మార్కు 11:26-33
మార్కు 11:26-33 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
ఒకవేళ మీరు ఇతరుల అపరాధాలను క్షమించకపోతే, మీ పరలోకపు తండ్రి కూడ మీ అపరాధాలను క్షమించరు.” వారు తిరిగి యెరూషలేముకు చేరుకొన్నారు, యేసు దేవాలయ ఆవరణంలో నడుస్తున్నప్పుడు, ముఖ్య యాజకులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు, నాయకులు ఆయన దగ్గరకు వచ్చారు. వారు, “నీవు ఏ అధికారంతో ఈ కార్యాలను చేస్తున్నావు? ఇవి చేయడానికి నీకు అధికారం ఎవరిచ్చారు?” అని అడిగారు. అందుకు యేసు, “నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. దానికి మీరు సమాధానం చెప్పండి, అప్పుడు ఏ అధికారంతో నేను వీటిని చేస్తున్నానో మీకు చెప్తాను. యోహాను ఇచ్చిన బాప్తిస్మం పరలోకం నుండా? లేదా మానవుల నుండా?” అని వారిని అడిగారు. వారు తమలో తాము చర్చించుకొంటూ అనుకున్నారు, “ఒకవేళ మనం ‘పరలోకం నుండి కలిగింది’ అని చెప్పితే ‘మరి మీరు ఎందుకు అతన్ని నమ్మలేదు’ అని అడుగుతాడు. ఒకవేళ మనం, ‘మనుష్యుల వలన’ ” అని చెప్తే, (వారు ప్రజలకు భయపడ్డారు. దానికి కారణం ప్రతి ఒక్కరు యోహాను నిజంగా ఒక ప్రవక్తని నమ్ముతున్నారు.) అందుకు వారు, “మాకు తెలియదు” అని యేసుకు జవాబిచ్చారు. అందుకు యేసు, “నేను ఏ అధికారంతో ఈ కార్యాలను చేస్తున్నానో నేను కూడా మీతో చెప్పను” అన్నారు.
మార్కు 11:26-33 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అప్పుడు పరలోకంలో ఉన్న మీ తండ్రి మీ పాపాలను క్షమిస్తాడు.” యేసు, ఆయన శిష్యులు యెరూషలేము చేరుకున్నారు. ఆయన దేవాలయంలో నడుస్తూ ఉండగా ముఖ్య యాజకులు, ధర్మశాస్త్ర పండితులు, పెద్దలు ఆయన దగ్గరికి వచ్చి ఆయనతో, “నీవు ఏ అధికారంతో ఈ పనులు చేస్తున్నావు? ఈ పనులు చేయడానికి అధికారం నీకెవరిచ్చారు?” అని అడిగారు. యేసు, “నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను జవాబు చెప్పండి. అప్పుడు నేను ఏ అధికారంతో ఈ క్రియలు చేస్తున్నానో మీకు చెబుతాను. యోహాను ఇచ్చిన బాప్తిసం ఎక్కడ నుంచి వచ్చింది? పరలోకం నుండా మనుషుల నుండా? చెప్పండి” అన్నాడు. వారు ఆ విషయాన్ని గురించి తమలో తాము ఈ విధంగా చర్చించుకున్నారు. “‘మనం పరలోకం నుండి’ అని అంటే ఇతడు ‘అలాగైతే మీరెందుకు అతన్ని నమ్మలేదు?’ అంటాడు. ‘మనుషుల నుండి’ అంటే ప్రజలకు మన మీద కోపం వస్తుంది” అనుకున్నారు. ఎందుకంటే, యోహాను నిజంగా ఒక ప్రవక్త అని అందరూ నమ్మేవారు. కనుక వారు, “మాకు తెలియదు” అని జవాబు చెప్పారు. యేసు, “అలాగైతే ఏ అధికారంతో ఈ క్రియలు చేస్తున్నానో అదీ మీకు చెప్పను” అన్నాడు.
మార్కు 11:26-33 పవిత్ర బైబిల్ (TERV)
యేసు, ఆయన శిష్యులు యెరూషలేం చేరుకొన్నారు. ఆయన మందిరావరణంలో నడుస్తుండగా ప్రధానయాజకులు, శాస్త్రులు పెద్దలు ఆయన దగ్గరకు వచ్చారు. వాళ్ళాయన్ని, “ఎవరిచ్చిన అధికారంతో నీవు వీటిని చేస్తున్నావు? ఇవి చేయటానికి అధికారమెవరిచ్చారు?” అని అడిగారు. యేసు సమాధానంగా, “నన్ను ఒక్క ప్రశ్న అడుగనివ్వండి. దానికి మీరు సమాధానం చెప్పండి. అప్పుడు నేనివి ఎవరిచ్చిన అధికారంతో చేస్తున్నానో చెబుతాను. యోహాను బాప్తిస్మము పరలోకంలో నుండి వచ్చినదా? లేక మానవులనుండి వచ్చినదా? సమాధానం చెప్పండి” అన్నాడు. వాళ్ళు, ఆ విషయాన్ని గురించి పరస్పరం చర్చించుకొని, “మనం ‘పరలోకం నుండి’ అని అంటే, ‘మరి అలాగైతే మీరు యోహానును ఎందుకు నమ్మలేదు?’ అని అడుగుతాడు. మనం ‘మానవుల నుండి’ అని అంటే ప్రజలకు మనమంటే కోపం వస్తుంది” అని అనుకున్నారు. యోహాను ఒక ప్రవక్త అని ప్రతి ఒక్కడు నమ్మటంవల్ల వాళ్ళు ప్రజలంటే భయపడ్డారు. కనుక వాళ్ళు, “మాకు తెలియదు” అని సమాధానం చెప్పారు. యేసు, “అలాగైతే నేను కూడా యివి ఎవరిచ్చిన అధికారంతో చేస్తున్నానో చెప్పను” అని అన్నాడు.
మార్కు 11:26-33 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములు క్షమించును. వారు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. ఆయన దేవాలయములో తిరుగుచుండగా ప్రధానయాజకులును శాస్త్రులును పెద్దలును ఆయనయొద్దకువచ్చి –నీవు ఏ అధికారమువలన ఈ కార్యములు చేయుచున్నావు? వీటిని చేయుటకు ఈ యధికారము నీకెవడిచ్చెనని అడిగిరి. అందుకు యేసు–నేనును మిమ్మును ఒక మాట అడిగెదను, నాకు ఉత్తరమియ్యుడి, అప్పుడు నేను ఏ అధికారమువలన వీటిని చేయుచున్నానో అది మీతో చెప్పుదును. యోహాను ఇచ్చిన బాప్తిస్మము పరలోకమునుండి కలిగినదా మనుష్యులనుండి కలిగినదా? నాకు ఉత్తరమియ్యుడని చెప్పెను. అందుకు వారు–మనము పరలోకమునుండి కలిగినదని చెప్పినయెడల, ఆయన – ఆలాగైతే మీరు ఎందుకతని నమ్మలేదని అడుగును; మనుష్యులవలన కలిగిన దని చెప్పుదుమా అని తమలోతాము ఆలోచించుకొనిరి గాని, అందరు యోహాను నిజముగా ప్రవక్త యని యెంచిరి గనుక ప్రజలకు భయపడి–ఆ సంగతి మాకు తెలియదని యేసునకు ఉత్తరమిచ్చిరి. అందుకు యేసు–ఏ అధికారము వలన ఈ కార్యములు చేయుచున్నానో అదియు నేను మీతో చెప్పననెను.