మీకా 3:1-12

మీకా 3:1-12 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

నేనిలా చెప్పాను. “యాకోబు నాయకులారా, ఇశ్రాయేలీయుల అధికారులారా, ఇప్పుడు వినండి. న్యాయం అంటే ఏంటో మీరు తెలుసుకోవద్దా? మీరు మంచిని అసహ్యించుకుని చెడును ఇష్టపడతారు. నా ప్రజల చర్మం ఒలిచేసి వారి ఎముకల మీద ఉన్న మాంసాన్ని చీలుస్తారు. నా ప్రజల మాంసాన్ని తింటారు. వారి చర్మాన్ని ఒలిచి వారి ఎముకలను విరగగొట్టేస్తారు. ఒకడు పాత్రలో వేసే మాంసాన్ని ముక్కలు చేసినట్టుగా ఉడుకుతున్న పాత్రలో వేసే మాంసాన్ని ముక్కలు చేసినట్టు మీరు చేస్తారు. ఆ తరువాత నాయకులైన మీరు యెహోవాకు మొరపెడతారు కానీ ఆయన వారికి జవాబివ్వడు. మీరు చెడు పనులు చేశారు. కాబట్టి అప్పుడు ఆయన వారికి తన ముఖాన్ని చూపించడు.” నా ప్రజలను తప్పుదారి పట్టించే ప్రవక్తలను గురించి యెహోవా చెప్పేదేమిటంటే, తమకు భోజనం పెట్టేవారికి “సంపద వస్తుంది” అని చెబుతారు. భోజనం పెట్టకపోతే, వారి మీద యుద్ధం ప్రకటిస్తారు. అందుచేత మీకు దర్శనాలేమీ రాకుండా రాత్రి కమ్ముకువస్తుంది. సోదె చెప్పకుండా మీకు చీకటి ఆవరిస్తుంది. ఇలాంటి ప్రవక్తలకు సూర్యుడు కనబడకుండ అస్తమిస్తాడు. పగలు చీకటిగా మారిపోతుంది. అప్పుడు భవిష్యత్తును చెప్పేవారికి సిగ్గు కలుగుతుంది. సోదె చెప్పేవాళ్ళు కలవరపడతారు. నా దగ్గరనుంచి జవాబేమీ రానందుకు వారంతా నోరు మూసుకుంటారు. అయితే నా మట్టుకైతే, యాకోబు సంతానానికి వాళ్ళ అతిక్రమాలనూ ఇశ్రాయేలీయులకు తమ పాపాన్ని వెల్లడించడానికి యెహోవా ఆత్మమూలంగా సంపూర్ణ అధికారంతో, న్యాయంతో ఉన్నాను. యాకోబు వంశపు ప్రధానులారా, ఇశ్రాయేలీయుల అధిపతులారా, ఈ మాట వినండి. మీరు న్యాయాన్ని తృణీకరిస్తూ సక్రమంగా ఉండే సమస్తాన్నీ వక్రం చేస్తారు. సీయోనును మీరు రక్తంతో కడతారు. దుర్మార్గంతో యెరూషలేమును కడతారు. ప్రజల ప్రధానులు లంచం పుచ్చుకుని తీర్పు తీరుస్తారు. వారి యాజకులు కూలికి బోధిస్తారు. ప్రవక్తలు డబ్బు కోసం సోదె చెబుతారు. అయినా వాళ్ళు యెహోవాను ఆధారం చేసుకుని “యెహోవా మన మధ్య ఉన్నాడు గదా, ఏ కీడూ మనకు రాదు” అనుకుంటారు. కాబట్టి మీ మూలంగా శత్రువులు సీయోనును పొలంలాగా దున్నుతారు. యెరూషలేము రాళ్ల కుప్ప అవుతుంది. మందిరమున్న కొండ, అడవిలాగా అవుతుంది.

