవిస్తాయి. కాని అంతం అప్పుడే రాదు. జనం మీదికి జనం, దేశం మీదికి దేశం లేస్తాయి. అనేక ప్రాంతాల్లో భూకంపాలు, కరువులు వస్తాయి. ఇవి ప్రసవించే ముందు కలిగే నొప్పుల్లాంటివి మాత్రమే. మీరు జాగ్రతగా ఉండండి! కొందరు మిమ్మల్ని చట్టసభలకు అప్పగిస్తారు. సమాజ మందిరాల్లో మీరు దెబ్బలు తినవలసి వస్తుంది. నా కారణంగా మీరు అధికారుల ముందు, రాజుల ముందు నిలబడి సాక్ష్యం చెప్పవలసి వస్తుంది. అంతానికి ముందు అన్ని జాతులకూ సువార్త ప్రకటించడం జరగాలి. వారు మిమ్మల్ని పట్టుకుని తీర్పుకు అప్పగించేటప్పుడు మీరు ఏమి మాట్లాడాలో అని కంగారుపడకండి. ఏమి మాట్లాడాలో ముందుగా ఆలోచన చేసుకోవద్దు. ఆ గడియలో మీకేది ఇయ్యబడుతుందో అదే చెప్పండి. ఎందుకంటే ఆ సమయంలో మాట్లాడేది మీరు కాదు, పరిశుద్ధాత్మ. సోదరుడు తన సోదరుడికి ద్రోహం చేసి చావుకు అప్పగిస్తారు. అదే విధంగా తండ్రి తన కుమారుణ్ణి మరణానికి అప్పగిస్తాడు. పిల్లలు తల్లిదండ్రులకు వ్యతిరేకంగా లేచి వారిని మరణానికి అప్పగిస్తారు. నా కారణంగా అందరూ మిమ్మల్ని ద్వేషిస్తారు. కాని, చివరి వరకూ సహించిన వారిని దేవుడు రక్షిస్తాడు.

షేర్ చేయి
Read మార్కు 13

మార్కు 13:1-13 పవిత్ర బైబిల్ (TERV)

యేసు మందిరం నుండి వెళ్తుండగా శిష్యుల్లో ఒకడు, “బోధకుడా! చూడండి, ఎంత అద్భుతమైన పెద్ద రాళ్ళో! ఎంత పెద్ద కట్టడాలో చూడండి!” అని అన్నాడు. యేసు సమాధానంగా, “నీవు పెద్ద కట్టడాన్ని చూస్తున్నావా? రాయి మీద రాయి నిలువకుండా రాళ్ళన్ని పడిపోతాయి” అని అన్నాడు. యేసు మందిరానికి ఎదురుగా ఉన్న ఒలీవల కొండపై కూర్చొన్నాడు. ఆయన వెంట ఆయన శిష్యులు పేతురు, యాకోబు, యోహాను మరియు అంద్రెయ ఉన్నారు. వాళ్ళు ఆయనతో “ఇది ఎప్పుడు జరుగుతుందో మాకు చెప్పండి. ఇవి జరుగబోయే సమయం వచ్చిందని సూచించటానికి ఏం జరుగుతుంది?” అని అడిగారు. యేసు వాళ్ళతో, “మిమ్మల్నెవరూ మోసం చేయకుండా జాగ్రత్తపడండి. అనేకులు నా పేరు పెట్టుకొని వచ్చి, నేనే ఆయన్ని అని చెప్పి అనేకుల్ని మోసం చేస్తారు. మీరు యుద్ధాల్ని గురించి కాని, యుద్ధాల వదంతుల్ని గురించి కాని వింటే వెంటనే ఆందోళన చెందకండి. అవి తప్పక సంభవిస్తాయి. కాని అంతం అప్పుడే రాదు. దేశాలకు, రాజ్యాలకు మధ్య యుద్ధాలు సంభవిస్తాయి. అనేక ప్రాంతాల్లో భూకంపాలు వస్తాయి. కరువులు వస్తాయి. అంటే ప్రసవించే ముందు కలిగే నొప్పులు ప్రారంభమయ్యాయన్నమాట. “మీరు జాగ్రత్తగా ఉండండి. కొందరు మనుష్యులు మిమ్మల్ని మహాసభలకు అప్పగిస్తారు. సమాజ మందిరాల్లో మీరు కొరడా దెబ్బలు తినవలసి వస్తుంది. నా కారణంగా మీరు రాజ్యాధికారుల ముందు, రాజుల ముందు నిలుచొని సాక్ష్యం చెప్పవలసి వస్తుంది. మొదట మీరు అన్ని దేశాలకు సువార్త తప్పక ప్రకటించాలి. మిమ్మల్ని బంధించి విచారణ జరపటానికి తీసుకు వెళ్తారు. అప్పుడు మీరు ఏం మాట్లాడాలో అని చింతించకండి. ఆ సమయంలో మీకు తోచింది మాట్లాడండి. ఎందుకంటే, అప్పుడు మాట్లాడేది మీరు కాదు. పవిత్రాత్మ మీ ద్వారా మాట్లాడుతాడు. “సోదరులు ఒకరికొకరు ద్రోహం చేసుకొని, ఒకరి మరణానికి ఒకరు కారకులౌతారు. అదే విధంగా తండ్రి తన కుమారుని యొక్క మరణానికి కారకుడౌతాడు. పిల్లలు తమ తల్లిదండ్రులకు ఎదురు తిరిగి వాళ్ళ మరణానికి కారకులౌతారు. నా కారణంగా ప్రజలందరూ మిమ్మల్ని ఏవగించుకొంటారు. కాని చివరిదాకా పట్టుదలతో ఉన్న వాణ్ణి దేవుడు రక్షిస్తాడు.

