మత్తయి 27:35-54

మత్తయి 27:35-54 తెలుగు సమకాలీన అనువాదము (TCV)

వారు ఆయనను సిలువ వేసిన తర్వాత, చీట్లు వేసి వారు ఆయన బట్టలను పంచుకున్నారు. వారు అక్కడే కూర్చుని, ఆయనకు కాపలాగా ఉన్నారు. ఆయన మీద మోపబడిన నేరం వ్రాసి ఆయన తలపైన బిగించారు: ఇతడు యేసు, యూదుల రాజు. ఆయనతోపాటు ఇద్దరు బందిపోటు దొంగలను, కుడి వైపున ఒకడిని, ఎడమ వైపున ఒకడిని సిలువ వేశారు. ఆ దారిలో వెళ్తున్నవారు తలలు ఊపుతూ, “దేవాలయాన్ని పడగొట్టి మూడు దినాలలో తిరిగి కడతానన్నావు, నిన్ను నీవే రక్షించుకో! నీవు దేవుని కుమారుడవైతే, సిలువ మీద నుండి దిగిరా” అంటూ ఆయనను దూషించారు. అలాగే ముఖ్య యాజకులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు మరియు నాయకులు కూడా ఆయనను ఎగతాళి చేశారు, “వీడు ఇతరులను రక్షించాడు, కాని తనను తాను రక్షించుకోలేడు! ఇశ్రాయేలీయుల రాజు కదా! ఇప్పుడు సిలువ మీది నుండి దిగి వస్తే, మేము ఇతన్ని నమ్ముతాము. వీడు దేవుని నమ్మాడు. ‘నేను దేవుని కుమారుడనని’ చెప్పుకొన్నాడు కదా, దేవునికి ఇష్టమైతే దేవుడే ఇతన్ని తప్పిస్తాడు” అన్నారు. ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలు కూడా ఆయనపై అవమానాలు గుప్పించారు. మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి మూడు గంటల వరకు ఆ దేశమంతా చీకటి కమ్మింది. ఇంచుమించు మూడు గంటలప్పుడు యేసు, “ఏలీ, ఏలీ, లామా సబక్తానీ?” అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు “నా దేవా, నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచావు?” అని అర్థం. అక్కడ నిలబడి ఉన్నవారిలో కొందరు ఆ మాట విని, “ఇతడు ఏలీయాను పిలుస్తున్నాడు” అన్నారు. వెంటనే వారిలో ఒకడు పరుగెత్తికొని వెళ్లి ఒక స్పంజీని తెచ్చాడు. దాన్ని ఆ చేదు చిరకలో ముంచి, కర్రకు తగిలించి, యేసుకు త్రాగడానికి అందించాడు. మిగిలిన వారు, “ఇప్పుడు వీన్ని ఒంటరిగా వదలి వేద్దాం. ఏలీయా వచ్చి వీన్ని రక్షిస్తాడేమో చూద్దాం” అన్నారు. యేసు మరల బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచారు. ఆ క్షణంలో దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగిపోయింది. భూమి కంపించింది, బండలు బద్దలయ్యాయి. సమాధులు తెరవబడ్డాయి. చనిపోయిన చాలామంది పరిశుద్ధుల శరీరాలు జీవంతో లేచాయి. యేసు లేచిన తర్వాత వారు సమాధులలో నుండి బయటికి వచ్చి, పరిశుద్ధ పట్టణంలో చాలా మందికి కనిపించారు. శతాధిపతి మరియు అతనితో కూడ యేసుకు కాపలా కాస్తున్నవారు వచ్చిన భూకంపాన్ని మరియు జరిగిన కార్యాలన్నిటిని చూసి, వారు భయపడి, “నిజంగా ఈయన దేవుని కుమారుడే!” అని చెప్పుకొన్నారు.

షేర్ చేయి
Read మత్తయి 27

మత్తయి 27:35-54 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

వారు ఆయనను సిలువ వేసిన తరవాత చీట్లు వేసి ఆయన బట్టలు పంచుకున్నారు. అక్కడే ఆయనకు కావలిగా కూర్చున్నారు. “ఇతడు యూదుల రాజైన యేసు’’ అని ఆయన మీద మోపిన నేరం రాసి ఉన్న ప్రకటన ఒకటి ఆయన తలకు పైన ఉంచారు. ఆయన కుడి వైపున ఒకడు, ఎడమ వైపున ఒకడు ఇద్దరు బందిపోటు దొంగలను కూడా సిలువవేశారు. ఆ దారిన వెళ్ళేవారు తలలూపుతూ, “దేవాలయాన్ని పడగొట్టి మూడు రోజుల్లో కట్టేవాడా, నిన్ను నీవే రక్షించుకో. నీవు దేవుని కుమారుడివైతే సిలువ మీద నుండి దిగిరా!” అంటూ ఆయనను తిట్టారు. అలాగే ధర్మశాస్త్ర పండితులూ, పెద్దలూ, ప్రధాన యాజకులూ ఆయనను వెక్కిరిస్తూ, “ఇతడు ఇతరులను రక్షించాడు గానీ తనను రక్షించుకోలేడు. ఇశ్రాయేలు రాజు గదా, అతడిప్పుడు సిలువ మీద నుండి దిగి వస్తే అతణ్ణి నమ్ముతాం. ఇతడు దేవునిలో విశ్వాసం ఉన్నవాడు గదా, తాను దేవుని కుమారుణ్ణి అని చెప్పాడు గదా. కాబట్టి ఆయనకిష్టమైతే దేవుడే ఇతన్ని తప్పిస్తాడు” అని హేళనగా మాట్లాడారు. ఆయనతోబాటు సిలువ వేసిన దోపిడీ దొంగలు కూడా ఆయనను అలాగే నిందించారు. మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి మూడు గంటల వరకూ దేశమంతా చీకటి కమ్మింది. సుమారు మూడు గంటలప్పుడు యేసు, “ఏలీ, ఏలీ, లామా సబక్తానీ” అని పెద్దగా కేక వేశాడు. ఆ మాటకు, “నా దేవా, నా దేవా, నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావు?” అని అర్థం. అక్కడ నిలబడిన వారిలో కొందరు ఆ మాట విని, “అతడు ఏలీయాను పిలుస్తున్నాడు” అన్నారు. వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకుంటూ వెళ్ళి, స్పాంజ్ తెచ్చి పులిసిన ద్రాక్షరసంలో ముంచి, రెల్లు కర్రకు తగిలించి ఆయనకు తాగడానికి అందించాడు. మిగిలిన వారు, “ఉండండి, ఏలీయా వచ్చి ఇతణ్ణి రక్షిస్తాడేమో చూద్దాం” అన్నారు. యేసు మళ్ళీ పెద్దగా కేక వేసి ప్రాణం విడిచాడు. అప్పుడు దేవాలయంలోని తెర పైనుండి కింది వరకూ రెండుగా చినిగింది. భూమి కంపించింది, బండలు బద్దలయ్యాయి. సమాధులు తెరుచుకున్నాయి. కన్ను మూసిన అనేక మంది పరిశుద్ధుల శరీరాలు సజీవంగా లేచాయి. వారు సమాధుల్లో నుండి బయటికి వచ్చి ఆయన పునరుత్థానం చెందిన తరువాత పవిత్ర నగరంలో ప్రవేశించి చాలామందికి కనిపించారు. రోమా శతాధిపతి, అతనితో యేసుకు కావలి ఉన్నవారు, భూకంపాన్ని, జరిగిన సంఘటనలను చూసి చాలా భయపడ్డారు. “ఈయన నిజంగా దేవుని కుమారుడే” అని వారు చెప్పుకున్నారు.

షేర్ చేయి
Read మత్తయి 27

మత్తయి 27:35-54 పవిత్ర బైబిల్ (TERV)

ఆయన్ని సిలువకు వేసాక ఆయన దుస్తుల్ని చీట్లువేసి పంచుకున్నారు. సైనికులు కూర్చొని ఆయనకు కాపలా కాశారు. ఆయనపై ఆరోపించిన, “ఇతడు యూదుల రాజు” అన్న నేరాన్ని వ్రాసి ఆయన తలపై భాగాన ఉంచారు. ఆ తదుపరి ఆయనతో పాటు దోపిడి దొంగలిద్దర్ని ఒకణ్ణి కుడివైపు, మరొకణ్ణి ఎడమ వైపు సిలువకు వేసారు. ఆ దారిన వెళ్ళిన వాళ్ళు తమ తలలాడిస్తూ ఆయన్ని దూషిస్తూ “దేవాలయాన్ని నాశనం చేసి మూడు రోజుల్లో పునర్నిర్మాణం చేయగల వాడివి! నిన్ను నీవు రక్షించుకో. నీవు దేవుని కుమారుడవైతే ఆ సిలువ నుండి దిగిరా!” అని అన్నారు. ప్రధానయాజకులు శాస్త్రులతో, పెద్దలతో కలసి ఆయన్ని అదే విధంగా హేళన చేస్తూ, “అతడు యితరులను రక్షిస్తాడు. కాని తనను తాను రక్షించుకోలేడు. అతడు ఇశ్రాయేలు ప్రజలకు రాజైనట్లయితే ఆ సిలువ నుండి క్రిందికి దిగిరానీ. అప్పుడతణ్ణి విశ్వసిస్తాము. అతడు దేవుణ్ణి విశ్వసిస్తాడు, ‘నేను దేవుని కుమారుణ్ణి’ అని అన్నాడు. దేవునికి కావలసివస్తే అతణ్ణి రక్షించుకోమనండి” అని అన్నారు. ఆయనతో సహా సిలువకు వేయబడిన దోపిడి దొంగలు కూడా ఆయన్ని అదేవిధంగా అవమానించారు. మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి మూడు గంటలదాకా ఆ దేశమంతా చీకటి వ్యాపించింది. సుమారు మూడు గంటలప్పుడు యేసు బిగ్గరగా, “ఏలీ! ఏలీ! లామా సబక్తానీ?” అని కేక వేసాడు. అంటే, “నా దైవమా! నా దైవమా! నన్నెందుకు ఒంటరిగా ఒదిలివేసావు?” అని అర్థం. అక్కడ నిల్చున్న వాళ్ళు కొందరు ఇది విని, “అతడు ఏలీయాను పిలుస్తున్నాడు” అని అన్నారు. ఒకడు వెంటనే పరుగెత్తుకొంటూ వెళ్ళి ఒక స్పాంజి తెచ్చాడు. దాన్ని పులిసిన ద్రాక్షారసంలో ముంచి ఒక బెత్తానికి పెట్టి యేసుకు త్రాగటానికి యిచ్చాడు. కాని యితర్లు, “ఆగండి! అతణ్ణి రక్షించటానికి ఏలీయా వస్తాడేమో చూద్దాం!” అని అన్నారు. యేసు మళ్ళీ ఒక మారు పెద్ద కేక వేసి తన ప్రాణం వదిలి వేసాడు. అదే క్షణంలో దేవాలయంలోని తెర పైనుండి క్రింది దాకా చినిగి పోయింది. భూకంపం వచ్చి బండలు పగిలి పొయ్యాయి. సమాధులు తెరుచుకొన్నాయి. దేవుడు చనిపోయిన పరిశుద్ధులను అనేకుల్ని బ్రతికించాడు. వాళ్ళు సమాధులనుండి వెలుపలికి వచ్చారు. యేసు బ్రతికి వచ్చాక వాళ్ళు పవిత్ర నగరాన్ని ప్రవేశించి చాలా మందికి కనిపించారు. యేసును కాపలా కాస్తున్న శతాధిపతి, సైనికులు భూకంపాన్ని, జరిగిన మిగతా సంఘటల్ని చూసి చాలా భయపడిపోయి, “ఈయన నిజంగా దేవుని కుమారుడే!” అని అన్నారు.