షేర్ చేయి
Read మీకా 3

మీకా 3:1-12 పవిత్ర బైబిల్ (TERV)

అప్పుడు నేనిలా అన్నాను: “యాకోబు పెద్దలారా, ఇశ్రాయేలు దేశాధిపతులారా, ఇప్పుడు వినండి. న్యాయమంటే ఏమిటో మీరు తెలుసుకోవాలి! కాని మీరు మంచిని ద్వేషించి, చెడును ప్రేమిస్తారు! మీరు వారి ప్రజల చర్మాన్ని ఒలుస్తారు. మీరు వారి ఎముకలపై గల మాంసాన్ని లాగివేస్తారు! మీరు నా ప్రజలను నాశనం చేస్తున్నారు! మీరు వారి చర్మాన్ని ఒలుచుకుంటున్నారు; వారి ఎముకలను విరుగ గొడుతున్నారు. మాంసంలా వారి ఎముకలను కుండలో పెట్టటానికి మీరు నరుకుతారు! అప్పుడు మీరు దేవుడైన యెహోవాను ప్రార్థిస్తారు. కాని ఆయన మీ ప్రార్థన వినడు; దేవుడైన యెహోవా మిమ్మల్ని చూచి ముఖం తిప్పుకుంటాడు. ఎందుకంటే మీరు చెడుపనులు చేశారు!” అబద్ధ ప్రవక్తలు యెహోవా ప్రజలకు తప్పుడు జీవిత విధానాన్ని బోధిస్తారు. యెహోవా ఆ ప్రవక్తల విషయంలో ఈ విధంగా చెపుతున్నాడు: “ప్రజలు గనుక ఈ ప్రవక్తలకు తినటానికి ఆహారం ఇస్తే వారు శాంతి అని అరుస్తారు! ఒకవేళ ప్రజలు వారికి ఆహారం ఇవ్వకపోతే, అప్పుడు ప్రవక్తలు ‘యుద్ధానికి సిద్ధంకండి’ అని అరుస్తారు. “అందువల్ల మీకు చీకటి కమ్మినట్లు ఉంటుంది. మీకు దర్శనాలు కలుగవు. భవిష్యత్తులో ఏమి జరుగుతుందో మీరు చెప్పలేరు గనుక. మీకు అంధకారం వ్యాపించినట్లు ఉంటుంది. ఈ ప్రవక్తలకు సూర్యుడు అస్తమిస్తాడు. వారికి పట్టపగలే అంధకారం ఆవరిస్తుంది. దీర్ఘదర్శులు (ప్రవక్తలు) సిగ్గుపడతారు. భవిష్యత్తును చూసేవారు కలవరపాటు చెందుతారు. అవును, వారంతా వారి నోళ్లు మూసుకుంటారు. ఎందుకంటే దేవునివద్దనుండి సమాధానం రాదు!” కానీ యెహోవా ఆత్మ నన్ను శక్తితోను, మంచితనంతోను, బలంతోను నింపివేశాడు. కావున నేను యాకోబుకు అతని పాపాలనుగూర్చి చెప్పగలను. అవును. ఇశ్రాయేలుకు అతను చేసిన పాపాలను గురించి నేను చెపుతాను! యాకోబు ప్రజల నాయకులారా, ఇశ్రాయేలు అధిపతులారా, నేను చెప్పేది వినండి! మీరు న్యాయాన్ని ద్వేషిస్తారు. మీరు తిన్నగా ఉన్నదానిని వంకర చేస్తారు! మీరు ప్రజలను హత్యచేసి సీయోనును నిర్మించారు! మీరు యెరూషలేమును పాపంతో నిర్మించారు! యెరూషలేములో న్యాయాధిపతులు రహస్యంగా లంచాలు తీసుకుంటారు. వారలా చేసి న్యాయస్థానంలో తమ తీర్పు ఇస్తారు. ప్రజలకు బోధించేముందు యెరూషలేము యాజకులకు వేతనం చెల్లించాలి. ప్రవక్తలు భవిష్యత్తులోకి చూసేముందు ప్రజలు వారికి డబ్బు చెల్లించాలి. అప్పుడా నాయకులు, “మనకు ఏరకమైన కీడూ రాదు! యెహోవా మనపట్ల ఉన్నాడు!” అని అంటారు. మీ మూలంగానే సీయోను నాశనమవుతుంది. అది దున్నిన పొలంలా తయారవుతుంది. యెరూషలేము రాళ్ల గుట్టలా మారుతుంది. ఆలయపు పర్వతం పొదలతో నిండిన వట్టి కొండలా తయారవుతుంది.

