మార్కు 12:38-44

మార్కు 12:38-44 తెలుగు సమకాలీన అనువాదము (TCV)

యేసు బోధిస్తూ, “ధర్మశాస్త్ర ఉపదేశకులను గురించి జాగ్రత్తపడండి. వారు పొడుగు అంగీలు వేసుకొని సంత వీధుల్లో తిరుగుతూ ప్రజల నుండి గౌరవం అందుకోవడానికి ఇష్టపడతారు. వారు సమాజమందిరాల్లో ముఖ్యమైన స్థానాలను మరియు విందుల్లో గౌరవ స్థలాలను పొందాలని కోరుకుంటారు. వారు విధవరాళ్ళ గృహాలను దోచుకుంటూ, ప్రజల ముందు చూపించుకోడానికి ఎక్కువసేపు ప్రార్థనలు చేస్తారు. ఇలాంటివారు తీవ్రంగా శిక్షింపబడతారు” అని చెప్పారు. యేసు దేవాలయంలో కానుకలపెట్టె ముందు కుర్చొని జనసమూహం ఆ కానుక పెట్టెలో వారి డబ్బులు వేయడం గమనిస్తున్నారు. చాలామంది ధనవంతులు డబ్బు మూటలను అందులో వేస్తున్నారు. కాని ఒక బీద విధవరాలు వచ్చి రెండు చిన్న కాసులను ఆ పెట్టెలో వేసింది. యేసు తన శిష్యులను దగ్గరకు పిలిచి, “నేను మీతో నిజంగా చెప్తున్నా, కానుక పెట్టెలో అందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసింది. వారందరు తమకు కలిగిన సమృద్ధిలో నుండి కొంత వేశారు, కాని ఈమె తన పేదరికం నుండి తన జీవనాధారమంతా వేసింది” అని అన్నారు.

షేర్ చేయి
Read మార్కు 12

మార్కు 12:38-44 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

ఆయన ఇంకా ఎన్నో విషయాలు బోధిస్తూ ఈ విధంగా అన్నాడు, “ధర్మశాస్త్ర పండితుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. వారు పొడవాటి దుస్తులు ధరించి, సంత వీధుల్లో తిరుగుతూ ప్రజలు తమకు నమస్కరించాలని కోరుతూ, సమాజ మందిరాల్లో అగ్రస్థానాలను, విందుల్లో గౌరవప్రదమైన స్థానాలను కోరుకుంటారు. వారు విధవరాళ్ళ ఇళ్ళను దోచుకుంటూ పైకి మాత్రం నటనగా గంటల తరబడి ప్రార్థనలు చేస్తారు. అలాంటి వారిని దేవుడు తీవ్రంగా శిక్షిస్తాడు.” యేసు, దేవాలయంలో కానుకలు వేసే పెట్టెలో మనుషులు డబ్బు వేయడం గమనిస్తూ ఉన్నాడు. ధనవంతులు చాలా మంది పెద్ద మొత్తాలను ఆ పెట్టెలో వేశారు. అప్పుడు ఒక పేద వితంతువు వచ్చి రెండు నాణాలు ఆ పెట్టెలో వేసింది. ఆయన తన శిష్యులను దగ్గరికి పిలిచి, “నేను మీతో కచ్చితంగా చెప్పేదేమంటే, కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ పేద వితంతువు ఎక్కువ వేసింది. మిగతావారు తాము దాచుకున్న ధనంలో కొంత మాత్రమే వేశారు కాని, ఈమె పేదదైనా తన దగ్గర ఉన్నదంతా వేసింది” అన్నాడు.

షేర్ చేయి
Read మార్కు 12

మార్కు 12:38-44 పవిత్ర బైబిల్ (TERV)

యేసు యింకా ఎన్నో విషయాలు బోధిస్తూ ఈ విధంగా అన్నాడు: “శాస్త్రుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు పొడుగాటి దుస్తులు ధరించి నడవాలని, సంతల్లో ప్రజలు తమకు నమస్కరించాలని కోరుతూ ఉంటారు. వాళ్ళు సమాజాల్లో ముఖ్య స్థానాలను, విందుల్లో గౌరవప్రదమైన స్థానాలను ఆక్రమించాలని ఆశిస్తూ ఉంటారు. వాళ్ళు వితంతువుల యిండ్లను దోచుకుంటూ, పైకి మాత్రం గంటల తరబడి ప్రార్థిస్తూవుంటారు. అలాంటి వాళ్ళను దేవుడు అతితీవ్రంగా శిక్షిస్తాడు.” ఒక రోజు యేసు, మందిరంలో కానుకలు వేసే పెట్టెకు ఎదురుగా కూర్చొని ఉన్నాడు. ప్రజలు ఆ పెట్టెలో డబ్బును వేయటం ఆయన గమనించాడు. ధనవంతులు చాలామంది పెద్ద పెద్ద మొత్తాల్ని ఆ పెట్టెలో వేసారు. కాని ఒక పేద వితంతువు వచ్చి రెండు రాగి నాణెములను ఆ పెట్టెలో వేసింది. యేసు తన శిష్యులను దగ్గరకు పిలిచి, “ఇది నిజం. ఈ పేద వితంతువు ఆ పెట్టెలో అందరికన్నా ఎక్కువ డబ్బు వేసింది. మిగతా వాళ్ళు తాము దాచుకొన్న ధనంలో కొంత భాగం మాత్రమే వేసారు. కాని ఆమె పేదదైనా తన దగ్గరున్నదంతా వేసింది” అని అన్నాడు.

షేర్ చేయి
Read మార్కు 12

మార్కు 12:38-44 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

మరియు ఆయన వారికి బోధించుచు నిట్లనెను–శాస్త్రులనుగూర్చి జాగ్రత్తపడుడి. వారు నిలువు టంగీలు ధరించుకొని తిరుగుటను, సంతవీధులలో వందనములను సమాజమందిరములలో అగ్రపీఠములను, విందులలో అగ్ర స్థానములను కోరుచు విధవరాండ్ర యిండ్లు దిగమ్రిం గుచు, మాయవేషముగా దీర్ఘప్రార్థనలు చేయుదురు. వీరు మరి విశేషముగా శిక్ష పొందుదురనెను. ఆయన కానుకపెట్టె యెదుట కూర్చుండి, జనసమూహము ఆ కానుకపెట్టెలో డబ్బులు వేయుట చూచు చుండెను. ధనవంతులైనవారనేకులు అందులో విశేషముగా సొమ్ము వేయుచుండిరి. ఒక బీద విధవరాలు వచ్చి రెండు కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి–కానుకపెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటె ఈ బీద విధవరాలు ఎక్కువ వేసెనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వారందరు తమకు కలిగిన సమృద్ధిలోనుండి వేసిరి గాని, యీమె తన లేమిలో తనకు కలిగినదంతయు, అనగా తన జీవనమంతయు వేసెనని చెప్పెను.

షేర్ చేయి
Read మార్కు 12