మత్తయి 4:16-25
మత్తయి 4:16-25 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
చీకటిలో నివసిస్తున్న ప్రజలు, గొప్ప వెలుగును చూశారు; మరణచ్ఛాయలో నివసించేవారి మీద ఒక వెలుగు ప్రకాశించింది” అనే మాటలు నెరవేరడానికి ఇలా జరిగింది. అప్పటినుండి యేసు, “పరలోక రాజ్యం సమీపించింది కాబట్టి పశ్చాత్తాపపడండి” అని ప్రకటించడం మొదలుపెట్టారు. యేసు గలిలయ సముద్రతీరాన నడుస్తున్నప్పుడు పేతురు అని పిలువబడే సీమోను, అతని సోదరుడు అంద్రెయ అనే ఇద్దరు సోదరులు సముద్రంలో వలలు వేయడం ఆయన చూశారు. వారు జాలరులు. యేసు వారితో, “నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని మనుష్యులను పట్టే జాలరులుగా చేస్తాను” అన్నారు. వెంటనే వారు తమ వలలను విడిచి యేసును వెంబడించారు. ఆయన అక్కడినుండి వెళ్తూ జెబెదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను అనే మరో ఇద్దరు సోదరులను చూశారు. వారు తమ తండ్రి జెబెదయితో కలసి పడవలో ఉండి తమ వలలను సిద్ధం చేసుకుంటున్నారు. యేసు వారిని పిలిచారు. వెంటనే వారు పడవను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. యేసు గలిలయ ప్రాంతమంతా తిరుగుతూ, వారి సమాజమందిరాల్లో బోధిస్తూ, రాజ్యసువార్తను ప్రకటిస్తూ, ప్రజల మధ్యలో ప్రతి వ్యాధిని రోగాన్ని బాగుచేస్తూ ఉన్నారు. ఆయన గురించి సిరియా దేశమంతటా తెలిసి ప్రజలు రకరకాల వ్యాధులతో, తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నవారిని, దయ్యాలు పట్టినవారిని, మూర్ఛ రోగం గలవారిని పక్షవాత రోగులను యేసు దగ్గరకు తీసుకుని రాగా ఆయన వారిని బాగుచేశారు. గలిలయ, దెకపొలి, యెరూషలేము, యూదయ, యొర్దాను అవతలి వైపు ఉన్న ప్రాంతాల నుండి గొప్ప జనసమూహం ఆయనను వెంబడించారు.
మత్తయి 4:14-25 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
“జెబూలూను నఫ్తాలి ప్రాంతాలు, యొర్దాను నది అవతల సముద్రం వైపున ఉన్న యూదేతరుల గలిలయ ప్రాంతాల్లో చీకటిలో కూర్చున్న ప్రజలు గొప్ప వెలుగు చూశారు. చావు నీడలో కూర్చున్న వారిపై వెలుగు ఉదయించింది.” అని యెషయా ప్రవక్త ద్వారా పలికిన మాట ఈ విధంగా నెరవేరింది. అప్పటి నుంచి యేసు, “పరలోక రాజ్యం దగ్గరపడింది. పశ్చాత్తాపపడండి” అంటూ బోధించడం మొదలు పెట్టాడు. యేసు గలిలయ సముద్ర తీరాన నడుస్తూ, ఇద్దరు అన్నదమ్ములు సముద్రంలో వల వేయడం చూశాడు. వారు పేతురు అనే సీమోను, అతని సోదరుడు అంద్రెయ. వారు చేపలు పట్టేవారు. యేసు వారితో, “నా వెంట రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టే జాలరులుగా చేస్తాను” అని పిలిచాడు. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయన వెంట వెళ్ళారు. యేసు అక్కడనుంచి వెళ్తూ ఇంకో ఇద్దరు అన్నదమ్ములను చూశాడు. వారు జెబెదయి కొడుకులు యాకోబు, యోహాను. వారు తమ తండ్రి జెబెదయి దగ్గర పడవలో తమ వలలు బాగుచేసుకుంటుంటే చూసి వారిని పిలిచాడు. వెంటనే వారు తమ పడవనూ తమ తండ్రినీ విడిచిపెట్టి ఆయనను వెంట వెళ్లారు. యేసు వారి సమాజ మందిరాల్లో బోధిస్తూ, దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తూ ప్రజల్లో ఉన్న ప్రతి వ్యాధినీ రోగాన్నీ బాగు చేస్తూ గలిలయ ప్రాంతమంతా తిరిగాడు. ఆయన పేరు సిరియా దేశమంతా తెలిసిపోయింది. రకరకాల వ్యాధులతో, నొప్పులతో బాధపడుతున్న వారిని, దయ్యాలు పట్టిన వారిని, మూర్ఛ రోగులను, పక్షవాతం వచ్చిన వారిని ఆయన దగ్గరికి తీసుకు వస్తే ఆయన వారిని బాగుచేశాడు. గలిలయ, దెకపొలి, యెరూషలేము, యూదయ ప్రాంతాల నుండీ యొర్దాను అవతలి ప్రాంతం నుండీ ప్రజలు గుంపులు గుంపులుగా ఆయన వెంట వెళ్ళారు.
