మార్కు 10:1-52

మార్కు 10:1-52 తెలుగు సమకాలీన అనువాదము (TCV)

యేసు కపెర్నహూము నుండి యూదయ ప్రాంతానికి మరియు యోర్దాను నది అవతల ఉన్న ప్రాంతానికి వెళ్లారు. మళ్ళీ ప్రజల గుంపు ఆయన దగ్గరకు వచ్చింది కనుక ఆయన ఎప్పటిలాగే వారికి బోధించారు. కొందరు పరిసయ్యులు ఆయనను పరీక్షించడానికి ఆయన దగ్గరకు వచ్చి, “ఒక పురుషుడు తన భార్యకు విడాకులు ఇవ్వడం చట్టప్రకారం న్యాయమేనా?” అని అడిగారు. అందుకు యేసు, “మోషే మీకు ఏమి ఆజ్ఞాపించాడు?” అని అడిగారు. వారు, “విడాకుల ధృవీకరణ పత్రం వ్రాసి ఆమెను పంపించడానికి మోషే పురుషునికి అనుమతించాడు” అన్నారు. అందుకు యేసు, “మీ హృదయ కాఠిన్యాన్ని బట్టే మోషే ఈ ఆజ్ఞను మీ కొరకు వ్రాసాడు. సృష్టి ఆరంభం నుండే దేవుడు వారిని ‘పురుషునిగా స్త్రీగా’ సృజించారు. ‘అందుకే పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకుంటాడు, అలా వారిద్దరు ఏకశరీరంగా అవుతారు.’ కనుక వారు ఇక ఇద్దరు కారు, కాని ఒకే శరీరమే అవుతారు. కనుక దేవుడు జతపరచినవారిని ఏ మనుష్యుడు వేరు చేయకూడదు” అని చెప్పారు. వారందరు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు, శిష్యులు వీటి గురించి యేసుని వివరంగా చెప్పమని అడిగారు. ఆయన ఇలా జవాబిచ్చారు, “తన భార్యను విడిచి మరొక స్త్రీని వివాహం చేసుకొనేవాడు ఆమెకు విరుద్ధంగా వ్యభిచారం చేస్తున్నాడు. అలాగే ఒకవేళ ఆమె తన భర్తను విడిచి వేరే పురుషుని వివాహం చేసుకుంటే, ఆమె వ్యభిచారం చేస్తుంది.” ప్రజలు తమ చిన్నపిల్లలపై యేసు తన చేతులుంచి వారిని ఆశీర్వదించాలని ఆయన దగ్గరకు తీసుకొని వస్తున్నారు, కాని శిష్యులు వారిని గద్దించారు. యేసు అది చూసి, శిష్యుల మీద కోప్పడ్డారు. ఆయన వారితో, “చిన్నపిల్లలను నా దగ్గరకు రానివ్వండి, వారిని ఆటంకపరచకండి, ఎందుకంటే ఇలాంటి వారిదే దేవుని రాజ్యం. ఎవరైనా చిన్నపిల్లల్లాగా దేవుని రాజ్యాన్ని స్వీకరించకపోతే ఎన్నటికి దానిలో ప్రవేశించరని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను” అని అన్నారు. అప్పుడు ఆయన ఆ పిల్లలను తన కౌగిటిలో ఎత్తుకొని, వారి మీద తన చేతులుంచి వారిని దీవించారు. యేసు బయలుదేరి వెళ్తునప్పుడు, ఒక మనిషి ఆయన దగ్గరకు పరిగెత్తుకొని వచ్చి ఆయన ముందు మోకాళ్ళూని, “మంచి బోధకుడా, నిత్యజీవం పొందుకోవాలంటే నేనేమి చేయాలి?” అని అడిగాడు. అందుకు యేసు, “నీవు నన్ను ఎందుకు మంచివాడనని పిలుస్తున్నావు? దేవుడు తప్ప మంచివారు ఎవ్వరూ లేరు. మీకు ఆజ్ఞలు తెలుసు: ‘నరహత్య చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, దొంగతనం చేయకూడదు, అబద్ధసాక్ష్యం చెప్పకూడదు, మోసం చేయకూడదు, మీ తండ్రిని తల్లిని గౌరవించాలి’ ” అని అన్నారు. అందుకు అతడు, “బోధకుడా, నేను నా బాల్యం నుండే వీటినన్నిటిని ఆచరిస్తున్నాను” అన్నాడు. యేసు అతన్ని చూసి అతన్ని ప్రేమించి, “నీలో ఒక కొరత ఉంది. నీవు వెళ్లి, నీకున్న ఆస్తి అంతా అమ్మి పేదవారికి పంచిపెట్టు, పరలోకంలో నీవు ధనం కలిగివుంటావు. తర్వాత వచ్చి, నన్ను వెంబడించు” అని చెప్పారు. ఆ మాటతో అతడు ముఖం చిన్నబుచ్చుకుని, విచారంగా వెళ్లిపోయాడు, ఎందుకంటే అతడు గొప్ప ఆస్తిగలవాడు. యేసు చుట్టూ చూసి తన శిష్యులతో, “ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం ఎంత కష్టమో!” అన్నారు. ఆయన మాటలకు శిష్యులు ఆశ్చర్యపడ్డారు కాని యేసు మళ్ళీ, “పిల్లలారా, దేవుని రాజ్యంలో ప్రవేశించడం ఎంత కష్టమో! ఒక ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కంటే ఒంటె సూది రంధ్రం గుండా దూరడం సులభం” అని చెప్పారు. ఇది విని శిష్యులు మరింత ఆశ్చర్యపడి, ఒకరితో ఒకరు, “అయితే మరి ఎవరు రక్షణ పొందగలరు?” అనుకున్నారు. యేసు వారివైపు చూసి, “ఇది మనుష్యులకు అసాధ్యమే, కాని దేవునికి కాదు; దేవునికి సమస్తం సాధ్యమే!” అన్నారు. అప్పుడు పేతురు, “మేము అన్నిటిని విడిచిపెట్టి నిన్ను వెంబడించాము!” అన్నాడు. అందుకు యేసు, “నేను