మత్తయి 5:39-48
మత్తయి 5:39-48 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
అయితే నేను మీతో చెప్పేదేంటంటే, దుష్టుని ఎదిరించకూడదు, ఎవరైనా మిమ్మల్ని కుడిచెంప మీద కొడితే, వారికి మీ మరో చెంపను చూపించాలి. ఎవరైనా మీతో వివాదం పెట్టుకోవాలని మీ అంగీ తీసుకుంటే, వారికి మీ పైవస్త్రాన్ని కూడా ఇవ్వండి. ఎవరైనా ఒక మైలు దూరం రమ్మని మిమ్మల్ని బలవంతం చేస్తే వారితో మీరు రెండు మైళ్ళు వెళ్లండి. ఎవరైనా మిమ్మల్ని అడిగేవారికి ఇవ్వండి. మిమ్మల్ని అప్పు అడగాలనుకున్న వారి నుండి మీరు తప్పించుకోవద్దు. “ ‘మీ పొరుగువారిని ప్రేమించాలి, మీ శత్రువును ద్వేషించాలి’ అని చెప్పిన మాటలను మీరు విన్నారు కదా. అయితే నేను మీతో చెప్పేదేంటంటే, మీరు పరలోకంలోని మీ తండ్రికి పిల్లలవాలంటే మీరు మీ శత్రువులను ప్రేమించాలి, మిమ్మల్ని బాధించే వారి కోసం ప్రార్థించాలి. ఆయన చెడ్డవారి మీద మంచివారి మీద తన సూర్యుని ఉదయింప చేస్తున్నారు. నీతిమంతుల మీద అనీతిమంతుల మీద వర్షం కురిపిస్తున్నారు. ఒకవేళ మిమ్మల్ని ప్రేమించేవారినే మీరు ప్రేమిస్తే, మీకు ఏం లాభం? పన్ను వసూలు చేసేవారు కూడా అలాగే చేస్తారు కదా! ఒకవేళ మీరు మీ సొంతవారినే పలకరిస్తే ఇతరులకు మీకు తేడా ఏంటి? దేవుని ఎరుగనివారు కూడా అలాగే చేస్తారు కదా! మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడై ఉన్నట్లు, మీరు కూడ పరిపూర్ణులై ఉండండి.
మత్తయి 5:39-48 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
కానీ నేను మీతో చెప్పేదేమిటంటే దుష్టుణ్ణి ఎదిరించవద్దు. ఎవరైనా నిన్ను కుడి చెంప మీద కొడితే అతన్ని మరొక చెంప మీద కూడా కొట్టనియ్యి. ఎవరైనా నీ అంగీ విషయం వివాదం పెట్టుకుని దాన్ని లాక్కుంటే అతనికి నీ పైచొక్కా కూడా ఇచ్చివెయ్యి. ఎవరైనా ఒక మైలు దూరం రమ్మని నిన్ను బలవంతం చేస్తే అతనితో రెండు మైళ్ళు వెళ్ళు. నిన్ను అడిగిన వాడికి ఇవ్వు. నిన్ను అప్పు అడగాలనుకొనే వాడికి నీ ముఖం చాటు చేయవద్దు. “‘నీ పొరుగువాణ్ణి ప్రేమించి, నీ శత్రువును ద్వేషించు’ అని చెప్పింది మీరు విన్నారు గదా. నేను మీతో చెప్పేదేమంటే, మీ శత్రువులను ప్రేమించండి. మిమ్మల్ని హింసించే వారి కోసం ప్రార్థించండి. ఆ విధంగా మీరు పరలోకంలో ఉన్న మీ తండ్రికి కుమారులవుతారు. ఎందుకంటే ఆయన చెడ్డవారిపైనా మంచివారిపైనా తన సూర్యుణ్ణి ఉదయింపజేసి, నీతిమంతులపైనా దుర్మార్గులపైనా వాన కురిపిస్తున్నాడు. మిమ్మల్ని ప్రేమించే వారినే ప్రేమిస్తే మీకు ఏం లాభం? పన్నులు వసూలు చేసేవారు కూడా అలాగే చేస్తారు గదా. మీరు మీ సోదరులనే గౌరవిస్తుంటే ఇతరులకంటే ఎక్కువేం చేస్తున్నారు? యూదేతరులూ అలాగే చేస్తున్నారు గదా. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు. అందుచేత మీరూ పరిపూర్ణులై ఉండండి.