షేర్ చేయి
Read మీకా 3

మీకా 3:1-12 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

నేనీలాగు ప్రకటించితిని–యాకోబు సంతతియొక్క ప్రధానులారా, ఇశ్రాయేలీయుల అధిపతులారా, ఆలకించుడి; న్యాయము ఎరిగియుండుట మీ ధర్మమే గదా. అయినను మేలు నసహ్యించుకొని కీడుచేయ నిష్టపడుదురు, నా జనుల చర్మము ఊడదీసి వారి యెముకలమీది మాంసము చీల్చుచుందురు. నా జనుల మాంసమును భుజించుచు వారి చర్మమును ఒలిచి వారి యెముకలను విరిచి, ఒకడు కుండలోవేయు మాంసమును ముక్కలుచేయునట్టు బానలోవేయు మాంసముగా వారిని తుత్తునియలుగా పగులగొట్టియున్నారు. వారు దుర్మార్గతననుసరించి నడుచుకొనియున్నారు గనుక వారు యెహోవాకు మొఱ్ఱపెట్టినను ఆయన వారి మనవి అంగీకరింపక ఆ కాలమందు వారికి కనబడకుండ తన్ను మరుగుచేసికొనును. ఆహారము నమలుచు, సమాధానమని ప్రకటించువారును, ఒకడు తమ నోట ఆహారము పెట్టనియెడల అతనిమీద యుద్ధము ప్రకటించువారునై నా జనులను పొరపెట్టు ప్రవక్తలనుగూర్చి యెహోవా సెలవిచ్చునదేమనగా –మీకు దర్శనము కలుగకుండ రాత్రికమ్మును, సోదె చెప్పకుండ మీకు చీకటి కలుగును; ఇట్టి ప్రవక్తలకు సూర్యుడు కనబడకుండ అస్తమించును, పగలు చీకటిపడును అప్పుడు దీర్ఘదర్శులు సిగ్గునొందుదురు, సోదెగాండ్రు తెల్లబోవుదురు. దేవుడు తమకు ప్రత్యుత్తర మియ్యకుండుట చూచి నోరు మూసి కొందురు. నేనైతే యాకోబు సంతతివారికి తమ దోషమును ఇశ్రాయేలీయులకు తమ పాపమును కనుపరచుటకై, యెహోవా ఆత్మావేశముచేత బలముతోను తీర్పు తీర్చు శక్తితోను ధైర్యముతోను నింపబడినవాడనైయున్నాను. యాకోబు సంతతివారి ప్రధానులారా, ఇశ్రాయేలీయుల యధిపతులారా, న్యాయమును తృణీకరించుచు దుర్నీతిని నీతిగా ఎంచువారలారా, యీ మాట ఆలకించుడి. నరహత్య చేయుటచేత సీయోనును మీరు కట్టుదురు. దుష్ట త్వము జరిగించుటచేత యెరూషలేమును మీరు కట్టుదురు. జనుల ప్రధానులు లంచము పుచ్చుకొని తీర్పు తీర్చుదురు, వారి యాజకులు కూలికి బోధింతురు, ప్రవక్తలు ద్రవ్యము కొరకు సోదె చెప్పుదురు; అయినను వారు, యెహోవాను ఆధారము చేసికొని యెహోవా మన మధ్యనున్నాడు గదా, యే కీడును మనకు రానేరదని యనుకొందురు. కాబట్టి చేను దున్నబడునట్లు మిమ్మునుబట్టి సీయోను దున్నబడును, యెరూషలేము రాళ్ల కుప్పలగును, మందిరమున్న పర్వతము అరణ్యములోని ఉన్నతస్థలములవలె అగును.