మీతో నిజంగా చెప్తున్నాను, నా కొరకు సువార్త కొరకు ఎవరైతే తమ ఇంటిని గాని సహోదరులను, సహోదరీలను, తల్లిని, తండ్రిని, పిల్లలను, పొలాలను విడిచిపెడతారో, వారు హింసతో పాటు ఇండ్లను, సహోదరులను, సహోదరీలను, తల్లులను, పిల్లలను, పొలాలను ఈ ప్రస్తుత యుగంలో మరియు రానున్న యుగంలో నిత్యజీవాన్ని వందరెట్లు పొందుకొంటారు. అయితే చాలామంది మొదటివారు చివరివారవుతారు, చివరివారు మొదటివారవుతారు” అని చెప్పారు. వారు యెరూషలేముకు వెళ్తున్నారు, యేసు వారికి ముందు నడుస్తున్నారు, ఆయనను వెంబడించినవారు భయపడుతూవుంటే, శిష్యులు విస్మయమొందారు. యేసు మళ్ళీ తన పన్నెండు మంది శిష్యులను పక్కకు తీసుకువెళ్లి తనకు జరగబోయే సంగతులను వారికి చెప్పారు. “మనం యెరూషలేముకు వెళ్తున్నాం, మనుష్యకుమారుడు ముఖ్యయాజకులకు మరియు ధర్మశాస్త్ర ఉపదేశకులకు అప్పగించబడతాడు. వారు ఆయనకు మరణశిక్ష విధించి ఆయనను యూదేతరుల చేతికి అప్పగిస్తారు. వారు ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్మివేసి, కొరడాలతో కొట్టి చంపేస్తారు. మూడు రోజుల తర్వాత ఆయన తిరిగి లేస్తారు” అని చెప్పారు. జెబెదయి కుమారులైన యాకోబు యోహానులు ఆయన దగ్గరకు వచ్చి, “బోధకుడా, మేమేది అడిగినా నీవు మా కొరకు అది చేయాలని మేము కోరుతున్నాం” అని అన్నారు. ఆయన వారిని, “నేను మీకు ఏమి చేయాలని మీరు కోరుతున్నారు?” అని అడిగారు. వారు ఆయనతో, “నీ మహిమలో మా ఇద్దరిలో ఒకరిని నీ కుడి వైపున మరొకరిని నీ ఎడమ వైపున కూర్చోపెట్టుకో” అన్నారు. యేసు వారితో, “మీరేమి అడుగుతున్నారో మీకు తెలియదు, నేను త్రాగబోయే గిన్నెలోనిది మీరు త్రాగగలరా లేదా నేను పొందిన బాప్తిస్మం మీరు పొందగలరా?” అని అడిగారు. వారు, “మేము చేయగలం” అని జవాబిచ్చారు. అప్పుడు యేసు వారితో, “నేను త్రాగే గిన్నెలోనిది మీరు తప్పక త్రాగుతారు మరియు నేను పొందిన బాప్తిస్మం మీరు పొందుతారు, కాని నా కుడి వైపున లేక ఎడమ వైపున కూర్చోడానికి అనుమతి ఇవ్వాల్సింది నేను కాదు. ఈ స్థానాలు ఎవరి కొరకు సిద్ధపరచబడి ఉన్నాయో వారికే చెందుతాయి” అని వారితో అన్నారు. ఇది విన్న తక్కిన పదిమంది శిష్యులు, యాకోబు యోహానుల మీద కోపపడ్డారు. యేసు వారిని తన దగ్గరకు పిలుచుకొని వారితో ఇలా అన్నారు, “యూదులు కాని అధికారులు వారి మీద ప్రభుత్వం చేస్తారని మరియు వారి ఉన్నతాధికారులు వారి మీద అధికారం చెలాయిస్తారని మీకు తెలుసు. కాని మీరలా ఉండకూడదు. మీలో గొప్పవాడు కావాలని కోరేవాడు మీకు దాసునిగా ఉండాలి, అలాగే మీలో మొదటి వానిగా ఉండాలని కోరుకొనేవాడు అందరికి దాసునిగా ఉండాలి. ఎందుకంటే మనుష్యకుమారుడు సేవ చేయించుకోడానికి రాలేదు కాని సేవ చేయడానికి, తన ప్రాణాన్ని అనేకులకు విమోచన క్రయధనంగా చెల్లించడానికి వచ్చాడు.” ఆ తర్వాత వారు యెరికో పట్టణం చేరుకున్నారు. యేసు, ఆయన శిష్యులు, గొప్ప జనసమూహంతో కలిసి, పట్టణం విడిచి వెళ్తుండగా, తిమయి కుమారుడైన బర్తిమయి అనే ఒక గ్రుడ్డివాడు త్రోవ ప్రక్కన కూర్చుని భిక్షం అడుక్కొంటున్నాడు. వాడు నజరేయుడైన యేసు అక్కడ ఉన్నాడని విని, “దావీదు కుమారుడా యేసూ, నా మీద దయ చూపించు!” అని కేకలు వేయడం మొదలుపెట్టాడు. అనేకులు వాన్ని గద్దించారు, నిశ్శబ్దంగా ఉండుమని వానికి చెప్పారు. కాని వాడు, “దావీదు కుమారుడా, నన్ను కరుణించు!” అని ఇంకా బిగ్గరగా కేకలు వేశాడు. అప్పుడు యేసు ఆగి, “వాన్ని పిలవండి” అన్నారు. వారు ఆ గ్రుడ్డివానితో, “సంతోషించు! లేచి రా! ఆయన నిన్ను పిలుస్తున్నారు” అన్నారు. వాడు తాను కప్పుకొన్న పైబట్టను పారవేసి, దిగ్గున లేచి యేసు దగ్గరకు వచ్చాడు. యేసు వాన్ని, “నేను నీకు ఏమి చేయాలని కోరుతున్నావు?” అని అడిగారు. అప్పుడు ఆ గ్రుడ్డివాడు, “బోధకుడా, నాకు చూపు కావాలి” అని అన్నాడు. అందుకు యేసు, “వెళ్లు, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచింది” అని చెప్పారు. వెంటనే వాడు చూపు పొందుకొని ఆ దారిన యేసును వెంబడించాడు.

