మార్కు 12:28-34

మార్కు 12:28-34 తెలుగు సమకాలీన అనువాదము (TCV)

ధర్మశాస్త్ర ఉపదేశకులలో ఒకడు వచ్చి వారు తర్కించుకోవడం విన్నాడు. యేసు వారికి మంచి జవాబు ఇవ్వడం గమనించి, “ఆజ్ఞలన్నిటిలో అతి ముఖ్యమైనదేది?” అని ఆయనను అడిగాడు. అందుకు యేసు, “అన్నిటిలో అతి ముఖ్యమైనది: ‘ఓ ఇశ్రాయేలీయులారా, వినండి, మన ప్రభువైన దేవుడు, ప్రభువు ఒక్కరే. మీ పూర్ణహృదయంతో, మీ పూర్ణాత్మతో, మీ పూర్ణమనస్సుతో, మీ పూర్ణబలంతో మీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి.’ రెండవ ఆజ్ఞ: ‘నీలాగే నీ పొరుగువానిని ప్రేమించాలి.’ వీటిని మించిన గొప్ప ఆజ్ఞ లేదు” అని అతనితో చెప్పారు. అతడు, “బోధకుడా, బాగా చెప్పావు. దేవుడు ఒక్కరే, ఆయన తప్ప వేరొకరు లేరని నీవు చెప్పింది నిజమే. మీ పూర్ణహృదయంతో, మీ పూర్ణవివేకంతో, మీ పూర్ణబలంతో ఆయనను ప్రేమించాలి, మరియు నిన్ను నీవు ప్రేమించుకొన్నట్లే నీ పొరుగువారిని ప్రేమించడం దహన బలులు మరియు అర్పణల కంటే ముఖ్యం” అని జవాబిచ్చాడు. అతడు తెలివిగా జవాబు చెప్పాడని యేసు గ్రహించి, “నీవు దేవుని రాజ్యానికి దూరంగా లేవు” అని అతనితో చెప్పారు. ఆ తర్వాత ఎవరు కూడా ఆయనను ప్రశ్నలు అడగడానికి ధైర్యం చేయలేదు.

షేర్ చేయి
Read మార్కు 12

మార్కు 12:28-34 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

ధర్మశాస్త్ర పండితుల్లో ఒకడు వచ్చి వారి వాదన విన్నాడు. యేసు చక్కని సమాధానం చెప్పాడని గ్రహించి, “ఆజ్ఞలన్నిటిలో ముఖ్యమైన ఆజ్ఞ ఏది?” అని ఆయనను అడిగాడు. అప్పుడు యేసు, “ఆజ్ఞలన్నిటిలో ముఖ్యమైనది ఇది, ‘ఇశ్రాయేలు ప్రజలారా వినండి, ప్రభువైన మన దేవుడు, ఆ ప్రభువు ఒక్కడే. పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ బలంతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి.’ ఇది ప్రధాన ఆజ్ఞ. రెండవది, ‘నిన్ను నీవెంతగా ప్రేమించుకుంటావో నీ పొరుగువాణ్ణి అంతగా ప్రేమించాలి.’ వీటికి మించిన ఆజ్ఞ మరొకటి లేదు” అని జవాబిచ్చాడు. ఆ ధర్మశాస్త్ర పండితుడు, “అయ్యా, మీరు బాగా చెప్పారు. దేవుడొక్కడే అనీ, ఆయన తప్ప వేరే దేవుడు లేడనీ మీరు చెప్పింది నిజమే. పూర్ణ హృదయంతో, పూర్ణ బుద్ధితో, పూర్ణ బలంతో ఆయనను ప్రేమించడం, మనలను ప్రేమించుకున్నట్టే మన పొరుగు వాణ్ణి ప్రేమించడం అన్ని హోమాల కన్నా, బలుల కన్నా ముఖ్యం” అన్నాడు. అతడు వివేకంగా జవాబు చెప్పాడని యేసు గ్రహించి అతనితో, “నీవు దేవుని రాజ్యానికి దూరంగా లేవు” అన్నాడు. ఆ తరువాత ఆయనను ప్రశ్నలు అడగడానికి ఎవ్వరికీ ధైర్యం లేకపోయింది.

