మత్తయి 5:1-48
మత్తయి 5:1-48 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఆయన ఆ జనసమూహములను చూచి కొండయెక్కి కూర్చుండగా ఆయన శిష్యు లాయనయొద్దకు వచ్చిరి. అప్పుడాయన నోరు తెరచి యీలాగు బోధింపసాగెను– ఆత్మవిషయమై దీనులైనవారు ధన్యులు; పరలోక రాజ్యము వారిది. దుఃఖపడువారు ధన్యులు; వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు; వారు భూలోకమును స్వతం త్రించుకొందురు. నీతికొరకు ఆకలిదప్పులు గలవారు ధన్యులు; వారు తృప్తిపరచబడుదురు. కనికరముగలవారు ధన్యులు; వారు కనికరము పొందుదురు. హృదయశుద్ధిగలవారు ధన్యులు; వారు దేవుని చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు ; వారు దేవుని కుమారు లనబడుదురు. నీతినిమిత్తము హింసింపబడువారు ధన్యులు; పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీమీద అబద్ధముగా చెడ్డమాటలెల్ల పలుకునప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈలాగునవారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. మీరు లోకమునకు ఉప్పయి యున్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేనివలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుష్యులచేత త్రొక్కబడుటకే గాని మరి దేనికిని పనికిరాదు. మీరు లోకమునకు వెలుగైయున్నారు; కొండమీదనుండు పట్టణము మరుగై యుండనేరదు. మనుష్యులు దీపము వెలిగించి కుంచము క్రింద పెట్టరు కాని అది యింటనుండువారికందరికి వెలుగిచ్చుటకై దీపస్తంభముమీదనే పెట్టుదురు. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారియెదుట మీ వెలుగు ప్రకాశింప నియ్యుడి. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టి వేయవచ్చితినని తలంచవద్దు; నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరువరకు దానినుండి యొక పొల్లయినను ఒక సున్నయైనను తప్పి పోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. కాబట్టి యీ యాజ్ఞలలో మిగుల అల్పమైన యొకదానినైనను మీరి, మనుష్యులకు ఆలాగున చేయ బోధించువాడెవడో వాడు పరలోకరాజ్యములో మిగుల అల్పుడనబడును; అయితే వాటిని గైకొని బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యములో గొప్పవాడనబడును. శాస్త్రుల నీతికంటెను పరిసయ్యుల నీతికంటెను మీ నీతి అధికము కానియెడల మీరు పరలోకరాజ్యములో ప్రవేశింపనేరరని మీతో చెప్పుచున్నాను. నరహత్య చేయవద్దు; నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వికులతో చెప్పబడిన మాట మీరు విన్నారు గదా. నేను మీతో చెప్పునదేమనగా – తన సహోదరునిమీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును; ద్రోహీ అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము నర్పించుచుండగా నీమీద నీ సహోదరునికి విరోధమేమైననుకలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చినయెడల అక్కడ బలిపీఠము నెదుటనే నీ యర్పణము విడిచిపెట్టి, మొదట వెళ్లి నీ సహోదరునితో సమాధానపడుము; అటు తరువాత వచ్చి నీ యర్పణము నర్పింపుము. నీ ప్రతివాదితో నీవును త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధానపడుము; లేనియెడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను బంట్రౌతుకు అప్పగించును, అంతట నీవు చెరసాలలో వేయబడుదువు. కడపటి కాసు చెల్లించువరకు అక్కడ నుండి నీవు