షేర్ చేయి
Read మార్కు 10

మార్కు 10:1-52 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

యేసు ఆ ప్రాంతం విడిచి యూదయ ప్రాంతానికి వెళ్ళాడు. ఆ తరువాత యొర్దాను నదికి అవతల ఉన్న ప్రాంతానికి వెళ్ళాడు. మళ్ళీ ప్రజలు గుంపులు గుంపులుగా ఆయన దగ్గరికి వచ్చారు. ఎప్పటిలాగే యేసు వారికి ఉపదేశం చేశాడు. కొందరు పరిసయ్యులు ఆయనను పరీక్షించే ఉద్దేశంతో, “ఒక పురుషుడు తన భార్యకు విడాకులు ఇవ్వడం ధర్మమేనా?” అని అడిగారు. యేసు, “మోషే మీకు ఏమని ఆజ్ఞాపించాడు?” అని అడిగాడు. వారు, “విడాకుల పత్రం రాసిచ్చి భార్యతో తెగతెంపులు చేసుకోవడానికి మోషే అనుమతి ఇచ్చాడు” అన్నారు. యేసు, “మీరు దేవునికి లోబడని వారు, కాబట్టి మోషే ఆ విధంగా ఆదేశించాడు. కాని, సృష్టి ఆరంభం నుండి దేవుడు వారిని స్త్రీ పురుషులుగా సృజించాడు. అందుకే పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి తన భార్యతో కలిసి జీవిస్తాడు. వారిద్దరు ఐక్యమై ఒకే శరీరంగా మారిపోతారు. కాబట్టి అప్పటి నుంచి వారు ఇద్దరు కాకుండా ఒకరిలా జీవిస్తారు. కాబట్టి దేవుడు కలిపిన వారిని ఏ మనిషీ వేరు చేయకూడదు” అని వారితో చెప్పాడు. అందరూ ఇంట్లోకి వచ్చాక శిష్యులు యేసును ఈ సంగతి గురించి వివరంగా చెప్పమని కోరారు. యేసు, “తన భార్యకు విడాకులిచ్చి మరొక స్త్రీని పెళ్ళి చేసుకున్నవాడు తన భార్యకు వ్యతిరేకంగా వ్యభిచారం చేస్తున్నట్టే. అదే విధంగా తన భర్తకు విడాకులిచ్చి మరొక పురుషుణ్ణి పెళ్ళి చేసుకున్న స్త్రీని వ్యభిచారిణిగా పరిగణించాలి” అని వారితో అన్నాడు. యేసు తమ చిన్న బిడ్డలను తాకాలని కొంతమంది వారిని తీసుకు వచ్చారు గాని, శిష్యులు వారిని అడ్డుకున్నారు. ఇది చూసి యేసుకు చాలా బాధ కలిగింది. ఆయన శిష్యులతో, “చిన్న బిడ్డలను నా దగ్గరికి రానివ్వండి. వారిని ఆపకండి. దేవుని రాజ్యం చిన్నపిల్లల్లాంటి వారిదే. మీతో కచ్చితంగా చెప్పేదేమంటే, చిన్న పిల్లల్లాగా దేవుని రాజ్యాన్ని స్వీకరించని వారు అందులో ఎన్నడూ ప్రవేశించరు” అన్నాడు. ఆయన ఆ చిన్నపిల్లలను దగ్గరికి పిలిచి వారిపై చేతులుంచి వారిని దీవించాడు. ఆయన బయలుదేరుతుండగా ఒక వ్యక్తి పరుగెత్తుకుంటూ వచ్చి ఆయన ముందు మోకరిల్లి, “మంచి బోధకుడా, శాశ్వత జీవానికి వారసుణ్ణి కావడానికి నేనేం చెయ్యాలి?” అని ఆయనను అడిగాడు. యేసు, “నేను మంచి వాడినని ఎందుకు అంటున్నావు? దేవుడు తప్ప మంచివాడు ఎవరూ లేరు. దేవుని ఆజ్ఞలు నీకు తెలుసు కదా! వ్యభిచారం చేయకూడదు, హత్య చేయకూడదు, దొంగతనం చేయకూడదు, అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు, మోసం చేయకూడదు, తల్లిదండ్రులను గౌరవించాలి” అన్నాడు. అతడు ఆయనతో, “బోధకా, నా చిన్నతనం నుండి నేను వీటిని పాటిస్తున్నాను” అని అన్నాడు. యేసు అతన్ని చూస్తూ, అతనిపై ప్రేమ భావం కలిగి ఇలా అన్నాడు, “నీకు ఒకటి తక్కువగా ఉంది. వెళ్ళి నీకున్నదంతా అమ్మి పేదవాళ్ళకు ఇవ్వు. అప్పుడు పరలోకంలో నీకు సంపద దొరుకుతుంది. ఆ తరువాత వచ్చి నన్ను అనుసరించు” అని అన్నాడు. అతడు గొప్ప సంపన్నుడు గనక యేసు చెప్పిన ఆ మాటకు ముఖం చిన్నబుచ్చుకుని దుఃఖంతో అక్కడ నుండి వెళ్ళిపోయాడు. యేసు చుట్టూ చూసి తన శిష్యులతో, “ధనికుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం చాలా కష్టం” అని అన్నాడు. ఆయన మాటలకు శిష్యులు ఎంతో ఆశ్చర్యపడ్డారు. యేసు మళ్ళీ, “పిల్లలారా, దేవుని రాజ్యంలో ప్రవేశించడం ఎంతో కష్టం! ధనికుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కన్నా ఒంటె సూది రంధ్రం ద్వారా వెళ్ళడం సులభం” అన్నాడు. ఇది విని శిష్యులు ఇంకా ఆశ్చర్యపడ్డారు. వారు “అలాగైతే ఎవరు రక్షణ పొందగలరు?” అంటూ తమలో తాము మాట్లాడుకున్నారు. యేసు వారి వైపు చూసి, “మనుషులకు ఇది అసాధ్యమే గాని, దేవునికి కాదు. దేవునికి అన్నీ సాధ్యమే” అన్నాడు. పేతురు