మీకా 6:1-8
మీకా 6:1-8 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
యెహోవా చెప్పబోయే మాట ఇప్పుడు వినండి. మీకా ఆయనతో ఇలా చెబుతున్నాడు, లేచి పర్వతాల ముందు నీ వాదన వినిపించు. నీ స్వరం కొండలు వినాలి. పర్వతాల్లారా, భూమికి స్థిరమైన పునాదులుగా ఉన్న మీరు యెహోవా చేసిన ఫిర్యాదు వినండి. ఆయన ఇశ్రాయేలీయుల మీద ఫిర్యాదు చేస్తున్నాడు. నా ప్రజలారా, నేను మీకేం చేశాను? మిమ్మల్ని నేనెలా కష్టపెట్టాను? జవాబివ్వండి. ఐగుప్తు దేశంలో నుంచి నేను మిమ్మల్ని రప్పించాను. బానిస ఇంట్లో నుంచి మిమ్మల్ని కాపాడాను. మీ కోసం మోషే అహరోను మిర్యాములను పంపించాను. నా ప్రజలారా, మోయాబురాజు బాలాకు చేసిన ఆలోచన, బెయోరు కుమారుడు బిలాము అతనికిచ్చిన జవాబు గుర్తుకు తెచ్చుకోండి. యెహోవా నీతి పనులు మీరు తెలుసుకునేలా షిత్తీము మొదలు గిల్గాలు వరకూ జరిగిన వాటిని మనసుకు తెచ్చుకోండి. యెహోవాకు నేనేం తీసుకురాను? మహోన్నతుడైన దేవునికి వంగి నమస్కారం చేయడానికి ఏం తీసుకురాను? దహనబలులనూ ఏడాది దూడలనూ తీసుకుని నేను ఆయన దగ్గరికి రానా? వేలకొలది పొట్టేళ్లు, పది వేల నదుల నూనెతో యెహోవా సంతోష పడతాడా? నా అతిక్రమానికి నా పెద్ద కొడుకుని నేనివ్వాలా? నా సొంత పాపానికి నా గర్భఫలాన్ని నేనివ్వాలా? మనిషీ, ఏది మంచిదో యెహోవా నీకు చెప్పాడు. ఆయన నిన్ను కోరేదేంటంటే, న్యాయంగా ప్రవర్తించు. కనికరాన్ని ప్రేమించు. వినయంగా నీ దేవునితో నడువు.
మీకా 6:1-8 పవిత్ర బైబిల్ (TERV)
యెహోవా ఏమి చేపుతున్నాడో ఇప్పుడు విను. నీవు లేచి, పర్వతాలముందు నిలబడు. వాటికి నీ కథ విన్నవించుకో. కొండలను నీ కథ విననియ్యి. తన ప్రజలకు వ్యతిరేకంగా యెహోవాకు ఒక ఫిర్యాదు వుంది. పర్వతాల్లారా, యెహోవా చేసే ఫిర్యాదు వినండి. భూమి పునాదుల్లారా, యెహోవా చేప్పేది వినండి. ఇశ్రాయేలుది తప్పు అని ఆయన నిరూపిస్తాడు! యెహోవా చెపుతున్నాడు, “నా ప్రజలారా, మీ పట్ల నేనేమి తప్పు చేశాను? మీరు నాపట్ల విరక్తి చెందేలా నేను ఏమి చేశాను? మీకు నేను చేసిన పనులు నాకు చెప్పండి! నేను చేసిన పనులు మీకు నేను చెపుతాను! ఐగుప్తు (ఈజిప్టు) దేశం నుండి మిమ్మల్ని నేను తీసుకువచ్చాను. మీకు నేను దాస్యంనుండి విముక్తి కలిగించాను. నేను మీవద్దకు మోషే, అహరోను, మిర్యాములను పంపాను. నా ప్రజలారా, మోయాబు రాజైన బాలాకు చేసిన దుష్టవ్యూహాలను మీరు గుర్తుపెట్టుకోండి. బెయోరు కుమారుడైన బిలాము అనేవాడు బాలాకుకు చెప్పిన విషయాలు గుర్తుకు తెచ్చుకోండి. అకాసియ (షిత్తీము) నుండి గిల్గాలువరకు జరిగిన విషయాలను గుర్తుకు తెచ్చుకోండి. అప్పుడు యెహోవా న్యాయ వర్తనుడని మీరు తెలుసుకుంటారు!” దేవుడైన యెహోవా సన్నిధికి నేను వచ్చినప్పుడు, నేను దేవుని ముందు సాష్టాంగ పడినప్పుడు నాతో నేనేమి తీసుకొనిరావాలి? ఒక సంవత్సరం వయస్సుగల కోడెదూడను దహనబలి నిమిత్తం తీసుకొని నేను యెహోవా వద్దకు రావాలా? యెహోవా వెయ్యి పొట్టేళ్లతో లేక పదివేల నదులకు సమానమైన నూనెతో సంతృప్తి చెందుతాడా? నా పాప పరిహారానికి నా ప్రథమ సంతానాన్ని బలి ఇవ్వనా? నా పాపాలకు పరిహారంగా నా శరీరంలో భాగంగా పుట్టిన శిశువును అర్పించనా? మానవుడా, మంచి విషయాలను గురించి యెహోవా నీకు చెప్పియున్నాడు. యెహోవా నీనుండి కోరేవి ఇవి: ఇతరులపట్ల నీవు న్యాయంగా ప్రవర్తించు. ప్రజలపట్ల ప్రేమ, దయ కలిగిఉండటానికి ఇష్టపడు. అణకువ కలిగి నీ దేవునితో జీవించు.
