మత్తయి 9:27-30
మత్తయి 9:27-30 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
అక్కడి నుండి యేసు వెళ్తున్నప్పుడు ఇద్దరు గ్రుడ్డివారు “దావీదు కుమారుడా! మమ్మల్ని కరుణించు” అని కేకలువేస్తూ ఆయనను వెంబడించారు. ఆయన ఇంట్లోకి వెళ్లినప్పుడు, ఆ గ్రుడ్డివారు ఆయన దగ్గరకు వచ్చారు. యేసు వారితో, “నేను ఇది చేయగలనని మీరు నమ్ముతున్నారా?” అని అన్నారు. వారు “అవును, ప్రభూ!” అన్నారు. అప్పుడు ఆయన వారి కళ్ళను ముట్టి, “మీ విశ్వాసం చొప్పున మీకు జరుగును గాక” అన్నారు. వారికి తిరిగీ చూపు వచ్చేసింది. యేసు వారితో, “ఈ సంగతి ఎవ్వరికి తెలియనివ్వకండి” అని తీవ్రంగా హెచ్చరించారు.
మత్తయి 9:27-30 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
యేసు అక్కడనుంచి వెళ్తూ ఉంటే ఇద్దరు గుడ్డివారు ఆయనను అనుసరిస్తూ, “దావీదు కుమారా, మామీద దయ చూపించు” అని కేకలు వేశారు. యేసు ఇంట్లోకి వెళ్ళిన తరువాత ఆ గుడ్డివారు ఆయన దగ్గరికి వచ్చారు. యేసు వారితో, “నేను దీన్ని చేయగలనని మీరు నమ్ముతున్నారా?” అని వారిని అడిగాడు. వారు, “అవును ప్రభూ” అన్నారు. అప్పుడాయన వారి కళ్ళు ముట్టి, “మీరు నమ్మినట్టే మీకు జరుగుతుంది” అన్నాడు. వారి కళ్ళు తెరుచుకున్నాయి. అప్పుడు యేసు “ఈ సంగతి ఎవరికీ తెలియనివ్వకండి” అని ఖండితంగా వారికి చెప్పాడు.
మత్తయి 9:27-30 పవిత్ర బైబిల్ (TERV)
యేసు అక్కడినుండి బయలుదేరి వెళ్తుండగా యిద్దరు గ్రుడ్డివాళ్ళు, “దావీదు కుమారుడా! మాపై దయ చూపు!” అని పిలుస్తూ ఆయన్ని అనుసరించారు. యేసు యింట్లోకి వెళ్ళాక ఆ గుడ్డివాళ్ళాయన దగ్గరకు వెళ్ళారు. ఆయన వాళ్ళను, “ఇది నేను చేయగలననే విశ్వాసం మీకుందా?” అని అడిగాడు. “ఉంది ప్రభూ!” అని వాళ్ళు సమాధానం చెప్పారు. అప్పుడాయన వాళ్ళ కళ్ళను తాకుతూ, “మీకెంత విశ్వాసముంటే అంత ఫలం కలుగనీ!” అని అన్నాడు. వాళ్ళకు చూపు వచ్చింది. యేసు, “ఈ విషయం ఎవ్వరికీ తెలియకుండా జాగ్రత్త పడండి!” అని వాళ్ళను హెచ్చరించాడు.
మత్తయి 9:27-30 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
యేసు అక్కడనుండి వెళ్లుచుండగా ఇద్దరు గ్రుడ్డివారు ఆయన వెంట వచ్చి–దావీదు కుమారుడా, మమ్మును కనిక రించుమని కేకలువేసిరి. ఆయన యింట ప్రవేశించిన తరువాత ఆ గ్రుడ్డివారు ఆయనయొద్దకు వచ్చిరి. యేసు–నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా? అని వారి నడుగగా వారు–నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడాయన వారి కన్నులు ముట్టి–మీ నమ్మికచొప్పున మీకు కలుగుగాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరువబడెను. అప్పుడు యేసు–ఇది ఎవరికిని తెలియకుండ చూచుకొనుడని వారికి ఖండితముగా ఆజ్ఞాపించెను.