ఆయనతో, “ఇదిగో, మేము అన్నిటినీ విడిచిపెట్టి నిన్ను అనుసరించాం గదా!” అన్నాడు. అందుకు యేసు, “మీతో కచ్చితంగా చెప్పేదేమంటే, నా కోసం, సువార్త కోసం, తన ఇంటిని, అన్నదమ్ములను, అక్కచెల్లెళ్ళను, తల్లిని, తండ్రిని, భార్యను, పిల్లలను, ఆస్తులను వదిలిపెట్టిన వాడు. ఇప్పుడు ఈ లోకంలో హింసలతో బాటు ఇళ్ళు, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, తల్లులు, పిల్లలు, ఆస్తులు, రానున్న లోకంలో శాశ్వత జీవం పొందుతాడు. కాని, మొదటివారు చాలా మంది చివరివారు అవుతారు, చివరివారు చాలా మంది మొదటివారు అవుతారు” అన్నాడు. యేసు, ఆయనతో ఉన్నవారంతా యెరూషలేము బయలుదేరారు. యేసు అందరికన్నా ముందు నడుస్తూ ఉన్నాడు. ఆయన శిష్యులకు ఆశ్చర్యం కలిగింది. ఆయనను అనుసరిస్తున్న ఇతరులు భయపడ్డారు. యేసు మళ్ళీ తన శిష్యులను పక్కకు పిలిచి, తనకు జరగబోయే వాటిని గురించి వారికి చెప్పాడు. ఆయన, “వినండి, మనం యెరూషలేము వెళ్తున్నాం. అక్కడ మనుష్య కుమారుణ్ణి ప్రధాన యాజకులకు, ధర్మశాస్త్ర పండితులకు అప్పగిస్తారు. వారు ఆయనకు మరణశిక్ష విధించి, యూదేతర ప్రజలకు అప్పగిస్తారు. వారు ఆయనను హేళన చేసి, ఆయన మీద ఉమ్మివేస్తారు. కొరడా దెబ్బలు కొడతారు, ఆ తరువాత చంపేస్తారు. మూడవ రోజున ఆయన మళ్ళీ సజీవంగా లేస్తాడు” అని వారితో చెప్పాడు. జెబెదయి కుమారులు యాకోబు, యోహాను ఆయన దగ్గరికి వచ్చి, “బోధకా! మేము అడిగింది మాకు అనుగ్రహిస్తావా?” అని అడిగారు. ఆయన, “నేనేం చెయ్యాలని మీరు కోరుతున్నారు?” అని ప్రశ్నించాడు. వారు, “నీవు మహిమలో మాలో ఒకరిని నీ కుడిచేతి వైపు, మరొకరిని ఎడమచేతి వైపు కూర్చోబెట్టుకో” అన్నారు. యేసు, “మీరు ఏమి అడుగుతున్నారో మీకు తెలియదు. నేను తాగిన దాన్ని మీరు తాగగలరా? నేను పొందే బాప్తిసం మీరు పొందగలరా?” అని అడిగాడు. వారు, “పొందగలం” అని జవాబు చెప్పారు. యేసు వారితో, “నేను తాగిన దాన్ని మీరు తాగుతారు, నేను పొందిన బాప్తిసం మీరు పొందుతారు. కాని, నా కుడి వైపు, నా ఎడమవైపు కూర్చోడానికి అనుమతించేది నేను కాదు. ఆ స్థానాలు ఎవరి కోసం సిద్ధం చేసి ఉన్నాయో వారికే అవి దొరుకుతాయి” అన్నాడు. ఇది విని మిగతా పదిమందికి యాకోబు, యోహానుల మీద కోపం వచ్చింది. అయితే యేసు వారిని దగ్గరికి పిలిచి వారితో ఇలా అన్నాడు, “అన్యజనుల అధికారులు ప్రజల మీద తమ ఆధిపత్యాన్ని చూపడానికి ప్రయత్నిస్తారు. వారిలో ప్రముఖులు వారిపై అధికారం చెలాయిస్తారు. మీరు అలా ఉండకూడదు. మీలో ప్రముఖుడు కావాలనుకొనేవాడు సేవకుడై ఉండాలి. మీలో మొదటివాడు కావాలని కోరేవాడు అందరికీ దాసుడై ఉండాలి. ఎందుకంటే మనుష్య కుమారుడు సేవ చేయించుకోడానికి రాలేదు, సేవ చేయడానికీ, అందరి పక్షాన తన ప్రాణాన్ని వెలగా ధార పోయడానికి వచ్చాడు.” ఆ తరువాత వారు యెరికో చేరుకున్నారు. యేసు, ఆయన శిష్యులు, వారితో ఉన్న జనసమూహం ఆ పట్టణాన్ని వదిలి బయలుదేరారు. తీమయి కుమారుడు బర్తిమయి అనే ఒక గుడ్డివాడు దారి పక్కన కూర్చుని ఉన్నాడు. అతడు భిక్షగాడు. ఆ గుడ్డివాడు, వస్తున్నది నజరేయుడైన యేసు అని తెలుసుకుని, “యేసూ! దావీదు కుమారా! నా మీద దయ చూపు!” అని కేకలు పెట్టసాగాడు. చాలా మంది అతణ్ణి గద్దించి ఊరుకోమన్నారు. కాని ఆ గుడ్డివాడు, “దావీదు కుమారా! నా మీద దయ చూపు!” అని ఇంకా పెద్దగా కేకలు వేశాడు. యేసు ఆగి, “అతణ్ణి పిలవండి” అన్నాడు. ప్రజలు ఆ గుడ్డివానితో, “ధైర్యంగా ఉండు! లే! ఆయన నిన్ను పిలుస్తున్నాడు” అన్నారు. ఆ గుడ్డివాడు తాను కప్పుకొన్న పైబట్టను అవతల పారవేసి, గభాలున లేచి యేసు దగ్గరికి వెళ్ళాడు. యేసు, “ఏం కావాలి?” అని అడిగాడు. ఆ గుడ్డివాడు, “రబ్బీ! నాకు మళ్లీ చూపు ప్రసాదించు” అని వేడుకున్నాడు. యేసు, “నీ విశ్వాసం నిన్ను బాగుచేసింది, ఇక వెళ్ళు” అన్నాడు. వెంటనే అతనికి చూపు వచ్చింది. అతడు యేసును అనుసరిస్తూ ఆయనతో వెళ్ళాడు.

