మార్కు 11:20-25
మార్కు 11:20-25 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
మరుసటి ఉదయం, వారు వెళ్తున్నప్పుడు, ఆ అంజూరపుచెట్టు వేర్లతో సహా ఎండిపోయిందని వారు గమనించారు. అందుకు పేతురు దానిని జ్ఞాపకం చేసుకొని యేసుతో, “బోధకుడా చూడు! నీవు శపించిన అంజూరపుచెట్టు ఎండిపోయింది” అన్నాడు. అందుకు యేసు, “దేవునిలో విశ్వాసముంచండి” అని చెప్పారు. “ఎవరైనా ఈ కొండతో, ‘వెళ్లు, సముద్రంలో పడు’ అని చెప్పి, తమ మనస్సులో సందేహించక తాము చెప్పింది తప్పక జరుగుతుందని నమ్మితే, వారికి అది జరుగుతుందని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను. కనుక నేను చెప్పేది ఏంటంటే, ప్రార్థనలో మీరు ఏమి అడిగినా, దానిని పొందుకున్నామని నమ్మండి, అప్పుడు దానిని మీరు పొందుకుంటారు. మీరు నిలబడి ప్రార్థన చేస్తున్నప్పుడు, ఒకవేళ మీరు ఎవరిపట్లనైనా ఏదైన వ్యతిరేకత కలిగి ఉంటే, వారిని క్షమించండి, దాన్ని బట్టి మీ పరలోకపు తండ్రి మీ పాపాలను క్షమిస్తారు. [
మార్కు 11:20-25 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
తరువాతి రోజు ఉదయం వారు ఆ దారిన నడుస్తూ ఉంటే అంజూరు చెట్టు వేరులతో సహా ఎండిపోయి ఉండడం గమనించారు. అప్పుడు పేతురుకు యేసు మాటలు జ్ఞాపకం వచ్చి ఆయనతో, “రబ్బీ! నీవు శపించిన అంజూరు చెట్టు ఎండిపోయింది” అన్నాడు. అందుకు యేసు వారితో ఇలా అన్నాడు, “దేవుని మీద విశ్వాసం ఉంచండి. మీతో కచ్చితంగా చెప్పేదేమంటే, ఎవరైనా సరే, ఈ కొండతో, ‘నీవు లేచి సముద్రంలో పడిపో!’ అని చెప్పి హృదయంలో అనుమానించకుండా తాను చెప్పినది జరుగుతుందని నమ్మితే అది అతనికి జరిగి తీరుతుంది. అందుచేత నేను చెప్పేది ఏమంటే, మీరు ప్రార్థించేటప్పుడు ఏది అడిగినా అది మీకు దొరుకుతుందని నమ్మండి. అప్పుడు అవన్నీ మీకు లభిస్తాయి. అంతే కాక మీరు నిలబడి ప్రార్థన చేసినప్పుడల్లా మీకు ఎవరితోనైనా విరోధముంటే అతన్ని క్షమించండి.
మార్కు 11:20-25 పవిత్ర బైబిల్ (TERV)
ఉదయం ఆ దారిన నడుస్తూ వాళ్ళా అంజూరపు చెట్టు వ్రేళ్ళు మొదలుకొని ఎండిపోయి ఉండటం గమనించారు. పేతురుకు యేసు అన్నమాటలు జ్ఞాపకం వచ్చి యేసుతో, “రబ్బీ! అదిగో చూడండి; మీరు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయింది” అని అన్నాడు. యేసు ఈ విధంగా సమాధానం చెప్పాడు: “దేవుణ్ణి విశ్వసించండి. ఇది నిజం. హృదయంలో అనుమానించకుండా తాను అన్నది జరుగుతుందని నమ్మి ఒక కొండతో ‘వెళ్ళి సముద్రంలో పడు’ అని అంటే, అలాగే సంభవిస్తుంది. అందువల్ల నేను చెప్పేదేమిటంటే, మీరు ప్రార్థించేటప్పుడు ఏది అడిగినా మీకు లభిస్తుందని సంపూర్ణంగా విశ్వసించండి. అప్పుడు మీకది లభిస్తుంది. అంతేకాక, మీరు ప్రార్థించటానికి నిలుచున్నప్పుడు మీకు ఎవరితోనన్న విరోధం ఉంటే అతణ్ణి క్షమించండి. అప్పుడు పరలోకంలో ఉన్న మీ తండ్రి మీ పాపాలను క్షమిస్తాడు.”
మార్కు 11:20-25 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ప్రొద్దునవారు మార్గమున పోవుచుండగా ఆ అంజూ రపుచెట్టు వేళ్లు మొదలుకొని యెండియుండుట చూచిరి. అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకమునకు తెచ్చుకొని–బోధకుడా, యిదిగో నీవు శపించిన అంజూరపుచెట్టు ఎండిపోయెనని ఆయనతో చెప్పెను. అందుకు యేసు వారితో ఇట్లనెను–మీరు దేవునియందు విశ్వాసముంచుడి. ఎవడైనను ఈ కొండను చూచి–నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడుమని చెప్పి, తన మనస్సులో సందే హింపక తాను చెప్పినది జరుగునని నమ్మినయెడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొందియున్నామని నమ్ముడి; అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. మీకు ఒకనిమీద విరోధ మేమైనను కలిగియున్నయెడల, మీరు నిలువబడి ప్రార్థన చేయునప్పుడెల్లను వాని క్షమించుడి.