మత్తయి 4:16-25 పవిత్ర బైబిల్ (TERV)
చీకట్లో నివసిస్తున్న ప్రజలు గొప్ప వెలుగును చూసారు! మృత్యుఛాయలు పడే ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలపై వెలుగు ప్రకాశించింది.” ఆ నాటి నుండి యేసు, “దేవుని రాజ్యం దగ్గర లోనే వుంది. కనుక మారుమనస్సు పొందండి!” అని ఉపదేశించటం మొదలు పెట్టాడు. యేసు గలిలయ సముద్రం ఒడ్డున నడుస్తూ పేతురు అని పిలువబడే సీమోనును, అతని సోదరుడు అంద్రెయను చూశాడు. ఈ సోదరులు చేపలు పట్టేవారు. వాళ్ళు అప్పుడు నీళ్ళల్లో వల వేస్తూ ఉన్నారు. యేసు వాళ్ళతో, “నన్ను అనుసరించండి! మీరు మనుష్యుల్ని పట్టుకొనేటట్లు చేస్తాను” అని అన్నాడు. వాళ్ళు వెంటనే తమ వలల్ని వదిలి ఆయన్ని అనుసరించారు. యేసు అక్కడ నుండి వెళ్తూ మరో యిద్దర్ని చూశాడు. వాళ్ళు కూడా సోదరులు. ఒకని పేరు యాకోబు, మరొకని పేరు యోహాను. తండ్రి పేరు జెబెదయి. ఆ సోదరులు తమ తండ్రితో కలసి పడవలో కూర్చొని వలను సరిచేసుకొంటూ ఉన్నారు. యేసు వాళ్ళను పిలిచాడు. వాళ్ళు వెంటనే పడవను, తమ తండ్రిని వదిలి ఆయన్ని అనుసరించారు. యేసు సమాజమందిరాల్లో బోధిస్తూ దేవుని రాజ్యాన్ని గురించి సువార్త ప్రకటిస్తూ గలిలయ ప్రాంతమంతా పర్యటించాడు. ఆయన ప్రతి రోగిని, బాధపడ్తున్న ప్రతి వ్యక్తిని బాగు చేసాడు. ఆయన కీర్తి సిరియ దేశమంతటా వ్యాపిస్తూవుండింది. ప్రజలు రకరకాల రోగాలు ఉన్నవాళ్ళను, బాధ పడ్తున్న వాళ్ళను, దయ్యాలు పట్టిన వాళ్ళను, మూర్చరోగుల్ని, పక్షవాత రోగుల్ని, ఆయన దగ్గరకు పిలుచుకొని వచ్చారు. ఆయన వాళ్ళను నయం చేశాడు. గలిలయ నుండి, దెకపొలి నుండి, యెరూషలేము నుండి, యూదయ నుండి, యొర్దాను నది అవతలి వైపుననున్న ప్రాంతాల నుండి ప్రజలు గుంపులు గుంపులుగా ఆయన్ని అనుసరించారు.
మత్తయి 4:12-25 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
యోహాను చెరపట్టబడెనని యేసు విని గలిలయకు తిరిగి వెళ్లి నజరేతు విడిచి జెబూలూను నఫ్తాలియను దేశముల ప్రాంతములలో సముద్రతీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. – జెబూలూను దేశమును, నఫ్తాలిదేశమును, యొర్దానుకు ఆవలనున్న సముద్రతీరమున అన్యజనులు నివసించు గలిలయయు చీకటిలో కూర్చుండియున్న ప్రజలును గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశములోను మరణచ్ఛాయలోను కూర్చుండియున్న వారికి వెలుగు ఉదయించెను అని ప్రవక్తయైన యెషయాద్వారా పలుకబడినది నెరవేరునట్లు (ఈలాగు జరిగెను.) అప్పటినుండి యేసు పర లోక రాజ్యము సమీపించియున్నది గనుక మారుమనస్సు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను. యేసు గలిలయ సముద్రతీరమున నడుచుచుండగా, పేతురనబడిన సీమోను అతని సహోదరుడైన అంద్రెయ అను ఇద్దరు సహోదరులు సముద్రములో వలవేయుట చూచెను; వారు జాలరులు. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మును మనుష్యులను పట్టుజాలరులనుగా చేతునని వారితో చెప్పెను; వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఆయన అక్కడనుండి వెళ్లి జెబెదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను అను మరి యిద్దరు సహోదరులు తమ తండ్రి యైన జెబెదయి యొద్ద దోనెలో తమ వలలు బాగుచేసికొనుచుండగా చూచి వారిని పిలిచెను. వెంటనే వారు తమ దోనెను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. యేసు వారి సమాజమందిరములలో బోధించుచు, (దేవుని) రాజ్యమునుగూర్చిన సువార్తను ప్రకటించుచు, ప్రజలలోని ప్రతి వ్యాధిని, రోగమును స్వస్థపరచుచు గలిలయయందంతట సంచరించెను. ఆయన కీర్తి సిరియ దేశమంతట వ్యాపించెను. నానావిధములైన రోగములచేతను వేదనలచేతను పీడింపబడిన వ్యాధి గ్రస్తులనందరిని, దయ్యముపెట్టినవారిని, చాంద్రరోగులను, పక్షవాయువు గలవారిని వారు ఆయనయొద్దకు తీసికొని రాగా ఆయన వారిని స్వస్థపరచెను. గలిలయ, దెకపొలి, యెరూషలేము, యూదయయను ప్రదేశములనుండియు యొర్దానునకు అవతలనుండియు బహుజనసమూహములు ఆయనను వెంబడించెను.