షేర్ చేయి
Read మార్కు 10

మార్కు 10:1-52 పవిత్ర బైబిల్ (TERV)

యేసు ఆ ప్రాంతాన్ని వదిలి యూదయ ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడి నుండి యొర్దాను నది అవతల వైపునున్న ప్రాంతానికి వెళ్ళాడు. మళ్ళీ ప్రజల గుంపులు ఆయన దగ్గరకు వచ్చాయి. యేసు ఎప్పటిలాగే వాళ్ళకు బోధించాడు. కొందరు పరిసయ్యులు ఆయన్ని పరీక్షించాలని అనుకొని వచ్చి, “ఒక మనిషి తన భార్యకు విడాకులివ్వటం న్యాయ సమ్మతమేనా?” అని అడిగారు. యేసు, “మోషే మీకు ఏమని ఆజ్ఞాపించాడు?” అని అడిగాడు. వాళ్ళు, “విడాకుల పత్రం వ్రాసి భార్యను పంపివేయటానికి మోషే అనుమతి ఇచ్చాడు” అని అన్నారు. యేసు, “మీరు దేవునికి లోబడనివారు కనుక మోషే అలా వ్రాశాడు. కాని, దేవుడు తన సృష్టి ప్రారంభించినప్పుడు ‘ఆడ మగ అనే జాతుల్ని సృష్టించాడు’ అందువల్లే, పురుషుడు తన తల్లి తండ్రుల్ని వదిలి తన భార్యతో కలిసి జీవిస్తున్నాడు. వాళ్ళిద్దరూ ఐక్యమై ఒకే దేహంగా మారిపోతారు. అందువల్ల వాళ్ళు యిద్దరివలే కాకుండా ఒకరిలా జీవిస్తారు. కనుక దేవుడు ఐక్యం చేసిన వాళ్ళను ఏ మానవుడూ వేరు చేయకూడదు” అని అన్నాడు. అంతా యింట్లోకి వచ్చాక శిష్యులు యేసును ఈ విషయాన్ని గురించి విశదంగా చెప్పమని కోరారు. యేసు ఇలాగన్నాడు: “తన భార్యకు విడాకులిచ్చి మరొక స్త్రీని వివాహం చేసుకొన్నవాడు తన భార్యకు వ్యతిరేకంగా వ్యభిచరించినవాడౌతాడు. అదే విధంగా తన భర్తకు విడాకులిచ్చి మరొక పురుషుని వివాహం చేసుకొన్న స్త్రీ వ్యభిచారిణిగా పరిగణింపబడుతుంది.” యేసు తాకాలని, ప్రజలు చిన్నపిల్లల్ని పిలుచుకొని వస్తూవుంటే శిష్యులు వాళ్ళని గద్దించారు. ఇది చూసి యేసుకు మనస్సులో బాధ కలిగింది. ఆయన వాళ్ళతో, “చిన్నపిల్లల్ని నా దగ్గరకు రానివ్వండి. వాళ్ళను ఆపకండి. దేవుని రాజ్యం చిన్న పిల్లల్లాంటి వారిది. ఇది నిజం. చిన్న పిల్లవాని వలే దేవుని రాజ్యాన్ని స్వీకరించనివాడు ఆ రాజ్యంలోకి ప్రవేశించలేడు” అని అన్నాడు. ఆయన ఆ చిన్న పిల్లల్ని దగ్గరకు పిలిచి వాళ్ళపై తన చేతులుంచి ఆశీర్వదించాడు. యేసు బయలుదేరుతుండగా ఒక మనిషి పరుగెత్తుకొంటూ ఆయన దగ్గరకు వచ్చి ఆయన ముందు మోకరిల్లి, “మంచి బోధకుడా! నేను నిత్యజీవం పొందాలంటే ఏమి చెయ్యాలి?” అని అడిగాడు. యేసు, “నేను మంచివాణ్ణి అని ఎందుకు అంటున్నావు. దేవుడు తప్ప ఎవరూ మంచివారు కారు. మోషే ఆజ్ఞలు నీకు తెలుసు కదా! హత్య చేయరాదు, వ్యభిచారం చేయరాదు. దొంగతనము చెయ్యరాదు. దొంగ సాక్ష్యం చెప్పరాదు. మోసం చెయ్యరాదు. నీ తల్లి తండ్రుల్ని గౌరవించు” అని అన్నాడు. అతడు, “అయ్యా! నా చిన్నతనంనుండి నేను వీటిని పాటిస్తున్నాను!” అని అన్నాడు. యేసు అతని వైపు చూసాడు. అతనిపై యేసుకు అభిమానం కలిగింది. అతనితో, “నీవు యింకొకటి చెయ్యాలి. వెళ్ళి నీ దగ్గరున్నవన్నీ అమ్మేసి పేదవాళ్ళకివ్వు. అప్పుడు నీకు పరలోకంలో సంపద లభిస్తుంది. ఆ తదుపరి నన్ను అనుసరించు” అని అన్నాడు. ఇది విన్నాక ఆ వచ్చిన వ్యక్తి ముఖం చిన్నబోయింది. అతని దగ్గర చాలా ధనముండటం వల్ల దుఃఖంతో అక్కడినుండి వెళ్ళిపొయ్యాడు. యేసు చుట్టూ చూసి తన శిష్యులతో, “ధనమున్నవాడు దేవుని రాజ్యంలోకి ప్రవేశించటం చాలా కష్టం” అని అన్నాడు. శిష్యులు ఆయన మాటలకు ఆశ్చర్యపోయారు. యేసు మళ్ళీ, “శిష్యులారా! దేవుని రాజ్యంలో ప్రవేశించటం ఎంతో కష్టం! ధనవంతుడు దేవుని రాజ్యంలోకి ప్రవేశించటం కన్నా ఒంటె సూది రంధ్రం ద్వారా వెళ్ళటం సులభం” అని అన్నాడు. ఇది విని శిష్యులు యింకా ఎక్కువ ఆశ్చర్యపడ్డారు. అలాగైతే, “ఎవరికి రక్షణ లభిస్తుంది?” అంటూ పరస్పరం మాట్లాడుకున్నారు. యేసు వాళ్ళవైపు చూసి, “మానవునికి ఇది అసాధ్యమైన పని కాని, దేవునికి అన్నీ సాధ్యమే!” అని అన్నాడు. పేతురు ఆయనతో, “మిమ్మల్ని అనుసరించాలని మేము అన్నీ వదిలివేసాము” అని అన్నాడు. యేసు, “ఇది నిజం. నా కోసం, సువార్తకోసం, తన యింటినికాని, సోదరులనుకాని, అక్క