మార్కు 11:1-33
మార్కు 11:1-33 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
వారు యెరూషలేముకు సమీపిస్తూ, ఒలీవల కొండ దగ్గర ఉన్న బేతనియ, బెత్పగే గ్రామాలకు వచ్చాక, యేసు తన ఇద్దరు శిష్యులను పంపుతూ, “మీ ఎదురుగా ఉన్న గ్రామానికి వెళ్లండి, దానిలో ప్రవేశించగానే, ఇంతవరకు ఎవ్వరూ ఎక్కని ఒక గాడిదపిల్ల కట్టబడి మీకు కనబడుతుంది. దానిని విప్పి ఇక్కడికి తీసుకురండి. ‘మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు?’ అని ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని అడిగితే, ‘ఇది ప్రభువుకు కావాలి, త్వరలో తిరిగి పంపిస్తారు’ అని చెప్పండి” అన్నారు. వారు వెళ్లి ఒక వీధిలో ఒక ఇంటి తలుపు బయట ఒక గాడిదపిల్ల కట్టబడి ఉండడం చూసారు వారు దాన్ని విప్పుతున్నప్పుడు, అక్కడ నిలబడ్డ కొందరు, “మీరు ఆ గాడిద పిల్లను ఎందుకు విప్పుతున్నారు?” అని వారిని అడిగారు. యేసు చెప్పినట్లే వారు ఆ మనుష్యులకు చెప్పినప్పుడు, ఆ మనుష్యులు దాన్ని తీసుకువెళ్ళనిచ్చారు. వారు ఆ గాడిద పిల్లను యేసు దగ్గరకు తీసుకువచ్చి దానిపై తమ వస్త్రాలను వేశారు, ఆయన దానిపై కూర్చున్నారు. చాలామంది ప్రజలు తమ వస్త్రాలను త్రోవలో పరిచారు, మరికొందరు పొలాలలో నుండి కొమ్మలు నరికితెచ్చి పరిచారు. ఆయన ముందు వెళ్లేవారు, ఆయనను వెంబడిస్తున్న వారు బిగ్గరగా, “హోసన్నా!” “ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక!” “రానైయున్న మన పితరుడైన దావీదు రాజ్యం ధన్యమవును గాక!” “సర్వోన్నతమైన స్థలాల్లో హోసన్నా!” అని కేకలు వేశారు. యేసు యెరూషలేములో ప్రవేశించి, దేవాలయ ఆవరణంలోనికి వెళ్లారు. అక్కడ ఉన్న వాటన్నిటినీ చూసారు కాని అప్పటికే ఆలస్యం అయినందుకు ఆయన పన్నెండు మందితో కలిసి బేతనియ గ్రామానికి వెళ్లిపోయారు. మరుసటిరోజు వారు బేతనియ గ్రామాన్ని విడిచి వెళ్లేటప్పుడు, యేసుకు ఆకలివేసింది. దూరం నుండి ఒక అంజూరపు చెట్టును చూసి, దానిలో ఏమైనా పండ్లు ఉన్నాయా అని దగ్గరకు వెళ్లారు. కాని అది అంజూరపు పండ్లు కాసే కాలం కాదు కనుక ఆకులు తప్ప పండ్లేమి కనిపించలేదు. అప్పుడు యేసు ఆ చెట్టుతో, “ఇక నుండి ఎవ్వరు ఎన్నడు నీ పండ్లను తినకపోవుదురు గాక” అన్నారు. ఆయన అలా అనడం శిష్యులు విన్నారు. వారు యెరూషలేము చేరిన తర్వాత, యేసు దేవాలయ ఆవరణంలో ప్రవేశించి అక్కడ అమ్ముతూ, కొంటూ ఉన్న వారినందరిని తరమడం ప్రారంభించారు. డబ్బు మార్చే వారి బల్లలను, గువ్వలను, అమ్మేవారి పీటలను ఆయన పడవేసారు. దేవాలయ ఆవరణంలో ఎవరినీ వ్యాపారం చేయనివ్వలేదు. ఆయన వారికి బోధిస్తూ, “ ‘నా మందిరం అన్ని జనాంగాలకు ప్రార్థన మందిరం అని