మత్తయి 6:24-25
మత్తయి 6:24-25 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
“ఎవ్వరూ ఇద్దరు యజమానులకు సేవచేయలేరు. వారు ఒకరిని ద్వేషించి మరొకరిని ప్రేమిస్తారు లేక ఒక యజమానికి అంకితమై మరొకనిని తృణీకరిస్తారు. మీరు దేవుణ్ణి, ధనాన్ని రెండింటిని ఒకేసారి సేవించలేరు. “అందుకే నేను మీతో చెప్పేది ఏంటంటే, మీరు ఏమి తినాలి ఏమి త్రాగాలి అని, మీ ప్రాణం గురించి గాని, లేక ఏమి ధరించాలి అని మీ దేహాన్ని గురించి గాని చింతించకండి. ఆహారం కంటే ప్రాణం, బట్టల కంటే దేహం గొప్పవి కావా?
మత్తయి 6:24-25 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఇద్దరు యజమానులకు ఎవరూ సేవ చేయలేరు. అతడు ఒకణ్ణి ద్వేషించి మరొకణ్ణి ప్రేమిస్తాడు. లేకపోతే ఒకడికి కట్టుబడి మరొకణ్ణి చిన్నచూపు చూస్తాడు. అలాగే దేవునికీ సంపదకూ ఒకేసారి సేవ చేయడం కుదరదు. “అందువల్ల నేను మీతో చెప్పేదేమంటే, ‘ఏమి తినాలి? ఏమి తాగాలి?’ అని మీ జీవితాన్ని గురించి గానీ, ‘ఏమి కట్టుకోవాలి?’ అని మీ శరీరం గురించి గానీ బెంగ పెట్టుకోవద్దు. తిండి కంటే జీవితమూ బట్టల కంటే శరీరమూ ఎక్కువే కదా!
మత్తయి 6:24-25 పవిత్ర బైబిల్ (TERV)
“ఒకే వ్యక్తి యిద్దరు యజమానులకు సేవ చేయలేడు. అలా చేస్తే అతడు ఒకణ్ణి ప్రేమించి, యింకొకణ్ణి ద్వేషిస్తూ ఉంటాడు. లేదా ఒకనికి అతిశ్రద్ధతో సేవ చేసి, యింకొకణ్ణి అశ్రద్ధ చేస్తాడు. మీరు దేవునికి, డబ్బుకు సేవకునిగా ఉండటమనేది అసంభవం. “అందువల్ల నేను చెప్పేదేమిటంటే, మీ జీవితాలకు కావలసిన ఆహారాన్ని గురించి కాని, మీ దేహాలకు కావలసిన దుస్తుల్ని గురించి కాని చింతించకండి. జీవితం ఆహారం కన్నా, దేహం దుస్తులకన్నా, ముఖ్యమైనవి కావా?
మత్తయి 6:24-25 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు; అతడు ఒకని ద్వేషించి యొకని ప్రేమించును; లేదా యొకని పక్షముగానుండి యొకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండనేరరు. అందువలన నేను మీతో చెప్పునదేమనగా–ఏమి తిందుమో యేమి త్రాగు దుమో అని మీ ప్రాణమునుగూర్చియైనను, ఏమి ధరించుకొందుమో అని మీ దేహమునుగూర్చియైనను చింతింపకుడి; ఆహారముకంటె ప్రాణమును, వస్త్రము కంటె దేహమును గొప్పవి కావా?