చెల్లెండ్లను కాని, తల్లినికాని, తండ్రినికాని, సంతానాన్ని కాని, పొలాల్ని కాని, విడిచినవాడు ఈ తరంలోనే నూరు రెట్లు యిళ్ళను, సోదరులను, అక్క చెల్లెండ్లను, తల్లుల్ని, సంతానాన్ని, పొలాల్ని పొందుతాడు. వీటితో పాటు హింసల్ని కూడా పొందుతాడు. రానున్న లోకంలో నిత్యజీవం పొందుతాడు. కాని ముందున్న వాళ్ళు చివరివాళ్ళై, చివర వున్న వాళ్ళు ముందుకు వెళ్తారు” అని అన్నాడు. యేసు, ఆయనతో ఉన్న వాళ్ళు అంతా యెరూషలేము వెళ్ళటానికి బయలుదేరారు. యేసు అందరికన్నా ముందు నడుస్తూ ఉన్నాడు. ఆయన శిష్యులు దిగులుతో నడుస్తూ ఉన్నారు. యేసును అనుసరిస్తున్న యితరులు భయపడుతూ నడుస్తూ ఉన్నారు. యేసు మళ్ళీ తన శిష్యులను ప్రక్కకు పిలిచి తనకు జరుగనున్న వాటిని గురించి వాళ్ళకు చెప్పాడు. ఆయన, “వినండి, మనం యెరూషలేము దాకా వెళ్తున్నాము. అక్కడ మనుష్యకుమారునికి ద్రోహం జరుగుతుంది. ఆయన ప్రధానయాజకులకు, శాస్త్రులకు అప్పగింపబడతాడు. వాళ్ళాయనకు మరణ శిక్ష విధించి యూదులుకాని వాళ్ళకు అప్పగిస్తారు. యూదులుకాని వాళ్ళు ఆయన్ని హేళన చేసి ఆయన మీద ఉమ్మివేస్తారు. ఆయన్ని కొరడా దెబ్బలుకొడతారు. ఆ తర్వాత చంపివేస్తారు. మూడు రోజుల తర్వాత ఆయన బ్రతికి వస్తాడు” అని అన్నాడు. జెబెదయి కుమారులు యాకోబు మరియు యోహానులు ఆయన దగ్గరకు వచ్చారు. వాళ్ళు, “బోధకుడా! మేము అడిగింది చెయ్యమని కోరుతున్నాము” అని అన్నారు. “ఏమి చెయ్యమంటారు?” అని యేసు అడిగాడు. వాళ్ళు, “మీరు మహిమను పొందినప్పుడు మాలో ఒకరిని మీ కుడిచేతి వైపు, మరొకరిని మీ ఎడమచేతివైపు కూర్చోనివ్వండి” అని అడిగారు. యేసు, “మీరేమి అడుగుతున్నారో మీకు తెలియదు. నేను త్రాగినదాన్ని మీరు త్రాగగలారా? నేను పొందిన బాప్తిస్మము మీరు పొందగలరా?” అని అడిగాడు. “పొందగలము” అని వాళ్ళు సమాధానం చెప్పారు. యేసు వాళ్ళతో, “నేను త్రాగిన దాన్ని మీరు త్రాగుదురు, నేను పొందిన బాప్తిస్మము మీరు పొందుదురు. కాని నా కుడివైపు, లేక నా ఎడమ వైపు కూర్చోమనటానికి అనుమతి యిచ్చేది నేను కాదు. ఈ స్థానాలు ఎవరి కోసం నియమించబడ్డాయో వాళ్ళు మాత్రమే కూర్చోగలరు” అని అన్నాడు. ఇది విని మిగతా పది మందికి యాకోబు మరియు యోహానులపై కోపం వచ్చింది. యేసు వాళ్ళను దగ్గరకు పిలిచి, “యూదులుకాని వాళ్ళను పాలించ వలసిన ప్రభువులు, వాళ్ళపై తమ అధికారం చూపుతూ ఉంటారు. ఇతర అధికారులు కూడా వాళ్ళపై అధికారం చూపుతూ ఉంటారు. ఇది మీకు తెలుసు. మీ విషయంలో అలా కాదు. మీలో అందరి కన్నా గొప్ప కావాలనుకున్నవాడు మిగతా వాళ్ళందరికి సేవ చేయాలి. మీలో ప్రాముఖ్యత పొందాలనుకొన్నవాడు మీ అందరికి బానిసగా ఉండాలి. ఎందుకంటే మనుష్యకుమారుడు కూడా సేవ చేయించుకోవటానికి రాలేదు. కాని సేవ చేయటానికి, అందరి పక్షాన తన ప్రాణాన్ని క్రయధనంగా ధారపోయటానికి వచ్చాడు” అని అన్నాడు. ఆ తర్వాత వాళ్ళు యెరికో చేరుకున్నారు. యేసు, ఆయన శిష్యులు, వాళ్ళతో ఉన్న ప్రజల గుంపు ఆ పట్టణాన్ని వదిలి బయలుదేరారు. తీమయి కుమారుడు బర్తిమయి అనే ఒక గ్రుడ్డివాడు దారి ప్రక్కన కూర్చుని ఉండినాడు. అతడు బిక్షగాడు. ఆ గ్రుడ్డివాడు, వస్తున్నది నజరేతు నివాసి యేసు అని తెలుసుకొని, “యేసూ! దావీదు కుమారుడా! నాపై దయ చూపు!” అని బిగ్గరగా అనటం మొదలు పెట్టాడు. చాలామంది అతణ్ణి తిట్టి ఊరుకోమన్నారు. కాని ఆ గ్రుడ్డివాడు. “దావీదు కుమారుడా! నా మీద దయ చూపు” అని యింకా బిగ్గరగా అరిచాడు. యేసు ఆగి, “అతణ్ణి పిలవండి” అని అన్నాడు. వాళ్ళా గ్రుడ్డివానితో, “ధైర్యంగా లేచి నిలుచో. ఆయన నిన్ను పిలుస్తున్నాడు” అని అన్నారు. ఆ గ్రుడ్డివాడు కప్పుకొన్న వస్త్రాన్ని ప్రక్కకు త్రోసి, గభాలున లేచి యేసు దగ్గరకు వెళ్ళాడు. యేసు, “ఏమి కావాలి?” అని అడిగాడు. ఆ గ్రుడ్డివాడు, “రబ్బీ! నాకు చూపు కావాలి” అని అన్నాడు. యేసు, “నీ విశ్వాసం నీకు నయం చేసింది. యిక వెళ్ళు” అని అన్నాడు. వెంటనే అతనికి చూపు వచ్చింది. అతడు యేసును అనుసరిస్తూ ఆయన వెంట వెళ్ళాడు.