పిలువబడుతుందని వ్రాయబడలేదా? కాని మీరు దానిని దొంగల గుహగా చేశారు’ ” అన్నారు. ముఖ్య యాజకులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు ఈ మాటలు విని, ఆయనను చంపడానికి ఒక మార్గాన్ని వెదకడం ప్రారంభించారు, కాని ప్రజలందరు ఆయన ఉపదేశానికి ఆశ్చర్యపడటం చూసి, ఆయనకు భయపడ్డారు. సాయంత్రంమైనప్పుడు, యేసు తన శిష్యులతో కలిసి పట్టణం విడిచి వెళ్లారు. మరుసటి ఉదయం, వారు వెళ్తున్నప్పుడు, ఆ అంజూరపుచెట్టు వేర్లతో సహా ఎండిపోయిందని వారు గమనించారు. అందుకు పేతురు దానిని జ్ఞాపకం చేసుకొని యేసుతో, “బోధకుడా చూడు! నీవు శపించిన అంజూరపుచెట్టు ఎండిపోయింది” అన్నాడు. అందుకు యేసు, “దేవునిలో విశ్వాసముంచండి” అని చెప్పారు. “ఎవరైనా ఈ కొండతో, ‘వెళ్లు, సముద్రంలో పడు’ అని చెప్పి, తమ మనస్సులో సందేహించక తాము చెప్పింది తప్పక జరుగుతుందని నమ్మితే, వారికి అది జరుగుతుందని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను. కనుక నేను చెప్పేది ఏంటంటే, ప్రార్థనలో మీరు ఏమి అడిగినా, దానిని పొందుకున్నామని నమ్మండి, అప్పుడు దానిని మీరు పొందుకుంటారు. మీరు నిలబడి ప్రార్థన చేస్తున్నప్పుడు, ఒకవేళ మీరు ఎవరిపట్లనైనా ఏదైన వ్యతిరేకత కలిగి ఉంటే, వారిని క్షమించండి, దాన్ని బట్టి మీ పరలోకపు తండ్రి మీ పాపాలను క్షమిస్తారు. [ఒకవేళ మీరు ఇతరుల అపరాధాలను క్షమించకపోతే, మీ పరలోకపు తండ్రి కూడ మీ అపరాధాలను క్షమించరు.”] వారు తిరిగి యెరూషలేముకు చేరుకొన్నారు, యేసు దేవాలయ ఆవరణంలో నడుస్తున్నప్పుడు, ముఖ్య యాజకులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు, నాయకులు ఆయన దగ్గరకు వచ్చారు. వారు, “నీవు ఏ అధికారంతో ఈ కార్యాలను చేస్తున్నావు? ఇవి చేయడానికి నీకు అధికారం ఎవరిచ్చారు?” అని అడిగారు. అందుకు యేసు, “నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. దానికి మీరు సమాధానం చెప్పండి, అప్పుడు ఏ అధికారంతో నేను వీటిని చేస్తున్నానో మీకు చెప్తాను. యోహాను ఇచ్చిన బాప్తిస్మం పరలోకం నుండి కలిగిందా, లేక మానవుల నుండి కలిగిందా? చెప్పండి!” అని వారిని అడిగారు. వారు తమలో తాము చర్చించుకొంటూ అనుకున్నారు, “ఒకవేళ మనం ‘పరలోకం నుండి కలిగింది’ అని చెప్పితే ‘మరి మీరు ఎందుకు అతన్ని నమ్మలేదు’ అని అడుగుతాడు. ఒకవేళ మనం, ‘మనుష్యుల వలన’ ” అని చెప్తే, (వారు ప్రజలకు భయపడ్డారు. దానికి కారణం ప్రతి ఒక్కరు యోహాను నిజంగా ఒక ప్రవక్తని నమ్ముతున్నారు.) కాబట్టి వారు, “మాకు తెలియదు” అని యేసుకు జవాబిచ్చారు. అందుకు యేసు, “నేను ఏ అధికారంతో ఈ కార్యాలను చేస్తున్నానో నేను కూడా మీతో చెప్పను” అన్నారు.
