మత్తయి 5:27-48
మత్తయి 5:27-48 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
“ ‘వ్యభిచారం చేయకూడదు’ అని చెప్పిన మాట మీరు విన్నారు. అయితే నేను మీతో చెప్పేది, ఒక స్త్రీని కామంతో చూసే ప్రతివాడు అప్పటికే తన మనస్సులో ఆమెతో వ్యభిచరించాడు. నీవు పొరపాట్లు చేయడానికి ఒకవేళ నీ కుడికన్ను కారణమైతే, దానిని పెరికి పారవేయి. నీ శరీరమంతా నరకంలో పడవేయబడటం కంటే, నీ శరీరంలో ఒక అవయవాన్ని పోగొట్టుకోవడం నీకు మేలు. నీవు పొరపాట్లు చేయడానికి ఒకవేళ నీ కుడి చెయ్యి కారణమైతే, దానిని నరికి పారవేయి. నీ శరీరమంతా నరకంలో పడవేయబడే కంటే నీ శరీరంలో ఒక అవయవాన్ని పోగొట్టుకోవడం నీకు మేలు. “ ‘తన భార్యను విడిచిపెట్టేవాడు ఆమెకు ధృవీకరణ పత్రం వ్రాసివ్వాలి’ అని చెప్పబడింది. అయితే నేను మీతో చెప్పేది ఏంటంటే, లైంగిక అనైతికత కారణంతో కాకుండా తన భార్యను విడిచిపెట్టేవాడు ఆమెను వ్యభిచార బాధితురాలిగా చేస్తున్నాడు, అలాగే విడిచిపెట్టబడిన స్త్రీని వివాహం చేసుకొనేవాడు వ్యభిచారం చేస్తున్నాడు. “అంతేకాక, ‘నీవు మాట తప్పకూడదు, చేసిన ప్రమాణాలను ప్రభువును బట్టి నిలబెట్టుకోవాలి’ అని పూర్వీకులతో చెప్పిన మాట మీరు విన్నారు. అయితే నేను మీతో చెప్పేది ఏంటంటే, అసలు మీరు ప్రమాణమే చేయవద్దు: ఆకాశంతోడని అనవద్దు, ఎందుకంటే అది దేవుని సింహాసనం; లేక భూమి తోడని అనవద్దు, ఎందుకంటే అది ఆయన పాదపీఠం; లేక యెరూషలేము తోడని అనవద్దు, ఎందుకంటే అది మహారాజు పట్టణం. నీ తల మీద ప్రమాణం చేయవద్దు, ఎందుకంటే నీవు కనీసం ఒక్క వెంట్రుకనైనా తెల్లగా కాని నల్లగా కాని చేయలేవు. నీవు కేవలం ‘అవునంటే అవును’ లేక ‘కాదంటే కాదు’ అని చెప్పాలి; దీనికి మించింది ఏదైనా దుష్టుని నుండి వస్తుంది. “ ‘కంటికి కన్ను, పంటికి పన్ను’ అని చెప్పిన మాట మీరు విన్నారు. అయితే నేను మీతో చెప్పేది ఏంటంటే, ఒక దుష్ట వ్యక్తిని ఎదిరించవద్దు. ఎవరైనా నిన్ను కుడిచెంప మీద కొడితే, వానికి నీ మరో చెంపను కూడ చూపించు. ఎవరైనా నీతో వివాదం పెట్టుకోవాలనుకొని నీ అంగీ తీసుకుంటే, వానికి నీ పైవస్త్రాన్ని కూడా ఇవ్వు. ఎవరైనా ఒక మైలు దూరం రమ్మని నిన్ను బలవంతం చేస్తే, వానితో రెండు మైళ్ళు వెళ్లు. నిన్ను అడిగేవానికి ఇవ్వు, మరియు నీ నుండి అప్పు పొందాలనుకొనే వారి నుండి తప్పించుకోవద్దు. “ ‘నీ పొరుగువారిని ప్రేమించి, నీ శత్రువును ద్వేషించు’ అని చెప్పిన మాటలను మీరు విన్నారు. అయితే నేను మీతో చెప్పేది ఏంటంటే, మీరు పరలోకంలోని మీ తండ్రికి పిల్లలగునట్లు, మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థించండి. ఆయన చెడ్డవారి మీద, అలాగే మంచివారి మీద తన సూర్యుని ఉదయింప చేస్తున్నారు, నీతిమంతుల మీద, అనీతిమంతుల మీద వర్షం కురిపిస్తున్నారు. ఒకవేళ మిమ్మల్ని ప్రేమించేవారినే మీరు ప్రేమిస్తే, మీరు ఏం ప్రతిఫలం పొందుకుంటారు? పన్ను వసూలు చేసేవారు కూడా అలాగే చేయడం లేదా? మరియు ఒకవేళ మీరు మీ సొంతవారినే పలకరిస్తే, ఇతరులకంటే మీరు ఏం ఎక్కువ చేసినట్టు? యూదేతరులు కూడా అలాగే చేయడం లేదా? మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడై యున్నట్లు, మీరు కూడ పరిపూర్ణులై ఉండండి.
మత్తయి 5:27-48 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
“‘వ్యభిచారం చేయకూడదు’ అని చెప్పడం మీరు విన్నారు గదా. కానీ నేను మీతో చెప్పేదేమిటంటే ఎవరైనా ఒక స్త్రీని కామంతో చూస్తే అప్పటికే ఆమెతో అతడు తన హృదయంలో వ్యభిచరించాడు. నీవు పాపం చేయడానికి నీ కుడి కన్ను కారణమైతే దాన్ని పీకి పారవెయ్యి. నీ శరీరమంతా నరకంలో పడడం కంటే శరీర భాగాల్లో ఒకటి పోవడం నీకు మంచిది గదా. నీ కుడి చెయ్యి నీవు పాపం చేయడానికి కారణమైతే దాన్ని నరికి పారవెయ్యి. నీ శరీరమంతా నరకంలో పడడం కంటే నీ శరీర భాగాల్లో ఒకటి పోవడం నీకు మంచిది గదా. “‘తన భార్యను వదిలేసేవాడు ఆమెకు విడాకుల పత్రం రాసివ్వాలి’ అని చెప్పడం కూడా మీరు విన్నారు. నేను మీతో చెప్పేదేమిటంటే వ్యభిచార కారణం కాకుండా తన భార్యను వదిలేసే ప్రతివాడూ ఆమెను వ్యభిచారిణిగా చేస్తున్నాడు. వదిలేసిన ఆమెను పెళ్ళి చేసుకొనేవాడు వ్యభిచారం చేస్తున్నాడు. “‘నీవు అబద్ధ ప్రమాణం చేయకూడదు. ప్రభువుకు చేసిన ప్రమాణాలను నిలబెట్టుకోవాలి’ అని పూర్వికులకు చెప్పింది మీరు విన్నారు గదా. అయితే నేను మీతో చెప్పేదేమిటంటే ఎంతమాత్రం ఒట్టు పెట్టుకోవద్దు. పరలోకం మీద ఒట్టు పెట్టుకోవద్దు, అది దేవుని సింహాసనం. భూమి తోడు అనవద్దు. అది ఆయన పాదపీఠం. యెరూషలేము తోడు అనవద్దు. అది మహారాజు నగరం. నీ తల తోడని ప్రమాణం చేయవద్దు. నీవు ఒక వెంట్రుకైనా తెల్లగా గాని నల్లగా గాని