మీకా 6:1-8 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
యెహోవా సెలవిచ్చు మాట ఆలకించుడి–నీవువచ్చి పర్వతములను సాక్ష్యముపెట్టి వ్యాజ్యెమాడుము, కొండలకు నీ స్వరము వినబడనిమ్ము. తన జనులమీద యెహోవాకు వ్యాజ్యెము కలదు, ఆయన ఇశ్రాయేలీయులమీద వ్యాజ్యెమాడుచున్నాడు; నిశ్చలములై భూమికి పునా దులుగా ఉన్న పర్వతములారా, యెహోవా ఆడు వ్యాజ్యెము ఆలకించుడి. నా జనులారా, నేను మీకేమి చేసితిని? మిమ్మునేలాగు ఆయాసపరచితిని? అది నాతో చెప్పుడి. ఐగుప్తు దేశములోనుండి నేను మిమ్మును రప్పించితిని, దాసగృహములోనుండి మిమ్మును విమోచించితిని, మిమ్మును నడిపించుటకై మోషే అహరోను మిర్యాములను పంపించితిని. నా జనులారా, యెహోవా నీతి కార్యములను మీరు గ్రహించునట్లు మోయాబురాజైన బాలాకు యోచించినదానిని బెయోరు కుమారుడైన బిలాము అతనికి ప్రత్యుత్తరముగా చెప్పిన మాటలను షిత్తీము మొదలుకొని గిల్గాలువరకును జరిగిన వాటిని, మనస్సునకు తెచ్చు కొనుడి. ఏమి తీసికొని వచ్చి నేను యెహోవాను దర్శింతును? ఏమి తీసికొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును? దహనబలులను ఏడాది దూడలను అర్పించి దర్శింతునా? వేలకొలది పొట్టేళ్లును వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగజేయునా? నా అతిక్రమమునకై నా జ్యేష్ఠపుత్రుని నేనిత్తునా? నా పాపపరిహారమునకై నా గర్భఫలమును నేనిత్తునా? మనుష్యుడా, యేది ఉత్తమమో అది నీకు తెలియజేయబడియున్నది; న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీనమనస్సుకలిగి నీ దేవుని యెదుట ప్రవర్తించుటయు, ఇంతేగదా యెహోవా నిన్నడుగుచున్నాడు.
మీకా 6:1-8 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
యెహోవా చెప్పేది వినండి: “మీరు నిలబడి, పర్వతాల ఎదుట నా వాదన వినిపించండి; కొండలు మీరు చెప్పేది వినాలి. “పర్వతాల్లారా, యెహోవా చేసిన నేరారోపణ వినండి; భూమికి నిత్యమైన పునాదుల్లారా, ఆలకించండి. యెహోవా తన ప్రజలకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేస్తున్నారు; ఆయన ఇశ్రాయేలుపై అభియోగం మోపుతున్నారు. “నా ప్రజలారా! నేను మీకేం చేశాను? నేను మిమ్మల్ని ఎలా కష్టపెట్టాను? నాకు జవాబివ్వండి. నేను మిమ్మల్ని ఈజిప్టు నుండి తీసుకువచ్చాను మిమ్మల్ని దాస్యంలో ఉంచిన ఆ దేశం నుండి విడిపించాను. మీకు దారి చూపడానికి మోషే అహరోను మిర్యాములను పంపించాను. నా ప్రజలారా! మోయాబు రాజైన బాలాకు ఎలా కుట్ర చేశాడో, బెయోరు కుమారుడైన బిలాము అతనికి ఎలా జవాబిచ్చాడో జ్ఞాపకం చేసుకోండి. యెహోవా నీతి క్రియలు మీరు గ్రహించేలా షిత్తీము నుండి గిల్గాలు వరకు జరిగిన మీ ప్రయాణం జ్ఞాపకం చేసుకోండి.” ఏమి తీసుకుని నేను యెహోవా సన్నిధిలోకి రావాలి, మహోన్నతుడైన దేవుని ఎదుట నమస్కరించాలి? నేను దహనబలులను, ఏడాది దూడలను ఆయన సన్నిధికి తీసుకురావాలా? వేల కొలది పొట్టేళ్ళూ, పదివేల నదులంత నూనెను అర్పిస్తే యెహోవా సంతోషిస్తారా? నా అతిక్రమం కోసం నా జ్యేష్ఠ కుమారున్ని, నా పాపం కోసం నా గర్భఫలాన్ని అర్పించాలా? ఓ మనుష్యుడా, ఏది మంచిదో ఆయన నీకు చూపించారు. యెహోవా నీ నుండి కోరేదేంటి? న్యాయంగా ప్రవర్తించడం, కరుణను ప్రేమించడం, వినయం కలిగి నీ దేవునితో కలిసి నడవడమే కదా.