మార్కు 11:1-33 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
వారు యెరూషలేము పట్టణాన్ని సమీపించారు. ఒలీవల కొండ దగ్గర ఉన్న బేత్పగే, బేతనియ అనే గ్రామాలు చేరుకున్నారు. అప్పుడు ఆయన తన శిష్యుల్లో ఇద్దరిని పిలిచి ఇలా అన్నాడు. “మీ ముందున్న గ్రామానికి వెళ్ళండి. దానిలో ప్రవేశించగానే కట్టి ఉన్న గాడిద పిల్ల మీకు కనబడుతుంది. ఇంతవరకూ దాని మీద ఎవరూ ఎన్నడూ స్వారీ చెయ్యలేదు. దాన్ని విప్పి తోలుకు రండి. అలా ఎందుకు చేస్తున్నారని మిమ్మల్ని ఎవరైనా అడిగితే, ‘ఇది ప్రభువుకు అవసరం’ అనండి. వెంటనే అతడు దాన్ని పంపిస్తాడు.” శిష్యులు వెళ్ళి, ఒక ఇంటి ముందు వీధిలో ఒక గాడిద పిల్ల ఉండడం చూసి, దాన్ని విప్పుతుండగా అక్కడ ఉన్న కొందరు వారితో, “మీరెందుకు గాడిద పిల్లను విప్పుతున్నారు?” అని అడిగారు. శిష్యులు యేసు చెప్పమన్నట్టే వారికి చెప్పారు. వెంటనే ఆ మనుషులు వారిని వెళ్ళనిచ్చారు. వారు ఆ గాడిద పిల్లను యేసు దగ్గరికి తీసుకు వచ్చి తమ వస్త్రాలను దాని మీద పరిచారు. ఆయన ఆ గాడిద పిల్ల మీద కూర్చున్నాడు. చాలామంది ప్రజలు తమ వస్త్రాలు దారి పొడవునా పరిచారు. ఇంకొందరు చెట్ల కొమ్మలను నరికి దారిన పరిచారు. ముందు, వెనక నడుస్తున్న వారు కేకలు వేస్తూ, “జయం! ప్రభువు పేరిట వచ్చేవాడు ధన్యుడు! రానున్న మన తండ్రి దావీదు రాజ్యం ధన్యం. సర్వోన్నతమైన స్థలాల్లో జయం!” అని బిగ్గరగా కేకలు వేశారు. యేసు యెరూషలేము పట్టణ దేవాలయంలోకి ప్రవేశించాడు. చుట్టూ ఉన్న అన్నిటినీ చూశాడు. అప్పటికే పొద్దుపోవడం వల్ల ఆయన తన పన్నెండు మంది శిష్యులతో కలిసి బేతనీకి వెళ్ళాడు. మరుసటి రోజు బేతనీ నుండి వస్తుండగా ఆయనకు ఆకలి వేసింది. కొంత దూరంలో ఆకులున్న అంజూరు చెట్టు ఆయనకు కనిపించింది. ఆ చెట్టుకు పండ్లు ఉన్నాయేమో అని చూడడానికి దగ్గరికి వెళ్ళాడు. కాని, అది పండ్లు కాసే కాలం కానందువల్ల ఆకులు తప్ప పండ్లు కనిపించలేదు. ఆయన ఆ చెట్టుతో, “ఇక నుండి ఎన్నడూ ఎవ్వరూ నీ పండ్లు తినరు” అన్నాడు. ఆయన పలికినది శిష్యులు విన్నారు. వారు యెరూషలేము వచ్చినప్పుడు యేసు దేవాలయంలో ప్రవేశించి, వ్యాపారం చేస్తున్నవారిని తరిమి వేయడం ప్రారంభించాడు. డబ్బు మార్చే వ్యాపారుల బల్లలు, పావురాలు అమ్ముతున్న వారి పీటలు పడదోశాడు. దేవాలయం గుండా ఎవ్వరూ సరుకులు మోసుకుపోకుండా చేశాడు. ఆయన వారికి బోధిస్తూ, “‘నా