చేయలేవు. మీ మాట ‘అవునంటే అవును, కాదంటే కాదు’ అన్నట్టే ఉండాలి. అలా కాని ప్రతిదీ అపవాది సంబంధమైనదే. “‘కంటికి బదులు కన్ను, పన్నుకు బదులు పన్ను’ అని చెప్పింది మీరు విన్నారు గదా. కానీ నేను మీతో చెప్పేదేమిటంటే దుష్టుణ్ణి ఎదిరించవద్దు. ఎవరైనా నిన్ను కుడి చెంప మీద కొడితే అతన్ని మరొక చెంప మీద కూడా కొట్టనియ్యి. ఎవరైనా నీ అంగీ విషయం వివాదం పెట్టుకుని దాన్ని లాక్కుంటే అతనికి నీ పైచొక్కా కూడా ఇచ్చివెయ్యి. ఎవరైనా ఒక మైలు దూరం రమ్మని నిన్ను బలవంతం చేస్తే అతనితో రెండు మైళ్ళు వెళ్ళు. నిన్ను అడిగిన వాడికి ఇవ్వు. నిన్ను అప్పు అడగాలనుకొనే వాడికి నీ ముఖం చాటు చేయవద్దు. “‘నీ పొరుగువాణ్ణి ప్రేమించి, నీ శత్రువును ద్వేషించు’ అని చెప్పింది మీరు విన్నారు గదా. నేను మీతో చెప్పేదేమంటే, మీ శత్రువులను ప్రేమించండి. మిమ్మల్ని హింసించే వారి కోసం ప్రార్థించండి. ఆ విధంగా మీరు పరలోకంలో ఉన్న మీ తండ్రికి కుమారులవుతారు. ఎందుకంటే ఆయన చెడ్డవారిపైనా మంచివారిపైనా తన సూర్యుణ్ణి ఉదయింపజేసి, నీతిమంతులపైనా దుర్మార్గులపైనా వాన కురిపిస్తున్నాడు. మిమ్మల్ని ప్రేమించే వారినే ప్రేమిస్తే మీకు ఏం లాభం? పన్నులు వసూలు చేసేవారు కూడా అలాగే చేస్తారు గదా. మీరు మీ సోదరులనే గౌరవిస్తుంటే ఇతరులకంటే ఎక్కువేం చేస్తున్నారు? యూదేతరులూ అలాగే చేస్తున్నారు గదా. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు. అందుచేత మీరూ పరిపూర్ణులై ఉండండి.
మత్తయి 5:27-48 పవిత్ర బైబిల్ (TERV)
“‘వ్యభిచారం చేయరాదు’ అని చెప్పటం మీరు విన్నారు. కాని నేను చెప్పేదేమిటంటే, పరస్త్రీ వైపు కామంతో చూసినవాడు, హృదయంలో ఆమెతో వ్యభిచరించిన వానిగా పరిగణింపబడతాడు. మీరు పాపం చెయ్యటానికి మీ కుడి కన్ను కారణమైతే దాన్ని పీకి పారవేయండి. మీ శరీరమంతా నరకంలో పడటం కన్నా మీ శరీరంలోని ఒక అవయవము పోగొట్టుకోవటం మంచిది. మీరు పాపం చెయ్యటానికి మీ కుడి చెయ్యి కారణమైతే దానిని నరికి పారవేయండి. మీ శరీరమంతా నరకంలో పడటం కన్నా మీ శరీరంలోని ఒక అవయవము పోగొట్టుకోవటం మంచిది. “‘తన భార్యకు విడాకులివ్వదలచిన వ్యక్తి ఆమెకు ఒక విడాకుల పత్రం ఇవ్వాలి’ అని చెప్పే వాళ్ళు. కాని నేను చెప్పేదేమంటే భార్య మీద వ్యభిచార కారణంలేకుండా భర్త ఆమెకు విడాకులిస్తే ఆమె వ్యభిచారిణిగా