షేర్ చేయి
Read మార్కు 13

మార్కు 13:1-13 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

ఆయన దేవాలయములోనుండి వెళ్లుచుండగా ఆయన శిష్యులలో ఒకడు – బోధకుడా, యీ రాళ్లేలాటివో యీ కట్టడములు ఏలాటివో చూడుమని ఆయనతో అనెను. అందుకు యేసు – ఈ గొప్ప కట్టడములు చూచుచున్నావే; రాతిమీద రాయి యొకటియైన ఇక్కడ నిలిచియుండకుండ పడద్రోయబడునని అతనితో చెప్పెను. ఆయన దేవాలయము ఎదుట ఒలీవల కొండమీద కూర్చుండియుండగా, పేతురు యాకోబు యోహాను అంద్రెయ అను వారు ఆయనను చూచి –ఇవి ఎప్పుడు జరుగును? ఇవన్నియు నెరవేరబోవుకాలమునకు ఏ గురుతు కలుగును? అది మాతో చెప్పుమని ఆయనను ఏకాంతమందు అడుగగా యేసు వారితో ఇట్లు చెప్పసాగెను –ఎవడును మిమ్మును మోసపుచ్చకుండ చూచుకొనుడి. అనేకులు నా పేరట వచ్చి–నేనే ఆయననని చెప్పి అనేకులను మోసపుచ్చెదరు. మీరు యుద్ధములనుగూర్చియు యుద్ధసమాచారములనుగూర్చియు వినునప్పుడు కలవరపడకుడి; ఇవి జరుగవలసియున్నవి గాని అంతము వెంటనే రాదు. జనముమీదికి జనమును రాజ్యముమీదికి రాజ్యమును లేచును, అక్కడక్కడ భూకంపములు కలుగును, కరవులు వచ్చును. ఇవే వేద నలకు ప్రారంభము. మిమ్మునుగూర్చి మీరే జాగ్రత్తపడుడి. వారు మిమ్మును సభల కప్పగించెదరు; మిమ్మును సమాజమందిరములలో కొట్టించెదరు; మీరు వారికి సాక్ష్యార్థమై అధిపతుల యెదుటను రాజుల యెదుటను నా నిమిత్తము నిలువబడెదరు. సకల జనములకు సువార్త ముందుగా ప్రకటింప బడవలెను. వారు మిమ్మును అప్పగించుటకు కొనిపోవు నప్పుడు మీరు–ఏమి చెప్పుదుమా అని ముందుగా చింతింపకుడి, ఆ గడియలోనే మీకేది ఇయ్యబడునో అదే చెప్పుడి; చెప్పువాడు పరిశుద్ధాత్మయే గాని మీరు కారు. సహోదరుడు సహోదరుని, తండ్రి కుమారుని, మరణమున కప్పగింతురు; కుమారులు తలిదండ్రులమీద లేచి వారిని చంపింతురు; నా నామము నిమిత్తము అందరిచేత మీరు ద్వేషింపబడుదురు; అంతమువరకు సహించినవాడే రక్షణ పొందును.

షేర్ చేయి
Read మార్కు 13