ఆలయం అన్ని జాతులకూ ప్రార్థనా ఆలయం అంటారు’ అని రాసి లేదా? కానీ మీరు దాన్ని దోపిడి దొంగల గుహగా చేశారు” అన్నాడు. ముఖ్య యాజకులు, ధర్మశాస్త్ర పండితులు ఆ మాట విని ఆయనను ఎలా చంపాలా అని ఆలోచించారు గానీ అక్కడ ఉన్న ప్రజలంతా యేసు బోధకు ఆశ్చర్య చకితులై ఉండడం వల్ల ఆయనకు భయపడ్డారు. సాయంకాలమైనప్పుడు ఆయన, ఆయన శిష్యులు పట్టణం విడిచి వెళ్ళిపోయారు. తరువాతి రోజు ఉదయం వారు ఆ దారిన నడుస్తూ ఉంటే అంజూరు చెట్టు వేరులతో సహా ఎండిపోయి ఉండడం గమనించారు. అప్పుడు పేతురుకు యేసు మాటలు జ్ఞాపకం వచ్చి ఆయనతో, “రబ్బీ! నీవు శపించిన అంజూరు చెట్టు ఎండిపోయింది” అన్నాడు. అందుకు యేసు వారితో ఇలా అన్నాడు, “దేవుని మీద విశ్వాసం ఉంచండి. మీతో కచ్చితంగా చెప్పేదేమంటే, ఎవరైనా సరే, ఈ కొండతో, ‘నీవు లేచి సముద్రంలో పడిపో!’ అని చెప్పి హృదయంలో అనుమానించకుండా తాను చెప్పినది జరుగుతుందని నమ్మితే అది అతనికి జరిగి తీరుతుంది. అందుచేత నేను చెప్పేది ఏమంటే, మీరు ప్రార్థించేటప్పుడు ఏది అడిగినా అది మీకు దొరుకుతుందని నమ్మండి. అప్పుడు అవన్నీ మీకు లభిస్తాయి. అంతే కాక మీరు నిలబడి ప్రార్థన చేసినప్పుడల్లా మీకు ఎవరితోనైనా విరోధముంటే అతన్ని క్షమించండి. అప్పుడు పరలోకంలో ఉన్న మీ తండ్రి మీ పాపాలను క్షమిస్తాడు.” యేసు, ఆయన శిష్యులు యెరూషలేము చేరుకున్నారు. ఆయన దేవాలయంలో నడుస్తూ ఉండగా ముఖ్య యాజకులు, ధర్మశాస్త్ర పండితులు, పెద్దలు ఆయన దగ్గరికి వచ్చి ఆయనతో, “నీవు ఏ అధికారంతో ఈ పనులు చేస్తున్నావు? ఈ పనులు చేయడానికి అధికారం నీకెవరిచ్చారు?” అని అడిగారు. యేసు, “నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను జవాబు చెప్పండి. అప్పుడు నేను ఏ అధికారంతో ఈ క్రియలు చేస్తున్నానో మీకు చెబుతాను. యోహాను ఇచ్చిన బాప్తిసం ఎక్కడ నుంచి వచ్చింది? పరలోకం నుండా మనుషుల నుండా? చెప్పండి” అన్నాడు. వారు ఆ విషయాన్ని గురించి తమలో తాము ఈ విధంగా చర్చించుకున్నారు. “‘మనం పరలోకం నుండి’ అని అంటే ఇతడు ‘అలాగైతే మీరెందుకు అతన్ని నమ్మలేదు?’ అంటాడు. ‘మనుషుల నుండి’ అంటే ప్రజలకు మన మీద కోపం వస్తుంది” అనుకున్నారు. ఎందుకంటే, యోహాను నిజంగా ఒక ప్రవక్త అని అందరూ నమ్మేవారు. కనుక వారు, “మాకు తెలియదు” అని జవాబు చెప్పారు. యేసు, “అలాగైతే ఏ అధికారంతో ఈ క్రియలు చేస్తున్నానో అదీ మీకు చెప్పను” అన్నాడు.
