మీకా 5:1-6

మీకా 5:1-6 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

సైన్య సమూహాలు గల నగరమా, సమూహాలను సమకూర్చు, శత్రువులు మనల్ని ముట్టడించారు. వారు ఇశ్రాయేలు ప్రజల పాలకున్ని బెత్తంతో చెంపమీద కొడతారు. “అయితే బేత్లెహేము ఎఫ్రాతా, యూదా వారి కుటుంబాల మధ్య నీవు చిన్నదానివైనప్పటికి, నా కోసం ఇశ్రాయేలు మీద పరిపాలన చేసే అధిపతి నీలో నుండి వస్తాడు, ఆయన పూర్వకాలం నుండి శాశ్వతకాలం ఉన్నవాడు.” కాబట్టి ప్రసవ వేదన పడే స్త్రీ బిడ్డను కనేవరకు ఇశ్రాయేలు విడిచిపెట్టబడుతుంది. అతని సోదరులలో మిగిలిన వారు, ఇశ్రాయేలీయులతో చేరడానికి తిరిగి వస్తారు. ఆయన యెహోవా బలం పొంది తన దేవుడైన యెహోవా నామ మహిమతో లేచి తన మందను మేపుతాడు. ఆయన మహాత్యం భూదిగంతాల వరకు వ్యాపిస్తుంది, కాబట్టి వారు సురక్షితంగా నివసిస్తారు. అష్షూరు వారు దండెత్తి మన దేశంలోకి వచ్చి మన కోటలలో ప్రవేశించేటప్పుడు, ఆయన మన సమాధానం అవుతారు మనం వారికి విరుద్ధంగా ఏడుగురు కాపరులను, ఎనిమిది మంది నాయకులుగా నియమిస్తాము. వీరు ఖడ్గంతో అష్షూరు దేశాన్ని, దూసిన ఖడ్గంతో నిమ్రోదు దేశాన్ని పరిపాలిస్తారు. అష్షూరు వారు దండెత్తి మన సరిహద్దులను దాటి, మన దేశాన్ని ఆక్రమించుకున్నప్పుడు ఆయన మనల్ని రక్షిస్తారు.

షేర్ చేయి
చదువండి మీకా 5

మీకా 5:1-6 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

యెరూషలేము ప్రజలారా, యుద్ధ సేనలతో ఇప్పుడు కలిసి రండి. నీ పట్టణం చుట్టూ గోడ ఉంది. అయితే శత్రువులు ఇశ్రాయేలీయుల నాయకుణ్ణి బెత్తంతో చెంప మీద కొడతారు. బేత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబాల మధ్య నువ్వు చిన్న గ్రామమైనా నా కోసం ఇశ్రాయేలీయులను పాలించేవాడు నీలోనుంచి వస్తాడు. ఆయన పూర్వకాలం నుంచి, నిత్యం నుంచి ఉన్నవాడు. కాబట్టి ప్రసవవేదన పడే స్త్రీ, బిడ్డను కనే వరకూ, దేవుడు వారిని అప్పగిస్తాడు. అప్పుడు ఆయన సోదరుల్లో మిగిలినవారు ఇశ్రాయేలీయుల దగ్గరికి తిరిగి వస్తారు. ఆయన యెహోవా బలంతో తన యెహోవా దేవుని పేరులోని గొప్పదనంతో నిలబడి తన మంద మేపుతాడు. వాళ్ళు క్షేమంగా ఉంటారు. భూమి కొనల వరకూ ఆయన గొప్పవాడిగా ఉంటాడు. అష్షూరీయులు మన దేశంలో చొరబడినప్పుడు, వాళ్ళు మన ప్రాకారాల మీద దండెత్తినప్పుడు వాన్ని ఎదిరించడానికి మేము ఏడుగురు గొర్రెల కాపరులను, ఎనిమిది మంది నాయకులను నియమిస్తాం. ఆయనే మనకు శాంతి. వారు కత్తితో అష్షూరు దేశాన్ని పాలిస్తారు. తమ చేతుల్లోని కత్తులతో నిమ్రోదు దేశాన్ని పరిపాలిస్తారు. అష్షూరీయులు మన దేశంలో చొరబడి మన సరిహద్దుల్లో ప్రవేశించినప్పుడు ఆయన మనలను ఇలా కాపాడతాడు.