వెలుపలికి రానేరవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారుగదా; నేను మీతో చెప్పునదేమనగా–ఒక స్త్రీని మోహపుచూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసినవా డగును. నీ కుడికన్ను నిన్ను అభ్యంతర పరచినయెడల దాని పెరికి నీయొద్దనుండి పారవేయుము; నీ దేహమంతయు నరకములో పడవేయబడకుండ నీ అవయవములలో నొకటి నశించుట నీకు ప్రయోజనకరముగదా. నీ కుడిచెయ్యి నిన్నభ్యంతర పరచినయెడల దాని నరికి నీయొద్దనుండి పారవేయుము; నీ దేహమంతయు నరకములో పడకుండ నీ అవయవములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము గదా. తన భార్యను విడనాడు వాడు ఆమెకు పరిత్యాగ పత్రిక యియ్యవలెనని చెప్ప బడియున్నది గదా; నేను మీతో చెప్పునదేమనగా–వ్యభిచారకారణమునుబట్టిగాక, తన భార్యను విడనాడు ప్రతివాడును ఆమెను వ్యభిచారిణిగా చేయుచున్నాడు; విడనాడబడినదానిని పెండ్లాడువాడు వ్యభిచరించుచున్నాడు. మరియు–నీవు అప్రమాణము చేయక నీ ప్రమాణము లను ప్రభువునకు చెల్లింపవలెనని పూర్వికులతో చెప్ప బడిన మాట మీరు విన్నారు గదా, నేను మీతో చెప్పునదేమనగా–ఎంతమాత్రము ఒట్టుపెట్టుకొనవద్దు; ఆకాశము తోడన వద్దు; అది దేవుని సింహాసనము, భూమి తోడన వద్దు, అది ఆయన పాదపీఠము, యెరూషలేము తోడనవద్దు; అది మహారాజు పట్టణము నీ తల తోడని ఒట్టుపెట్టుకొనవద్దు, నీవు ఒక వెండ్రుకనైనను తెలుపుగా గాని నలుపుగా గాని చేయలేవు. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని యుండవలెను; వీటికి మించునది దుష్టునినుండి పుట్టునది. పె కంటికి కన్ను, పంటికి పల్లు అని చెప్పబడిన మాట మీరు విన్నారు గదా. నేను మీతో చెప్పునదేమనగా దుష్టుని ఎదిరింపక, నిన్ను కుడిచెంపమీద కొట్టువాని వైపునకు ఎడమచెంప కూడ త్రిప్పుము. ఎవడైన నీమీద వ్యాజ్యెము వేసి నీ అంగీ తీసికొనగోరినయెడల వానికి నీ పైవస్త్రము కూడ ఇచ్చివేయుము. ఒకడు ఒక మైలు దూరము రమ్మని నిన్ను బలవంతము చేసినయెడల, వానితోకూడ రెండు మైళ్లు వెళ్లుము. నిన్ను అడుగువానికిమ్ము, నిన్ను అప్పు అడుగగోరువానినుండి నీ ముఖము త్రిప్పు కొనవద్దు. నీ పొరుగువాని ప్రేమించి, నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు గదా; నేను మీతో చెప్పునదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై యుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. మిమ్మును హింసించు వారికొరకు ప్రార్థన చేయుడి. ఆయన చెడ్డవారిమీదను మంచివారిమీదను తన సూర్యుని ఉదయింపజేసి, నీతిమంతులమీదను, అనీతిమంతులమీదను వర్షము కురిపించుచున్నాడు. మీరు మిమ్మును ప్రేమించువారినే ప్రేమించినయెడల మీకేమి ఫలము కలుగును? సుంకరులును ఆలాగు చేయుచున్నారు గదా. మీ సహోదరులకు మాత్రము వందనము చేసినయెడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్యజనులును ఆలాగు చేయుచున్నారు గదా. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు.
మత్తయి 5:1-48 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
ఒక రోజు యేసు జనసమూహాన్ని చూసి, కొండ మీదికి వెళ్లి కూర్చున్నారు, ఆయన శిష్యులు ఆయన దగ్గరకు వచ్చారు. అప్పుడు ఆయన వారికి బోధించడం మొదలుపెట్టారు. ఆయన అన్నారు: “ఆత్మ కొరకు దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిదే. దుఃఖించే వారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. సాత్వికులు ధన్యులు, వారు భూమిని స్వతంత్రించుకుంటారు. నీతికొరకు ఆకలిదప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపొందుతారు. కనికరం చూపేవారు ధన్యులు, వారు కనికరం పొందుకొంటారు. హృదయశుధ్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. సమాధానపరచేవారు ధన్యులు, వారు దేవుని బిడ్డలుగా పిలువబడతారు. నీతికొరకు హింసల పాలయ్యేవారు ధన్యులు, పరలోక రాజ్యం వారిదే. “నా నిమిత్తం ప్రజలు మిమ్మల్ని అవమానించి, హింసించి మీరు చెడ్డవారని అబద్ధ సాక్ష్యం చెప్పినప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించండి, ఎందుకంటే పరలోకంలో మీ బహుమానం గొప్పది, మీకన్నా ముందు వచ్చిన ప్రవక్తలను కూడా వారు ఇలాగే హింసించారు. “మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. కాని ఉప్పు తన సారం కోల్పోతే, అది తిరిగి సారవంతంగా ఎలా చేయబడుతుంది? అది బయట పడవేయబడి పాదాల క్రింద త్రొక్కబడడానికే తప్ప మరి దేనికి పనికిరాదు. “మీరు లోకానికి వెలుగై ఉన్నారు. కొండ మీద కట్టబడిన పట్టణం కనబడకుండ ఉండలేదు. అదే విధంగా, ఎవ్వరూ దీపాన్ని వెలిగించి దానిని పాత్ర క్రింద పెట్టరు, కాని దానిని దీపస్తంభం మీద పెడతారు, అప్పుడది ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి వెలుగు ఇస్తుంది. అదే విధంగా, ఇతరులు మీ మంచి పనులను చూసి పరలోకమందు ఉన్న మీ తండ్రిని మహిమపరిచేలా, ఇతరుల ముందు మీ వెలుగును ప్రకాశింపనివ్వండి. “నేను ధర్మశాస్త్రాన్ని లేదా ప్రవక్తల మాటలను రద్దు చేయడానికి వచ్చానని అనుకోవద్దు. నేను వాటిని నెరవేర్చడానికే కాని రద్దు చేయడానికి రాలేదు. భూమ్యాకాశాలు గతించిపోకముందు, ధర్మశాస్త్రం అంతా నెరవేరే వరకు అందులో నుండి ఒక పొల్లు కానీ, ఒక సున్నా కానీ తప్పిపోదని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను. కనుక ఈ ఆజ్ఞలలో అతి చిన్నదాన్ని పాటించకుండానే ఇతరులకు బోధించేవారు పరలోకరాజ్యంలో చాలా తక్కువవారిగా పిలువబడతారు, అయితే ఎవరైతే ఈ ఆజ్ఞలను పాటిస్తూ బోధిస్తారో వారు పరలోకరాజ్యంలో గొప్పవారిగా పిలువబడతారు. ధర్మశాస్త్ర ఉపదేశకుల నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే, మీ నీతి అధికంగా లేకపోతే మీరు పరలోకరాజ్యంలో ప్రవేశించలేరని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను. “ ‘మీరు నరహత్య చేయకూడదు, ఎవరైనా నరహత్య చేస్తే వారు తీర్పుకు గురవుతారు’ అని మీ పూర్వీకులకు చెప్పిన మాట మీరు విన్నారు. కాని నేను చెప్పేది, తన సహోదరుని మీద కాని, సహోదరి మీద కాని కోపపడే ప్రతివాడు తీర్పుకు గురవుతాడు. అంతేకాక తన సహోదరుని కాని సహోదరిని కాని చూసి ద్రోహి అని పలికేవాడు న్యాయస్థానానికి సమాధానం చెప్పుకోవాలి. వెర్రివాడ లేదా వెర్రిదాన అని పలికే ప్రతివాడు నరకాగ్నికి గురవుతాడు. “కాబట్టి నీవు బలిపీఠం మీద కానుకను అర్పిస్తూ వుండగా నీ సహోదరునికైనా సహోదరికైనా నీ పట్ల ఏదైన విరోధం ఉందని జ్ఞాపకం వస్తే, అక్కడ బలిపీఠం ముందే నీ కానుకను పెట్టి, మొదట వెళ్లి నీ సహోదరునితో లేక సహోదరితో సమాధానపడి ఆ తర్వాత వచ్చి నీ కానుకను అర్పించాలి. “నిన్ను న్యాయస్థానానికి తీసుకువెళ్తున్న నీ విరోధితో నీకున్న వివాదాన్ని త్వరగా పరిష్కరించుకోవాలి. ఆ పని మీరిద్దరు ఇంకా దారిలో ఉండగానే చేయాలి. లేకపోతే నీ విరోధి నిన్ను న్యాయాధిపతికి అప్పగించవచ్చు, ఆ న్యాయాధిపతి నిన్ను అధికారికి అప్పగించవచ్చు, మరియు నీవు చెరసాలలో వేయబడవచ్చు. నిజంగా నీతో నేను చెప్తున్నా, నీవు చివరి పైసా చెల్లించే వరకు బయట పడలేవు. “ ‘వ్యభిచారం చేయకూడదు’ అని చెప్పిన మాట మీరు విన్నారు. అయితే నేను మీతో చెప్పేది, ఒక స్త్రీని కామంతో చూసే ప్రతివాడు అప్పటికే తన మనస్సులో ఆమెతో వ్యభిచరించాడు. నీవు పొరపాట్లు చేయడానికి ఒకవేళ నీ కుడికన్ను కారణమైతే, దానిని పెరికి పారవేయి. నీ శరీరమంతా నరకంలో పడవేయబడటం కంటే, నీ శరీరంలో ఒక అవయవాన్ని పోగొట్టుకోవడం నీకు మేలు. నీవు పొరపాట్లు చేయడానికి ఒకవేళ నీ కుడి చెయ్యి కారణమైతే, దానిని నరికి పారవేయి. నీ శరీరమంతా నరకంలో పడవేయబడే కంటే నీ శరీరంలో ఒక అవయవాన్ని పోగొట్టుకోవడం నీకు మేలు. “ ‘తన భార్యను విడిచిపెట్టేవాడు ఆమెకు ధృవీకరణ పత్రం వ్రాసివ్వాలి’ అని చెప్పబడింది. అయితే నేను మీతో చెప్పేది ఏంటంటే, లైంగిక అనైతికత కారణంతో కాకుండా తన భార్యను విడిచిపెట్టేవాడు ఆమెను వ్యభిచార బాధితురాలిగా చేస్తున్నాడు, అలాగే విడిచిపెట్టబడిన స్త్రీని వివాహం చేసుకొనేవాడు వ్యభిచారం చేస్తున్నాడు. “అంతేకాక, ‘నీవు మాట తప్పకూడదు, చేసిన ప్రమాణాలను ప్రభువును బట్టి నిలబెట్టుకోవాలి’ అని పూర్వీకులతో చెప్పిన మాట మీరు విన్నారు. అయితే నేను మీతో చెప్పేది ఏంటంటే, అసలు మీరు ప్రమాణమే చేయవద్దు: ఆకాశంతోడని అనవద్దు, ఎందుకంటే అది దేవుని సింహాసనం; లేక భూమి తోడని అనవద్దు, ఎందుకంటే అది ఆయన పాదపీఠం; లేక యెరూషలేము తోడని అనవద్దు, ఎందుకంటే అది మహారాజు పట్టణం. నీ తల మీద ప్రమాణం చేయవద్దు, ఎందుకంటే నీవు కనీసం ఒక్క వెంట్రుకనైనా తెల్లగా కాని నల్లగా కాని చేయలేవు. నీవు కేవలం ‘అవునంటే అవును’ లేక ‘కాదంటే కాదు’ అని చెప్పాలి; దీనికి మించింది ఏదైనా దుష్టుని నుండి వస్తుంది. “ ‘కంటికి కన్ను, పంటికి పన్ను’ అని చెప్పిన మాట మీరు విన్నారు. అయితే నేను మీతో చెప్పేది ఏంటంటే, ఒక దుష్ట వ్యక్తిని ఎదిరించవద్దు. ఎవరైనా నిన్ను కుడిచెంప మీద కొడితే, వానికి నీ మరో చెంపను కూడ చూపించు. ఎవరైనా నీతో వివాదం పెట్టుకోవాలనుకొని నీ అంగీ తీసుకుంటే, వానికి నీ పైవస్త్రాన్ని కూడా ఇవ్వు. ఎవరైనా ఒక మైలు దూరం రమ్మని నిన్ను బలవంతం చేస్తే, వానితో రెండు మైళ్ళు వెళ్లు. నిన్ను అడిగేవానికి ఇవ్వు, మరియు నీ నుండి అప్పు పొందాలనుకొనే వారి నుండి తప్పించుకోవద్దు. “ ‘నీ పొరుగువారిని ప్రేమించి, నీ శత్రువును ద్వేషించు’ అని చెప్పిన మాటలను మీరు విన్నారు. అయితే నేను మీతో చెప్పేది ఏంటంటే, మీరు పరలోకంలోని మీ తండ్రికి పిల్లలగునట్లు, మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థించండి. ఆయన చెడ్డవారి మీద, అలాగే మంచివారి మీద తన సూర్యుని ఉదయింప చేస్తున్నారు, నీతిమంతుల మీద, అనీతిమంతుల మీద వర్షం కురిపిస్తున్నారు. ఒకవేళ మిమ్మల్ని ప్రేమించేవారినే మీరు ప్రేమిస్తే, మీరు ఏం ప్రతిఫలం పొందుకుంటారు? పన్ను వసూలు చేసేవారు కూడా అలాగే చేయడం లేదా? మరియు ఒకవేళ మీరు మీ సొంతవారినే పలకరిస్తే, ఇతరులకంటే మీరు ఏం ఎక్కువ చేసినట్టు? యూదేతరులు కూడా అలాగే చేయడం లేదా? మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడై యున్నట్లు, మీరు కూడ పరిపూర్ణులై ఉండండి.
మత్తయి 5:1-48 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
యేసు ఆ ప్రజా సమూహాన్ని చూసి కొండ ఎక్కి కూర్చున్నప్పుడు ఆయన శిష్యులు ఆయన దగ్గరికి వచ్చారు. ఆయన తన నోరు తెరచి ఇలా ఉపదేశించ సాగాడు. “ఆత్మలో దీనత్వం గలవారు ధన్యులు, పరలోకరాజ్యం వారిదే. దుఃఖించే వారు ధన్యులు, వారికి ఓదార్పు కలుగుతుంది. సాధుగుణం గలవారు ధన్యులు, ఈ భూమికి వారు వారసులవుతారు. నీతిన్యాయాల కోసం ఆకలిదప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పొందుతారు. కనికరం చూపే వారు ధన్యులు, వారు కనికరం పొందుతారు. పవిత్ర హృదయం గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. శాంతి కుదిర్చేవారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనిపించుకుంటారు. నీతి కోసం నిలబడి హింసల పాలయ్యేవారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. “నన్ను బట్టి మనుషులు మిమ్మల్ని అవమానించి, హింసించి మీమీద అన్ని రకాల అపనిందలు అన్యాయంగా వేసినప్పుడు మీరు ధన్యులు. అప్పుడు సంతోషించండి! ఉప్పొంగిపొండి. పరలోకంలో మీకు గొప్ప బహుమానం ఉంటుంది. మీకు ముందు వచ్చిన ప్రవక్తలను కూడా మనుషులు ఇలాగే హింసించారు. “లోకానికి మీరు ఉప్పు. ఉప్పు తన రుచి కోల్పోతే దానికి ఆ రుచి మళ్ళీ ఎలా వస్తుంది? అలాంటి ఉప్పు బయట పారేసి కాళ్ళ కింద తొక్కడానికి తప్ప ఇక దేనికీ పనికిరాదు. ప్రపంచానికి మీరు వెలుగుగా ఉన్నారు. కొండ మీద ఉండే ఊరు కనబడకుండా ఉండదు. ఎవరూ దీపం వెలిగించి బుట్ట కింద పెట్టరు. దీపస్తంభం మీదే పెడతారు. అప్పుడు ఆ దీపం ఇంట్లో అందరికీ వెలుగు ఇస్తుంది. మీ వెలుగు మనుషుల ముందు ప్రకాశించనీయండి. అప్పుడు వారు మీ మంచి పనులు చూసి పరలోకంలో ఉన్న మీ తండ్రిని కీర్తిస్తారు. “నేను ధర్మశాస్త్రాన్ని గానీ ప్రవక్తల మాటలను గానీ రద్దు చేయడానికి వచ్చాననుకోవద్దు. వాటిని నెరవేర్చడానికే వచ్చాను గానీ రద్దు చేయడానికి కాదు. నేను కచ్చితంగా చెబుతున్నాను. ఆకాశం, భూమి నశించే వరకూ ధర్మశాస్త్రమంతా నెరవేరే వరకూ ధర్మశాస్త్రం నుంచి ఒక్క పొల్లు అయినా, ఒక సున్నా అయినా తప్పిపోదు. కాబట్టి ఈ ఆజ్ఞల్లో ఎంత చిన్న దానినైనా సరే అతిక్రమించి, ఇతరులకు కూడా అలా చేయమని బోధించేవాణ్ణి పరలోకరాజ్యంలో అతి తక్కువ వాడుగా ఎంచుతారు. కానీ ఈ ఆజ్ఞల ప్రకారం చేస్తూ, వాటిని బోధించేవాణ్ణి పరలోక రాజ్యంలో గొప్పవాడుగా లెక్కిస్తారు. ధర్మశాస్త్ర పండితుల, పరిసయ్యుల నీతికన్నా మీ నీతి మిన్నగా ఉండకపోతే మీరు పరలోకరాజ్యంలో ఎంత మాత్రమూ ప్రవేశించలేరని మీతో చెబుతున్నాను. “‘హత్య చేయవద్దు. హత్య చేసేవాడు శిక్షకు లోనవుతాడు’ అని పూర్వికులకు చెప్పింది మీరు విన్నారు. అయితే నేను మీతో చెప్పేదేమిటంటే తన సోదరుని మీద కోపం పెట్టుకొనే ప్రతివాడూ శిక్షకు లోనవుతాడు. తన సోదరుణ్ణి ‘పనికి మాలినవాడా’ అని పిలిచే ప్రతివాడూ మహాసభ ముందు నిలబడాలి. ‘మూర్ఖుడా’ అనే ప్రతివాడికీ నరకాగ్ని తప్పదు. “కాబట్టి నీవు నీ కానుకను బలిపీఠం వద్ద అర్పించే ముందు, నీ సోదరునికి నీ మీద ఏదైనా విరోధ భావం ఉందని నీకు గుర్తుకు వచ్చిందనుకో. నీ కానుకను అక్కడే, బలిపీఠం ఎదుటే వదిలి వెళ్ళు. ముందు నీ సోదరునితో రాజీ పడు. ఆ తరువాత వచ్చి నీ కానుకను అర్పించు. నీపై నేరం ఆరోపించేవాడితో న్యాయస్థానానికి వెళ్ళే దారిలోనే త్వరగా రాజీపడు. లేకపోతే అతడు నిన్ను న్యాయాధిపతికి అప్పగిస్తాడేమో. ఆ న్యాయాధిపతి నిన్ను అధికారికి అప్పగించి చెరసాల్లో వేయిస్తాడేమో. చెల్లించాల్సి ఉన్నదంతా చెల్లించే వరకూ నీవు అక్కడ నుండి బయట పడలేవని కచ్చితంగా చెబుతున్నాను. “‘వ్యభిచారం చేయకూడదు’ అని చెప్పడం మీరు విన్నారు గదా. కానీ నేను మీతో చెప్పేదేమిటంటే ఎవరైనా ఒక స్త్రీని కామంతో చూస్తే అప్పటికే ఆమెతో అతడు తన హృదయంలో వ్యభిచరించాడు. నీవు పాపం చేయడానికి నీ కుడి కన్ను కారణమైతే దాన్ని పీకి పారవెయ్యి. నీ శరీరమంతా నరకంలో పడడం కంటే శరీర భాగాల్లో ఒకటి పోవడం నీకు మంచిది గదా. నీ కుడి చెయ్యి నీవు పాపం చేయడానికి కారణమైతే దాన్ని నరికి పారవెయ్యి. నీ శరీరమంతా నరకంలో పడడం కంటే నీ శరీర భాగాల్లో ఒకటి పోవడం నీకు మంచిది గదా. “‘తన భార్యను వదిలేసేవాడు ఆమెకు విడాకుల పత్రం రాసివ్వాలి’ అని చెప్పడం కూడా మీరు విన్నారు. నేను మీతో చెప్పేదేమిటంటే వ్యభిచార కారణం కాకుండా తన భార్యను వదిలేసే ప్రతివాడూ ఆమెను వ్యభిచారిణిగా చేస్తున్నాడు. వదిలేసిన ఆమెను పెళ్ళి చేసుకొనేవాడు వ్యభిచారం చేస్తున్నాడు. “‘నీవు అబద్ధ ప్రమాణం చేయకూడదు. ప్రభువుకు చేసిన ప్రమాణాలను నిలబెట్టుకోవాలి’ అని పూర్వికులకు చెప్పింది మీరు విన్నారు గదా. అయితే నేను మీతో చెప్పేదేమిటంటే ఎంతమాత్రం ఒట్టు పెట్టుకోవద్దు. పరలోకం మీద ఒట్టు పెట్టుకోవద్దు, అది దేవుని సింహాసనం. భూమి తోడు అనవద్దు. అది ఆయన పాదపీఠం. యెరూషలేము తోడు అనవద్దు. అది మహారాజు నగరం. నీ తల తోడని ప్రమాణం చేయవద్దు. నీవు ఒక వెంట్రుకైనా తెల్లగా గాని నల్లగా గాని చేయలేవు. మీ మాట ‘అవునంటే అవును, కాదంటే కాదు’ అన్నట్టే ఉండాలి. అలా కాని ప్రతిదీ అపవాది సంబంధమైనదే. “‘కంటికి బదులు కన్ను, పన్నుకు బదులు పన్ను’ అని చెప్పింది మీరు విన్నారు గదా. కానీ నేను మీతో చెప్పేదేమిటంటే దుష్టుణ్ణి ఎదిరించవద్దు. ఎవరైనా నిన్ను కుడి చెంప మీద కొడితే అతన్ని మరొక చెంప మీద కూడా కొట్టనియ్యి. ఎవరైనా నీ అంగీ విషయం వివాదం పెట్టుకుని దాన్ని లాక్కుంటే అతనికి నీ పైచొక్కా కూడా ఇచ్చివెయ్యి. ఎవరైనా ఒక మైలు దూరం రమ్మని నిన్ను బలవంతం చేస్తే అతనితో రెండు మైళ్ళు వెళ్ళు. నిన్ను అడిగిన వాడికి ఇవ్వు. నిన్ను అప్పు అడగాలనుకొనే వాడికి నీ ముఖం చాటు చేయవద్దు. “‘నీ పొరుగువాణ్ణి ప్రేమించి, నీ శత్రువును ద్వేషించు’ అని చెప్పింది మీరు విన్నారు గదా. నేను మీతో చెప్పేదేమంటే, మీ శత్రువులను ప్రేమించండి. మిమ్మల్ని హింసించే వారి కోసం ప్రార్థించండి. ఆ విధంగా మీరు పరలోకంలో ఉన్న మీ తండ్రికి కుమారులవుతారు. ఎందుకంటే ఆయన చెడ్డవారిపైనా మంచివారిపైనా తన సూర్యుణ్ణి ఉదయింపజేసి, నీతిమంతులపైనా దుర్మార్గులపైనా వాన కురిపిస్తున్నాడు. మిమ్మల్ని ప్రేమించే వారినే ప్రేమిస్తే మీకు ఏం లాభం? పన్నులు వసూలు చేసేవారు కూడా అలాగే చేస్తారు గదా. మీరు మీ సోదరులనే గౌరవిస్తుంటే ఇతరులకంటే ఎక్కువేం చేస్తున్నారు? యూదేతరులూ అలాగే చేస్తున్నారు గదా. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు. అందుచేత మీరూ పరిపూర్ణులై ఉండండి.
మత్తయి 5:1-48 పవిత్ర బైబిల్ (TERV)
యేసు ప్రజా సమూహాల్ని చూసి ఒక కొండ మీదికి వెళ్ళి కూర్చొన్నాడు. ఆ తర్వాత ఆయన శిష్యులు ఆయన దగ్గరకు వెళ్ళారు. యేసు ఈ విధంగా ఉపదేశించటం మొదలు పెట్టాడు: “ఆధ్యాత్మికంగా దీనులుగా ఉన్న వాళ్ళదే దేవుని రాజ్యం. కనుక వాళ్ళు ధన్యులు. దుఃఖించే వాళ్ళను దేవుడు ఓదారుస్తాడు. కనుక వాళ్ళు ధన్యులు. నెమ్మది స్వభావం కలవాళ్ళు భూలోకానికి వారసులౌతారు. కనుక వాళ్ళు ధన్యులు. అన్నిటికన్నా నీతి విషయమై ప్రయాసపడే వాళ్ళకు ప్రతిఫలం దొరకుతుంది. కనుక వాళ్ళు ధన్యులు. దయగల వాళ్ళకు దేవుని దయ దొరుకుతుంది. కనుక వాళ్ళు ధన్యులు. శుద్ధ హృదయం కలవాళ్ళు దేవుణ్ణి చూస్తారు. కనుక వాళ్ళు ధన్యులు. శాంతి స్థాపకుల్ని దేవుడు తన కుమారులుగా పరిగణిస్తాడు. కనుక శాంతి స్థాపకులు ధన్యులు. నీతి కోసం హింసల్ని అనుభవించిన వాళ్ళదే దేవుని రాజ్యం. కనుక వాళ్ళు ధన్యులు. “నా కారణంగా ప్రజలు మిమ్మల్ని అవమానిస్తే లేక హింసిస్తే లేక అన్యాయంగా చెడు మాటలు పలికితే, మీకు పరలోకంలో గొప్ప బహుమతి లభిస్తుంది. కనుక మీరు ధన్యులు. ఆనందించండి. వాళ్ళు మిమ్మల్ని హింసించినట్లే మీకన్నా ముందున్న ప్రవక్తల్ని కూడ హింసించారు. “మీరు ఈ ప్రపంచానికి ఉప్పులాంటి వాళ్ళు, కాని ఉప్పులోవున్న ఉప్పు గుణం పోతే మళ్ళీ దాన్ని ఉప్పుగా ఎలా చెయ్యగలం? అది దేనికీ పనికి రాకుండా పోతుంది. అంతేకాక, దాన్ని పార వేయవలసి వస్తుంది. ప్రజలు దాన్ని త్రొక్కుతూ నడుస్తారు. “మీరు ఈ ప్రపంచానికి వెలుగులాంటి వాళ్ళు. కొండ మీద ఉన్న పట్టణాన్ని మరుగు పరచటం అసంభవం. దీపాన్ని వెలిగించి దాన్ని ఎవ్వరూ గంప క్రింద దాచి ఉంచరు. దానికి మారుగా దాన్ని వెలిగించి ముక్కాలి పీటపై ఉంచుతారు. అప్పుడది యింట్లోని వాళ్ళందరికి వెలుగునిస్తుంది. అదే విధంగా మీ జీవితం వెలుగులా ప్రకాశించాలి. అప్పుడు యితర్లు మీరు చేస్తున్న మంచి పనులు చూసి పరలోకంలో ఉన్న మీ తండ్రిని స్తుతిస్తారు. “నేను ధర్మశాస్త్రాన్ని కాని, ప్రవక్తల వచనాలను కాని రద్దు చేయటానికి వచ్చానని అనుకోవద్దు. నేను వాటిని రద్దుచేయటానికి రాలేదు. వాటిని పూర్తి చేయటానికి వచ్చాను. ఇది సత్యం. భూమి, ఆకాశం గడచి పోయేలోపుల అన్ని సంగతులు, ధర్మశాస్త్రంలోని చిన్న అక్షరం, పొల్లుతో సహా నెరవేరుతాయి. “ఒక చిన్న ఆజ్ఞనైనా సరే రద్దుచేసిన వాడును, తనలాగే చెయ్యమని బోధించిన వాడును దేవుని రాజ్యంలో తక్కువ వాడుగా ఎంచబడుతాడు. కాని ఈ ఆజ్ఞల్ని అనుసరిస్తూ వాటిని బోధించినవాడు దేవుని రాజ్యంలో గొప్పవానిగా ఎంచబడతాడు. ఎందుకంటే, మీరు శాస్త్రులకన్నా, పరిసయ్యుల కన్నా గొప్ప నీతిమంతులని గుర్తింపబడక పోతే దేవుని రాజ్యంలోకి ప్రవేశింపలేరని నేను చెబుతున్నాను. “పూర్వంలో ‘హత్య చేయరాదు, హత్య చేసిన వానికి శిక్ష పడుతుంది’ అని ప్రజలకు చెప్పటం మీరు విన్నారు. కాని నేను చెప్పేదేమిటంటే తన సోదరునిపై కోపగించిన ప్రతి వ్యక్తి శిక్షింపబడతాడు. తన సోదరుణ్ణి “పనికిమాలినవాడా” అన్న ప్రతి వ్యక్తి మహాసభకు సమాధానం చెప్పవలసి ఉంటుంది. తన సోదరుణ్ణి “మూర్ఖుడా!” అన్న ప్రతి వ్యక్తి నరకంలో అగ్నిపాలు కావలసి వస్తుంది. “మీరు, మీ కానుకను బలిపీఠం దగ్గరవుంచటానికి ముందు, మీ సోదరునికి మీపై ఏ కారణం చేతనైనా కోపం ఉందని జ్ఞాపకం వస్తే మీ కానుకను అక్కడే వదిలి వెళ్ళండి. వెళ్ళి, మీ సోదరునితో ముందు రాజీ పడండి. ఆ తర్వాత వచ్చి మీ కానుకను అర్పించండి. “మీరు, మీ ప్రతివాదితో దారిలో ఉన్నప్పుడే అతనితో మీకున్న సమస్యల్ని త్వరగా పరిష్కరించుకోండి. అలా చేయకపోతే అతడు మిమ్మల్ని న్యాయాధిపతికి అప్పగించవచ్చు. ఆ న్యాయాధిపతి మిమ్మల్ని భటునికి అప్పగించవచ్చు. ఆ భటుడు మిమ్మల్ని కారాగారంలో పడవేయవచ్చు. ఇది సత్యం. మీరు చెల్లించవలసిన చివరికాసు చెల్లించే వరకు మీరా కారగారం నుండి బయటపడరు. “‘వ్యభిచారం చేయరాదు’ అని చెప్పటం మీరు విన్నారు. కాని నేను చెప్పేదేమిటంటే, పరస్త్రీ వైపు కామంతో చూసినవాడు, హృదయంలో ఆమెతో వ్యభిచరించిన వానిగా పరిగణింపబడతాడు. మీరు పాపం చెయ్యటానికి మీ కుడి కన్ను కారణమైతే దాన్ని పీకి పారవేయండి. మీ శరీరమంతా నరకంలో పడటం కన్నా మీ శరీరంలోని ఒక అవయవము పోగొట్టుకోవటం మంచిది. మీరు పాపం చెయ్యటానికి మీ కుడి చెయ్యి కారణమైతే దానిని నరికి పారవేయండి. మీ శరీరమంతా నరకంలో పడటం కన్నా మీ శరీరంలోని ఒక అవయవము పోగొట్టుకోవటం మంచిది. “‘తన భార్యకు విడాకులివ్వదలచిన వ్యక్తి ఆమెకు ఒక విడాకుల పత్రం ఇవ్వాలి’ అని చెప్పే వాళ్ళు. కాని నేను చెప్పేదేమంటే భార్య మీద వ్యభిచార కారణంలేకుండా భర్త ఆమెకు విడాకులిస్తే ఆమె వ్యభిచారిణిగా పరిగణింప బడటానికి అతడు కారకుడౌతాడు. అలా విడాకులు పొందిన స్త్రీని వివాహమాడిన వాడు వ్యభిచారిగా పరిగణింపబడతాడు. వ్యభిచార కారణాన మాత్రానే తన భార్యకు విడాకులివ్వాలి గాని వేరే కారణాన కాదు. “అంతేకాక మాట తప్పకండి. ‘ప్రభువుతో చేసిన ప్రమాణాల్ని నిలబెట్టుకోండి,’ అని పూర్వం ప్రజలకు చెప్పటం మీరు విన్నారు. కాని నేను చెప్పేదేమిటంటె, దేని మీదా ప్రమాణం చెయ్యకండి, ఆకాశం దేవుని సింహాసనం కనుక ఆకాశం మీద ప్రమాణం చెయ్యకండి. భూమి దేవుని పాదపీఠం కనుక భూమ్మీద ప్రమాణం చెయ్యకండి. యెరూషలేము మహారాజు నగరం కనుక దానిపై ప్రమాణం చెయ్యకండి. మీ తలపై ఉన్న ఒక్క వెంట్రుకను కూడా తెలుపుగా కాని, నలుపుగా కాని మార్చలేరు. కనుక, మీ తలపై ప్రమాణం చెయ్యకండి. మీరు ‘ఔను’ అని అనాలనుకొంటే ఔననండి. ‘కాదు’ అని అనాలనుకొంటే కాదనండి. మరేవిధమైన ప్రమాణం మీ నుండి వచ్చినా దానికి కారణం ఆ సైతానే. “‘కంటికి కన్ను, పంటికి పన్ను ఊడ దీయాలి’ అని అనటం మీరు విన్నారు. కాని నేను చెప్పేదేమిటంటే దుష్టుల్ని ఆపటానికి ప్రయత్నించకండి. మిమ్మల్ని ఎవరైనా కుడి చెంపమీద కొడితే మీ రెండవ చెంప కూడా అతనికి చూపండి. ఎవరైనా మీపై వ్యాజ్యము వేసి మీ చొక్కాను కూడా లాక్కోవాలని చూస్తే, మీ కండువా కూడా తీసుకు వెళ్ళనివ్వండి. ఎవరైనా మిమ్మల్ని తమతో మైలు దూరం రమ్మని బలవంతం చేస్తే, అతనితో రెండు మైళ్ళు వెళ్ళండి. అడిగిన వాళ్ళకు ఇవ్వండి. మీ దగ్గర అప్పుపుచ్చుకోవాలని అనుకొని వచ్చిన వాళ్ళతో లేదనకండి. “‘పొరుగింటి వాణ్ణి ప్రేమించండి. శత్రువును ద్వేషించండి’ అని చెప్పటం మీరు విన్నారు. కాని నేను చెప్పేదేమిటంటే ‘మీ శత్రువుల్ని ప్రేమించండి మిమ్మల్ని హింసించిన వాళ్ళ కోసం దేవుణ్ణి ప్రార్థించండి.’ అప్పుడు మీరు పరలోకంలో ఉన్న మీ తండ్రికి బిడ్డలౌతారు. ఎందుకంటే దేవుడు చెడ్డవాళ్ళ కోసం, మంచి వాళ్ళ కోసం సూర్యోదయం కలిగిస్తాడు. నీతిమంతుల కోసం, అనీతిమంతుల కోసం వర్షాలు కురిపిస్తాడు. మిమ్మల్ని ప్రేమించిన వాళ్ళను మీరు ప్రేమిస్తే మీకేం ప్రతిఫలం కలుగుతుంది? పాపులు కూడా అలాచెయ్యటం లేదా? మీ సోదరులకు మాత్రమే మీరు అభివందనాలు చేస్తే యితర్ల కన్నా మీరు ఏం గొప్ప? యూదులుకాని వాళ్ళు కూడా అలా చేస్తారే! పరలోకంలో ఉన్న మీ తండ్రి పరిపూర్ణుడు. మీరును ఆయనలా ఉండాలి.