మార్కు 11:1-33 పవిత్ర బైబిల్ (TERV)
వాళ్ళు యెరూషలేము పట్టణాన్ని సమీపించారు. ఒలీవలకొండ దగ్గరున్న బేత్పగే మరియు బేతనియ గ్రామాలకు రాగానే యేసు తన శిష్యుల్లో యిద్దరిని పంపుతూ, వాళ్ళతో, “ముందున్న గ్రామానికి వెళ్ళండి. మీరాగ్రామంలోకి వెళ్ళిన వెంటనే అక్కడ వయస్సులో ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడుతుంది. అది ఒక వాకిలి ముందు కట్టబడి ఉంటుంది. దాని మీద ఇది వరకెవ్వరూ స్వారి చెయ్యలేదు. దాన్ని విప్పి యిక్కడకు తీసుకొని రండి. అలా ఎందుకు చేస్తున్నారని మిమ్మల్ని ఎవరైనా అడిగితే, ‘ప్రభువుకు కావాలి, త్వరలోనే తిరిగి పంపుతాము’ అని సమాధానం చెప్పండి” అని అన్నాడు. శిష్యులు వెళ్ళి, ఇంటి ముందు వీధిలో ఒక గాడిద ఉండటం చూసారు. వాళ్ళు దాన్ని విప్పుతుండగా అక్కడ నిలుచున్న కొందరు మనుష్యులు, “గాడిదను ఎందుకు విప్పుతున్నారు?” అని అడిగారు. వాళ్ళు యేసు చెప్పమన్న సమాధానం చెప్పారు. ఆ మనుష్యులు వాళ్ళను పోనిచ్చారు. వాళ్ళా గాడిదను యేసు దగ్గరకు తీసుకొని వచ్చి, తమ వస్త్రాల్ని దాని మీద పరిచారు. యేసు దానిపై కూర్చున్నాడు. చాలా మంది ప్రజలు తమ వస్త్రాలను దారిమీద పరిచారు. మరికొందరు తోటలనుండి తెచ్చిన చెట్ల రెమ్మల్ని దారి మీద పరిచారు. ముందు నడుస్తున్న వాళ్ళు, వెనుక నడుస్తున్న వాళ్ళు, “‘హోసన్నా, ప్రభువు పేరిట వచ్చుచున్న వాడు ధన్యుడు.’ “రానున్న మన తండ్రి దావీదు రాజ్యం ధన్యమైనది. మహోన్నతుడైన వానికి హోసన్నా!” అని బిగ్గరగా కేకలు వేసారు. యేసు యెరూషలేం పట్టణం ప్రవేశించి అక్కడున్న ఆలయానికి వెళ్ళాడు. చుట్టూ ఉన్న వాటిని చూసాడు. అప్పటికే ప్రొద్దు పోయి ఉండటం వల్ల పన్నెండుగురితో కలిసి బేతనియకు వెళ్ళాడు. మరుసటిరోజు వాళ్ళు బేతనియనుండి బయలుదేరి వస్తుండగా యేసుకు ఆకలి వేసింది. కొంత దూరంలో ఆకులున్న అంజూరపు చెట్టు ఉండటం యేసు చూసాడు. దాని మీద పండ్లున్నాయేమో చూడాలని దగ్గరకు వెళ్ళాడు. కాని దగ్గరకు వెళ్ళాక, అది పండ్లు కాచేకాలం కానందువల్ల ఆయనకు ఆకులు తప్ప పండ్లు కనిపించలేదు. అప్పుడు యేసు ఆ చెట్టుతో, “ఎన్నడూ ఎవ్వరూ నీ ఫలాల్ని తినకూడదు!” అని అన్నాడు. ఆయన అలా అనటం శిష్యులు విన్నారు. యెరూషలేము చేరుకొన్నాక యేసు దేవాలయంలోకి ప్రవేశించి వ్యాపారం చేస్తున్న వాళ్ళను తరిమి వేయటం మొదలుపెట్టాడు. డబ్బు మార్చే వ్యాపారస్తుల బల్లల్ని, పావురాలు అమ్ముతున్న వ్యాపారస్తుల బల్లల్ని క్రింద