షేర్ చేయి
చదువండి మీకా 5

మీకా 5:1-6 పవిత్ర బైబిల్ (TERV)

కావున, బలమైన నగరమా, నీ సైన్యాలను సమీకరించు. నీ శత్రువులు ముట్టడించటానికి కూడుకుంటున్నారు. వారు ఇశ్రాయేలు న్యాయాధిపతిని చెంపమీద కొడతారు. కాని, బేత్లెహేము ఎఫ్రాతా, నీవు యూదాలో అతి చిన్న గ్రామానివి. నీ వంశం లెక్కపెట్టటానికి కూడా అతి చిన్నది. అయినప్పటికీ, నీ నుండే నా “ఇశ్రాయేలు పాలకుడు” వస్తాడు. ఆయన ఆరంభం (ఉనికి) పురాతన కాలంనుండి, అనాది కాలంనుండి ఉంటూవుంది. యెహోవా తన ప్రజలను బబులోను (బాబిలోనియా)లో ఉండనిస్తాడు. స్త్రీ ప్రసవించేదాకా వారక్కడ ఉంటారు. అప్పుడు ఇంకా బతికివున్న అతని సోదరులు తిరిగివస్తారు. వారు ఇశ్రాయేలు ప్రజలవద్దకు తిరిగివస్తారు. అప్పుడు ఇశ్రాయేలును పాలించేవాడు నిలబడి తన మందను మేపుతాడు. యెహోవా తన శక్తితోను; దేవుడైన యెహోవా తన అద్భుత నామ మహత్తుతోను వారిని నడిపించుతాడు. వారు నిర్భయంగా జీవిస్తారు. ఎందువల్లనంటే, ఆ సమయంలో ఆయన గొప్పతనం భూమి అంచులదాకా వ్యాపిస్తుంది. శాంతి నెలకొంటుంది. అష్షూరు సైన్యం మన దేశంలోకి వస్తుంది. ఆ సైన్యం మన పెద్ద ఇండ్లను నాశనంచేస్తుంది. కాని ఇశ్రాయేలు పాలకుడు ఏడుగురు గొర్రెల కాపరులను ఎంపికచేస్తాడు. కాదు, ఆయన ఎనమండుగురు నాయకులనుఎంపిక చేస్తాడు. వారు తమ కత్తులను ఉపయోగించి, అష్షూరువారిని పాలిస్తారు. వారు తమ స్వంత నగరాలనుండి నిమ్రోదుదేశాన్ని పాలిస్తారు. ఆ ప్రజలను పాలించటానికి వారు తమ కత్తులను ఉపయోగిస్తారు. అప్పుడు ఇశ్రాయేలు పాలకుడు మనలను అష్షూరీయులనుండి రక్షిస్తాడు. ఆ ప్రజలు మన రాజ్యంలోకి వస్తారు. వారు మన ప్రాంతాన్ని తమ కాళ్ళకింద త్రొక్కుతారు.

షేర్ చేయి
చదువండి మీకా 5

మీకా 5:1-6 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

అయితే సమూహములుగా కూడుదానా, సమూహములుగా కూడుము; శత్రువులు మన పట్టణము ముట్టడి వేయుచున్నారు, వారు ఇశ్రాయేలీయుల న్యాయాధిపతిని కఱ్ఱతో చెంపమీద కొట్టుచున్నారు. బేత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబములలో నీవు స్వల్పగ్రామమైనను నాకొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు నీలోనుండి వచ్చును; పురాతన కాలము మొదలుకొని శాశ్వతకాలము ఆయన ప్రత్యక్ష మగుచుండెను. కాబట్టి ప్రసవమగు స్త్రీ పిల్లనుకనువరకు ఆయన వారిని అప్పగించును, అప్పుడు ఆయన సహోదరులలో శేషించినవారును ఇశ్రాయేలీయులతోకూడ తిరిగి వత్తురు. ఆయన నిలిచి యెహోవా బలముపొంది తన దేవుడైన యెహోవా నామ మహాత్మ్యమునుబట్టి తన మందను మేపును. కాగా వారు నిలుతురు, ఆయన భూమ్యంతములవరకు ప్రబలుడగును, ఆయన సమాధానమునకు కారకుడగును, అష్షూరు మన దేశములో చొరబడి మన నగరులలో ప్రవేశింపగా వాని నెదిరించుటకు మేము ఏడుగురు గొఱ్ఱెలకాపరులను ఎనమండుగురు ప్రధానులను నియమింతుము. వారు అష్షూరు దేశమును, దాని గుమ్మములవరకు నిమ్రోదు దేశమును ఖడ్గముచేత మేపుదురు, అష్షూరీయులు మన దేశములో చొరబడి మన సరిహద్దులలో ప్రవేశించినప్పుడు ఆయన యీలాగున మనలను రక్షించును.

షేర్ చేయి
చదువండి మీకా 5