షేర్ చేయి
Read మార్కు 12

మార్కు 12:28-34 పవిత్ర బైబిల్ (TERV)

శాస్త్రుల్లో ఒకడు వచ్చి వాదన విన్నాడు. యేసు చక్కటి సమాధానం చెప్పాడని గ్రహించి, “ఆజ్ఞలన్నిటిలో ఏ ఆజ్ఞ ముఖ్య మైనది?” అని యేసును అడిగాడు. యేసు ఈ విధంగా సమాధానం చెప్పాడు: “ఓ ఇశ్రాయేలు జనాంగమా విను. మొదటిది ఇది: మన ప్రభువైన దేవుడు మాత్రమే ప్రభువు. నీ శక్తి, బుద్ధి, సంపూర్ణంగా ఉపయోగిస్తూ నీ ప్రభువైన దేవుణ్ణి నీ సంపూర్ణమైన ఆత్మతో మనస్ఫూర్తిగా ప్రేమించు, రెండవది ఇది: నిన్ను నీవు ప్రేమించుకున్నంతగా నీ పొరుగు వాణ్ణి ప్రేమించు. వీటిని మించిన ఆజ్ఞ మరొకటి లేదు.” ఆ శాస్త్రి, “అయ్యా! చక్కగా చెప్పారు. దేవుడు ఒక్కడేనని, ఆయన తప్ప మరెవ్వరూ లేరని సరిగ్గా చెప్పారు. ఆ దేవుణ్ణి సంపూర్ణమైన బుద్ధితో, సంపూర్ణమైన మనస్సుతో శక్తినంతా ఉపయోగిస్తూ ప్రేమించాలని, మరియు తనను ప్రేమించుకొన్నంతగా, తన పొరుగువాణ్ణి ప్రేమించాలని చక్కగా చెప్పారు. ఈ రెండు ఆజ్ఞలు, బలులకన్నా, దహన బలులకన్నా ముఖ్యమైనవి” అని అన్నాడు. అతడు తెలివిగా చెప్పాడని యేసు గ్రహించి అతనితో, “నీవు దేవుని రాజ్యానికి దూరంగా లేవు!” అని అన్నాడు. ఆ తర్వాత ఆయన్ని ప్రశ్నలు అడగటానికి ఎవ్వరికి ధైర్యం చాలలేదు.

షేర్ చేయి
Read మార్కు 12

మార్కు 12:28-34 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

శాస్త్రులలో ఒకడు వచ్చి, వారు తర్కించుట విని, ఆయన వారికి బాగుగా ఉత్తరమిచ్చెనని గ్రహించి–ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనదేదని ఆయన నడిగెను. అందుకు యేసు – ప్రధానమైనది ఏదనగా – ఓ ఇశ్రాయేలూ, వినుము; మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు . నీవు నీ పూర్ణహృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణవివేకముతోను, నీ పూర్ణబలముతోను, నీ దేవుడైన ప్రభువు ను ప్రేమింపవలెననునది ప్రధానమైన ఆజ్ఞ. రెండవది, నీవు నిన్నువలె నీ పొరుగువానిని ప్రేమింపవలెననునది రెండవ ఆజ్ఞ; వీటికంటె ముఖ్యమైన ఆజ్ఞ మరే దియు లేదని అతనితో చెప్పెను ఆ శాస్త్రి–బోధకుడా, బాగుగా చెప్పితివి; ఆయన అద్వితీయుడనియు, ఆయన తప్ప వేరొకడు లేడనియు నీవు చెప్పిన మాట సత్యమే. పూర్ణహృదయముతోను, పూర్ణవివేకముతోను, పూర్ణ బలముతోను, ఆయనను ప్రేమించుటయు, ఒకడు తన్నువలె తన పొరుగువాని ప్రేమించుటయు సర్వాంగ హోమములన్నిటికంటెను బలులకంటెను అధికమని ఆయనతో చెప్పెను. అతడు వివేకముగా నుత్తరమిచ్చెనని యేసు గ్రహించి–నీవు దేవుని రాజ్యమునకు దూరముగ లేవని అతనితో చెప్పెను. ఆ తరువాత ఎవడును ఆయనను ఏ ప్రశ్నయు అడుగ తెగింపలేదు.

షేర్ చేయి
Read మార్కు 12