షేర్ చేయి
Read మార్కు 10

మార్కు 10:1-52 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

ఆయన అక్కడనుండి లేచి యూదయ ప్రాంతములకును యొర్దాను అద్దరికిని వచ్చెను. జనసమూహములు తిరిగి ఆయనయొద్దకు కూడివచ్చిరి: ఆయన తనవాడుక చొప్పున వారికి మరల బోధించుచుండెను. పరిసయ్యులు ఆయనయొద్దకు వచ్చి, ఆయనను శోధించుటకై–పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా? అని ఆయన నడిగిరి. అందుకాయన–మోషే మీకేమి ఆజ్ఞాపించెనని వారి నడిగెను. వారు–పరిత్యాగ పత్రిక వ్రాయించి, ఆమెను విడనాడవలెనని మోషే సెలవిచ్చెనని చెప్పగా యేసు–మీ హృదయకాఠిన్యమునుబట్టి అతడీ ఆజ్ఞను మీకు వ్రాసి యిచ్చెను గాని సృష్ట్యాదినుండి (దేవుడు) వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలుగ జేసెను. ఈ హేతువుచేత పురుషుడు తన తలిదండ్రులను విడిచి పెట్టి తన భార్యను హత్తుకొనును; వారిద్దరు ఏకశరీరమై యుందురు, గనుక వారిక ఇద్దరుగా నుండక యేకశరీరముగా నుందురు. కాబట్టి దేవుడు జతపరచిన వారిని మనుష్యుడు వేరుపరచ కూడదని వారితో చెప్పెను. ఇంటికి వచ్చి శిష్యులు ఈ సంగతినిగూర్చి ఆయనను మరల నడిగిరి. అందుకాయన–తన భార్యను విడనాడి మరియొకతెను పెండ్లిచేసికొనువాడు తాను విడనాడిన ఆమె విషయమై వ్యభిచరించువాడగును. మరియు స్త్రీ తన పురుషుని విడనాడి మరియొకని పెండ్లిజేసికొనినయెడల ఆమె వ్యభిచరించునదగునని వారితో చెప్పెను. తమ చిన్నబిడ్డలను ముట్టవలెనని కొందరాయనయొద్దకు వారిని తీసికొని వచ్చిరి; అయితే శిష్యులు (వారిని తీసికొని వచ్చిన) వారిని గద్దించిరి. యేసు అది చూచి కోపపడి–చిన్నబిడ్డలను నాయొద్దకు రానియ్యుడి, వారి నాటంక పరచవద్దు; దేవునిరాజ్యము ఈలాటివారిదే. చిన్నబిడ్డవలె దేవునిరాజ్యము నంగీకరింపనివాడు అందులో నెంత మాత్రము ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పు చున్నానని చెప్పి ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని, వారి మీద చేతులుంచి ఆశీర్వదించెను. ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒకడు పరుగెత్తికొనివచ్చి ఆయనయెదుట మోకాళ్లూని–సద్బోధ కుడా, నిత్యజీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయుదునని ఆయన నడిగెను. యేసు–నన్ను సత్పురుషుడని యేల చెప్పుచున్నావు? దేవుడొక్కడే గాని మరి ఎవడును సత్పురుషుడు కాడు. నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధసాక్ష్యము పలుకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తలిదండ్రులను సన్మానింపుము అను ఆజ్ఞలు నీకు తెలియును గదా అని అతనితో చెప్పెను. అందుకతడు–బోధకుడా, బాల్యమునుండి ఇవన్నియు అనుసరించుచునే యుంటినని చెప్పెను. యేసు అతని చూచి అతని ప్రేమించి–నీకు ఒకటి కొదువగానున్నది; నీవు వెళ్లి నీకు కలిగినవన్నియు అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును; నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పెను. అతడు మిగుల ఆస్తిగలవాడు, గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని, దుఃఖపడుచు వెళ్లిపోయెను. అప్పుడు యేసు చుట్టు చూచి–ఆస్తిగలవారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభమని తన శిష్యులతో చెప్పెను. ఆయన మాటలకు శిష్యులు విస్మయమొందిరి. అందుకు యేసు తిరిగి వారితో ఇట్లనెను– పిల్లలారా, తమ ఆస్తియందు నమ్మికయుంచువారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభము; ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుటకంటె ఒంటె సూదిబెజ్జములో దూరుట సులభము. అందుకు వారు అత్యధికముగా ఆశ్చర్యపడి– అట్లయితే ఎవడు రక్షణపొంద గలడని ఆయన నడిగిరి. యేసు వారిని చూచి–ఇది మనుష్యులకు అసాధ్యమే గాని, దేవునికి అసాధ్యము కాదు; దేవునికి సమస్తమును సాధ్యమే అనెను. పేతురు