పడవేసాడు. దేవాలయం ద్వారా ఎవరూ సరుకులు మోసుకు పోనీయకుండా చేసాడు. ఆయన బోధిస్తూ, “‘నా ఆలయం అన్ని జనాంగాలకు ప్రార్థనా ఆలయం అనిపించుకొంటుంది’ అని గ్రంథాల్లో వ్రాసారు. కాని మీరు దాన్ని దోపిడి దొంగలు దాచుకొనే గుహగా మార్చారు” అని అన్నాడు. అక్కడున్న ప్రజలు యేసు బోధను విని ఆశ్చర్యపొయ్యారు. ప్రధానయాజకులు, శాస్త్రులు భయపడి యేసును చంపటానికి మార్గం వెతకటం మొదలు పెట్టారు. సాయంత్రం కాగానే ఆయన, శిష్యులు పట్టణం వదిలి వెళ్ళిపొయ్యారు. ఉదయం ఆ దారిన నడుస్తూ వాళ్ళా అంజూరపు చెట్టు వ్రేళ్ళు మొదలుకొని ఎండిపోయి ఉండటం గమనించారు. పేతురుకు యేసు అన్నమాటలు జ్ఞాపకం వచ్చి యేసుతో, “రబ్బీ! అదిగో చూడండి; మీరు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయింది” అని అన్నాడు. యేసు ఈ విధంగా సమాధానం చెప్పాడు: “దేవుణ్ణి విశ్వసించండి. ఇది నిజం. హృదయంలో అనుమానించకుండా తాను అన్నది జరుగుతుందని నమ్మి ఒక కొండతో ‘వెళ్ళి సముద్రంలో పడు’ అని అంటే, అలాగే సంభవిస్తుంది. అందువల్ల నేను చెప్పేదేమిటంటే, మీరు ప్రార్థించేటప్పుడు ఏది అడిగినా మీకు లభిస్తుందని సంపూర్ణంగా విశ్వసించండి. అప్పుడు మీకది లభిస్తుంది. అంతేకాక, మీరు ప్రార్థించటానికి నిలుచున్నప్పుడు మీకు ఎవరితోనన్న విరోధం ఉంటే అతణ్ణి క్షమించండి. అప్పుడు పరలోకంలో ఉన్న మీ తండ్రి మీ పాపాలను క్షమిస్తాడు.” యేసు, ఆయన శిష్యులు యెరూషలేం చేరుకొన్నారు. ఆయన మందిరావరణంలో నడుస్తుండగా ప్రధానయాజకులు, శాస్త్రులు పెద్దలు ఆయన దగ్గరకు వచ్చారు. వాళ్ళాయన్ని, “ఎవరిచ్చిన అధికారంతో నీవు వీటిని చేస్తున్నావు? ఇవి చేయటానికి అధికారమెవరిచ్చారు?” అని అడిగారు. యేసు సమాధానంగా, “నన్ను ఒక్క ప్రశ్న అడుగనివ్వండి. దానికి మీరు సమాధానం చెప్పండి. అప్పుడు నేనివి ఎవరిచ్చిన అధికారంతో చేస్తున్నానో చెబుతాను. యోహాను బాప్తిస్మము పరలోకంలో నుండి వచ్చినదా? లేక మానవులనుండి వచ్చినదా? సమాధానం చెప్పండి” అన్నాడు. వాళ్ళు, ఆ విషయాన్ని గురించి పరస్పరం చర్చించుకొని, “మనం ‘పరలోకం నుండి’ అని అంటే, ‘మరి అలాగైతే మీరు యోహానును ఎందుకు నమ్మలేదు?’ అని అడుగుతాడు. మనం ‘మానవుల నుండి’ అని అంటే ప్రజలకు మనమంటే కోపం వస్తుంది” అని అనుకున్నారు. యోహాను ఒక ప్రవక్త అని ప్రతి ఒక్కడు నమ్మటంవల్ల వాళ్ళు ప్రజలంటే భయపడ్డారు. కనుక వాళ్ళు, “మాకు తెలియదు” అని సమాధానం చెప్పారు. యేసు, “అలాగైతే నేను కూడా యివి ఎవరిచ్చిన అధికారంతో చేస్తున్నానో చెప్పను” అని అన్నాడు.