మత్తయి 5:39-48 పవిత్ర బైబిల్ (TERV)
కాని నేను చెప్పేదేమిటంటే దుష్టుల్ని ఆపటానికి ప్రయత్నించకండి. మిమ్మల్ని ఎవరైనా కుడి చెంపమీద కొడితే మీ రెండవ చెంప కూడా అతనికి చూపండి. ఎవరైనా మీపై వ్యాజ్యము వేసి మీ చొక్కాను కూడా లాక్కోవాలని చూస్తే, మీ కండువా కూడా తీసుకు వెళ్ళనివ్వండి. ఎవరైనా మిమ్మల్ని తమతో మైలు దూరం రమ్మని బలవంతం చేస్తే, అతనితో రెండు మైళ్ళు వెళ్ళండి. అడిగిన వాళ్ళకు ఇవ్వండి. మీ దగ్గర అప్పుపుచ్చుకోవాలని అనుకొని వచ్చిన వాళ్ళతో లేదనకండి. “‘పొరుగింటి వాణ్ణి ప్రేమించండి. శత్రువును ద్వేషించండి’ అని చెప్పటం మీరు విన్నారు. కాని నేను చెప్పేదేమిటంటే ‘మీ శత్రువుల్ని ప్రేమించండి మిమ్మల్ని హింసించిన వాళ్ళ కోసం దేవుణ్ణి ప్రార్థించండి.’ అప్పుడు మీరు పరలోకంలో ఉన్న మీ తండ్రికి బిడ్డలౌతారు. ఎందుకంటే దేవుడు చెడ్డవాళ్ళ కోసం, మంచి వాళ్ళ కోసం సూర్యోదయం కలిగిస్తాడు. నీతిమంతుల కోసం, అనీతిమంతుల కోసం వర్షాలు కురిపిస్తాడు. మిమ్మల్ని ప్రేమించిన వాళ్ళను మీరు ప్రేమిస్తే మీకేం ప్రతిఫలం కలుగుతుంది? పాపులు కూడా అలాచెయ్యటం లేదా? మీ సోదరులకు మాత్రమే మీరు అభివందనాలు చేస్తే యితర్ల కన్నా మీరు ఏం గొప్ప? యూదులుకాని వాళ్ళు కూడా అలా చేస్తారే! పరలోకంలో ఉన్న మీ తండ్రి పరిపూర్ణుడు. మీరును ఆయనలా ఉండాలి.
మత్తయి 5:39-48 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
నేను మీతో చెప్పునదేమనగా దుష్టుని ఎదిరింపక, నిన్ను కుడిచెంపమీద కొట్టువాని వైపునకు ఎడమచెంప కూడ త్రిప్పుము. ఎవడైన నీమీద వ్యాజ్యెము వేసి నీ అంగీ తీసికొనగోరినయెడల వానికి నీ పైవస్త్రము కూడ ఇచ్చివేయుము. ఒకడు ఒక మైలు దూరము రమ్మని నిన్ను బలవంతము చేసినయెడల, వానితోకూడ రెండు మైళ్లు వెళ్లుము. నిన్ను అడుగువానికిమ్ము, నిన్ను అప్పు అడుగగోరువానినుండి నీ ముఖము త్రిప్పు కొనవద్దు. నీ పొరుగువాని ప్రేమించి, నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు గదా; నేను మీతో చెప్పునదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై యుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. మిమ్మును హింసించు వారికొరకు ప్రార్థన చేయుడి. ఆయన చెడ్డవారిమీదను మంచివారిమీదను తన సూర్యుని ఉదయింపజేసి, నీతిమంతులమీదను, అనీతిమంతులమీదను వర్షము కురిపించుచున్నాడు. మీరు మిమ్మును ప్రేమించువారినే ప్రేమించినయెడల మీకేమి ఫలము కలుగును? సుంకరులును ఆలాగు చేయుచున్నారు గదా. మీ సహోదరులకు మాత్రము వందనము చేసినయెడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్యజనులును ఆలాగు చేయుచున్నారు గదా. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు.