మత్తయి 5:13-20

మత్తయి 5:13-20 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

మీరు లోకమునకు ఉప్పయి యున్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేనివలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుష్యులచేత త్రొక్కబడుటకే గాని మరి దేనికిని పనికిరాదు. మీరు లోకమునకు వెలుగైయున్నారు; కొండమీదనుండు పట్టణము మరుగై యుండనేరదు. మనుష్యులు దీపము వెలిగించి కుంచము క్రింద పెట్టరు కాని అది యింటనుండువారికందరికి వెలుగిచ్చుటకై దీపస్తంభముమీదనే పెట్టుదురు. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారియెదుట మీ వెలుగు ప్రకాశింప నియ్యుడి. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టి వేయవచ్చితినని తలంచవద్దు; నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరువరకు దానినుండి యొక పొల్లయినను ఒక సున్నయైనను తప్పి పోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. కాబట్టి యీ యాజ్ఞలలో మిగుల అల్పమైన యొకదానినైనను మీరి, మనుష్యులకు ఆలాగున చేయ బోధించువాడెవడో వాడు పరలోకరాజ్యములో మిగుల అల్పుడనబడును; అయితే వాటిని గైకొని బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యములో గొప్పవాడనబడును. శాస్త్రుల నీతికంటెను పరిసయ్యుల నీతికంటెను మీ నీతి అధికము కానియెడల మీరు పరలోకరాజ్యములో ప్రవేశింపనేరరని మీతో చెప్పుచున్నాను.

షేర్ చేయి
Read మత్తయి 5

మత్తయి 5:13-20 తెలుగు సమకాలీన అనువాదము (TCV)

“మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. కాని ఉప్పు తన సారం కోల్పోతే, అది తిరిగి సారవంతంగా ఎలా చేయబడుతుంది? అది బయట పడవేయబడి పాదాల క్రింద త్రొక్కబడడానికే తప్ప మరి దేనికి పనికిరాదు. “మీరు లోకానికి వెలుగై ఉన్నారు. కొండ మీద కట్టబడిన పట్టణం కనబడకుండ ఉండలేదు. అదే విధంగా, ఎవ్వరూ దీపాన్ని వెలిగించి దానిని పాత్ర క్రింద పెట్టరు, కాని దానిని దీపస్తంభం మీద పెడతారు, అప్పుడది ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి వెలుగు ఇస్తుంది. అదే విధంగా, ఇతరులు మీ మంచి పనులను చూసి పరలోకమందు ఉన్న మీ తండ్రిని మహిమపరిచేలా, ఇతరుల ముందు మీ వెలుగును ప్రకాశింపనివ్వండి. “నేను ధర్మశాస్త్రాన్ని లేదా ప్రవక్తల మాటలను రద్దు చేయడానికి వచ్చానని అనుకోవద్దు. నేను వాటిని నెరవేర్చడానికే కాని రద్దు చేయడానికి రాలేదు. భూమ్యాకాశాలు గతించిపోకముందు, ధర్మశాస్త్రం అంతా నెరవేరే వరకు అందులో నుండి ఒక పొల్లు కానీ, ఒక సున్నా కానీ తప్పిపోదని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను. కనుక ఈ ఆజ్ఞలలో అతి చిన్నదాన్ని పాటించకుండానే ఇతరులకు బోధించేవారు పరలోకరాజ్యంలో చాలా తక్కువవారిగా పిలువబడతారు, అయితే ఎవరైతే ఈ ఆజ్ఞలను పాటిస్తూ బోధిస్తారో వారు పరలోకరాజ్యంలో గొప్పవారిగా పిలువబడతారు. ధర్మశాస్త్ర ఉపదేశకుల నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే, మీ నీతి అధికంగా లేకపోతే మీరు పరలోకరాజ్యంలో ప్రవేశించలేరని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను.

షేర్ చేయి
Read మత్తయి 5

మత్తయి 5:13-20 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

“లోకానికి మీరు ఉప్పు. ఉప్పు తన రుచి కోల్పోతే దానికి ఆ రుచి మళ్ళీ ఎలా వస్తుంది? అలాంటి ఉప్పు బయట పారేసి కాళ్ళ కింద తొక్కడానికి తప్ప ఇక దేనికీ పనికిరాదు. ప్రపంచానికి మీరు వెలుగుగా ఉన్నారు. కొండ మీద ఉండే ఊరు కనబడకుండా ఉండదు. ఎవరూ దీపం వెలిగించి బుట్ట కింద పెట్టరు. దీపస్తంభం మీదే పెడతారు. అప్పుడు ఆ దీపం ఇంట్లో అందరికీ వెలుగు ఇస్తుంది. మీ వెలుగు మనుషుల ముందు ప్రకాశించనీయండి. అప్పుడు వారు మీ మంచి పనులు చూసి పరలోకంలో ఉన్న మీ తండ్రిని కీర్తిస్తారు. “నేను ధర్మశాస్త్రాన్ని గానీ ప్రవక్తల మాటలను గానీ రద్దు చేయడానికి వచ్చాననుకోవద్దు. వాటిని నెరవేర్చడానికే వచ్చాను గానీ రద్దు చేయడానికి కాదు. నేను కచ్చితంగా చెబుతున్నాను. ఆకాశం, భూమి నశించే వరకూ ధర్మశాస్త్రమంతా నెరవేరే వరకూ ధర్మశాస్త్రం నుంచి ఒక్క పొల్లు అయినా, ఒక సున్నా అయినా తప్పిపోదు. కాబట్టి ఈ ఆజ్ఞల్లో ఎంత చిన్న దానినైనా సరే అతిక్రమించి, ఇతరులకు కూడా అలా చేయమని బోధించేవాణ్ణి పరలోకరాజ్యంలో అతి తక్కువ వాడుగా ఎంచుతారు. కానీ ఈ ఆజ్ఞల ప్రకారం చేస్తూ, వాటిని బోధించేవాణ్ణి పరలోక రాజ్యంలో గొప్పవాడుగా లెక్కిస్తారు. ధర్మశాస్త్ర పండితుల, పరిసయ్యుల నీతికన్నా మీ నీతి మిన్నగా ఉండకపోతే మీరు పరలోకరాజ్యంలో ఎంత మాత్రమూ ప్రవేశించలేరని మీతో చెబుతున్నాను.

షేర్ చేయి
Read మత్తయి 5

మత్తయి 5:13-20 పవిత్ర బైబిల్ (TERV)

“మీరు ఈ ప్రపంచానికి ఉప్పులాంటి వాళ్ళు, కాని ఉప్పులోవున్న ఉప్పు గుణం పోతే మళ్ళీ దాన్ని ఉప్పుగా ఎలా చెయ్యగలం? అది దేనికీ పనికి రాకుండా పోతుంది. అంతేకాక, దాన్ని పార వేయవలసి వస్తుంది. ప్రజలు దాన్ని త్రొక్కుతూ నడుస్తారు. “మీరు ఈ ప్రపంచానికి వెలుగులాంటి వాళ్ళు. కొండ మీద ఉన్న పట్టణాన్ని మరుగు పరచటం అసంభవం. దీపాన్ని వెలిగించి దాన్ని ఎవ్వరూ గంప క్రింద దాచి ఉంచరు. దానికి మారుగా దాన్ని వెలిగించి ముక్కాలి పీటపై ఉంచుతారు. అప్పుడది యింట్లోని వాళ్ళందరికి వెలుగునిస్తుంది. అదే విధంగా మీ జీవితం వెలుగులా ప్రకాశించాలి. అప్పుడు యితర్లు మీరు చేస్తున్న మంచి పనులు చూసి పరలోకంలో ఉన్న మీ తండ్రిని స్తుతిస్తారు. “నేను ధర్మశాస్త్రాన్ని కాని, ప్రవక్తల వచనాలను కాని రద్దు చేయటానికి వచ్చానని అనుకోవద్దు. నేను వాటిని రద్దుచేయటానికి రాలేదు. వాటిని పూర్తి చేయటానికి వచ్చాను. ఇది సత్యం. భూమి, ఆకాశం గడచి పోయేలోపుల అన్ని సంగతులు, ధర్మశాస్త్రంలోని చిన్న అక్షరం, పొల్లుతో సహా నెరవేరుతాయి. “ఒక చిన్న ఆజ్ఞనైనా సరే రద్దుచేసిన వాడును, తనలాగే చెయ్యమని బోధించిన వాడును దేవుని రాజ్యంలో తక్కువ వాడుగా ఎంచబడుతాడు. కాని ఈ ఆజ్ఞల్ని అనుసరిస్తూ వాటిని బోధించినవాడు దేవుని రాజ్యంలో గొప్పవానిగా ఎంచబడతాడు. ఎందుకంటే, మీరు శాస్త్రులకన్నా, పరిసయ్యుల కన్నా గొప్ప నీతిమంతులని గుర్తింపబడక పోతే దేవుని రాజ్యంలోకి ప్రవేశింపలేరని నేను చెబుతున్నాను.

షేర్ చేయి
Read మత్తయి 5

మత్తయి 5:13-20

మత్తయి 5:13-20 TELUBSIమత్తయి 5:13-20 TELUBSIమత్తయి 5:13-20 TELUBSIమత్తయి 5:13-20 TELUBSIమత్తయి 5:13-20 TELUBSI