పరిగణింప బడటానికి అతడు కారకుడౌతాడు. అలా విడాకులు పొందిన స్త్రీని వివాహమాడిన వాడు వ్యభిచారిగా పరిగణింపబడతాడు. వ్యభిచార కారణాన మాత్రానే తన భార్యకు విడాకులివ్వాలి గాని వేరే కారణాన కాదు. “అంతేకాక మాట తప్పకండి. ‘ప్రభువుతో చేసిన ప్రమాణాల్ని నిలబెట్టుకోండి,’ అని పూర్వం ప్రజలకు చెప్పటం మీరు విన్నారు. కాని నేను చెప్పేదేమిటంటె, దేని మీదా ప్రమాణం చెయ్యకండి, ఆకాశం దేవుని సింహాసనం కనుక ఆకాశం మీద ప్రమాణం చెయ్యకండి. భూమి దేవుని పాదపీఠం కనుక భూమ్మీద ప్రమాణం చెయ్యకండి. యెరూషలేము మహారాజు నగరం కనుక దానిపై ప్రమాణం చెయ్యకండి. మీ తలపై ఉన్న ఒక్క వెంట్రుకను కూడా తెలుపుగా కాని, నలుపుగా కాని మార్చలేరు. కనుక, మీ తలపై ప్రమాణం చెయ్యకండి. మీరు ‘ఔను’ అని అనాలనుకొంటే ఔననండి. ‘కాదు’ అని అనాలనుకొంటే కాదనండి. మరేవిధమైన ప్రమాణం మీ నుండి వచ్చినా దానికి కారణం ఆ సైతానే. “‘కంటికి కన్ను, పంటికి పన్ను ఊడ దీయాలి’ అని అనటం మీరు విన్నారు. కాని నేను చెప్పేదేమిటంటే దుష్టుల్ని ఆపటానికి ప్రయత్నించకండి. మిమ్మల్ని ఎవరైనా కుడి చెంపమీద కొడితే మీ రెండవ చెంప కూడా అతనికి చూపండి. ఎవరైనా మీపై వ్యాజ్యము వేసి మీ చొక్కాను కూడా లాక్కోవాలని చూస్తే, మీ కండువా కూడా తీసుకు వెళ్ళనివ్వండి. ఎవరైనా మిమ్మల్ని తమతో మైలు దూరం రమ్మని బలవంతం చేస్తే, అతనితో రెండు మైళ్ళు వెళ్ళండి. అడిగిన వాళ్ళకు ఇవ్వండి. మీ దగ్గర అప్పుపుచ్చుకోవాలని అనుకొని వచ్చిన వాళ్ళతో లేదనకండి. “‘పొరుగింటి వాణ్ణి ప్రేమించండి. శత్రువును ద్వేషించండి’ అని చెప్పటం మీరు విన్నారు. కాని నేను చెప్పేదేమిటంటే ‘మీ శత్రువుల్ని ప్రేమించండి మిమ్మల్ని హింసించిన వాళ్ళ కోసం దేవుణ్ణి ప్రార్థించండి.’ అప్పుడు మీరు పరలోకంలో ఉన్న మీ తండ్రికి బిడ్డలౌతారు. ఎందుకంటే దేవుడు చెడ్డవాళ్ళ కోసం, మంచి వాళ్ళ కోసం సూర్యోదయం కలిగిస్తాడు. నీతిమంతుల కోసం, అనీతిమంతుల కోసం వర్షాలు కురిపిస్తాడు. మిమ్మల్ని ప్రేమించిన వాళ్ళను మీరు ప్రేమిస్తే మీకేం ప్రతిఫలం కలుగుతుంది? పాపులు కూడా అలాచెయ్యటం లేదా? మీ సోదరులకు మాత్రమే మీరు అభివందనాలు చేస్తే యితర్ల కన్నా మీరు ఏం గొప్ప? యూదులుకాని వాళ్ళు కూడా అలా చేస్తారే! పరలోకంలో ఉన్న మీ తండ్రి పరిపూర్ణుడు. మీరును ఆయనలా ఉండాలి.