షేర్ చేయి
Read మీకా 3

మీకా 3:1-12 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)

అప్పుడు నేను ఇలా అన్నాను, “యాకోబు నాయకులారా, ఇశ్రాయేలు పాలకులారా, వినండి. న్యాయాన్ని మీరు తెలుసుకోవద్దా? మీరు మంచిని అసహ్యించుకుని చెడును ప్రేమిస్తారు; నా ప్రజల చర్మం ఒలిచి, వారి ఎముకల మీద మాంసాన్ని చీలుస్తారు; నా ప్రజల మాంసాన్ని తింటారు, వారి చర్మం ఒలిచి, వారి ఎముకలను ముక్కలుగా విరగ్గొడతారు; పాత్రలో వేసే మాంసాన్ని ముక్కలు చేసినట్లు, కుండలో వేసే మాంసాన్ని ముక్కలు చేసినట్లు చేస్తారు.” తర్వాత వారు యెహోవాకు మొరపెడతారు, కాని ఆయన వారికి జవాబివ్వరు. వారు చేసిన చెడు కారణంగా ఆయన ఆ కాలంలో తన ముఖం దాచుకుంటారు. యెహోవా చెప్పే మాట ఇదే: “నా ప్రజలను తప్పుదారి పట్టించిన ప్రవక్తల విషయానికి వస్తే, వారికి తినడానికి ఏదైన ఉంటే, వారు ‘సమాధానం’ ప్రకటిస్తారు, కాని ఎవరైనా వారికి భోజనం పెట్టకపోతే, వారి మీద యుద్ధానికి సిద్ధపడతారు. కాబట్టి మీకు దర్శనాలేమీ రాకుండా రాత్రి కమ్ముతుంది, సోదె చెప్పకుండా మిమ్మల్ని చీకటి ఆవరిస్తుంది. ప్రవక్తలకు సూర్యాస్తమయం అవుతుంది, పగలు వారికి చీకటిగా మారుతుంది. అప్పుడు దీర్ఘదర్శులు సిగ్గుపడతారు సోదె చెప్పేవారు అవమానపడతారు. దేవుని దగ్గర నుండి జవాబేమీ రాక వారంతా తమ ముఖాలను కప్పుకుంటారు.” నేనైతే, యాకోబుకు అతని అతిక్రమాన్ని ఇశ్రాయేలుకు అతని పాపాన్ని తెలియజేయడానికి, యెహోవా ఆత్మను పొంది శక్తితో నింపబడి ఉన్నాను, న్యాయబుద్ధితో, బలంతో ఉన్నాను. యాకోబు నాయకులారా, ఇశ్రాయేలు పాలకులారా, మీరు ఇది వినండి. మీరు న్యాయాన్ని తృణీకరించి, సరియైన దానినంతటిని వంకర చేస్తారు; మీరు రక్తపాతంతో సీయోనును కడతారు, దుష్టత్వంతో యెరూషలేమును నిర్మిస్తారు. దాని నాయకులు లంచం తీసుకుని తీర్పు చెప్తారు, దాని యాజకులు జీతానికి ఉపదేశిస్తారు. దాని ప్రవక్తలు డబ్బు కోసం సోదె చెప్తారు. అయినా వారు యెహోవా సహాయం కోసం చూస్తూ, “యెహోవా మన మధ్య ఉన్నారు గదా! ఏ కీడు మన మీదికి రాదు” అంటారు. కాబట్టి మీ కారణంగా, సీయోను ఒక పొలంలా దున్నబడుతుంది, యెరూషలేము రాళ్ల కుప్పగా మారుతుంది ఆలయమున్న కొండ దట్టమైన పొదలతో మట్టి దిబ్బగా మారుతుంది.

షేర్ చేయి
Read మీకా 3