మత్తయి 26:7-13

మత్తయి 26:7-13 తెలుగు సమకాలీన అనువాదము (TCV)

ఒక స్త్రీ చాలా ఖరీదైన పరిమళద్రవ్యం ఉన్న ఒక పాలరాతి సీసాను తెచ్చి, ఆయన భోజనం చేయడానికి కూర్చున్నప్పుడు ఆయన తల మీద ఆ పరిమళద్రవ్యంను పోసింది. శిష్యులు అది చూసి కోపపడి, “ఇలా ఎందుకు వృధా చేయడం?” అని అడిగారు. వారు, “ఈ పరిమళద్రవ్యాన్ని ఎక్కువ వెలకు అమ్మి ఆ డబ్బు పేదవారికి ఇచ్చి ఉండాల్సింది” అన్నారు. యేసు ఆ సంగతి గ్రహించి వారితో, “ఈ స్త్రీని ఎందుకు తొందర పెడుతున్నారు? ఈమె నా కొరకు ఒక మంచి కార్యం చేసింది. పేదలు ఎల్లప్పుడు మీతోనే ఉంటారు, కాని నేను మీతో ఉండను. ఈమె ఈ పరిమళద్రవ్యంను నా శరీరం మీద పోసి, నా భూస్థాపన కొరకు నన్ను సిద్ధం చేసింది. సర్వలోకంలో ఎక్కడ ఈ సువార్త ప్రకటించబడినా, అక్కడ ఈమె చేసింది జ్ఞాపకం చేసుకొని, ఈమె చేసినదాని గురించి కూడా చెప్పుకుంటారని మీతో నిశ్చయంగా చెప్తున్నాను” అని వారితో అన్నారు.

షేర్ చేయి
Read మత్తయి 26

మత్తయి 26:7-13 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

ఆ సమయంలో ఒక స్త్రీ పాలరాతి సీసాలో బాగా ఖరీదైన అత్తరు తెచ్చి, ఆయన భోజనానికి కూర్చుని ఉన్నప్పుడు ఆయన తలమీద ఆ అత్తరు పోసింది. అది చూసి శిష్యులకు కోపం వచ్చింది. వారు ఆమెతో, “ఎంత నష్టం! దీన్ని మంచి ధరకు అమ్మి ఆ సొమ్మును పేదలకు దానం చెయ్యవచ్చు కదా?” అన్నారు. యేసు ఆ సంగతి గ్రహించి, “ఈ స్త్రీని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? ఈమె నా విషయంలో ఒక మంచి పని చేసింది. బీదవారు మీ దగ్గర ఎప్పుడూ ఉంటారు. కానీ నేను ఎల్లకాలం మీతో ఉండను. ఈమె ఈ అత్తరు నా శరీరంపై పోసి నా భూస్థాపన కోసం సిద్ధం చేసింది. నేను కచ్చితంగా చెప్పేదేమంటే, ఈ లోకమంతటిలో సువార్త ప్రకటన ఎక్కడెక్కడ జరుగుతుందో అక్కడ ఈమెనూ, ఈమె చేసిన పనినీ అందరూ గుర్తు చేసుకుని ప్రశంసిస్తారు.”

షేర్ చేయి
Read మత్తయి 26

మత్తయి 26:7-13 పవిత్ర బైబిల్ (TERV)

యేసు భోజనానికి కూర్చొని ఉండగా ఒక స్త్రీ చలువరాతి బుడ్డిలో అతి విలువైన అత్తరుతో ఆయన దగ్గరకు వచ్చి ఆయన తలపై పోసింది. ఇది చూసి శిష్యులకు కోపం వచ్చింది. “ఎందుకిలా వ్యర్థంచేయటం? ఈ అత్తరు పెద్ద మొత్తానికి అమ్మి ఆ డబ్బు పేదవాళ్ళ కివ్వవలసింది!” అని వాళ్ళన్నారు. యేసుకు ఈ విషయం తెలిసి, “ఆమెనెందుకంటున్నారు? ఆమె సరియైన పని చేసింది, పేద వాళ్ళు మీతో ఎప్పుడూ ఉంటారు. కాని నేను మీతో ఎల్లకాలం ఉండబోను. ఆమె ఆ అత్తరు నా శరీరం మీద పోసి నన్ను సమాధి చెయ్యటానికి సిద్ధం చేసింది. ఇది సత్యం — ఈ సువార్తను ప్రపంచంలో ఏ చోట ప్రకటించినా ఆమె జ్ఞాపకార్థం ఆమె చేసింది కూడా చెప్పబడుతుంది” అని అన్నాడు.

షేర్ చేయి
Read మత్తయి 26

మత్తయి 26:6-13 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

యేసు బేతనియలో కుష్ఠరోగియైన సీమోను ఇంట నున్నప్పుడు, ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరుబుడ్డి తీసికొని ఆయనయొద్దకు వచ్చి, ఆయన భోజనమునకు కూర్చుండగా దానిని ఆయన తలమీద పోసెను. శిష్యులు చూచి కోపపడి–ఈ నష్టమెందుకు? దీనిని గొప్ప వెలకు అమ్మి బీదలకియ్యవచ్చునే అనిరి. యేసు ఆ సంగతి తెలిసి కొని–ఈ స్త్రీ నా విషయమై యొక మంచి కార్యము చేసెను; ఈమెను మీరేల తొందరపెట్టుచున్నారు? బీదలెల్లప్పుడు మీతోకూడ ఉన్నారు. గాని నేనెల్లప్పుడు మీతోకూడ ఉండను. ఈమె యీ అత్తరు నా శరీరము మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీనిని చేసెను. సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునో, అక్కడ ఈమె చేసినదియు ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను.

షేర్ చేయి
Read మత్తయి 26