మత్తయి 6:26-34
మత్తయి 6:26-34 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
గాలిలో ఎగిరే పక్షులను చూడండి; అవి విత్తవు కోయవు, కొట్లలో కూర్చుకోవు, అయినా మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నారు. వాటికన్నా మీరు ఇంకా ఎంతో విలువైన వారు కారా? మీలో ఒక్కరైనా చింతిస్తూ మీ ఆయుష్షును ఒక గంట పొడిగించుకోగలరా? “అలాంటప్పుడు మీరు బట్టల గురించి ఎందుకు చింతిస్తున్నారు? పొలంలో పువ్వులు ఎలా ఎదుగుతున్నాయో చూడండి. అవి కష్టపడవు నేయవు. అయినను గొప్ప వైభవం కలిగివున్న సొలొమోను కూడా ఈ పూలలో ఒక దానిలా అలంకరించబడలేదని నేను మీతో చెప్తున్నాను. అల్పవిశ్వాసులారా, ఈ రోజు ఉండి రేపు అగ్నిలో పడవేయబడే పొలంలోని గడ్డినే దేవుడు అంతగా అలంకరించినప్పుడు, ఆయన మిమ్మల్ని అంతకన్నా ఎక్కువగా అలంకరించరా? కనుక ‘ఏమి తినాలి? ఏమి త్రాగాలి? ఏమి ధరించుకోవాలి?’ అంటూ చింతించకండి. దేవుని ఎరుగని ప్రజలు అలాంటి వాటి వెంటపడతారు, కాని అవన్నీ మీకు అవసరమని మీ పరలోకపు తండ్రికి తెలుసు. మొదట ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని వెదకండి, అప్పుడు అవన్నీ మీకు ఇవ్వబడతాయి. కాబట్టి రేపటి గురించి చింతించకండి, ఎందుకంటే రేపటి సంగతి గురించి రేపటి దినమే చింతిస్తుంది. ఏ రోజు కష్టం ఆ రోజుకు సరిపోతుంది.
మత్తయి 6:26-34 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఎగిరే పక్షులను చూడండి. అవి విత్తనాలు నాటవు, కోత కోయవు, కొట్లలో ధాన్యం కూర్చుకోవు. అయినా మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. మీరు వాటికంటే ఎంతో విలువైన వారు కాదా? ఆందోళనపడి మీలో ఎవరు తన జీవితకాలాన్ని కాస్త పొడిగించుకోగలడు? బట్టల గురించి మీకు ఎందుకంత దిగులు? పొలాల్లో గడ్డిపూలు ఎలా పూస్తున్నాయో ఆలోచించండి. అవి పని చేయవు, బట్టలు నేయవు. అయినా నేనంటాను, తన వైభవమంతటితో ఉన్న సొలొమోను రాజుకు సైతం వీటిలో ఒక్క దానికున్నంత అలంకారం లేదు. ఈ రోజు ఉండి రేపు పొయ్యిలో వేసే పొలంలోని గడ్డిని దేవుడు ఇంతగా అలంకరిస్తుంటే, అల్ప విశ్వాసులారా, ఆయన మరింకెంతగా మిమ్మల్ని అలంకరిస్తాడో గదా! కాబట్టి ఏమి తినాలో ఏమి తాగాలో ఏమి కట్టుకోవాలో అని దిగులు పడొద్దు. దేవుడంటే తెలియని వారు వీటి కోసం తాపత్రయ పడతారు. ఇవన్నీ మీకు అవసరమని మీ పరలోకపు తండ్రికి తెలుసు. అయితే మీరు మొట్ట మొదట దేవుని రాజ్యాన్నీ ఆయన నీతినీ వెదకండి. అప్పుడు ఆయన వీటన్నిటినీ మీకు అందిస్తాడు. కాబట్టి రేపటి విషయం దిగులు పడవద్దు. దాని సంగతి అదే చూసుకుంటుంది. ఏ రోజు కష్టం ఆ రోజుకు చాలు.
మత్తయి 6:26-34 పవిత్ర బైబిల్ (TERV)
ఆకాశంలో ఎగిరే పక్షుల్ని గమనించండి. అవి విత్తనం విత్తి పంటను పండించవు. ధాన్యాన్ని ధాన్యపు కొట్టులో దాచివుంచవు. అయినా పరలోకంలోవున్న మీ తండ్రి వాటికి ఆహారాన్ని యిస్తాడు. మీరు వాటికన్నా విలువైన వాళ్ళు కారా! చింతించి తన జీవితకాలాన్ని ఒక్క ఘడియ పొడిగించగలవాడు మీలో ఎవరైనా ఉన్నారా? “మీరు దుస్తుల్ని గురించి ఎందుకు చింతిస్తున్నారు? గడ్డిమీద పెరిగే పువ్వుల్ని గమనించండి. అవి పని చేసి దారాన్ని వడకవు. అయినా, నేను చెప్పేదేమిటంటే గొప్ప వైభవమున్న సొలొమోను రాజుకూడా అలంకరణలో ఈ పువ్వుల్లోని ఒక్క పువ్వుతో కూడా సరితూగలేడు. ఈనాడు ఉండి రేపు మంటల్లో పారవేయబడే ఈ గడ్డిని దేవుడంత అందంగా అలంకరిస్తే మిమ్మల్ని యింకెంత అందంగా అలంకరిస్తాడో కదా! మీలో దృఢ విశ్వాసం లేదు. “‘ఏమి తినాలి? ఏమి త్రాగాలి? ఏ దుస్తుల్ని వేసుకోవాలి?’ అని చింతించకండి. యూదులు కానివాళ్ళు వాటివైపు పరుగెత్తుతూ ఉంటారు. పరలోకంలో ఉన్న మీ తండ్రికి యివన్నీ మీకవసరమని తెలుసు. కాని మొదట ఆయన రాజ్యం కొఱకు, నీతి కొఱకు ప్రయాస పడండి; అప్పుడు అవన్నీ దేవుడు మీకిస్తాడు. రేపటిని గురించి చింతించకండి. రేపటి చింత రేపటిదే. ఏరోజుకు తగ్గ కష్టాలు ఆరోజుకు ఉన్నాయి.
మత్తయి 6:26-34 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఆకాశపక్షులను చూడుడి; అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు; అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు; మీరు వాటికంటె బహు శ్రేష్ఠులు కారా? మీలో నెవడు చింతించుటవలన తన యెత్తు మూరెడెక్కువ చేసికొనగలడు? వస్త్రములనుగూర్చి మీరు చింతింప నేల? అడవిపువ్వులు ఏలాగు నెదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, ఒడకవు అయినను తన సమస్త వైభవముతోకూడిన సొలొమోను సహితము వీటిలో నొకదానివలెనైనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయిలో వేయబడు అడవి గడ్డిని దేవుడీలాగు అలంక రించినయెడల, అల్పవిశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయును గదా. కాబట్టి– ఏమి తిందుమో యేమి త్రాగుదుమో యేమి ధరించు కొందుమో అని చింతింపకుడి; అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నియు మీకు కావలెనని మీ పరలోకపు తండ్రికి తెలియును. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పుడవన్నియు మీకనుగ్రహింపబడును. రేపటినిగూర్చి చింతింపకుడి; రేపటి దినము దాని సంగతులనుగూర్చి చింతించును; ఏనాటికీడు ఆనాటికి చాలును.