షేర్ చేయి
Read మత్తయి 27

మత్తయి 27:35-54 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

వారు ఆయనను సిలువవేసిన పిమ్మట చీట్లువేసి ఆయన వస్త్రములు పంచుకొనిరి. అంతట వారక్కడ కూర్చుండి ఆయనకు కావలియుండిరి. –ఇతడు యూదుల రాజైన యేసు అని ఆయనమీద మోపబడిన నేరము వ్రాసి ఆయన తలకు పైగా ఉంచిరి. మరియు కుడివైపున ఒకడును ఎడమ వైపున ఒకడును ఇద్దరు బందిపోటు దొంగలు ఆయనతోకూడ సిలువవేయ బడిరి. ఆ మార్గమున వెళ్లుచుండినవారు తలలూచుచు –దేవాలయమును పడగొట్టి మూడుదినములలో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకొనుము; నీవు దేవుని కుమారుడవైతే సిలువమీదనుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించిరి ఆలాగే శాస్త్రులును పెద్దలును ప్రధానయాజకులును కూడ ఆయనను అపహసించుచు –వీడు ఇతరులను రక్షించెను, తన్ను తానే రక్షించుకొనలేడు; ఇశ్రాయేలురాజుగదా, యిప్పుడు సిలువమీదనుండి దిగినయెడల వాని నమ్ముదుము. వాడు దేవునియందు విశ్వాసముంచెను, నేను దేవుని కుమారుడనని చెప్పెను గనుక ఆయనకిష్టుడైతే ఆయన ఇప్పుడు వానిని తప్పించునని చెప్పిరి. ఆయనతోకూడ సిలువవేయబడిన బందిపోటుదొంగలును ఆలాగే ఆయనను నిందించిరి. మధ్యాహ్నము మొదలుకొని మూడు గంటలవరకు ఆ దేశమంతటను చీకటికమ్మెను. ఇంచుమించు మూడు గంటలప్పుడు యేసు ఏలీ, ఏలీ, లామా సబక్తానీ అని బిగ్గరగా కేకవేసెను. ఆ మాటకు నా దేవా, నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. అక్కడ నిలిచియున్నవారిలో కొందరామాట విని ఇతడు ఏలీయాను పిలుచుచున్నాడనిరి. వెంటనే వారిలో ఒకడు పరుగెత్తికొనిపోయి, స్పంజీ తీసికొని చిరకాలో ముంచి, రెల్లున తగిలించి ఆయనకు త్రాగనిచ్చెను; తక్కినవారు–ఊరకుండుడి ఏలీయా అతని రక్షింపవచ్చునేమో చూత మనిరి. యేసు మరల బిగ్గరగా కేకవేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రిందివరకు రెండుగా చినిగెను; భూమి వణకెను; బండలు బద్ద లాయెను; సమాధులు తెరవబడెను; నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధులలోనుండి బయటికి వచ్చి ఆయన లేచినతరువాత పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి అనేకులకు అగపడిరి. శతాధి పతియు అతనితోకూడ యేసునకు కావలి యున్నవారును, భూకంపమును జరిగిన కార్యములన్నిటిని చూచి, మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పు కొనిరి.

షేర్ చేయి
Read మత్తయి 27