మార్కు 11:1-33 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవల కొండ దగ్గరనున్న బేత్పగే బేతనియ అను గ్రామములకు వచ్చినప్పుడు, ఆయన తన శిష్యులలో ఇద్దరిని చూచి –మీ యెదుటనున్న గ్రామమునకు వెళ్లుడి; అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడియున్న యొక గాడిద పిల్ల కనబడును; దానిమీద ఏ మనుష్యుడును ఎప్పుడును కూర్చుండ లేదు; దానిని విప్పి, తోలుకొని రండి. ఎవడైనను– మీరెందుకు ఈలాగు చేయుచున్నారని మిమ్ము నడిగినయెడల–అది ప్రభువునకు కావలసియున్నదని చెప్పుడి. తక్షణమే అతడు దానిని ఇక్కడికి తోలి పంపునని చెప్పి వారిని పంపెను. వారు వెళ్లగా వీధిలో ఇంటి బయట తలవాకిట కట్టబడియున్న గాడిద పిల్ల యొకటి వారికి కనబడెను; దానిని విప్పుచుండగా, అక్కడ నిలిచియున్న వారిలో కొందరు– మీరేమి చేయుచున్నారు? గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారినడిగిరి. అందుకు శిష్యులు, యేసు ఆజ్ఞాపించినట్టు వారితో చెప్పగా వారు పోనిచ్చిరి. వారు ఆ గాడిదపిల్లను యేసునొద్దకు తోలుకొని వచ్చి, తమ బట్టలు దానిపై వేయగా ఆయన దానిమీద కూర్చుండెను. అనేకులు తమ బట్టలను దారి పొడుగుననుపరచిరి, కొందరు తాము పొలములలో నరికిన కొమ్మలనుపరచిరి. మరియు ముందు వెళ్లుచుండినవారును వెనుక వచ్చుచుండినవారును –జయము ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడుగాక వచ్చుచున్న మన తండ్రియైన దావీదు రాజ్యము స్తుతింపబడుగాక సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ఆయన యెరూషలేమునకు వచ్చి దేవాలయములో ప్రవేశించి, చుట్టు సమస్తమును చూచి, సాయంకాలమైనందున పండ్రెండుమందితోకూడ బేతనియకు వెళ్లెను. మరునాడు వారు బేతనియనుండి వెళ్లుచుండగా ఆయన ఆకలిగొని ఆకులుగల ఒక అంజూరపు చెట్టును దూరము నుండి చూచి, దానిమీద ఏమైనను దొరకునేమో అని వచ్చెను. దానియొద్దకు వచ్చి చూడగా, ఆకులు తప్ప మరేమియు కనబడలేదు; ఏలయనగా అది అంజూరపు పండ్లకాలము కాదు. అందుకాయన–ఇకమీదట ఎన్నటి కిని నీ పండ్లు ఎవరును తినకుందురు గాక అని చెప్పెను ; ఇది ఆయన శిష్యులు వినిరి. వారు యెరూషలేమునకు వచ్చినప్పుడు ఆయన దేవాలయములో ప్రవేశించి, దేవాలయములో క్రయ విక్రయములు చేయువారిని వెళ్లగొట్ట నారంభించి, రూకలు మార్చువారి బల్లలను, గువ్వలమ్మువారి పీటలను పడద్రోసి దేవాలయము గుండ ఏపాత్రయైనను