ఇదిగో–మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమని ఆయనతో చెప్పసాగెను. అందుకు యేసు ఇట్లనెను–నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్కచెల్లెండ్రనైనను తలి దండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను విడిచినవాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను అన్నదమ్ములను అక్కచెల్లెండ్రను తల్లులను పిల్లలను భూములను, రాబోవు లోకమందు నిత్యజీవమును పొందు నని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మొదటి వారు అనేకులు కడపటివారగుదురు, కడపటివారు మొదటి వారగుదురు అనెను. వారు ప్రయాణమై యెరూషలేమునకు వెళ్లుచుండిరి. యేసు వారికి ముందు నడుచుచుండగా వారు విస్మయ మొందిరి, వెంబడించువారు భయపడిరి. అప్పుడాయన మరల పండ్రెండుగురు శిష్యులను పిలుచుకొని, తనకు సంభవింపబోవువాటిని వారికి తెలియజెప్పనారంభించి – ఇదిగో మనము యెరూషలేమునకు వెళ్లుచున్నాము; మనుష్య కుమారుడు ప్రధానయాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును; వారాయనకు మరణశిక్ష విధించి ఆయనను అన్యజనుల కప్పగించెదరు. వారు ఆయనను అపహసించి, ఆయనమీద ఉమ్మివేసి, కొరడాలతో ఆయనను కొట్టి చంపెదరు; మూడుదినములైన తరువాత ఆయన తిరిగి లేచునని చెప్పెను. జెబెదయి కుమారులైన యాకోబును యోహానును ఆయనయొద్దకు వచ్చి–బోధకుడా, మేము అడుగునదెల్ల నీవు మాకు చేయగోరుచున్నామని చెప్పగా ఆయన–నేను మీకేమి చేయగోరుచున్నారని వారి నడిగెను. వారు–నీ మహిమయందు నీ కుడివైపున ఒకడును నీ యెడమవైపున ఒకడును కూర్చుండునట్లు మాకు దయచేయుమని చెప్పిరి. యేసు–మీరేమి అడుగుచున్నారో మీకు తెలియదు; నేను త్రాగుచున్న గిన్నెలోనిది త్రాగుటయైనను, నేను పొందుచున్న బాప్తిస్మము పొందుట యైనను మీచేత అగునా? అని వారి నడుగగా వారు–మా చేత అగుననిరి. అప్పుడు యేసు–నేను త్రాగుచున్న గిన్నెలోనిది మీరు త్రాగెదరు; నేను పొందుచున్న బాప్తిస్మము మీరు పొందెదరు, గాని నా కుడివైపునను ఎడమ వైపునను కూర్చుండనిచ్చుట నావశములో లేదు; అది ఎవరికి సిద్ధపరచబడెనో వారికే (దొరకునని) వారితో చెప్పెను. తక్కినపదిమంది శిష్యులు ఆ మాట విని, యాకోబు యోహానులమీద కోపపడసాగిరి. యేసు వారిని తనయొద్దకు పిలిచి వారితో ఇట్లనెను–అన్యజనులలో అధికారులని యెంచబడినవారు వారిమీద ప్రభుత్వము చేయుదురు; వారిలో గొప్పవారు వారిమీద అధికారము చేయుదురని మీకు తెలియును. మీలో ఆలాగుండకూడదు. మీలో ఎవడైనను గొప్పవాడై యుండగోరినయెడల వాడు మీకు పరిచారము చేయువాడై యుండవలెను. మీలో ఎవడైనను ప్రముఖుడై యుండగోరినయెడల, వాడు అందరికి దాసుడై యుండవలెను. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చెననెను. వారు యెరికోపట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోను బహుజనసమూహముతోను యెరికోనుండి బయలుదేరి వచ్చుచుండగా, తీమయి కుమారుడగు బర్తిమయి యను గ్రుడ్డి భిక్షకుడు త్రోవప్రక్కను కూర్చుండెను. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని– దావీదు కుమారుడా యేసూ, నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలుపెట్టెను. ఊరకుండుమని అనేకులు వానిని గద్దించిరి గాని వాడు–దావీదు కుమారుడా, నన్ను కరు ణింపుమని మరి ఎక్కువగా కేకలువేసెను. అప్పుడు యేసు నిలిచి–వానిని పిలువుడని చెప్పగా వారా గ్రుడ్డివానిని పిలిచి–ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లెమ్మని వానితో చెప్పిరి. అంతట వాడు బట్టను పారవేసి, దిగ్గున లేచి యేసునొద్దకు వచ్చెను. యేసు–నేను నీకేమి చేయగోరుచున్నావని వానినడుగగా, ఆ గ్రుడ్డివాడు–బోధకుడా, నాకు దృష్టి కలుగ జేయుమని ఆయనతో అనెను. అందుకు యేసు–నీవు వెళ్లుము; నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెనని చెప్పెను. వెంటనే వాడు త్రోవను ఆయనవెంట చూపుపొంది వెళ్లెను.

షేర్ చేయి
Read మార్కు 10