మత్తయి 28:1-8

మత్తయి 28:1-8 తెలుగు సమకాలీన అనువాదము (TCV)

సబ్బాతు దినం గడిచిన తర్వాత, వారం మొదటి రోజున, తెల్లవారేటప్పుడు మగ్దలేనే మరియ, వేరొక మరియ సమాధిని చూడడానికి వచ్చారు. అకస్మాత్తుగా భయంకరమైన భూకంపం వచ్చింది, ఎందుకంటే పరలోకం నుండి ప్రభువు దూత దిగి వచ్చి, సమాధి దగ్గరకు వెళ్లి, ఆ రాయిని వెనక్కి దొర్లించి దాని మీద కూర్చున్నాడు. ఆ దూత రూపం మెరుపులా, అతని బట్టలు మంచులా తెల్లగా ఉన్నాయి. ఆ కాపలావారు దూతను చూసి భయంతో వణికి చచ్చినవారిలా పడిపోయారు. దూత ఆ స్త్రీలతో, “భయపడకండి, మీరు సిలువ వేయబడిన, యేసును వెదకుతున్నారు అని నాకు తెలుసు. ఆయన ఇక్కడ లేరు; తాను చెప్పినట్లే, ఆయన లేచారు. రండి ఆయనను పడుకోబెట్టిన స్థలాన్ని చూడండి. త్వరగా వెళ్లి ఆయన శిష్యులతో, ‘యేసు మృతులలో నుండి లేచారు, ఆయన మీకంటే ముందుగా గలిలయలోనికి వెళ్తున్నారు. అక్కడ మీరు ఆయనను చూస్తారు’ అని చెప్పండి. నేను మీతో చెప్పింది జ్ఞాపకముంచుకోండి” అన్నాడు. ఆ స్త్రీలు భయపడినప్పటికీ గొప్ప ఆనందంతో, యేసు శిష్యులకు ఆ సమాచారం చెప్పడానికి సమాధి దగ్గర నుండి త్వరగా పరుగెత్తి వెళ్లారు.

షేర్ చేయి
Read మత్తయి 28

మత్తయి 28:1-8 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

విశ్రాంతిదినం గడిచిన తరవాత ఆదివారం నాడు తెల్లవారుతుండగా మగ్దలేనే మరియ, మరొక మరియ సమాధిని చూడడానికి వచ్చారు. ప్రభువు దూత పరలోకం నుండి దిగి వచ్చి, ఆ రాయిని దొర్లించి దాని మీద కూర్చున్నాడు. అప్పుడు పెద్ద భూకంపం వచ్చింది. ఆ దూత స్వరూపం మెరుపులా ఉంది. అతని వస్త్రం మంచు అంత తెల్లగా ఉంది. అతన్ని చూసి కావలివారు భయపడి వణకుతూ చచ్చిన వారిలా పడిపోయారు. ఆ దూత ఆ స్త్రీలతో, “భయపడకండి, సిలువ వేసిన యేసును మీరు వెతుకుతున్నారని నాకు తెలుసు. ఆయన ఇక్కడ లేడు. తాను చెప్పినట్టే తిరిగి లేచాడు. రండి, ప్రభువు పండుకున్న చోటు చూసి, త్వరగా వెళ్ళి, ‘ఆయన చనిపోయిన వారిలో నుండి తిరిగి లేచాడు’ అని ఆయన శిష్యులకు చెప్పండి. ఇదిగో, ఆయన గలిలయకి మీకంటే ముందుగా వెళ్ళాడు. మీరు ఆయనను అక్కడ చూస్తారు. ఇదిగో, నేను మీతో చెప్పాను గదా” అన్నాడు. వారు భయంతో, మహా ఆనందంతో సమాధి దగ్గర నుండి త్వరగా వెళ్ళి ఆ సంగతి ఆయన శిష్యులకు చెప్పడానికి పరుగెడుతుండగా

షేర్ చేయి
Read మత్తయి 28

మత్తయి 28:1-8 పవిత్ర బైబిల్ (TERV)

విశ్రాంతి రోజు గడిచింది. ఆదివారం సూర్యోదయమవుతుండగా మగ్దలేనే మరియ, యింకొక మరియ సమాధిని చూడటానికి వెళ్ళారు. అప్పుడు ఒక భూకంపం వచ్చింది. పరలోకం నుండి ప్రభువు దూత వచ్చి ఆ సమాధి దగ్గరకు వెళ్ళాడు. ఆ రాతిని దొర్లించి దాని మీద కూర్చొన్నాడు. ఆ రూపం మెరుపులా ఉంది. అతని దుస్తులు మంచువలె తెల్లగా ఉన్నాయి. సమాధిని కాపలా కాస్తున్న భటులు అతన్ని చూసి భయపడి వణికిపోయి, చనిపోయిన వాళ్ళలా అయ్యారు. ఆ దేవదూత, స్త్రీలతో ఈ విధంగా అన్నాడు: “భయపడకండి, సిలువకు వేయబడిన యేసు కోసం మీరు చూస్తున్నారని నాకు తెలుసు. ఆయనిక్కడ లేడు. ఆయన తాను చెప్పినట్లు బ్రతికి వచ్చాడు. ఆయన్ని పడుకోబెట్టిన స్థలాన్ని చూడండి. ఆ తదుపరి వెంటేనే వెళ్ళి ఆయన శిష్యులతో, ‘ఆయన బ్రతికి వచ్చాడు. మీకన్నా ముందే గలిలయకు వెళ్ళబోతున్నాడు. మీరు ఆయన్ని అక్కడ కలుసుకొంటారు’ అని చెప్పండి. నేను చెప్పవలసింది చెప్పాను.” ఆ స్త్రీలు ఆయన శిష్యులకు చెప్పాలని సమాధి దగ్గరనుండి భయంతో, ఆనందంతో పరుగెత్తికొంటూ వెళ్ళారు.

షేర్ చేయి
Read మత్తయి 28

మత్తయి 28:1-8 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

విశ్రాంతిదినము గడచిపోయిన తరువాత ఆదివారమున, తెల్లవారుచుండగా మగ్దలేనే మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభువు దూత పరలోకమునుండి దిగివచ్చి, రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను; అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపువలె నుండెను, అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుటవలన కావలివారు వణకి చచ్చినవారివలె నుండిరి. దూత ఆ స్ర్తిలను చూచి–మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెదకుచున్నారని నాకు తెలియును; ఆయన ఇక్కడ లేడు; తాను చెప్పినట్టే ఆయన లేచియున్నాడు; రండి ప్రభువు పండుకొనిన స్థలము చూచి త్వరగా వెళ్లి, ఆయన మృతులలోనుండి లేచియున్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి; ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్లు చున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు; ఇదిగో మీతో చెప్పితిననెను. వారు భయముతోను మహా ఆనందముతోను సమాధియొద్దనుండి త్వరగా వెళ్లి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుప పరుగెత్తుచుండగా

షేర్ చేయి
Read మత్తయి 28