ఎవనిని తేనియ్యకుండెను. మరియు ఆయన బోధించుచు –నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థన మందిరమనబడును అని వ్రాయబడలేదా? అయితే మీరు దానిని దొంగల గుహగా చేసితిరనెను. శాస్త్రులును ప్రధానయాజకులును ఆ మాట విని, జన సమూహమంతయు ఆయన బోధకు బహుగా ఆశ్చర్య పడుట చూచి, ఆయనకు భయపడి, ఆయన నేలాగు సంహరించుదమా అని సమయము చూచుచుండిరి. సాయంకాలమైనప్పుడు ఆయన పట్టణములోనుండి బయలుదేరెను. ప్రొద్దునవారు మార్గమున పోవుచుండగా ఆ అంజూ రపుచెట్టు వేళ్లు మొదలుకొని యెండియుండుట చూచిరి. అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకమునకు తెచ్చుకొని–బోధకుడా, యిదిగో నీవు శపించిన అంజూరపుచెట్టు ఎండిపోయెనని ఆయనతో చెప్పెను. అందుకు యేసు వారితో ఇట్లనెను–మీరు దేవునియందు విశ్వాసముంచుడి. ఎవడైనను ఈ కొండను చూచి–నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడుమని చెప్పి, తన మనస్సులో సందే హింపక తాను చెప్పినది జరుగునని నమ్మినయెడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొందియున్నామని నమ్ముడి; అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. మీకు ఒకనిమీద విరోధ మేమైనను కలిగియున్నయెడల, మీరు నిలువబడి ప్రార్థన చేయునప్పుడెల్లను వాని క్షమించుడి. అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములు క్షమించును. వారు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. ఆయన దేవాలయములో తిరుగుచుండగా ప్రధానయాజకులును శాస్త్రులును పెద్దలును ఆయనయొద్దకువచ్చి –నీవు ఏ అధికారమువలన ఈ కార్యములు చేయుచున్నావు? వీటిని చేయుటకు ఈ యధికారము నీకెవడిచ్చెనని అడిగిరి. అందుకు యేసు–నేనును మిమ్మును ఒక మాట అడిగెదను, నాకు ఉత్తరమియ్యుడి, అప్పుడు నేను ఏ అధికారమువలన వీటిని చేయుచున్నానో అది మీతో చెప్పుదును. యోహాను ఇచ్చిన బాప్తిస్మము పరలోకమునుండి కలిగినదా మనుష్యులనుండి కలిగినదా? నాకు ఉత్తరమియ్యుడని చెప్పెను. అందుకు వారు–మనము పరలోకమునుండి కలిగినదని చెప్పినయెడల, ఆయన – ఆలాగైతే మీరు ఎందుకతని నమ్మలేదని అడుగును; మనుష్యులవలన కలిగిన దని చెప్పుదుమా అని తమలోతాము ఆలోచించుకొనిరి గాని, అందరు యోహాను నిజముగా ప్రవక్త యని యెంచిరి గనుక ప్రజలకు భయపడి–ఆ సంగతి మాకు తెలియదని యేసునకు ఉత్తరమిచ్చిరి. అందుకు యేసు–ఏ అధికారము వలన ఈ కార్యములు చేయుచున్నానో అదియు నేను మీతో చెప్పననెను.