మత్తయి 5:27-48 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారుగదా; నేను మీతో చెప్పునదేమనగా–ఒక స్త్రీని మోహపుచూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసినవా డగును. నీ కుడికన్ను నిన్ను అభ్యంతర పరచినయెడల దాని పెరికి నీయొద్దనుండి పారవేయుము; నీ దేహమంతయు నరకములో పడవేయబడకుండ నీ అవయవములలో నొకటి నశించుట నీకు ప్రయోజనకరముగదా. నీ కుడిచెయ్యి నిన్నభ్యంతర పరచినయెడల దాని నరికి నీయొద్దనుండి పారవేయుము; నీ దేహమంతయు నరకములో పడకుండ నీ అవయవములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము గదా. తన భార్యను విడనాడు వాడు ఆమెకు పరిత్యాగ పత్రిక యియ్యవలెనని చెప్ప బడియున్నది గదా; నేను మీతో చెప్పునదేమనగా–వ్యభిచారకారణమునుబట్టిగాక, తన భార్యను విడనాడు ప్రతివాడును ఆమెను వ్యభిచారిణిగా చేయుచున్నాడు; విడనాడబడినదానిని పెండ్లాడువాడు వ్యభిచరించుచున్నాడు. మరియు–నీవు అప్రమాణము చేయక నీ ప్రమాణము లను ప్రభువునకు చెల్లింపవలెనని పూర్వికులతో చెప్ప బడిన మాట మీరు విన్నారు గదా, నేను మీతో చెప్పునదేమనగా–ఎంతమాత్రము ఒట్టుపెట్టుకొనవద్దు; ఆకాశము తోడన వద్దు; అది దేవుని సింహాసనము, భూమి తోడన వద్దు, అది ఆయన పాదపీఠము, యెరూషలేము తోడనవద్దు; అది మహారాజు పట్టణము నీ తల తోడని ఒట్టుపెట్టుకొనవద్దు, నీవు ఒక వెండ్రుకనైనను తెలుపుగా గాని నలుపుగా గాని చేయలేవు. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని యుండవలెను; వీటికి మించునది దుష్టునినుండి పుట్టునది. పె కంటికి కన్ను, పంటికి పల్లు అని చెప్పబడిన మాట మీరు విన్నారు గదా. నేను మీతో చెప్పునదేమనగా దుష్టుని ఎదిరింపక, నిన్ను కుడిచెంపమీద కొట్టువాని వైపునకు ఎడమచెంప కూడ త్రిప్పుము. ఎవడైన నీమీద వ్యాజ్యెము వేసి నీ అంగీ తీసికొనగోరినయెడల వానికి నీ పైవస్త్రము కూడ ఇచ్చివేయుము. ఒకడు ఒక మైలు దూరము రమ్మని నిన్ను బలవంతము చేసినయెడల, వానితోకూడ రెండు మైళ్లు వెళ్లుము. నిన్ను అడుగువానికిమ్ము, నిన్ను అప్పు అడుగగోరువానినుండి నీ ముఖము త్రిప్పు కొనవద్దు. నీ పొరుగువాని ప్రేమించి, నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు గదా; నేను మీతో చెప్పునదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై యుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. మిమ్మును హింసించు వారికొరకు ప్రార్థన చేయుడి. ఆయన చెడ్డవారిమీదను మంచివారిమీదను తన సూర్యుని ఉదయింపజేసి, నీతిమంతులమీదను, అనీతిమంతులమీదను వర్షము కురిపించుచున్నాడు. మీరు మిమ్మును ప్రేమించువారినే ప్రేమించినయెడల మీకేమి ఫలము కలుగును? సుంకరులును ఆలాగు చేయుచున్నారు గదా. మీ సహోదరులకు మాత్రము వందనము చేసినయెడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్యజనులును ఆలాగు చేయుచున్నారు గదా. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు.